Home » History » Diviseema Uppena 1977


   
    కొక్కిలిగడ్డ నాగేశ్వరరావు            ఎదురు మొండి గ్రామము
    
    వయస్సు 39 సంవత్సరాలు

           


    నేను వ్యాపారాన్ని చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకొంటున్నాను. అందుకనే ఒకనాడు ఇరవై నాలుగుకట్టలబియ్యాన్ని నావలో వేసుకొని వ్యాపారానికై బయలుదేరాను. మా నావ సముద్రముమీద ప్రయాణం చేయవలసియుంది. అందుకని మంచి విలువగల నావను తీసుకొన్నాం. దానిలోనేనూ, మా నావ సరంగులు నలుగురు బయలుదేరాము. ఆ రోజు గురువారం మా ప్రయాణం చాలా బాగానే సాగింది. కృష్ణానదిలో 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాము, అప్పటికి ప్రొద్దుగూకింది. లంకివేణి దిబ్బ వచ్చింది. అక్కడ మా నావకు లంగరేశాము. వంటజేసుకొని, భోజనము చేశాము. సుఖంగా నిద్రించాము. కోడికూతతో మాకు మెలకువ వచ్చింది. నావలంగరు తీసి సముద్రమువైపు ప్రయాణం సాగించాము.

                 
    
    ఆ రోజు శుక్రవారం. మా ప్రయాణం చాలా చురుగ్గానే సాగుతోంది. మేము సముద్రములోకి వెళ్ళటానికి ముత్తయ్యకాలువ గుండా ప్రయాణం చేయవలసియుంది. మేమా కాలవలో ప్రవేశించాము. ఇరుప్రక్కల ఆల్చి చెట్లు కిక్కిరిసి యున్నవి. అడవి పక్షులు కిలకిలారావములు చేస్తున్నవి. పైన మబ్బులుపట్టి యుండుట చేత అడవిదోమలు కుట్టుచున్నవి. ఏవి ఏమయినా చాలా సంతోషం గానే మా ప్రయాణం సాగిపోతోంది. కొంచెముసేపటికి సముద్రము లోనికి చేరుకున్నాము. కాలువ సముద్రములోనికి చేరేచోటిని 'దండి' అంటారు. అచ్చట కొందరు వేటాడుతున్నారు వాళ్ళంతా కాకినాడ ప్రాంతమునుండి వచ్చినవాళ్ళే. వాళ్ళని మేము లెక్కించాము. పదకొండుమంది. పైన వాతావరణంలో మార్పు కనిపించినా మేము వీళ్ళను చూడగానే మాకు కొంతదైర్యము వచ్చింది, మేము వాళ్ళ దగ్గరకు వెళ్ళాము. వాళ్ళు మాకు కొన్ని చేపలు పెట్టారు. మాకు మరీ సంతోషంగా వుంది. తిరిగి సముద్రంలో ప్రయాణం సాగించాము. నావ గాలివేగానికి ముందుకు దూసుకుపోతోంది. కాని వాతావరణంలో చాలా మార్పు కనపడుతోంది. ఆకాశాన కారుమేఘాలు పరువులెడుతున్నాయ్. హోరుగాలి వీస్తోంది వానజల్లులుమంచుతుంపరుల్లా పడుతున్నాయ్. బాహ్యప్రపంచం ఏమి కనబడటం లేదు. సముద్రమంతా కలకపారి కావురుకమ్మివుంది. మేము మాత్రం ముందునే వున్నాము. ఉన్నాకొలది ప్రశాంతంగా వుండవలసిన సముద్రాన పెద్ద యెత్తున అలలు లేచి వస్తున్నాయ్. సముద్రం అల్లకల్లోలంగా వుంది. మా పని అయోమయంగా వుంది. నావనడక తగ్గింది. ముందుకు పోవటం లేదు. బహుశా యింకా నాలుగుమైళ్ళుపోతే నిజాంపట్నం జేరుకొనే వాళ్ళము, కాని ప్రయోజనం లేకపోయింది. నావవోటుకు తట్టుకొనేటట్టులేదు. రానున్న ప్రమాదాన్ని గ్రహించి మా నావను వెనుకకు త్రిప్పాడు. షుమారు ఒక గంటలో అది త్రవ్వకాల్వ గుండా చినగొందిలోకి చేరుకుంది.
    
