Home » Prasanna Kumar » Prasanna Kumar - Sarraju kathalu - 2



    సీయం ఫోన్ పెట్టేయగానే సీయమ్ తల్లి కొడుకు దగ్గర చేరింది. "ఒరేయ్ నాన్నా, నేను కూడా వస్తాన్రా గాంధీనగరానికి... ఎప్పుడో చాలాకాలం క్రితం వెళ్ళాను. అప్పటికింకా ఈ దిక్కుమాలిన సొంత కుంపట్లు పెట్టుకోవడం అనేది లేదు. ఎలాగూ గాంధీనగరం వెడుతున్నాం గదా! నువ్వుగానీ కొంచెం ఆ వన్ టౌన్ సీయమ్ కి గానీ ఫోన్ చేసిచెప్తే....నువ్వు రావద్దులే.... నీ ఆపరేషన్ అయ్యాకే నేనూ కోడలూ వన్ టౌన్ వెళ్ళి, అక్కడ కృష్ణమ్మ ఘాట్ లో మునిగి, ఆ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొస్తాం. ఏదో ఏ హెలీకాఫ్టర్ లోనే ఓమూల తుండుగుడ్డ వేసుకుని కూచుంటాం.." అంది.
    సీయమ్ ఇబ్బందిగా... "వన్ టౌన్ సీయమ్ నాఫ్రెండే కానీ గాంధీనగరం సీయమ్ తోనే యిబ్బంది. వాళ్ళకూ మనకూ పడదు. క్రితం ఎలక్షన్లలో వాళ్ళు గోరు గుర్తు అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు చూడు... రాబోయే ఎలక్షన్లలో గొడ్డలి గుర్తుకోసం దరఖాస్తు చేసుకున్నారట. ఇక హెలీకాఫ్టరంటావా... ఏ రాష్ట్రానికీ ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. ఉన్న హెలీకాఫ్టర్లోనే అందరూ అమ్మేసుకుంటున్నారు. కనీసం హెలీకాఫ్టరు లాండవడానికీ, పైకెగరడానికీ కొంతస్థలమయినా కావాలి గదా....ఆ మాత్రం స్థలం వుంటే రౌడీలూ గూండాలకంటే ప్రభుత్వమే కబ్జాచేయటానికి రెడీగా వుంది. కాబట్టి హెలీకాఫ్టర్ లో వెళ్ళి దుర్గమ్మ గుడిని దర్శించే ఆలోచన మానుకో. అదీగాక, మనం ఏ బెంగుళూరు నుంచైనా దాన్ని అద్దెకు తీసుకున్నా, వేళ్ళాడే నిచ్చెన మీద నుంచీ వరదబాధితుల్లాగా మనల్ని ఎక్కించుకున్నా, గాంధీనగరం మీదనుంచీ ఎగిరి వెళ్ళడానికి ఆ గవర్నమెంటు అనుమతి ఉండాలి" అన్నాడు.
    అత్తగారు చిన్నబుచ్చుకున్న సంగతి గమనించి, సీయమ్ భార్య ఆవిడని పక్కకు తీసుకెళ్ళి, "మీరు నిశ్చింతగా ఉండండత్తయ్యా! ఆయన అలాగే అంటార్లే. నేనేర్పాటు చేస్తాగా!" అంది. అత్తగారు "మా తల్లే" అంటూ లోపలికి వెళ్ళింది.
    సీఎమ్ భార్య భర్తదగ్గరకొచ్చి "ఎలాగూ మనకి పాస్ పోర్టులూ వీసాలూ తప్పవుగదా! గాంధీనగర్ వెళ్ళాక అక్కడి గవర్నర్ కి ఫోన్ చేసి వన్ టౌన్ స్టేట్ కి ఒక్కరోజుకు టూరిస్టు వీసా తీసుకోండి మాయిద్దరికీ. పొద్దువెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం" అంది. భార్యమాట కాదనలేక సరేనన్నాడు సీయమ్.
    బీసెంటు రోడ్డుకి అటూ ఇటూ "సీయమ్ అంకుల్! మీరు పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలి" "క్షేమంగా వెళ్ళి లాభంగా రండి" లాంటిఫ్లకార్డులు పట్టుకుని స్కూలు పిల్లలూ, పౌరులూ వీడ్కోలు పలికారు. వంతేనకి కాస్త ఇవతలగా బందరు మిఠాయిదుకాణం వద్ద ఆగి, రెండు స్వీట్ పాకెట్లు తీసుకున్నాడు సీయమ్. ఒకటి గాంధీనగరం గరవ్నర్ కీ, ఇంకోటి - వస్తేగిస్తే - సీయమ్ కీ.
