Home » D Kameshwari » Tirigi Dorikina Jeevitham
"ఏమిటిరా హాస్యం, యీ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు!"
"జ్ఞాపకం తెచ్చుకో, నా కెవరో మేనత్త కూతురో, మేనమామ కూతురో ..."
"నాకు తెలియని మేనత్తలు మేనమామలు ఎక్కడనుంచి వస్తారు...అసలీ అమ్మాయి ఎవరు రా, యిక్కడికెలా వచ్చింది. సంగతేమిటి సరిగా చెప్పరా" అంది ఆవిడ అసహనంగా ఆరాటాన్ని అణచుకోలేక.
కృష్ణమోహన్ జరిగిన సంగతి చెప్పాడు. సరస్వతమ్మ వింటూ ఆశ్చర్యపోయింది. "బావా" అందా నిన్ను నాకు తెలియని మేనకోడళ్ళు ఎవరురా. నీ కసలు అత్తలు లేరు మీ అన్నయ్య, తమ్ముడు పిల్లలు నాకు తెలీదూ- అసలీ అమ్మాయిని మన బంధువులలో కూడా ఎక్కడా చూసినట్లులేదు.... ఆ అమ్మాయికి నీలాంటి బావ ఎవరన్నా ఉన్నారేమో, నీవనుకుని పొరపాటుపడి వుంటుంది. పాపం తెలివిరాగానే అన్ని వివరాలు అడిగితేసరి పాపం అయినింటి పిల్లలావుంది-"
తల్లి అనేవరకు ఆమెకి తనలాంటి బావ వుండి తనే అత ననుకుని పొరపడి ఉంటుందన్న ఆలోచనే రానందుకు ఆశ్చర్యపడ్డాడు. అంతే అయివుంటుంది. ఆ మహానుభావుడు కంటికి కనపడకుండా పోయినట్టున్నాడు, అందుకే అలా అంది.
"అయ్యో, జ్వరం మండిపోతుందిరా, మందిచ్చావా, ఏం చేస్తావురా యిప్పుడు యీ అమ్మాయిని..." సరోజ చేయిపట్టుకుని చూసి ఆమె వంక జాలిగా చూస్తూ అంది.
"చేసేదేం ఉంది. నర్శింగుహోముకే చేరుస్తా. కాస్త తెలివి వచ్చాక వివరాలు అడిగి వాళ్ళ వాళ్ళు ఎవరికన్నా టెలిగ్రాం యిస్తాను. సింహాచలాన్ని సుబ్బిని పంపించు బెడ్ మీద పడుకోబెట్టుతారు" అన్నాడు.
సరోజ మొహం చూస్తూన్న సరస్వతమ్మ మొహం ఒక్కసారిగా ఎందుకో మారిపోయింది. "కృష్ణా...యీ అమ్మాయిమొహం సరిగ్గాచూశావురా" అంది వణికేగొంతుతో తల్లిగొంతులో మార్పుకి ఆశ్చర్యపోతూ తల్లి చూస్తున్న దేమిటో అర్ధంగాక తల్లివంకచూశాడు. "సీత...మన సీతలా లేదురా యీ అమ్మాయి-" అంది ఉద్వేగంతో. కృష్ణ మోహన్ సరోజ వంక యీ సారి కుతూహలంగా, శద్దగా చూశాడు. సీత-తన చెల్లెలు సీతలా పూర్తిగా లేకపోయినా, ఎక్కడో దేన్లోనో సీతకి యీ అమ్మాయికి పోలికవుంది మొత్తంమీద అన్పించింది అతనికికూడా. "చూడరా, ఆ ముక్కు, ఆ నోరు, గడ్డం అదీ అదీ అచ్చు సీతేరా సీత కంటే ఒక్కచాయ తక్కువ అంతే," అంది ఆవిడ యింకా సరోజని ఆరాటంగా చూస్తూ.
"అవును అమ్మా, సీత పోలికలు కొంచెం ఉన్నాయి, ఈ అమ్మాయికి. మన సీత అంత ఎత్తు. ఇంతా ఒకటే, కాని కళ్ళువేరు. మొఖం తీరుకూడా ఒకటేనమ్మ"
సరోజని చూస్తూన్న సరస్వతమ్మ కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. "మళ్ళీ యీ నాటికి నా సీతని చూసినట్లుందిరా...సీతవుంటే యింత వయసుదే అయిఉండేది..." అంటుంటే ఆమె గొంతు పట్టుకుంది. కృష్ణమోహన్ గొంతులో ఏదో అడ్డుపడినట్లు అయింది. యింకా ఉంటే తల్లి మరింత బాధపడ్తుందని "అమ్మా, సుబ్బిని పంపమ్మా, నర్సింగుహోమ్ కి చేరుస్తాను..." అన్నాడు ఆవిడ ఆమాట విన్పించుకోకుండా తనివితీరా లేదన్నట్టు సరోజని ఆప్యాయంగా చూసుకోసాగింది. "ఈ అమ్మాయిని యింట్లోనే ఉండనీయరా నర్సింగుహోమ్ లో వద్దు - నా కళ్ళముందు ఉండనీయరా, ఇన్నాళ్ళకి మళ్ళీ సీతని చూసినట్టుంది..." పట్టుకున్న గొంతుతో అంది. 'అమ్మా!' అన్నాడు కృష్ణ. "ఎందుకమ్మా యీ ప్రలోభం. ఈ అమ్మాయి మన సీత ఎలా అవుతుందమ్మా, రెండు రోజులుండి పోయే యీ అమ్మాయి మీద అనవసరంగా మమతలు పెంచుకోడం, తర్వాత బాధపడడం ఎందుకమ్మా..."
"లేదురా నాయనా, వుండనీ, అలా నర్సింగు హోమ్ లో దిక్కూ మొక్కూ లేనట్టు నా సీత అయితే పడేసేదాన్నా....ప్రక్క తీయించి వస్తాను. రెండురోజులన్నా నా కళ్ళముందు ఉండనీ యీ అమ్మాయిని, యింకేం అడ్డు చెప్పకు" అంటూనే ఆవిడ లోపలికి వెళ్ళి పోయింది.
* * *
మూడో రోజుకి జ్వర తీవ్రత తగ్గి వాస్తవ పరిస్థితి గుర్తించ గల్గిన స్థితికి వచ్చింది సరోజ. తెలివిలోకి రాగానే తనున్నస్థితి చూసుకుని ఆశ్చర్యపడింది ప్రక్కనే కూర్చుని ఆప్యాయంగా తనవంక చూస్తున్న సరస్వతమ్మని వింతగా చూసింది.





