Home » D Kameshwari » Vivahabandalu
ఆయన కోపంగా "నీ వెందుకు అనవసరంగా ఈ విషయంలో జోక్యం కల్గించుకుంటావు? బుద్దిలేదా ఒకసారి చెపితే. నన్ను బతకనీయ దలుచుకోలేదా. మధ్య నేను చస్తున్నాను." అని నామీద ఎగిరారు.
ఆయ నన్నదీ ఒక విధంగా నిజమే. ఒక వంక భార్య, మరోవంక తల్లి. ఎవరిని ఏమనగలరు? తల్లిని అనలేక ఆ కోపం నామీద చూపిస్తారు. అందుకనే యింకేం అనకుండా వూరుకున్నాను. అసలు డబ్బు అడగడం యీయన మొదటి తప్పు.
తరువాత మా అత్తగారు మామగారితో చెప్పడం, కొడుకుని పిలిచి ఏమన్నారో, కాగితాలు లేకక్లు చూపడం, మిగతా డబ్బు యిదిగో అని ఓ వెయ్యి యీయన చేతిలో పడేశారుట.
తల్లి దండ్రులు నిష్టూరంగా మాట్లాడటం, కోడలు వచ్చిన రోజునుంచి కొడుకు అప్పుడే పరాయివాడయిపోయాడని, కట్నం డబ్బులు కోడలు అడిగించిందని, ఏవేవో సాధింపులు. ఆ రోజంతా అత్తవారు గొణగడం, చిరచిరలాడారు.
మా ఆయన తల్లిదండ్రులని ప్రసన్నం చేసుకో ప్రయత్నించి విఫలులై ఆకోపం నామీద చూపి ఆ వెయ్యిరూపాయలు నా మొహంమీద విసిరేసి "నీవు, నీ కట్నండబ్బు కట్ట గట్టుకొని గంగలో దుముకండి. ఛీ- ఒక్కరోజూ శాంతంగా గడపనీయలేదు. నీవూ, మీవాళ్ళూ యిలాంటి వాళ్ళని ట్లేలిస్తే ఛస్తే చేసుకునేవాడిని కాదు యీ పెళ్ళి" అంటూ నిప్పులు కక్కారు.
నేనేమన్నా అంటే పరిస్థితి మరింత విషమిస్తుందని నోరు మూసుకున్నాను. ఆ రోజంతా యింట్లో వాతావరణం గంభీరంగా వుంది.
సాయంత్రం ప్రయాణం. స్టేషన్ కి కూడా ఎవరూ రాలేదు, మరిది తప్ప. వెడుతున్నా నని చెపితే ఊఁ ఆఁ అనలేదు.
వెళ్ళేముందు అత్తగారికి, మామగారికి పాదాభివందనం చేశాను. మామగారు ఆశీర్వదించారు. కాని, అత్తగారు "మాకెందుకులే అమ్మా దండాలు, తిట్టకుండా వుంటే అంతే చాలు" అంది మూతితిప్పి.
ఆయన చాలా గంభీరంగా వున్నారు ఉలుకూపలుకూ లేకుండా.
* * *
డాక్టరుగారూ. కొత్త కాపురానికి మా భార్యా భర్తలం ఎడ మొహం పెడమొహాలతో వెళ్ళాం. నవ వధువుగా ఆ యింట్లో పాదంపెట్టడమే కలతలతో ఆరంభమైంది కాపురం! ఏ ముహూర్తాన పెళ్ళయిందో, ఏ ముహూర్తాన కాపురానికొచ్చానో ఆ యింట్లో ఆ సంసారంలో సారమే లోపించింది. బతుకులో అనురక్తే లేకుండా పోయింది.
