Home » D Kameshwari » Mahima



    "తను రేణుక. మన పన్లన్నీ చూస్తుంది. వంట అన్నీ తనే. నీకేం కావాలన్నా తనని అడుగు" అంది సీమ. "నమస్తే అమ్మా" అంది రేణుక. "ఇంక నేను రేపటినుంచి ఇక్కడి మెంబర్ ని" నవ్వుతూ అంది మహిమ.
    "ఇంకా అందరూ ఇంటికి వచ్చినట్టు లేదు. అందరిని రేపు పరిచయం చేస్తా, ఇంక బయలుదేరు. మళ్ళీ ఆలస్యం అవుతుంది. ఎనిమిదికల్లా రావాలి, ఆలస్యం చేయొద్దు. ఇల్లు కనుక్కోగలవు గదా! అన్నట్టు నా సెల్ నెంబర్ నోట్ చేసుకో, నీది నాకు చెప్పు" అంటూ నెంబర్ తీసుకుంది. "బై సీమా... సీ యూ టుమారో" అంటూ వెళ్ళింది మహిమ. ఇంత మంచి అకామడేషన్, ఇంత మంచి రూమ్మేటు, మంచి ఉద్యోగం ... మహిమకి గాలిలో తేలిపోతున్నట్లు సంబరంగా ఉంది.

                                                           *  *  *  *

    "డాడీ! నాకు ఉద్యోగం వచ్చేసింది. జీతమెంతో తెలుసా? గెస్! అకామడేషన్ కూడా దొరికింది. ఆ కంపెనీలోనే పనిచేసే అమ్మాయిలు కొందరు అపార్ట్ మెంట్ లో రెండు ఫ్లాట్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారిలో ఒకరితో రూమ్ షేర్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ సెటిల్డ్. రేపే రూముకి షిఫ్ట్ అవుతున్నా" రాత్రి ఇంటికి ఫోను చేసింది మహిమ, చాలా ఉద్విగ్నంగా.
    "ఓ ... గ్రేట్" సంతోషంగా అన్నాడు కృష్ణమూర్తి. "జగ్రత్తమ్మా! ప్రకటనల ప్రపంచంలో అనేకానేక కథలు వింటుంటాం. ఎంత తొందరగా పైకి వెళ్ళొచ్చో అంత త్వరగాను కిందకి జారచ్చు. నీ లిమిట్స్ దాటకు. నీ రూమ్మేట్ మంచి అమ్మాయేనా? చెడు అలవాట్లకి ..."
    "అబ్బ డాడీ ... నేనేమైనా టీనేజ్ అమ్మాయినా? నా లిమిట్స్ నాకు తెలుసు డాడీ. నేను చేసేది క్రియేటివ్ జాబ్. మోడల్ ని, యాక్టర్ ని కాను, డెస్క్ వర్క్ నాది. డాడీ, ఆఫీసు ఎంత పెద్దదో తెలుసా? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో? నాలుగైదు వందలమంది స్టాఫ్. నన్ను చూసి మా బాస్ ఇంప్రెస్ అయినట్టే కనిపించాడు. జవాబులు విని ఓపెన్ గానే మెచ్చుకున్నారు" సంతోషంగా అంది.
    "మంచిది. కీపిట్ ఆప్. రూమ్ కి మారాక అడ్రసు, అది ఇవ్వు. సెల్ ఫోను దగ్గరుంచుకో. అన్నట్టు భోజనం అది..."
    "ఆ చెప్పలేదు కదూ... మర్చిపోయా. అందరూ కలిసి వంటపని, మిగతా పనులు చూసేందుకు పనమ్మాయిని పెట్టుకున్నారు. మూడు బెడ్ రూముల్లో ఆరుగురం ఉంటాం. అందరికి వంట, టిఫిన్లు అన్నీ చూస్తుంది. ఖర్చులు అందరం షేర్ చేసుకుంటాం. ఏ ప్రాబ్లమ్ లేదు డాడీ ..."
    "సరే మహీ! ఫోను చేస్తూండు. మీ మమ్మీ పడుకుంది. రేపు రూముకి షిఫ్ట్ అయ్యాక అమ్మతో మాట్లాడు. ఓకే బై గుడ్ నైట్" నిశ్చింతగా సోఫాలో వెనక్కి వాలారు ఆయన. కూతురు అహ్మదాబాద్ సీటు కోసం ఎంత కష్టపడి చదివిందో ఆయనకి తెలుసు. ఇంజనీరింగ్ చదవమంటే కాదని, తన అభిరుచి క్రియేటివ్ రైటింగ్ అని, యాడ్ వరల్డ్ లో రాణించాలని కలలు కంది. మొదటి మెట్టు ఎక్కింది. ఇంక ఫరవాలేదు. నిశ్చింతగా అనిపించింది.

