Home » Poranki Dakshinamurty » Velugu Vennela Godaari


 

    ఆ వుసారులో ఎగిరి గంతేసివోడు. "నేపట్టినయ్యి పైడిముక్కలాయేనే!" అంటా పాటే లంకించుకునీవోడు.
    సేవన సుక్కురారం సందేల , గోదారి గట్టు మీద సతికిల పడి కూకుని , దూరంనించొచ్చీ పడవల తెరచాపలు సూత్తావున్నాడు ముసలయ్య.
    ఎన్ని ఏల ఎల్లనించి పారుతున్నాదో గోదారి! ఎన్ని యేల పడవలు నడుత్తా వున్నాయో?
    ఎన్ని తెరచాపలు గాలికి రెపరెప లాడినాయో?
    ఒకో మనిసిని, దేవుడు తన్లో కలుపుగునీ లోగా ఎన్ని ఏల పుట్టక లిత్తాడో?
    ఒచ్చీ పడవలూ పోయీ పడవలూ!
    సవుద్రం లా గోదారి!
    పోగలంతా సూరీడు--
    రేతిర్లు సెందురుడు!
    ఇద్దరూ మారలేదు. గోదారీ మారలేదు.
    పడవలు మారినాయి. పడవల్లో మనుసులు మారారు. మనుసుల మనసులు మారినాయి!
    పెయ్యానవయ్యాక లంగరేత్తారు.
    కదిలీ ముందు తీత్తారు. సుక్కాని తిప్పుతారు.
    కొండ మీంచి సుక్క పొడుచుకొత్తాది . పురిటిగదిలో పాప కేరు మంటాది.
    మల్లా, మల్లా అల్లాగే!
    అపడవా, యీ పడవా నడిసేది ఒక గోదార్లో!
    దానికీ , దీనికీ నడవ నీలాల నీళ్ళు!
    మనసుల సుట్టూ కొండలు!
    మనిషికీ, మనిషికీ నడాన్న కొండలు.
    ఆ కొండల్ని ఆళ్ళు కరిగించలేరు.
    మామూలు కొండలికి పైపైన సిగుళ్ళు.
    ఈటన్నిటికీ పునాదులే పయిన!
    కొండలు లేపోతే మనుసులు నిలవలేరు. మనసులు నిలిసెయీ కావు.
    ఏంటో సిత్రమంతా?
    సల్లటి సేయ్యొచ్చి ముసలోడి బుజాలికి మెత్తగా తగిల్నాది.
    ఆడు ఎనక్కి తిరిగాడు.
    "ఏం సూత్తన్నావు తాతా?"
    "మనిసికి మనిసికి మనసులో కొండలు. మొగుడికీ పెల్లానిమీ మద్దిలో కొండలు!" పిచ్చోడు తాతయ్య!
    "నీక్కూడా పెళ్ళి అయిందా తాతా?"
    "నాక్కాదమ్మా! జగ్గన్న కయినాది!"
    సీతమ్మ నవ్వినాది.
    "పిల్లలా?"
    "ఉన్నారమ్మా! ఇద్దరు. కాదు అయిదుగురు!"
    "ఆళ్ళేరి మరి?"
    "కొండల్లో ఉన్నారు."
    "ఏ కొండలు? పాపి కొండలా?"
    "దానికీ నాకూ నడవ నిలుసున్న కొండలు!"
    "సిత్రంగా వుంది తాతా! ముసలమ్మా , పిల్లలూ సచ్చి పోయారా?"
    "రామరామ! నిండు పేనాలు తల్లీ! ఇంతమందిని మోసీ బూదేవమ్మకి ఆళ్ళు బరువవుతారా అమ్మా!"
    "నీమాటలెం తెల్తం లేదు. నీకతంతా నాకు సేప్పవూ?' ముసలయ్య నవ్వాడు.

