Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
"ఆ! ఇప్పుడెందుకు లెండి! తర్వాతెలాగూ వెళ్తాంగా" అంది వాళ్ళావిడ సిగ్గుపడిపోతూ.
"ఆహహ? అలా అంటే ఎలా! స్కూటర్ మీద కూర్చోవటం కూడా మీరు నేర్చుకోవాలి కదా!" అంటూ బలవంతం చేసి ఆమెను స్కూటర్ ఎక్కించారు.
మళ్ళీ చంద్రకాంత్ ఫస్ట్ గేర్ వేయగానే అందరం తప్పట్లు కొట్టాము.
స్కూటర్ రివ్వున దూసుకెళ్ళి మళ్ళీ ఇంకో పెద్ద రౌండ్ కొట్టి దిగ్విజయంగా తిరిగి వచ్చింది. చంద్రకాంత్ మొఖం గర్వంతో వెలిగిపోతోంది.
"డ్రైవింగ్ నేర్చుకొని చాలా దినాలైపోయింది గానీ ఆ టచ్ పోలేదు. చాలా ఈజీగా డ్రైవ్ చేసేయగలుగుతున్నా" అన్నాడతను ఆనందంగా. అయితే అతని వెనుక సీట్ ఖాళీగా కనిపించేసరికి అతని భార్య మధ్యలో భయపడి దిగిపోయిందేమోనని అనుకున్నాం అందరం.
"మీ ఆవిడేదీ!" అడిగాడు రంగారెడ్డి.
చంద్రకాంత్ ఛటుక్కున వెనక్కు తిరిగి చూసి కెవ్వున కేకవేశాడు.
"అయ్యో! ఎక్కడో పడిపోయినట్లుంది" అన్నాడు పాలిపోయిన మొఖంతో మా అందరి గుండెలూ ఝల్లుమన్నాయి.
అందరం స్కూటర్ వచ్చిన రూట్ వేపు పరుగులు తీశాం.
మా కాలనీ బయట, కార్పొరేషన్ రోడ్ జాయిన్ అయే చోట కార్పొరేషన్ వాళ్ళు కొత్తగా తవ్విన గోతిలో పడిపోయి కనిపించిందామె. ఆదుర్దాగా ఆమెను లేపి కూర్చోబెట్టాం. కానీ ఆమె అప్పటికే స్పృహ తప్పింది. తలకూ కాళ్ళూ చేతులకూ దెబ్బలు తగిలాయి.
"ముందు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం పదండి!" అన్నాడు గోపాల్రావ్.
"ఆటోని పిలవండి" అరిచాడు రంగారెడ్డి.
యాదగిరీ, జనార్ధన్ ఆటో కోసం పరుగెత్తారు. రోడ్ పక్కనే అరడజను ఆటోలు ఖాళీగా కనిపించినయ్.
"ఆటో" పిలిచాడు యాదగిరి. ఒక ఆటోడ్రైవర్ సిగరెట్ కాల్చుకుంటూ వచ్చాడు నెమ్మదిగా.
"ఎక్కడకు పోవాలె?" అడిగాడతను.
"డాక్టర్ దగ్గరకు!"
"ఎవళ్ళను తీసుకుపోవాలె?"
"ఒకామెకు యాక్సిడెంట్ అయింది. అర్జంటుగా ఈ చుట్టుపక్కలున్న ఏదో ఒక డిస్పెన్సరీకి తీసుకుపోవాలి!"
"యాక్సిడెంటా? అయితే నేన్రాను" అనేసి వెళ్ళి ఆటోలో పడుకున్నాడు.
"ఎందుకు రావ్!" ఆశ్చర్యంగా అడిగాడు యాదగిరి.
"యాక్సిడెంట్ కేస్ లంటే పోలీసులతో కిరికిరివయ్యా! నేన్రాను"
"అరె! నువ్వేం పాగల్ గానివా? నీయవ్వ- ఆడ పేషెంట్ బేహూష్ ఉన్నదంటే ఫాల్తూ కిరికిరి చేస్తావ్"
ఆటో డ్రైవర్ మా మాటలు తనకుద్దేసించనట్లే "ఏక్ దో తీన్" అంటూ హిందీపాట పాడుకోసాగాడు.
"అరె! నీగ్గాదువయ్యా జెప్పేది?" మరింత కోపంగా అరిచాడు యాదగిరి.
ఆటోడ్రైవర్ అదే పాటను మరింత బిగ్గరగా పాడాడు.
"వీడితో ఏంట్లే- వేరే ఆటోలున్నయ్ గా పద" అన్నాడు జనార్ధన్. ఇద్దరూ ఆ పక్కనే ఉన్న మిగతా ఆటోల దగ్గరకు నడిచారు.
మమ్మల్ని చూడగానే అందరూ అదే పాట పాడటం మొదలుపెట్టారు.
"ఆటో- ఇగో- జర అర్జెంట్! డాక్టర్ దగ్గరకు పోవాలె! నడు" అన్నాడు యాదగిరి.
"యాక్సిడెంట్స్ కేసులు తీసుకుపోము సార్!" ఒకతను పాట ఆపి చెప్పి మళ్ళీ పాటలో కెళ్ళిపోయాడు. యాదగిరికి కోపం ఆగలేదు.