                                    *  *  *  *

    రెండు సూట్ కేసులు, ఓ షోల్డర్ బ్యాగుతో ఎనిమిది గంటలకల్లా అపార్ట్ మెంట్ కు వచ్చింది మహిమ. "వెల్ కమ్ వెల్ కమ్" అంటూ సీమ సంతోషంగా చేయిచాపి చేతిలో సామాన్లు అందుకుంది. అప్పటికింకా నైట్ గౌనులోనే ఉంది. మొహం నిండా ఏదో క్రీము పట్టించింది. జుత్తుకు నూనె. "రా, ఇదిగో ఈ కప్ బోర్డ్ నీది. బట్టలు తీసి సర్దేసుకో. ఈ టేబిల్ మీద నీ సామానేం పెట్టుకుంటావో పెట్టుకో. ఈలోగా నేను స్నానం చేసి వస్తా. తరువాత టిఫిన్ చేద్దాం" అంటూ బాత్ రూములో దూరింది.
    బట్టలన్నీ తెచ్చుకున్న హాంగర్లకి తగిలించి, వార్డ్ రోబ్ లో మంచిబట్టలు ఒకవైపు, రోజూ కట్టుకునేవి ఒకవైపు ఎక్కడికక్కడ నీట్ గా సర్దుకుంది. అడుగున ఉన్న అరలో చెప్పులు, ఇంటి నుంచి తెచ్చుకున్న సబ్బులు, షాంపూలు, టూత్ పేస్ట్ లు పెట్టింది. అద్దం ముందు రోజూ వాడుకునే మామూలు మేకప్ సామానులు పెట్టుకుంది. టేబుల్ మీద ల్యాప్ టాప్, పుస్తకాలు, టూ ఇన్ వన్ డైరీలు, కాగితాలు, పెన్నులు లాంటివన్నీ సర్దుకుంది.
    "గుడ్ ! అయిపోయిందా?" అంటూ జుత్తును డ్రయ్యర్ లో ఆరబెట్టుకుంటూ చుట్టూ చూసింది. 'మన ఆఫీసుకి డ్రస్ కోడ్ లేదు. సల్వార్ కుర్తా, జీన్స్, లాంగ్ స్కర్ట్స్ ఏవయినా మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. జుత్తు దువ్వి పైకి లాగి క్లిప్ పెట్టి, "పద టిఫిన్ చేద్దాం. అక్కడ అందరం కలుస్తాం గదా. అందరికి పరిచయం చేస్తాను" ఎనిమిదిన్నరకల్లా టిఫిన్ టేబిల్ దగ్గరకి వెళ్లాలి అందరూ. ఏ రోజన్నా సెలవుపెట్టినా, ఇంకేదన్నా పని ఉండి వెడితే ముందుగా రేణుకకి చెపితే వేరే పెట్టి ఉంచుతుంది టిఫిన్. ఉతకాల్సిన బట్టలు బాత్ రూములో బాల్చీలో నానపెట్టాలి. రా" అంటూ డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లింది. అప్పటికే నలుగురమ్మాయిలు టేబిల్ ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు".
    "హాయ్ ..." అన్నారంతా. మహిమని చూసి "కొత్త రూమ్మేటా?"
    "ఆ... మహిమ. క్రియేటివ్ సెక్షన్ లో ఇవాళే జాయిన్ అవుతోంది. మనతో ఉంటుంది. నా రూమ్మేట్. పేరెంట్స్ వైజాగ్ లో ఉంటారు" అని చెప్పి, "మహిమ ... తను స్రవంతి. ఫైనాన్స్ లో ఉంది ..."
    చామనచాయ రంగు, తెలివైన మొహం. నవ్వుతూ చేయిచాచి, "హాయ్, వెల్ కమ్ టు అవర్ నెస్ట్" అంది మహిమ చెయ్యినొక్కి.
    "ఈమె మంగళ. క్రియేటివ్ సెక్షన్ లో తమిళ సెక్షన్. మద్రాసు పొన్ను" అంది నవ్వి సీమ. తమిళ అమ్మాయని చెప్పకపోయినా గుర్తుపట్టేట్లు, స్టిక్కర్ పైన విభూతి బొట్టు, కాటన్ సల్వార్ కుర్తా. సింపుల్ గా ఉంది. పలకరింపుగా నవ్వి "హాయ్..." అని.




Related Novels


Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

D Kameswari Kathalu

Teeram Cherina Naava

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.