Home » Sri N T Rama Rao » Sri N T Rama Rao Prasangalu


 

               తెలుగు - తమిళుల మైత్రికి వారధి
    
    ఈరోజు సుదినం. ఆనాడు వీరబ్రహ్మేంద్రస్వామి వారి చిత్ర నిర్మాణం సందర్భంలో ఇక్కడికి వచ్చాను. వారి ఆశీస్సులతో మరొకసారి ప్రజాహితమైనటువంటి ఈ సంక్షేమ కార్యక్రమానికి ఇక్కడికి రావడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకంటె ఈనాడు ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం  కానీ అధికారం చేపట్టడానికి కాదన్నది నిర్వివాదాంశం. ఈనాడు ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. ప్రభుత్వం ఏది చేస్తున్నప్పటికీ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమానికే చేస్తున్నదని మాత్రం నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదే ఈనాటి ప్రజాస్వామ్యానికి నిర్వచనం. ఏదైనా సరే అందరికీ సరైనటువంటి సక్రమమైనటువంటి అవకాశాలు కల్పించబడాలి. ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అందరూ మనవారు. ఆరుకోట్ల తెలుగు ప్రజానీకమంతా కూడా సోదర భావంతో ఒక్క త్రాటి మీద మెలగాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రక్కవారి సంక్షేమాన్ని చూడాలి. వారి సంక్షేమాన్ని గమనించి సాటి సంఘం యొక్క , సాటి సమాజం యొక్క అభివృద్ధి కి పాటుపడాలి. సహాయపడాలి. ఇదే ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా మీకందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను.
    ఈనాడు తెలుగువారి గుండెల్లో నుంచి ప్రవహించినటువంటి అనురాగ వహినే తెలుగు గంగగా రూపొందిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తమిళనాడుకు, తెలుగునాడుకు శాశ్వతమై నటువంటి అనుబంధంగా , ప్రేమ వాహినిగా చిరకాలం ఈ తెలుగుగంగ చక్కగా , చల్లగా హ్రుదయానురంజకంగా, మనస్సంతృప్తిగా సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈనాడు మనందరం కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాల వారం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి నటువంటి వారము. మన సంక్షేమాన్ని, అభివృద్దిని ఒకరి కొకరం చూచుకుంటూ ముందుకు సాగవలసినవారం. అటువంటి సందర్భంలో ప్రక్కవారికి తాగడానికి నీళ్ళు కూడా లేకుండా బాధపడుతున్నారు అంటే ఎప్పుడో చేయవలసింది. ఈ పధకం ఇంతవరకు జాప్యం అయిందంటే ఒకవిధంగా బాధగానే ఉంది. ఇకముందు ఈ కార్యక్రమాలు కుంటూపడకూడదు. మన సుహృద్భావానికి సూచకంగా తెలుగువారి ఆదరణకు ఒక రూపంగా ఇది ఆకృతి దిద్దుకోవాలనేటటు వంటి సోదరభావంతోనే మన తమిళ సోదరులకు ఈనాడు ఈ వసతి కల్పించడం జరిగిందని మీకందరకూ మనవి చేస్తున్నాను.
    ఈనాడు మనం తినటం ప్రాధాన్యం కాదు. ప్రక్కనలేని వారిని చూడడం, వారికి పెట్టడం కూడా నా ఆదర్శం. అదే మానవ ధర్మం. అదే వీరబ్రహ్మంగారు చెప్పిన ఆదర్శం కూడా. ఈనాడు మానవులంటే మానవతా వాదం అంటే - ఎవరైతే సాటి మానవుడితో భగవంతుడిని చూడగలుగుతారో అది నిజమైనటువంటి మానవత్వం. ఈనాడు నీ సంగతి నీవు చూసుకోవటం కాదు. నీ ప్రక్కన నీ దేశం, నీ సంఘం , నీ సమాజం, నీ మానవాళి ఏ విధంగా ముందుకు వెడుతున్నది? ఏ విధమైనటువంటి సంక్షేమకరమై నటువంటి భావంతో నీవు మెలగాలి? సోరదభావంతో నీ సమాజానికి అభివృద్ధికి దోహదకారిని కావాలి? అది పరమార్ధమైనటువంటి విషయం. అదే బ్రహ్మం గారు చెప్పినటు వంటి సత్య స్వరూపమైనటువంటి మానవ ధర్మం. ఎన్నాళ్ళనుంచో , ఎన్నో తరాల నుంచో ఇంచుమించుగా ఎన్నో యుగాల నుంచో కటకటలాడుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని మనకున్నటువంటి వనరులన్నింటిని సద్వినియోగపరచుకుని వాటిని సంక్షేమ కార్యక్రమాలకు, ప్రజాభివృద్దికి, తద్వారా రాష్ట్రాభివృద్దికి ఉపయోగించుకోవడం మన ధర్మం.
    అందుకనే ఏది ఏమైనా సరే ఈనాడు పేద ప్రజానీకం యొక్క సంక్షేమాన్ని చూడటమే ప్రభుత్వ ధర్మంగా పెట్టుకొని, ఆనాడు ఎన్నికల ముందు ఏ మాటైతే హామిగా యిచ్చామో, ఏ పేద ప్రజల సంక్షేమాన్ని చూస్తామని చెప్పి మీ అందరికీ మాట యిచ్చామో ఆ పేద ప్రజల సంక్షేమం కోసమే ఈ కార్యక్రమాలన్నీ తలపెట్ట బడ్డాయని సోదర సోదరీ మణులకు మనవి చేస్తున్నాను. మీరు నమ్మకం ఇచ్చారు. ఆదరించారు. విశ్వసించారు, గౌరవించారు. దానికి ప్రతిరూపంగా మీ విశ్వసానికి , మీరిచ్చిన గౌరవానికి అర్హత ఉన్నవాళ్ళమని నిరూపించుకొనటానికే ఈ ప్రభుత్వం  


