Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ అప్పలస్వామి, పురిపండా
రణభేరీ
రణభేరీ రణభేరీ!
ఎక్కడి దీ రణభేరీ?
ఎక్కడి దీ రణాహ్వాన
మెక్కడి దీ హుంకారం
హుంకారం క్రేంకారం
హయహేషలు రథఘోషలు
పొలి పొలి పొలి పొలికేకలు
ఎక్కడి దీ కోలాహలం
కోలాహలం హాలాహలం!
నా నరాల నరనరాల
ఎక్కడి దీ విద్యుద్వేగం
జ్వాలాముఖి లావాలాస్యం!
ఎక్కడి దీ రణభేరీ?
రణభేరీ జయభేరీ!
శతమహాద్రు లదిరినాయి
శతజలదా లురిమినాయి
భూకంపం పుట్టినట్టు
సుడి తుపాను కొట్టినట్టు
ఎక్కడి దీ రణభేరీ?
ఎక్కడి దీ జయభేరీ?
ఎక్కడి దీ రణాంగణం?
రణాంగణం రణదుర్గం
రణదుర్గం శిరిదుర్గం
సుధాధవళ హిమదుర్గం!
ఎవరు ఎవరు ఎవరు చింది రీ సీమల
ఈ సీమల చంద్ర శుభ్ర
హిమసీమల గిరిసీమల
ఎవరు చింది రీ రక్తం
నర రక్తం నర రక్తం
గంగా యమునా జలాల
కడిగిన చెరగని రక్తం!
నర రక్తం నర రక్తం
నా తమ్ముల నర రక్తం!
నర రక్తం నా రక్తం
సహించునా నా రక్తం!
నవసైనిక యువరక్తం!
ఓహో సైనికులారా!
రండి రండి రణభూమికి
రణభూమికి రండి రండి!
ప్రళయకాల రుద్రులై
భయద వీర భద్రులై
రండి రండి రండి రండి
రండి రండి రణభూమికి
ప్రళయాగ్నులు రేగినట్టు
లావా నది సాగినట్టు
పెనుగోడల పెల్లగించి
విను వీధులు కుళ్ళగించి
గిరులు పెరికి అరుల నరికి
హరోం హర హర హర హర
రండి రానైద్ రణభూమికి
చిచ్చుల పిడుగుల కురిసీ
విచ్చిన కత్తులు మెరిసీ
రండి రండి రణభూమికి.
* * * *