"రాకుంటే ఆటో తీస్కొని ఇంటికి పో! రోడ్ మీదికెందుకు వచ్చినవ్?" అన్నాడు మండిపడుతూ.
"నువ్వెవడివి అడగటానికి?" తనూ లేచి నిలబడుతూ అన్నాడు ఆటోవాడు.
నేనూ జనార్ధన్ యాదగిరిని వెనక్కు లాగాం.
"నేనెవడినా? నీయవ్వ- ఆటోకి లైసెన్స్ ఎందుకిచ్చిన్రు! పబ్లిక్ అడిగితే బరాబర్ పోవాలి! కానూన్ ఎరుకనా నీకు?"
ఆ మాటతో ఆటోడ్రైవర్లందరూ పాట ఆపేసి ఘోల్లున నవ్వారు.
"వీడెవడో పిచ్చాడిలాగున్నాడు భాయ్! హైదరాబాద్ లో ఆటోలకు కానూనంట"
వాళ్ళు పగలబడి నవ్వుతుంటే ఇంక అక్కడ టైమ్ వృధా చేయటం అనవసరమని ఆ ప్రక్కనే ఆగి ఉన్న రిక్షా దగ్గరకు నడిచాం.
అతను ఉలిక్కిపడి ఠక్కున లేచి నిలబడతాడని మేమనుకున్నాం. కానీ అలాంటిదేమీ జరగలేదు. అసలతను కళ్ళుకూడా విప్పలేదు.
"ఏం గావాలి?" అన్నాడు కళ్ళు మూసుకునే.
"ఒకామెకి ఆక్సిడెంట్ జరిగి బేహూష్ అయింది. హాస్పిటల్ తీస్కుపోవాలె!" చెప్పాడు యాదగిరి.
"ఏ దవాఖానాకి!
"ఏది దగ్గరుంటే అది"
"అట్లనా! ముప్పుయ్ రూపాయిలిస్తావా?"
అందరం ఉలిక్కిపడ్డాం.
"ముప్పై రూపాయలా?"
"అవ్ సార్! యాక్సిడెంట్ కేస్ గదా?"
"అయితే?"
"పోలీసోండ్ల తోటి కిరికిరి. సార్! పరిషాన్జేస్తరు తర్వాత"
"ముప్పై రూపాయలిచ్చినా చేయక మానరు గదా?" అడిగాడు జనార్ధన్.
"ఇరవై రూపాయలిస్తాం. పద" అన్నాన్నేను.
యాదగిరి, జనార్ధన్ నావేపు కోపంగా చూశారు "రెండు మూడు రూపాయలిచ్చే దూరానికి ఇరవై ఇస్తానంటావేమి సంగతి?" అడిగాడు యాదగిరి.
"అవతల ఆమె ప్రమాదంలో ఇరుక్కుని స్పృహ తప్పింది. ఈ సమయంలో బేరాలాడితే ఎలా?"
రిక్షావాడు చప్పున నా సపోర్ట్ కొచ్చాడు.
"అవ్ సార్! ఒక దినం గిట్లనే ఒక పెద్దమనిషి ఇరవై కొస్తవా, పాతిక్కొస్తవా అంటూ లొల్లి పెట్టుకున్నడు. చివరికేమాయె? ఇంటికిపోయే సరికే ఆమె చనిపోయె! నా పైసలు నాకియ్యబట్టె-"
ఆ మాటతో అందరి గుండెలూ ఝల్లుమన్నాయి. "నిజమే! చంద్రకాంత్ భార్య ప్రాణాలు కూడా పోతాయేమో" అన్నాన్నేను.
"సరే పద! ఆలస్యం చేయటం అనవసరం" అన్నాడు జనార్ధన్.
రిక్షా తీసుకుని కాలనీలో కెళ్ళాం.
అందరం కలసి ఆమెను రిక్షాలో కూర్చోబెట్టాం. తల నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. అందరం రిక్షా వెనుకే బయల్దేరాం. రాజేశ్వరి ఆమెను పట్టుకుని కూర్చుంది రిక్షాలో.
కొద్దిదూరం నడవగానే "డాక్టర్ ప్రయోగ్', ఎమ్.బి.బి,ఎస్. అన్న బోర్డు కనిపించింది.
"పదండి! ఈ డాక్టర్ కి చూపిద్దాం" అన్నాడు రంగారెడ్డి.
శాయిరామ్ గేటు గీసుకుని లోపలికెళ్ళి డోర్ బెల్ మీట నొక్కాడు.
పరుగుతో వచ్చి కర్టెన్ పక్కక తొలగించి- "హో వెల్ కమ్" అన్నాడో యువకుడు.
"మీ ఫాదర్ ని పిలవండి! అర్జెంట్ కేస్ చూడాలి వెంటనే" అన్నాడు శాయిరామ్.
"మా ఫాదరెందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఎందుకేమిటి? పేషెంట్ ని చూడాలి! సీరియస్ యాక్సిడెంట్ అయింది." ఆ మాటతో ఆ కుర్రాడు మొఖం పాలిపోయింది. కొంచెంగా కాళ్ళూ చేతులు వణకసాగినాయి.





