Home » D Kameshwari » Madhupam
"ఏమిటి ఏమైంది?" గొంతులో ఆదుర్దా.
"ఆ రాస్కెల్ దినేష్ లేడూ.... నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు."
"ఎందుకూ ఏమని, మీ ఇద్దరు విడిపోయి నాలుగు నెలలయింది. నీవు గౌతమ్ ని చేసుకున్తున్నావు. ఇపుడేమిటి ప్రాబ్లం?"
"ఆ, ఏం లేదు. వాడ్ని కాదని గౌతమ్ ని చేసుకుంటున్నానని కుళ్ళు. ఇన్నాళ్ళు ఊరుకున్నాడు. పెళ్లనగానే అసలు కలర్స్ బయటపట్టాడు. సెల్ లో ఫోటోలున్నాయి వాడి దగ్గర."
"అసలు నిన్ననాలి. ఆ దినేష్ గాడు ఓ రోమియో. అలాంటి వాడిని నమ్మావు. వాడితో క్లోజ్ గా ఉండద్దని ఎంత చెప్పాను."
"ప్లీజ్ , నువ్వు తిట్టకే. వాడి మాటలకి బోర్లా పడ్డాను. కింద కాదు, వాడి వళ్ళో అదే నే చేసిన తప్పు."
"మీ పేరెంట్స్ కి చెప్పావా..... చెప్పడం మంచిది " హరిత సలహా ఇచ్చింది.
"చెప్పా..."
"చెంప పగలకొట్టింది అమ్మ" చిన్నపిల్లలా అంది.
"నిజం....? అంటే , ఆవిడకి ఎంత కోపం వచ్చిందో అర్ధం అవుతుంది. మీ డాడీ ఏమన్నారు?"
"అమ్మ నాన్నా ఇద్దరూ మాట్లాడుకుని దినేష్ గౌతమ్ కి చెప్పి ఫోటోలు చూపించక ముందే నన్నే చెప్పమంటున్నారు. లేకపోతే పెళ్ళయినా ఎప్పుడు చెప్పాస్తాడోనని అనుక్షణం వాడికి భయపడుతూ టెన్షన్ తో బతకాల్సి ఉంటుంది. నీవే చెపితే నీ నిజాయితీ ని గౌతమ్ హర్షించవచ్చు. చెప్పాక అతని ఏ నిర్ణయానికైనా తలవగ్గడం మంచిది అంటున్నారు. నీ అభిప్రాయం చెప్పు."
"గౌతమ్ తో చెప్పడం సరే ఆ రాస్కెల్ ని అంత ఈజీగా వదిలెయడమేనా? ఆడపిల్లలతో ఎంజాయ్ చేసి తరువాత బ్లాక్ మెయిల్ చేసేవాడిని ఊరికే వదిలేయడమా?" హరిత సాలోచనగా అంది.
"నీవు నాకేదన్నా సలహా చెప్పవే తల్లీ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ గౌతమ్."
"సరే, ఈ రోజు ఆదివారమే గా మా ఇంటికి రా. ఇద్దరం ఆలోచిద్దాం. ఊరికే టెన్షన్ పడకు."
* * * *
"ఏయ్ దినేష్ ఎందుకలా ఎస్సెమ్మెస్ లు పంపిస్తున్నావు. నీకేం కావాలి?"
"నీవే కావాలి " కొంటెగా అన్నాడు దినేష్.
"షటప్. మనిద్దరం గుడ్ బై చెప్పుకుని ఐదునెలలయింది. ఇప్పుడు మళ్ళీ నా వెంట ఎందుకు పడ్డావు?" కోపంగా అరిచింది.
"దూరం అయ్యాక నీ మీద ప్రేమ ఎక్కువయింది డార్లింగ్. నిన్ను వదులుకోలేననిపిస్తుంది."
'చూడు , నీ పిచ్చివేషాలు నాదగ్గర కాదు, నీవేమిటో నాకు బాగా తెలుసు. ఈ బ్లాక్ మెయిలింగులు అపు. నీకేం కావాలో చెప్పు. నేను దీనికి భయపడేదాన్ని కానని నీకు తెలుసు."
"అలాగా.... సరే, నాకేం కావాలి , నీవు కావాలి. అప్పుడు పెళ్ళయ్యాక అంటూ ఊరించి దూరం పెట్టావు. పెళ్లవుతుందిగా, ఇప్పుడు ...." విలాసంగా నవ్వాడు.
'ఛా.... నోర్మూయ్. పెళ్ళి అవుతుంది నాకు. ఇప్పుడిలాంటి వెధవ వేషాలా..." అరిచింది.
"ఏయ్.... నీ పొగరు మాటలు అపు. నీకు రెండే ఛాయిస్ లున్నాయి. ఒకటి నా కోరిక తీర్చు. లేదంటే ఆ ఫోటోలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరకి వెడతాయి" వికటంగా నవ్వి అన్నాడు.
'చూడు, నేను ముందు నీతో ఓసారి మాట్లాడాలి. ఇంటికిరా.'
"ఇళ్ళకి రాను, ఏదన్నా హోటలయితే రెడీ."
"నేను హోటల్ కి రాను. చూడు హరిత ఆఫీసుకి వెళ్ళాక దాని అపార్ట్ మెంట్ తాళం తీసుకుంటాను. అక్కడికి రా. రేపు పదకొండుకి?" ఫోన్ పెట్టేసింది.
"ఒకే..... చూడు, ఏదన్నా పిచ్చి వేషాలు వేస్తె నష్టం నీకే అన్నది మర్చిపోకు" ఫోన్ కట్ చేశాడు.
