Home » D Kameshwari » Tirigi Dorikina Jeevitham
తండ్రి చనిపోయిన ఈ ఆరునెలలనించి తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తుంటే కృష్ణమోహన్ గుండెలు ఎవరో మెలిపెట్టినట్లు బాధపడతాడు. ఏంచేసి తల్లి బాధ తీర్చగలనా అని గిలగిలలాడుతాడు! రోజంతా దేముడి ముందు కూర్చునే తల్లిని ఏ విధంగా మళ్ళీ మామూలు మనుష్యులలో పడేయాలా అని యోచిస్తాడు. తను తన తీరిక సమయం అంతా తల్లితో ఏదో మాట్లాడుతూ ఆమెని మరపిస్తూ కాస్త మనశ్శాంతి కల్గించేందుకు ఆరాటపడ్తాడు. కాని తను ఆస్పత్రిలో కూర్చుంటే తీరిక అనేది దొరకడం రోజు రోజుకీ కష్టమైపోతుంది. వంటరిగావుంటే తల్లి ఆలోచనలు ఎంతసేపూ తండ్రి చుట్టు తిరిగి తనలోతను కుమిలి ఏడుస్తుందని అతనికి తెలుసు. మధ్య మధ్య యింటి లోపలికి వచ్చి తల్లేంచేస్తూందీ చూసి వెడుతూంటాడు. అనుక్షణం ఆమెని కనిపెట్టుకొని వుండేందుకు తీరికలేని అతను తల్లికి కాలక్షేపానికి ఎవరన్నాదొరికితే బాగుండనుకుంటాడు. ఎవరొస్తారు. వచ్చిన బంధువులు ఎన్నాళ్ళు వారి పనులు, సంసారాలు వదులుకొని వుంటారు. పని మనుష్యులు. వంట మనుష్యులని ఆమెని కనిపెట్టుకుని వుండడానికి పెట్టగలడు కాని ఆమెని వాళ్ళు ఏ విధంగా ఉపశమింప చేయగలరు.
సరోజ వచ్చిన ఈ వారం రోజులలో తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తే కృష్ణమోహన్ కే ఆశ్చర్యం కలిగింది. యిరవై నాల్గు గంటలూ పూజలు పునస్కారాలు అంటూ ఆ వంకతో దేవుడి గదిలో కూర్చునే ఆమె అనుక్షణం సరోజ ప్రక్కన కూర్చునేది. తన దుఃఖం మరిచి సరోజకోసం ఆరాటపడేది. వంటింట్లోకే వెళ్ళడంమానేసిన ఆవిడ స్వయంగా సరోజ కోసం కాఫీ కలిపి, పత్యం పెట్టే రోజున దగ్గరుండి వండించి తీసుకొచ్చి స్వయంగా పెట్టింది భోజనం. కొడుకుని పదిసార్లు సరోజ గురించి ఆరాటపడ్తూ వచ్చి చూడమని మందులు సరిగా యియ్యమని ఇంజక్షన్ లు యియ్యమని చెప్పేది. పదిసార్లు కృష్ణ మోహన్ హెచ్చరించితే రోజూ భోజనం ముందు ఏదో తప్పదు. బ్రతకడానికి తినాలి అన్నట్టుండే తల్లి తనంతట తాను భోజనానికి కూర్చుని గబగబ భోంచేసేది, సరోజ వంటరిగా వుందంటూ. తల్లిలోని మార్పుకి ఆశ్చర్యపోయాడు. మళ్ళీమామూలు మనుషులలో సరోజ ధర్మమా అని పడినందుకు సంతోషించాడు. ఈ వారంలోనే తల్లిలో కాస్త జీవకళరావడం చూసి ఎంతో ఆనందించాడు. తల్లి ఆనందానికి కారణం అయిన సరోజ పట్ల అతనికి తెలియకుండానే ఏదో అభిమానం, కృతజ్ఞత చోటు చేసుకున్నాయి సరోజ ద్వారా నెమ్మదిగా ఆమె యింటి విషయాలు, బావ విషయం అన్నీ తెల్సుకుంది సరస్వతమ్మ. అదంతా తల్లి ద్వారా విన్న కృష్ణ మోహన్ కి మరింత సానుభూతి కలిగింది సరోజ పట్ల.
* * *
సరోజ పూర్తిగా కోలుకుంది. అప్పటికి సరిగా పదిరోజులయింది సరోజ వచ్చి. ఆ తల్లి కొడుకుల ఆదరాభిమానాలకి, శ్రద్దాసక్తులకి, వారు తనకు చేసిందానికి ఏ విధంగా కృతజ్ఞత చూపాలో అర్ధం కాని విషయం అయిందీ సరోజకి. అవతల తన ఉద్యోగం ఏమయిందో! తను అన్న వేళకి రాలేదని మరెవరికైనా ఆ ఉద్యోగం యిచ్చేశారేమో! ఏమయినా యీ రోజు తను ఇక్కడ నించి వెళ్ళిపోవాలి. ఆశ్రయం యిచ్చారని ఎన్నాళ్ళు వుండిపోతుంది. సరస్వతమ్మగారు తను రెండుమూడుసార్లు ఆ ప్రసక్తి తెచ్చినా ముందు నీ ఆరోగ్యం చక్కబడనీ ఆ సంగతి తరువాత ఆలోచించవచ్చు. అంటూ ఆ ప్రసక్తిని ఎత్తితే మధ్యలోనే తుంచేసింది. ఈరోజు ఏమయినాసరే వెళ్ళిపోవాలి. ముక్కూమొహం తెలియని తన మీద వాళ్ళు చూపించే అభిమానం అందుకోడానికి తనకి సిగ్గుగా వుంది.
సరస్వతమ్మగారి పూజ అయి కృష్ణమోహన్ ఫలహారం చేస్తూండగా "ఇవాళ నేను యింక వెడతానండీ, అప్పుడే పదిరోజులయింది వచ్చి-నా ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది....ఈరోజు వెళ్ళి ఉద్యోగం ఏం అయిందీ చూసుకోవాలి ముందు....మీరు నాకుచేసిన యీ సహాయానికి మీకే విధంగానూ కృతజ్ఞత చూపలేను. యింకా వుండి మీకిబ్బంది కల్గించలేను. యింక నా తిప్పలు నేను పడతాను" అంది.
సరస్వతమ్మ చప్పున కొడుకు మొహంవంక చూసింది. ఆవిడ మొహంలో నీడలా మెదిలిన ఆవేదన కృష్ణ మోహన్ దృష్టిని దాటిపోలేదు. "వెడుదువుగానీలే అమ్మా, ఎందుకంత తొందర పడ్తున్నావు. నీవు మాకేం బరువు అనుకున్నావా, నిన్ను చూస్తుంటే మళ్ళీ నా సీత యింట్లో తిరిగినంత సంతృప్తిగా వుంది, యీ పదిరోజులుగా, నీవు వెళ్ళిపోతే..." ఆవిడ గొంతు గద్గదం అయింది. సరోజ యిబ్బందిగా కృష్ణమోహన్ వంక చూసింది.





