Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
అసలు ఈ సైన్సు అనేదానికి మానవత లేదు. మనసు లేదు. ప్రాణం లేదు. ఇది కేవలం టంకశాల. పెట్టుబడిదారునికి ధనం సంపాదించిపెట్టే నికృష్ణయంత్రం. దీని ఆవిష్కరణకు సామాన్యుడు లక్ష్యం కాదు. కొనుగోలుదారుడు లక్ష్యం. ఇది నరుని జీవితం సుసంపన్నం చేయడానికి కాదు. అగ్రరాజ్యాల పెత్తనం పెంచడానికి ఉపయోగపడుతున్నది.
సైన్సు సమాజాన్ని సభ్యతను, మానవతను అంటుకోడు. అవి సైన్సుకు అంటరానివి. అది సమాజాన్ని గాని, మానవునిగాని సంపూర్ణంగా అధ్యయనం చేయదు. వాటిని ముక్కలకింద నరికి శాఖలుగా అధ్యయనం చేస్తుంది. సైన్సు చెవి విషయం ముక్కుకు, కంటి విషయం గుండెకు తెలియనీవు. వీటిన్నింటికీ ఒకే మనసు, ఒకే ప్రాణం ఆధారం అని గ్రహించదు. ఇది ఒక్క వైద్య విషయం మాత్రమే కాదు. ఆర్ధిక, రాజకీయ, సామాజిక శాస్త్రాలన్నీ అంతే! దేనికీ పరిపూర్ణ మానవునితో నిమిత్తం లేదు.
సనాతన భారత శాస్త్రం - అంటే జీవం లేని సైన్సు కాదు - మానవుణ్ణి పరిపూర్ణంగా అర్ధం చేసుకుంది. మానవ జీవిత వికాసానికి ఆవిష్కరణలు చేసింది. నిస్వార్ధంగా ప్రపంచ ప్రజలతో వాటిని వాడుకలో పెట్టింది. వేదం భూలోక మానవాళి జీవితాన్ని తీర్చి దిద్దింది. మానవాళికి సుఖజీవనం ప్రసాదించింది. పారిశ్రామిక విప్లవం పేర సుఖ జీవితాన్ని ధ్వంసం చేసేదాకా ప్రపంచం మొత్తంలో వేద జీవనమే వెల్లివిరిసింది.
అన్నీ చెప్పలేను. ఒక చిన్న ఉదాహరణ. నిప్పూ, నీరూ శత్రువులు ఈ రెండు కలుస్తేనే మానవ వికాసం. ఎంతోమంది ఋషులు, మహర్షులు, విద్వాంసులు ఎంతోకాలం శ్రమించారు. సంధానం సాధించారు. కుండను కనిపెట్టారు. పొయ్యిని కనిపెట్టారు. కింద మంట పైన నీరు, మంట చల్లారదు, అగ్ని గుణం నీటికి వస్తుంది. శాస్త్రాలు వేదం నుంచే ఉద్భవించాయి. ఎంతటి సైన్సు అయినా ఇదే ఇవ్వాల్టికి రేపటికీ మూలసూత్రం.
పొయ్యిలోని వంట చెరుకును వైద్యంతో, సామాజికంగా అధ్యయనం చేశారు. ఏ చెట్లు వంటకు, ఏ చెట్టునీడకు, ఏ చెట్టు ఔషధికి ఉపయోగించాలో నిర్ణయించారు. చెట్టును రక్షించాలని చెప్పారు. ఇప్పుడు మనం వండుతున్న గ్యాస్ గుణం ఏది? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతకాలం ఉంటుంది? ఈ వంట, ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? రుచిపుడ్తుందా? చస్తుందా? ఎవడికి తీరికా? కావలసింది లాభం! కేవలం విషం విక్రయించి కంపెనీలు కోట్లు ఆర్జిస్తున్నాయి. మనం ఎంత మాయలో పడిపోయామంటే విషాన్నీ, దాస్యాన్నీ మన కష్టార్జితంతో కొనుక్కుంటున్నాం!
