Home » D Kameshwari » Kadedi Kadhaku Anarham
వంటికి అంటుకున్న దుమ్ము - నోట్లోంచి కారిన రక్తం చెక్కుకు పోయి మండుతున్న గాయాలు కారే కన్నీళ్లు అన్నీ తుడుచుకున్నాక తోటి ముష్టివాళ్ళు ఆ దెబ్బలకి కారణం చెప్పాక మళ్ళీ ఆ స్టేషను లోపలికి అడుగు పెట్టడానికి ధైర్యం చాలలేదు. యిద్దరూ బితుకుబితుకుమంటూ ఆ గజాల దగ్గిరే ముడుచుకు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ పుట్టి బుద్ది ఎరిగిన ఈ ఎనిమిదేళ్ళలో ఆ స్టేషను తప్ప బయట ఓ ప్రపంచం వున్నదన్న సంగతి ఎరగరు - ఆ స్టేషను ఆవరణ దాటి ఎరుగని ఆ యిద్దరూ స్టేషనులోకి రావద్దంటే మరెక్కడన్నా వెళ్ళి అడుక్కోవచ్చని కూడా తెలియనంత అయోమయంలో, ఎక్కడి కన్నా వెడితే తల్లి నించి తప్పడి జనంలో కలిసి పోతామని తల్లి కొంగు విడవని పసివాళ్ళలా ఆ స్టేషను గజం బద్దలు పట్టుకుని వచ్చేపోయే రైళ్ళను చూస్తూ, అమ్మే తినుబండారాలు చూస్తూ కింద విసిరేసిన ఎంగిలాకులు చూస్తూ నోట చొంగ కార్చుకుంటూ , ఆశగా, ఆబగా, దీనంగా ఆ రోజంతా ఆకలి కడుపులతో నకనకలాడి, రాత్రి కాంగానే ఆ మట్టిలోనే ఆ గజాల నానుకునే నిద్ర పోయేరు.
తెల్లారాగానే ----- నిన్న భయానికి అణిచి పెట్టిన ఆకలి మండి ఏమయినా అగనన్నట్టు విజ్రుంభించింది. పెంటిగాడు, సిన్నిగాడు నకనకలాడుతున్న కడుపులని ఎలా నింపుకోవాలో తెలియక బిక్కమొహాలు వేసుకు నిల్చున్నారు. ధైర్యం చేసి గజాల మధ్య నించి దూరి ఫ్లాట్ ఫారం మీదకి వెళ్ళాలన్న ఆరాటాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టమయి పోసాగింది వాళ్ళకి. మరుక్షణం నిన్న కొట్టిన దెబ్బలు తాలూకు నల్లగా కమిలిపోయిన , రక్తం కారిన, చెక్కుకు పోయిన గుర్తులు కళ్ళ ముందు కనపడుతుంటే - ఆకలి ముందుకు లాగుతుంటే భయం వెనక్కి లాగుతుంటే ఏం చెయ్యాలో తెలియక గజాలు పట్టుకు నిల్చున్నారు.
అదే సమయంలో మెయిలు వచ్చి ఆగింది. గజాల అవతల నిలబడ్డ వాళ్ళిద్దరి ఎదురుగా ఓ ఫస్టు క్లాసు కంపార్టుమెంటు ఆగింది.
అక్కడ కిటికీ దగ్గిర ముద్దులు మూటకట్టె ఐదేళ్ళ పిల్లాడు కూర్చుని అటూ యిటూ చూస్తున్నాడు. పిల్లాడికి యిరుపక్కలా అందం, యవ్వనం , ఐశ్వర్యం , ఆధునికత కలిసి మిసమిసలాడుతున్న తల్లిదండ్రులు కూర్చున్నారు. రైలు ఆగగానే కంపార్టుమెంటు లోకి బేరార్ బ్రేక్ ఫాస్టు ట్రే తీసుకు వెళ్ళాడు. ఆ ట్రేలో నుంచి ఓ సాండ్ విచ్ తీసి కుర్రాడికి యిచ్చి తినమని బ్రతిమాలాడుతుంది తల్లి. కుర్రాడు వద్దంటూ తల అడిస్తున్నాడు. కుర్రాడి చేతిలో బలవంతంగా సాండ్ విచ్ పెట్టి తల్లి తండ్రి కాఫీ తాగసాగారు. కుర్రాడు చేతిలో రొట్టె పట్టుకుని తినకుండా ప్లాట్ ఫారం మీద సందడి కుతూహలంగా గమనిస్తున్నాడు.