    చినగొంది చేపలవేటకు పెట్టింది పేరు. అక్కడ చాలామంది వేటాడుతుంటారు. కాని ఆరోజు అక్కడ యిద్దరే పిల్లలున్నారు, మరో యెనిమిది నావలున్నాయి. అక్కడ వంట చేసుకొన్నాము. ప్రొద్దుగూకింది. మేము భోజనము చేశాము ఆ పిల్ల వాళ్ళకు కూడా అన్నము పెట్టాము. నావపై టార్బాలు కప్పి. దానిలో పడుకున్నాము. హాయిగా నిదురపోయాము.
    
    తెల్లవారింది. శనివారం వచ్చింది, తుఫాను ప్రారంభమైంది. ప్రచండ వాయువులు వీస్తున్నాయి. చెట్లు విరగడం మొదలు పెట్టినది. యేమిచేయాలో తోచటం లేదు మా నావ లంగరు లాక్కొని పోతోంది. మేము చూడనేలేదు. ఎదురుగా వున్న కుర్రవాళ్ళు చూసి కేకేశారు. వెంటనే నావపైకి లంగరు లాక్కొని పెట్టుకొన్నాము. ఆ కుర్రవాళ్ళను రమ్మని పిలిచాము. వాళ్ళు నావల్ని వదిలి రాలేమన్నారు. వాళ్ళను మేము అదే చూడటం. వాళ్ళత్రోవ వాళ్ళదయింది మాత్రోవ మాదయింది. వాళ్ళేమయ్యారో తెలియదు. మేము మాత్రం ఒక పర్రమీదుగ ప్రయాణం చేస్తున్నాము. అక్కడ అయిదుగజాల లోతు నీరుంది. నావ వేగంగా పరుగెడుతోంది. చెట్లన్నీ నీళ్ళలో మునిగిపోయినవి చెట్ల మీదుగా మా నావ ప్రయాణిస్తోంది. షుమారు పడమటకు 8 కిలోమీటర్ల దూరం వెళ్ళాము. ఇంకొక 25 అడుగుల దూరం వెళ్ళాము అంటే సముద్రాన పడిపోయేవాళ్ళమే. అదృష్టవశాత్తు ఒక దిబ్బపైన నావమెరక తాకింది. మా నావ అక్కడ లంగరువేశాము. అమ్మయ్యా అనుకున్నాము.
    
    నీరంతా సముద్రానికి లాగుకొనిపోయింది. పల్లాల్లో నీళ్ళు మాత్రము చిలకచిలకగా కనపడుతున్నాయ్. ఎటుచూసినా బురద గాలివేగానికి బురదలేచి మా ముఖాలపై పడుతోంది. మాకు యేమి తోచటం లేదు నావ దిగి వెళ్ళిపోదామనుకున్నాము. మా ప్రధాన సరంగు మమ్ములను వారించాడు నావ దిగారా చచ్చిపోతారని హెచ్చరించాడు గత్యంతరము లేక నావలోనే వుండిపోయాము. మాకు చుట్టూ చేపలు కనపడుతున్నాయి. ఒకటి కాదు రెండుకాదు. వేలకొలది చేపలున్నాయి. కొన్ని చేపలు మనిషికి మించి కూడ వున్నాయి. వాటినిచూసి వూరుకోలేకపోయాము. ఒకచేపను చుక్కానిబావుతో కొట్టి నావలో వేసుకొన్నాము. అది మా నలుగురకు మోతబరువు సరిపోయింది అది జూసి మాసరంగు కేకలు వేశాడు. మనకే నమ్మకము లేనిది యీ చేప యెందుకని యేది యేమయినప్పటికీ అన్ని చేపల్ని చూసిన వాళ్ళము మేమేనేమో ననిపించింది.
    