ఈ నేపథ్యంలో హ్యూమన్ జీనోమ్ ఆవిష్కరణ గురించి ఆలోచిద్దాం.
1. మనిషి ఊపిరి పీల్చడానికి మాత్రం జీవించడు. జీవితానికి కొన్ని కర్తవ్యాలు, విధులు, ధర్మాలు ఉన్నాయి. భరతశాస్త్రం జీవితాన్ని 1) బ్రహ్మచర్యం - విద్యార్ధి దశ 2) గార్హస్పత్యం - వైవాహిక దశ 3) వానప్రస్థం - అర్ధ వైరాగ్య దశ 4) సన్యాసం పూర్ణ వైరాగ్య దశలను ఏర్పర్చింది. అన్ని దశల్లోనూ కుటుంబం గ్రామం జనపథం, రాష్ట్రం, లోకం వీటికి ఉపయోగపడాలి. ఈ పనులన్నింటికి - శతంజీవ నూరేళ్ళు చాల్తాయి. వెయ్యేళ్ళు బతికి ఏం చేస్తాడు?
2. ప్రకృతి సిద్ధాంతం ఏమంటే గింజపుడుతుంది. మొలకెత్తుతుంది. మానవుతుంది మరిన్ని చెట్లకు కారణం అవుతుంది. పోతుంది. మళ్ళీ పుడ్తుంది. మనిషీ అంతే. పునరపి జననం - పునరపి మరణం.
3. మరణాలను, అంటువ్యాధులను నిర్మూలించేందుకు మందులు కనిపెట్టారు. వాటితో వ్యాపారం. అంటువ్యాధులను దూరం చేశామన్నారు.
4. అంటువ్యాధులను దూరం చేయడంలో కూడా కేవలం వ్యాపార దృష్టే! చావులు తగ్గితే జనాభా పెరుగుతుందని తెలియదా?
5. జనాభా పెరిగిందని గగ్గోలు. దానికి మందులు - ప్రచారం. అప్పులు, లంచాలు, అవినీతి, జనాభా తగ్గించాలని రణఘోష.
6. ఈ సైన్సు ప్రకృతిసిద్దంగా మనిషిని పుట్టనీయదు, బతకనీయదు, చావనీయదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వ్యాపార వస్తువులైనారు.
7. సైన్సు వల్ల ఆయుర్దాయం పెరిగింది. ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నది. వారిని పోషించడం సమాజానికి భారం అవుతున్నది. ఇది సమాజానికి సమస్య అని తెలియాలి. ఇవన్నీ సమస్యలే - చర్చలు, అధ్యయనం ఎక్కువ. ఆచరణ అణుమాత్రం.
8. అగ్రరాజ్యాల వద్ద మానవజాతిని అనేకసార్లు ధ్వంసం చేయగలన్ని మారణాయుధాలున్నాయి. వాటిని చూపి పేద దేశాలను పాదాక్రాంతం చేసుకుంటున్నాయి. ఉన్న మారణాయుధాలను ధ్వంసం చేయాలన్నా భూగోళం నిలిచి ఉండదు.
9. ఇదిగో ఈ అగ్రజాతులవారే ప్రస్తుతం హ్యూమన్ జీనోమ్ ను ఆవిష్కరింపచేసింది. ఇది వాస్తవంగా మానవ శ్రేయస్సుకే అయితే ఈ మారణాయుధాలు, యుద్దాలు, దోపిడీలను వదులుకోవచ్చును కదా!
మానవజాతి చరిత్రలో బహుశ మానవునికి ఇంత కన్నా నికృష్ణ దశ వచ్చి ఉండదు. మానవత, ఆత్మీయత, అనురాగం, అనుబంధం, స్నేహం, మైత్రి వంటి వాటికి దూరమైన మానవుడు వ్యాపార విషవలయంలో చిక్కుకుని, నీడలేని ఎడారిలో ఒంటరిగా విలపిస్తున్నాడు. కనీసం కన్నీరు తుడిచేవారే లేరు.