                                   3
    ఆనాటి ,మాట నిన్నటి కతలా కనిపిత్తాది రావులమ్మ కి. ఇన్నేళ్ళ బట్టి కాపరవు సెత్తన్నా ఆడి మీద మనుసు తీరేలేదు. పొగలూ రేత్తిరీ ఆడి కాళ్ళ కాడే పడున్నా ఎల్లకాలం అలాగే ఉండాలని పిత్తాది. ఏంటో ఆ మమకారం! జనమ జనవాలికీ ఆడే తన మొగుడవ్వాలని కోరుకుంటాది . తన సీర కొంగు క్కట్టుకొని సిత్రంగా సూసి నవ్వుకుందారని పిస్తాది! ఓరబ్బ! ఆడు మనిసా? దేవుడే!
    'అదంతా అయ్యగారి సలవ!' అనుకున్నాది రావి. 'ఎన్నలాటి గుండి! అందరికీ తన్లాగే నచ్చినోడూ, మనసిచ్చినోడూ దొరికుతాడేంటి? ఉసారు ముంచెత్తు కొత్తే ఆడి ఎదట కొండలు మట్టుక్కి అగ్గలవా? ముమ్మరమయిన గోదారి వోరదలంటోడు నావోడు!' అనీ అనుకున్నాది.
    పెల్లయిన తొలి రోజుల్లో ఎల్లాగుండీది తను? అడేక్కడుండె అక్కడలేదో? పొలమేడితే పొలమే. కూలి పని కేడితే ఆడేనకె! ఎండ బడి తిరిగోత్తే సల్లటి గెంజి లో ఉప్పు నలిపి తాగిచ్చేది. ఒనలో తడిసొత్తే సేంగుతో తల తుడిసేది. 'సాంబరానీ పొగ కూడా ఎత్తావెందే?' అనీవోడు పరాసకంగా. ఎదురెదురుగా కూకుంటే ఎయేయో అలోసన్లు పొడుచుకొత్తాయి. ఆడి కేదో అనాలనిపిస్తాది. దాని కినీ! ఏదో సేయ్యాలని పిత్తాది. అలాటప్పుడు సూసీ సూపుకి తట్టుకోలేక సిత్తయిపోయి వొలిపోతాది. ఎక్కడికో ఎల్లాలని పిత్తాది. దాని కళ్ళ ముందు నించి కదలలేక పోతాడు. ఓ ఆటతోనో, ఓ పాటతోనో , ఏరే తోటలోనో అల్లా అల్లా ఓ సిణేమాలో అడతన్నట్టు రోజులు  గడిపేసీ వోరు.
    ఏనవండోరి లోగిలి ఎంతో మారినాది. పురుషోత్తవుగారు పోయాక ఇంట్లో కరుసు శానా పెరిగి పోయింది. అరి తోడల్లుడు గోరి సంతానవంతా యీరింటి మీద పడి మేసేవోరు. పెల్లాం బిడ్డల్తో వచ్చి యిందు బోజినాలు మేక్కీవోరు. అల్లాగని యిసివోవసవు వున్నవొళ్లా? అదీ లేదు. తిన్నింటి వోసాలే లేక్కేట్టీ వొళ్ళు! అత్తగారూ, బారియా బాద పడతారే'వోని సత్తిన్నాయనగారు కూడా ఏం అనీ వోరు కారు. పైగా , సెనిగొట్టు దివానం ఓటి కొనడవూ, ఆ సావాన్తో లోన గది కొట్లు ఎయించడవూ జరిగింది. దానా దీనా పదెకరాల బూని నట్టాని కమ్మేయడం అయింది. కొబ్బరి తోట దూబాసోరూ, నడిం దొడ్దోది తోట సత్తేవూ, మిగిలింది యేరో వొళ్ళూ కొనుక్కున్నారు. దాంతో అరి సంసారం దెబ్బతిన్నాది. ఎంకన్న ని కూడా పాలేరు పన్లోంచి మానిపించేశారు. తల్లి నిడిసి పెడతాన్న లేగదూడలా గిలగిల్లాడాడు పాపం! దానికి ఆరు మటుక్కు ఏం సేత్తారు? పెట్టాపోయినా పెట్టీ అమ్మని సూబించమన్నట్టు నరసిం దేవరోరితో మాటాడి ఎంకన్న కి అరికాడ నవుకిరీ యిప్పించారు సత్తేన్నాయినగారు. ఆపాటి వుపకారానికే ఆరికి ఎయ్యి దణ్ణాలెట్టుకున్నాడు ఎంకన్న.
    ఇయేయీ పట్టించుకోలేదు రావులమ్మ. మంచి పొంకం లో వుందేవో, దానికి ఆడు ఎదట కూసుంటే సాలు యింకేమీ అక్కర్లేదు. "అత్తలేదు, మావలేడు, అడబోడుసు పోరు అసలే లేదు. ఎంతదురట్టం!" అనుకుంది రావి.