    శనివారం సాయంత్రం షుమారు 5 గంటలయింది. ఒక్క సారిగ మా నావపైకి లేచిపోయింది. ఏమిటా అని మేమంతా ఆశ్చర్యపడ్డాము. నావ పైకి వచ్చి చూశాము. ఉప్పెన వచ్చింది. భూమిమీద నుంచి మేమిప్పుడు 30 అడుగుల యెత్తున వుండవచ్చు. లంగరులాగి నావమీద పెట్టుకున్నాము. నావ ప్రయాణం సాగించింది. పొన్న, మడ, ఉరవడి మొదలైన అడవుల మీదుగా మా నావ పోతోంది. అడవులన్నీ నీళ్ళలో మునిగిపోయాయి చివళ్ళు నీళ్ళ గుండా కనబడుతున్నాయి నావ యెక్కడ యేమోడుకు తగిలి బ్రద్దలగుతుందోనని గుండెల్ని గుప్పెట్లో పెట్టుకొన్నాము చూస్తుండగానే లంకివేణి దిబ్బకు చేరుకున్నాము. వాగలు వస్తున్నవి కాని మెరక మీదకు వచ్చామని మాకు కొంత ధైర్యము వచ్చింది. నావను ఎత్తాంటి చెట్టుకు కట్టేశాము. తెల్లవార్లు మేమంతా మేలుకొనే వున్నాము తెల్లవారుజామున షుమారు 2 గంటలకు గాలి కొంచెము తగ్గింది. నావను చూసుకొంటూ అక్కడేవున్నాము.
    
    తెల్లవారింది. ఆదివారం వచ్చింది నీరు కొంత తగ్గింది. "నాలి" వెంట నావను దోసుకొంటూ లంకివేణిదిబ్బ వూరువైపు వెళ్తున్నాము ఎంతో యెత్తాటి అడవి విరిగిపోయి మ్రోళ్ళు మాత్రమే కనబడుతున్నాయి యెటుచూసినా పక్షులు చచ్చిపోయి కుప్పలుకుప్పలుగా  పడివున్నాయి. పశువుల కళేబరాలకు సందేలేదు. మాకు సాయపడిన కొందరి మితృల శవాలు మాకు కనిపించాయి. హృదయాలు ద్రవించి చేతులు జోడించి వారికి నమస్కరించుకొన్నాము. ఆదివారం ఉదయం 10 గంటలకు లంకివేణిదిబ్బ వూళ్ళోకి జేరుకున్నాము.
    
    ఊళ్ళోకి వెళ్ళాము. మాకు విశ్రాంతి కలిగింది. ఊరంతా స్మశానంలాగ వుంది. ఇళ్ళు చెట్లు పడిపోయినాయి. పశువులు మందలు మందలుగా చనిపోయినవి. అక్కడక్కడ చనిపోయిన వాళ్ళకాడ మనుషులు గుంపులు గుంపులుగా నిలబడి యేడుస్తున్నారు. సరైన యిల్లే మాకక్కడ కనపడలేదు. ఇళ్ళల్లోని సామాన్లన్నీ కొట్టుక పోయాయి. తిండిలేక జనం తల్లడిల్లి పోతున్నారు. పాలకై పిల్లలు పోరుపెట్టి యేడుస్తున్నారు. ఎటు చూసినా శోకమయము. అది జూసి నా హృదయం ద్రవించింది. కనులు చెమ్మగిల్లినాయి, గ్రామ పెద్దలను పిలిచి నా వద్దనున్న 24  కట్టల బియ్యాన్ని వారికి అప్పగించాను. మొత్తం గ్రామానికి పంచవలసినదిగా వారిని కోరుకొన్నాను. వారు చాలా సంతోషించారు. నేను మావూరు చేరుకొన్నాను. మా వాళ్ళంతా క్షేమంగా వుండటం జూసి నేను కొంత ఆనందించాను.




Related Novels


Diviseema Uppena 1977

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.