    వంతెన దగ్గర ఫుల్ సెక్యూరిటీ వుంది. వంతెనకి ఇటేపు గవర్నర్ పేట రాష్ట్రజెండా, అటేపు గాంధీనగర్ రాష్ట్రజెండా రెపరెపలాడుతూ ఎగురుతున్నై.
    సీయమ్ కారుదిగుతూ పీయేని అడిగాడు. "ఓడలోనా లేక వంతెనమీదనుంచీ బైరోడ్డా?"
    "ఓడా! సారీ సర్. కాలవలో నీళ్ళు చాలా తక్కువగా వున్నై. కనీసం బల్లకట్టుకూడా నడవదు. మీరంతగా పట్టుపడితే పంచెలు పైకెగదోసి, మోకాలి లోతు నీళ్ళలో వెళ్ళగలం. అయినా, మీ పర్సనల్ సెక్యూరిటీ అనుమతి కావాలి" అంటున్న పీయేతో - "వొద్దొద్దులే...మామూలుగా వంతెన మీదనించేవెడదాం" అని సీయం, ఆయన భార్య, తల్లీ, పీయే,. డ్రైవరూ వంతెన దగ్గర సాయుధ జవానులకు పత్రాలన్నీ చూపించారు. ఆ పత్రాలన్నీ పరిశీలించి, తిరిగి ఇచ్చేస్తూ "సారీ సర్! డ్యూటీ ఈజ్ డ్యూటీ" అని మర్యాదగా నవ్వాడు ఆ అధికారి.
    "రండి సార్! కారెక్కండి" అన్న పీయేతో.
    "చాల్లేవయ్యా...జానాబెత్తెడు లేదువంతెన. కాస్త నడవలేవూ? కొవ్వైనా కరుగుతుంది" అని సీయమ్ తల్లి ముందుకు నడిచింది. సీయమ్ కూడా ఇక తప్పదన్నట్లు చిరునవ్వు నవ్వుతూ తల్లిని ఫాలో అయ్యాడు. వెనకే భార్య. కారుడ్రైవరు నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెనకనే ఫాలో అయ్యాడు. పీయే బిక్కమొహం వేసుకుని, కారు పక్కనే నడిచాడు.
    ఇక్కడ సీయం ఫ్యామిలీ వంతెన దాటుతున్న సమయాన ఏలూరురోడ్డు రామమందిరం దగ్గర ప్రతిపక్షాల ప్రదర్శన జరుగుతోంది. ప్రతిపక్షం నాయకుడు పెద్దగా అరుస్తున్నాడు.
    "సీయం! కమ్ బ్యాక్! ఆపరేషన్ కి పక్క రాష్ట్రానికెళ్ళడం మన రాష్ట్ర వైద్యులను అవమానించడమే. విరాష్ట్రీ మారక ద్రవ్యాన్ని వృధా చేసే హక్కు మీకెవరిచ్చారు? మన గవర్నరుపేట రాష్ట్రంలో ప్రైవేటు వైద్యం చేయించు కోవడానికి మీదగ్గర డబ్బే లేదా? వరల్డ్ బ్యాంకు నుంచీ వచ్చే విధులన్నీ ఏమయ్యాయి! ఉన్నత ప్రభుత్వాధికారులు గవర్నమెంటు హాస్పిటల్లోనే వైద్యం చేయించుకోవాలనే రూలును రద్దు చేయాలి. లేదా మన గవర్నరుపేటలోనే గవర్నమెంటు ఆస్పత్రి కట్టించాలి" ఇలా అరుస్తూ నానా యాగీ చేస్తున్న ఆయన్ని, ఆయన అనుచరులతో పాటు రోడ్డు మీదనించీ ఈడ్చుకెళ్ళి వ్యాన్ లోపడేసి తీసుకెళ్ళారు పోలీసులు. అలా ఏదో ఒక కారణం మీద పోలీసులతో లాక్కెళ్ళబడి, నానా హైరానాపడి, చొక్కా బొత్తాలు వూడిపోతూ, చెమటలు కారుకుంటూ బలవంతాన వ్యాన్ లో కెక్కించబడి, అరెస్టయి మళ్ళీ బెయిలుమీద యింటికెడితేగానీ తోచదు ఆయనకి.
    నెలకో అరడజను సార్లైనా అలా చేయమని ఆయన పర్సనల్ డాక్టర్ సలహా ఇచ్చాడట. అది కూడా సిద్దయోగ, ధ్యానయోగాలాగా ఒకయోగాట. దాన్ని ధర్నాయోగ, లేక యాగియోగ అని అంటారట. దాంతో ఆయనకున్న షుగరు, కీళ్ళ వాతాలూ అన్నీ పోయి చక్కగా రక్తప్రసరణ అయి, పది కాలాలపాటు అరెష్టవుతూ బతకొచ్చట.




Related Novels


Prasanna Kumar - Sarraju kathalu - 2

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.