Home » D Kameshwari » Vivahabandalu
"అందలం ఎక్కించమనలేదు. ఆదరణ చూపాలన్నాను. సేవలు చెయ్యమనలేదు, కలుపుగోరుతనంగా వుంటే చాలు. పోనీ అందరి మాట వదిలేయండి. మీరు...మీకు-కట్టుకున్న భార్య ఒక్కర్తి వుందని రాత్రితప్ప పగలు గుర్తు రాలేదా? కొత్తగా పెళ్ళయి వచ్చినదాన్ని, అత్తవారింట్లో కొత్త. కనీసం భర్త అయినా ఆదరించకపోతే.... ఎలా వుంటుందో..." దుఃఖం ముంచుకువచ్చి తల గడలో మొహం దాచేసుకొన్నాను.
"బాగుంది. నాకు మాత్రం కొత్తకాదు? అస్తమానూ వీవెంట తిరిగితే అంతా ఏమనుకొంటారు.... అయినా ఏదో వారం రోజులుండి వెళ్ళేదానికి ఈ గొడవెందుకు!" అన్నారు కాస్త అనునయిస్తున్న ధోరణిలో.
ఎంతైనా కొత్త పెళ్ళాం. ప్రేమ లేకపోయినా మోజు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? భుజం మీద చెయ్యివేసి తన వైపుకు తిప్పుకున్నారు.
"చాల్లే ఈ మాత్రం దానికి ఏడుపెందుకు?" అన్నారు కళ్ళు తుడిచి.
ఆ మాత్రం దానికే కరిగిపోయాను. హఁ స్త్రీ స్వభావం ఎంత విచిత్రం!! భర్త ఆదరిస్తే పొంగిపోవడం. ఎంత కర్కోటకుడైనా రెండు ప్రేమ మాటలు వల్లించగానే అంతా మరిచి క్షమించేసి కౌగిలిలో కరిగిపోతుంది. ఆడదాని ఈ దౌర్భల్యమే ఆమె దౌర్భాగ్యానికి మొదటి కారణం!
* * *
మర్నాడు మధ్యాహ్నం కాఫీలు తాగుతూ అందరూ సినిమా ప్రోగ్రాం వేశారు. ఎవరెవరు వెడతారు. ఏ సినిమాకి వెళ్ళాలి? అన్న చర్చలు ఆరంభించారు. ఎన్ని టిక్కెట్లు అంటూ లెక్కపెడుతూ వచ్చేవాళ్ళందరూ కల్సి పదకొండు టిక్కెట్లు తేల్చారు. అందులో నేను లేను. అక్కడే కూర్చున్న నా మొహం నల్లబడటం చూసినట్లున్నారు ఆయన.
"మీ వదినో - పన్నెండు మొత్తం" అన్నారు.
"ఆవిడ మాతో వస్తారో రాదో" చిన్నాడపడుచు దీర్ఘం తీసింది.
"ఇంతకు ముందు మీ రెప్పుడు పిలిచారో, నేనెప్పుడు రానన్నానో" సూటిగానే అడిగాను.
ఆమె మొహం ఎర్రబరుచుకుని "చిన్నన్నయ్యా, మీ ఆవిడ ఏమన్నా మీదపడి కరుస్తుందిరా! బాబోయ్, జాగ్రత్త ఎలా వేగుతావో! ఐ పిటీ యూ" అంది హాస్యంగా అన్నట్టు నవ్వుతూ.
అంతా అదో పెద్ద హాస్యంలా విరగబడి నవ్వారు.
అందరిముందూ ఆయనగారిని భార్యని కంట్రోలు చేసుకోవడం చేతకానివాడని ఎక్కడ అకుకుంటారోనన్నట్టు నా వైపు ఒక క్షణం తీక్షణంగా చూస్తూ "కరిచే కుక్కకి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పటం చేతకానివాడ్ని కాను" అన్నారు అదోలా నవ్వుతూ.