ఆ కుర్రాడి చేతిలో రొట్టె చూసేసరికి పెంటిగాడికి సిన్నిగాడికి మరిచిపోయిన ఆకలి విజ్రుంభిన్చింది. ఆ రొట్టె చూడగానే యిద్దరి కళ్ళు మిలమిల్లాడాయి. నోట్లో నీరూరింది. యిద్దరి కళ్ళు కల్సుకున్నాయి. వెంటనే యిద్దరూ నిస్సహాయంగా , అటు యిటు తిరుగుతున్న టి.సి లని గార్డుని చూశారు. అంతలో పెంటిగాడి బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది. వాడి కళ్ళు మెరిశాయి. ఆ రహస్యం సిన్నిగాడి చెవిలో ఊదాడు. యిద్దరూ రాబందుల్లా అవకాశం కోసం లేచారు.
గార్డు విజిల్ వేశాడు. రైలు నెమ్మదిగా కదిలింది. వేగం అందుకుంటుంది. పెంటిగాడు చటుక్కున గజాల మధ్య నించి దూరి మెరుపులా పరిగెత్తి కిటికీ దగ్గిర కూర్చున్న కుర్రాడి చేతిలో రొట్టె ముక్క లాగేశాడు. మరో సెకనులో వెనక్కి పరిగెత్తేవాడే కాని వాడి ఖర్మ కాలి ఆ తండ్రి చూడడం ఏమిటి చటుక్కున 'చోర్ చోర్' అంటూ పెంటిగాడి చెయ్యి పట్టేశాడు. ఆ చేతిలోంచి తన చెయ్యి లాక్కోవాలని పెంటిగాడు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకపోయింది. భాలూకం లాంటి ఆ పట్టు నించి తప్పించుకోలేక, రైలు వేగం అందుకుంటుంటే దాంతో సరిగా పరిగెత్తలేక, కుక్క నోట కరిచిన కోడి పెట్టలా గాలిలో కాళ్ళు తన్నుకుంటూ గిలగిల కొట్టుకున్నాడు. 'చోర్ బద్మాష్ - పకడో - అంటూ తమ ధనధాన్యాలు కొల్లగొట్టి నంత హడావుడిగా అరుస్తూ ---- 'పుల్ దట్ చైన్ ' అంటూ భార్య వంక తిరిగి అరిచాడు. పెంటిగాడు ఆఖరి ప్రయత్నంగా తన చెయ్యి పట్టుకున్న ఆ పెద్ద మనిషి చెయ్యి చటుక్కున కొరకడం ఆ పెద్ద మనిషి ఓ కేక పెట్టి పట్టు విడవడం రైలు వేగంతో బాలన్స్ కుదరక ప్లాట్ ఫారం కి రైలు కి మధ్య ఖాళీ స్థలంలో పెంటిగాడు పడడం, అంతవరకు తెల్లబోయి చూస్తున్న జనం హాహాకారాలు , సిన్నిగాడి కేవ్వుమన్న కేకతో - చైన్ లాగబడిన రైలాగింది.
ఆగిన రైలు పెంటిగాడి కోసం మరి కాస్త ముందు కెళ్ళాక గాని పెంటిగాడు దొరకలేదు. దొరికిన పెంటిగాడు పెంటిగాడులా లేడు. ఏ ముక్కకాముక్క తెగిపడి రక్తం ముద్దలా వున్నాడు. రక్తం ముద్దని చూసి అంతా నోట మాట రాక ఒక్క క్షణం నిలబడిపోయారు. జనాన్ని తోసుకు ముందుకి పరిగెత్తి వచ్చిన సిన్నిగాడు --- పెంటిగాడిని -- తనకున్న ఏకైక బంధువు, తోబుట్టువు , ఆప్తుడు , మిత్రుడిని చూసి కేవ్వుమనలేదు. నెత్తి కొట్టుకుని ఏడవలేదు. ఒక్క క్షణం దిగ్భంత్రిలో నిలబడిపోయాడు. తరువాత వాడి కళ్ళు చురుకుగా దేని కోసమో వెతికాయి. రక్తం ముద్దకి కాస్త దూరంగా సిన్నిగాడు వెతుకుతున్నది కనపడింది. అది దూరంగా తెగిపడిన పెంటిగాడి చెయ్యి. ఆ చేతిలో గుప్పెట్లో బిగించిన రొట్టెముక్క!! సిన్నిగాడు ఒక్క ఉరుకున అక్కడికి దూకి ఆ చేతిలోంచి రొట్టె ముక్క తీసి చటుక్కున నోట్లో పెట్టేసుకున్నాడు.
అబ్బ - ఎంత ఘోరం - ఇంత చిన్న రొట్టె ముక్కకి ప్రాణం 'కాపాడే శక్తే కాదు, తీసే శక్తి వుందని ఇవాళే తెల్సింది అనుకున్నారంతా.
('జ్యోతి' సౌజన్యంతో ) ***