ఆయన రైలులో మాట్లాడలేదు. ఇంటికి రాగానే తాళం తీసి సామాను లోపల పడేయించి మాట పలుకు లేకుండా వచ్చినవారు వచ్చినట్టే ఎటో ఆ రిక్షాలోనే మళ్ళీ వెళ్ళారు. లోపలికి వెళ్ళాను. రెండు గదులు, ఓ వంటిల్లు, బాత్ రూము. ఇల్లు చిన్నదైనా సదుపాయంగానే వుంది. ఆయన చాలారోజులు ఏదో లాడ్జీలో వుండే వారట. పెళ్ళి కుదిరాక యీ యిల్లు కుదిర్చారుట. ఆయనకోసం కొనుక్కున్న ఓ మడత మంచం, ఓ కుర్చీ, కాఫీకి కాబోలు ఓ స్టవ్, కాఫీ సామాను, ఓ బాల్చి స్నానానికి, నీళ్ళకి కూజా, ఓ బ్రహ్మచారి సంసారానికి కావల్సిన సామానులున్నాయి.
ఆయనెక్కడికి వెళ్ళారో తెలియదు. ఎనిమిది గంటలయిందిఅప్పటికి. నాపరుపు విప్పుకున్నాను. ఆయన పెట్టెలో బట్టలు తీసి అలమారాలో సర్దాను. నాబట్టలు మరో అరలో సర్దాను. కిటికీలో వున్న ఆయన షేవింగ్ సామాను, టూత్ పేస్టులు అన్నీ తీసి వాష్ బేసిన్ దగ్గిర పెట్టాను. ఆ చిన్న ఇల్లు మాచిన్న సంసారానికి అనుకోగానే అప్పుడే ఆ ఇంటి మీద, ఆ యింట్లోవున్నా కొద్దిపాటి సామానుమీద నాది అన్న భావం వచ్చేసింది.
అంతా సర్ది స్నానంచేసి ఏం చెయ్యడానికి లేకపోతే ఇలస్ట్రేటెడ్ వీక్లీలు తిరగేస్తూ కూర్చున్నాను. రేపు ముందుగా ఏం సామానులు కొనాలో, వంటకి కావల్సిన పప్పులు ఉప్పులు చిన్న లిస్టు తయారుచేశాను.
తొమ్మిదవుతూండగా ఓ కుర్రాడెవరో క్యారియర్ తీసుకొచ్చాడు. "అయ్యగారు ఇమ్మన్నారు. అయ్యగారు హోటల్లో భోంచేస్తున్నారు. ఇది మీ కిచ్చిరమ్మన్నారు." అన్నాడు. మనసు చివుక్కుమంది. ఆయనక్కడ అలా తినకపోతే, నన్నిక్కడ యిలా వంటరిగా వదలకుండా ఆ క్యారియర్ ఏదో తెచ్చుకుని యిద్దరం కలిసి యిక్కడ తింటే ఎంత బాగుండేది అన్పించింది. కొత్తభార్య కిచ్చిన స్వాగతం చూడగానే ఆకలి చచ్చిపోయింది. అయినా ఏదో తినాలి గదా. క్యారియర్ విప్పుకుని భోంచేశాననిపించాను. ఇంతలో ఆయన వచ్చారు.
వస్తూనే గదిలో నే మార్చిన మార్పులు చూశారు. నుదురు చిట్లించి నేను మధ్యనించి కిటికీవారగా లాగిన మంచం మళ్ళీ యధా స్థానంలోకిలాగారు. వాష్ బేసిన్ దగ్గిర షేవింగ్ సామాను తెచ్చి మళ్ళీ అలమారాలో పెట్టుకున్నారు. పెట్టె యధాస్థానంలో పెట్టారు. ఆ యిల్లు, ఆ సామానులు తనవి అవి మార్చే అధికారం నాకు లేదన్నట్టు తన పద్దతి తప్ప నా యిష్టాలు చెల్లవని స్పష్టంగా చెపుతున్నట్లనిపించింది నాకు. బ్రహ్మచారి గదిని యిల్లాలిగా చేతనయినంత అందంగా పొందికగా సర్దితే మళ్ళీ చిందర వందర చేసుకున్న ఆయన మనస్తత్వం ఏమిటో నాకర్ధంకాలేదు.