ఒక్క క్షణం ఆ మాట అర్ధం కానిదానిలా దిమ్మెర పోయాను. అంతా ఆ మాటకి సీరియస్ అయిపోయారు. వాతావరణం హఠాత్తుగా సీరియస్ గా మారిపోయింది. నా మొహంలోకి రక్తం పొంగింది. ఆ క్షణంలో ఆవేశం యెలా నిగ్రహించుకున్నానో భగవంతుడికే తెలుసు. నేను అన్న చిన్నమాటలో ఏం తప్పువుందో, ఆ మాటకి అంత ప్రాముఖ్యత ఇచ్చి - భార్యని యింత కటువుగా అవమానించాల్సిన అవసరం ఏముందో నాకే కాదు, మీకన్నా అర్ధం అవుతుందా? ఆ క్షణంలో ఒక నిస్సహాయురాలైన ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏడుపు ముంచెత్తగా గదిలోకి పారిపోయి పక్కమీద పడిపోయాను.
ఇక నన్ను సినిమాకి రమ్మని అడగలేకపోయారెవరూ.
ఆయనకూడా తలనెప్పిగా వుందని సినిమా మానేశారు.
రాత్రి పడకలవరకు యిద్దరం మౌనంగానే వున్నాం. వంటావిడ వడ్డిస్తే భోజనాలు చేసి వచ్చాం గదిలోకి. సినిమా నుంచి ఇంకా రాలేదు మిగతావాళ్ళు. మామగారు క్లబ్బు నుంచి రాలేదు. ఇంట్లో యిద్దరం. ఇంత మంచి అవకాశాన్ని ఏ కొత్తజనతా వృధాగా పోనివ్వదని చాలచోట్ల చదివాను. కాని, జరుగుతున్న దేమిటి? ఎన్నేళ్ళగానో కాపురంచేస్తున్న రీతిన ఎడమొహం పెడమొహం మొదటి రోజునుంచి ఆరంభమవడం ఎంత దురదృష్టం? అక్క పెళ్ళయిన కొత్తలో అక్కా బావ యెంత హేపీగా వుండేవారు-యిద్దరూ అసలు గది వదిలి వచ్చేవారు కారు. రోజూ బీచికీ, సినిమాకి షికారు. అక్క మొహం సంతృప్తితో, సంతోషంతో ఎంత వెలిగిపోయేది! బావ ఎప్పుడూ హాస్యాలాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ ఎంత సరదాగా వుండేవాడు! ఈయన మొహంలో నవ్వే కనపడదు. ఇది నేను చేసిన పూజల ఫలితమా? జరుగుతున్న ప్రతి సంఘటన నన్ను విరక్తిలో పడేస్తూంది.
"కోపం వచ్చిందా?" హఠాత్తుగా ఆలోచన మధ్య ఆయన ఎప్పుడు వచ్చారో నా పక్కన కూర్చుని నవ్వుమొహంతో అంటూ వుంటే ఆశ్చర్యపోయాను. నా మీదకి వంగి మొహంలో మొహం పెట్టిన ఆయనని చూస్తే ఆ క్షణంలో ఏదో చెప్పలేని జుగుప్స కలిగింది. ఆ కళ్ళలో కోరిక తప్ప అనురాగం కనపడలేదు. ఆ కోరిక రోడ్డునపోయె ఆడకుక్క వెంట తిరిగే మగకుక్క కళ్ళని గుర్తు చేస్తూంటే మొహం తిరస్కారంగా తిప్పాను.
"అదంతా కోపమేనా? ఏదో అనాలని అనుకోకుండా అనేశాను. అయినా వాళ్ళేదో అంటూంటే సరదాగా అన్నాను-"
"మిమ్మల్ని సంజాయిషీలు నేను అడగలేదు. దయచేసి నన్ను వదలండి." ఆయననించి విడిపించుకోవాలని ప్రయత్నం చేశాను.
"తప్పయింది అన్నాగా-యింకా కోపం ఎందుకు?"
"తప్పేమిటి - పెళ్ళాన్ని యిష్టం వచ్చినట్టు తిట్టేహక్కు మీకుంది. అదేమని అడిగే హక్కు నాకు లేదుగా."