    ఎన్నో యిసయాలు ఆడికి తెలిసినట్టు ఎవురికీ తెలవ్వు. పెద్దోల్ల నేందర్నో దగ్గిర్నించే సూశాడు. అందరితోటీ కలిసి ఆడు కూడా కలకటేరు గోరి కారుతో సేడంట! కద్దరు టోపీ లోళ్ళతో సానామంది తో మాటాడి నాడంట. పట్నంలో రోజుకి ఎన్ని బయిస్కోపు లాడతాయో కూడా ఆడికి తెలుసునంట. ఎటార్లు ఏ అట ఆడుతున్నారో బొమ్మలు సూసి చెప్పగలడంట. ఆడు సయ్యంటే సాలు పట్నంలో పదిమంది పని యిత్తావన్నారంట! కానేందుకో ఎల్లలేదు.
    అబ్బో! ఎంత గొప్పోడు తనవోడు!
    మూడు పూట్లా వోన్నం పెట్టి సాలుకి రెండు కాయిళ్ళ గింజ లిత్తా రాడికి. కావందు పొలంలో పండిన అంటి గెల్లు బండి మీదే సుకుని రాయిసంద్రంలో బెరానిచ్చిచ్చీవోడు. ఆపని ఆడికి దరిజా అనిపించినాది. తను కూడా బెట్టుకున్న సొమ్ముతో సవగ్గా ఊల్లో అంటి గెల్లు కొని సొంతంగా కూడా ఏసుగెల్లీవోడు.
    ఓపాలి పట్నా వెల్లినప్పుడెం జరిగిందంటే ------
    ఓసోస్! ఆపాటి సంగతి కల్లగట్టినట్టు సేప్పలేడో?------
    సలిది ముంత కట్టిచ్చి, పయిన కుసింత ఉప్పూ, వూరగాయ పచ్చడి యేసి యిచ్చింది రామి. రొండో జావు రేతిరికి లెగిసి బండి కట్టాడు. ఆడి డైరివింగేవో, తుపాను మేలు కంటే బోగి నడిసీది బండి!
    సద్ది కూడెలకి రాయసంద్రం సేరుకున్నాడు. ఎడ్ల నిప్పి కాడి కిందికి వోల్సి , కులాయి కాడ కాళ్ళూ సేతులూ కడుక్కుని ముంతిప్పుకుని కూకున్నాడు. ఒక్క ముద్దా నోట్టో పెట్టుకున్నాడో లేదో పోలీసోకడు యిట్టే సక్కా వచ్చాడు.
    "ఏరా! ఈ బండేవరిదిరా?"
    "నాదేనండయ్యా!"
    "అయితే నడు స్టేషను కి."
    "ఏ టేసనుకి బాబూ?"
    "పోలీస్టేషనుకిరా!"
    "ఎందుకండయ్యా?"
    "ఏవో తెలీదెం? నేను చెప్పాల్రా?"
    "మన్నించండయ్యా! ఇంకెప్పుడూ సేయ్యను. ఈ వూరికి నేను కొత్త!"
    "అందుకని, వళ్ళు పొగరెక్కి రోడ్డు కుడి ప్రక్కన బండి యిప్పుతావా?"
    "నాకు తెల్దు అయ్యా! ఇప్పుడే లేగదీసుకు పోతా!"
    "ఎక్కడికి పోతావ్? ముందు స్టేషను కి నడు!"
    "నీ కాల్లట్టుకుంటానయ్యా! ఈ యాల్టికొదిలేయ్."
    "అ వేషాలు నా దగ్గర పనికి రావు. గవర్నమెంటు పనిలో మన్నిస్తే లాభం లేదు."
    "ఒక నివసవెగందా అయ్యింది అయ్యా! తెలీక సేసానంటున్నా . మన్నించండి!"
    "అవేం కుదరవ్! స్టేషను కి వచ్చి ముందు ఫైను చేయించాలి. లేపోతే జైలు!"
    "అయ్య బాబో! జైలే! నాక్కోడుకుడితే నీ పెరెట్టు కుంటానయ్యా! ఈ ఏల కూరకి వో అంటి గెల కూడా యిచ్చు కుంటాను. నన్నొది లెయ్ బాబూ!"
    పుచ్చుకుక్కోటి తన ముంత పక్క నుంచి వోసనసూత్తా పోడం సూశాడు ఎంకన్న.
    ఎంత బతివాలుకున్నా ఆడు వదిల్తేగా!
    అప్పుడాడికి మొండి దయిర్నేవె వొచ్చినాది. 'ఈ డేసాలు నాకాడా?' అని అనుకున్నాడు.




Related Novels


Mutyala Pandiri

Velugu Vennela Godaari

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.