చాలాసేపు హరిత, కార్తీక మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
* * * *
"ఫర్వాలేదే అన్నమాట ప్రకారం వచ్చావు. థాంక్స్ నన్నింకా నీ మనసులోంచి తొలగించనందుకు. మనిద్దరం తప్పు చేశామా దూరం అయి....." దినేష్ కులాసాగా అన్నాడు హరిత ప్లాట్ లోకి రాగానే.
"చూడు దినేష్, నీతో గతించిన ముచ్చట్లు మాట్లాడడానికి రాలేదు. నీకేం కావాలి సూటిగా చెప్పు."
"చెప్పాగా , నీవే కావాలి. పర్మినెంట్ గా వద్దులే. పాపం పెళ్ళి కుదుర్చుకున్నావుగా. ఒక్కసారికి నాదానివి కా. వెరీ సింపుల్ కోరిక నాది" విలాసంగా సోఫాలో కూర్చుని కాళ్ళు సెంటర్ టేబుల్ మీద పెట్టాడు.
"అది కుదరదని నేనంటే...." సూటిగా చూసి అంది కార్తీక.
"ఒకే , రేపీపాటికి మీ శ్రీవారితో పాటు దేశ విదేశాల్లో అందరూ మనిద్దరి ఇంటిమేటు ఫోటోలు ఫేస్ బుక్ లో చూస్తారు" తలెగరేసి పొగరుగా అన్నాడు.
"ఇంకా ఫేస్ బుక్ లో పెట్టలేదా. నీకంటే నేనే ఫాస్ట్ అన్నమాట. అప్పుడే నే పెట్టేశా చూస్తావా" హ్యాండ్ బ్యాగు లోంచి "ఐపాడ్ " తీసి ఓపెన్ చేసి దినేష్ కళ్ళ ముందు ఆడించింది. "ఇంగ్లీషు వచ్చుగా. చదువుకుంటావా తెలుగులో చెప్పాలా.... నీకేండుకులే కష్టం. చదువుతా విను" పాలిపోయిన మొహంతో కలవరంగా చూస్తున్న దినేష్ వంక విలాసంగా చూస్తూ "ఈ ఫోటోలో ఉన్న దినేష్ అనే వాడు ఉత్తి దొంగ రాస్కెల్. వీడ్నీ ఆడపిల్లలెవరూ నమ్మద్దూ. ప్రేమ కబుర్లు చెప్పి అమ్మాయిలతో తిరిగి మొహం మొత్తగానే ఇంకొకరిని చూసుకుని పాతవాళ్ళ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఏడిపించడం వీడికి వినోదం. పెద్ద శాడిస్ట్. ఆడపిల్లలెవరూ వీడి ట్రాప్ లో పడద్దని , ప్రేమ కబుర్లకి లొంగవద్దని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన ఓ అమ్మాయి చెబుతున్న మాటలు ఇవి"..... 'ఇది ఇంకో క్షణంలో దేశ విదేశాల వాళ్ళంతా చూస్తారు. ఫేస్ బుక్ అంటే తెలుసుగా నీకు."
"ఏయ్ కార్తీకా...." ఒక్క ఉదుటున కార్తీక మీదకి దుమికాడు దినేష్.
"ఏయ్ అక్కడే అగు" చటుక్కున బెడ్ రూమ్ లోంచి వచ్చిన హరిత అరిచింది.
"నోరు మూసుకు కూర్చో. ఒక్క అడుగు ముందుకు వేశావంటే పోలీసుల్నీ పిలుస్తా" హరిత దినేష్ ని సోఫాలో తోసింది. దినేష్ మొహంలో రక్తం ఇంకిపోయింది.
"దినేష్ నీవే పెద్ద తెలివైన వాడివనుకుంటున్నావా? సెల్ ఫోన్లు, కంప్యూటర్లూ, ఐపాడ్ లు మాకూ ఉన్నాయి. ఇంటర్నెట్లు, ఫేస్ బుక్ లు మాకూ తెలుసు. అవి ఎలా వాడాలో కూడా తెలుసు. నీవు నన్ను బ్లాక్ మెయిల్ చేసి భయపెడితే ఏడుస్తూ కూర్చోడానికి నేను పాతకాలం అమ్మాయిని కాను. ఫ్రెండ్లీగా తిరిగాం. పెళ్ళి ఇద్దరం వద్దనుకుని విడిపోయాం. ఇన్నాళ్ళ తరువాత నా పెళ్లనగానే నీలో అహం తలెత్తిందా . నీవు నా వుడ్ బీకి చూపిస్తే , నేనెవరికీ చెప్పుకోలేననుకున్నావు. నీ ఎస్సెమ్మెస్ లు సెల్ లో ఉన్నాయి. ఇందాకటి నుంచి మనం మాట్లాడింది , నిన్న మాట్లాడింది సెల్ లో రికార్డ్ అయి వుంది. ఇవి చాలు పోలీసు కంప్లయింట్ ఇవ్వడానికి. రేపీపాటికీ నీ బాస్ కి చెప్పి నీ ఉద్యోగం ఊడగోట్టిస్తా, గౌతమ్ కి నీవు చెప్పేదేమిటి నేనే చెపుతాను జరిగిందేమిటో, నోరుమూసుకుని పడి వుండి, చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పి కదులు..... ఇంకా కక్ష సాధించాలనుకుంటే నాశనం అయ్యేది నీ బతుకే" కఠినంగా అంది కార్తీక.