మృత్యువును జయించడానికి భారత ఇతిహాసంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ప్రకృతికి వ్యతిరేకం, మానవునికి విషప్రాయం. ప్రకృతి కన్నతల్లి - దానిని కాలదన్నినవాడి భవిష్యత్తు శూన్యం.
నేటి ఈ విష సంస్కృతికి విరుగుడు అనబోతూ సద్గమయ - అసత్యం నుంచి సత్యానికి సాగుదాం. తమసోమా జ్యోతిర్గమయ - చీకటి నుంచి కాంతివైపు సాగుదాం. మృత్యోర్మా అమృతంగమయ - మృత్యువు నుంచి అమృతంవైపు సాగుదాం అంటున్నాను.
ఈ నేపథ్యంలో వ్యాసుని వంశావళిని పరిశీలింతాం! తెలిసినంతవరకు ఆ వంశానికి వశిష్టుడు మొదటివాడు చివరివాడు శ్రీ శుకయోగీంద్రుడు.
విశ్వామిత్రుడు రాజసుడు. సాత్విక వశిష్టునితో పోటీ పడినాడు. భంగపడినాడు.
ఆ గాథ రామాయణమునందలిది.
శబళ:
విశ్వామిత్రుడు గాధి తరువాత సింహాసన మధిష్టించెను. అతడు అనేక వేల సంవత్సరములు రాజ్యము చేసెను. ఒకసారి అతడు అక్షౌహినీ పరిమితమైన చతురంగబలముతో భూమండల మందంతయు సంచరించెను. అనేక నదులు, పర్వతములు, మున్యాశ్రమములు దర్శించెను. అట్లు తిరుగునప్పుడతడు వశిష్టుని ఆశ్రమమునకు చేరెను. అది నానా మృగసమన్వితమై, వాలఖిల్యాద్యనేక ఋషి నివాసమై అపర బ్రహ్మలోకమువలె విరాజిల్లుచుండెను. రాజు రాకకు వశిష్టుడు మిగుల సంతసించెను. అతనికి అనేక సపర్యలు చేసెను. విశ్వామిత్రుడు ఆ సపర్యలకు సంతృప్తుడై వశిష్టుని వశిష్టుని శలవు కోరెను. వశిష్టుడు ఆతిథ్యము గైకొని వెళ్ళవలసినదిగ విశ్వామిత్రుని ప్రార్దించెను. విశ్వామిత్రుడెంత వారించినను వశిష్ఠుడు వినలేదు. విశ్వామిత్రునకు అంగీకరించక తప్పినది కాదు.
వశిష్ఠుని విచిత్రమైన 'శబళ' యను హోమధేనువు ఒకటి ఉండెను. మహర్షి దానిని పిలిచి ఎల్లరకు షడ్రసోపేతమైన భోజన పదార్దములు సృష్టించి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించెను. ఆ ధేనువు తేనె, పేలాలు, మైరేయము అను మద్యము మున్నగు నానా భోజన పదార్దములు వడ్డించెను. రాజును అతని పరివారము అంతకు మున్నెన్నడు ఎరుగని భోజనపదార్ధము లారగించి మిక్కిలి సంతుష్టులైరి. విశ్వామిత్రుడు ఆయన సంపదను మిక్కిలి ఆశ్చర్యపడెను. వశిష్టునితో శబళను తనకు ఇవ్వవలసినదని కోరెను. కావలసినచో లక్షగోవు లిచ్చెదననెను. బంగారు ఆభరణములు గల పదునాల్గువేల ఏనుగుల నిత్తుననెను. కాని వశిష్టుడు అంగీకరించలేదు.
ఏత దేవ హి మేరత్న మేతదేవ హి మే ధనమ్
ఏత దేవ హి సర్వస్వమేతదేవ హి జీవితమ్