          


    తెలుగు గంగ ఒప్పందంపై 1983 ఏప్రిల్ 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు సంతాకాలు చేస్తున్న దృశ్యం.


          


    ఏప్రిల్ 27 న కడప జిల్లా బ్రహం గారి మఠం వద్ద రిజర్వాయరు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న తమిళనాడు ముఖ్యామంత్రి శ్రీ ఎంజి. రామచంద్రన్ తో

        


    తెలుగు గంగ ప్రాజెక్టు వ్యయంతో తమిళనాడు వాటా తొలివిడత రూ. 30 కోట్ల మొత్తాన్ని మద్రాసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వం తరపున ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి నుంచి స్వీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 

    

పనిచేస్తున్నది అహర్నిశలని మీకందరికీ నేను మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈనాడు ఈ తెలుగు గంగకు శంకుస్థాపన చేయడం జరిగింది - సోదరులు ఎం.జి, రామచంద్రన్ యొక్క చల్లని హస్తాలతో. ఈనాడు వారు ఇక్కడికి రావడం, ఈ తెలుగు గంగకు వారి చేతులమీదుగా ఈ ఉత్సవాన్ని జరిపించడం నిజంగా ఇది చిరస్మీరణీయంగా తెలుగువారి హృదయాలలో ఉండేటటువంటి మధురాతి మధురమైనటువంటి అనుభూతిగా ఉంటుందని వారికి సవినయంగా మనవి చేస్తున్నాను.

మన జాతి ఉన్నంత కాలం, మన దక్షిణ భారతదేశం ఉన్నంత కాలం తెలుగు తమిళుల మైత్రికి చిహ్నంగా, గుర్తుగా జ్ఞాపకంగా పదిలంగా హృదయాలలో ఉంచుకుంటారని కూడా నేను వారికీ సవినయంగా మనవి చేస్తున్నాను. సోదరులందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దీనికి ఒక ప్రత్యేకమైన నటువంటి ఒక కొత్త పద్దతి మీద ఈ పధకాన్ని రూపొందించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నదని నేను మనవి  చేస్తున్నాను. ముందు నుంచి కూడా ప్రభుత్వం మధ్య నున్నటువంటి దళారి వర్గం వారందర్నీ కూడా తీసివేయటానికే ప్రయత్నిస్తున్నది. ఏదైనా సరే అనుభవించే వారికీ, దాని నిర్మాణంలో తలపెట్టిన వారికి వారి ఇద్దరి మధ్య కాంట్రాక్టర్లు గానీ, దళారీలు కానీ ఉండకూడదన్న భావంతో ఈనాడు యువశక్తి నంతా కేంద్రీకరించి, మన రాష్ట్రాలలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాలు - కడప, కర్నూలు, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఉన్నటువంటి - యువశక్తి నంతా సమీకరించి, వారి కృషికి చిహ్నంగా , వారి కృషికి గుర్తుగా ఈ ప్రాజెక్టు ఒక ఆకృతి పొందాలని కూడ ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
    ఈనాడు కరువు, కాటకాలమూలంగా తినటానికీ తిండి, లేక చేసుకోవడానికి పనులు లేకుండా వలస వెడుతున్నటువంటి సోదరీ, సోదరులందరికీ న్యాయం కలుగజేయాలి. వారికి వృత్తి ఇవ్వాలి. తద్వారా భ్రుతిని కల్పించాలి. కిలోబియ్యం 2 రూపాయలకు అందజేయాలి. శ్రామికులందరికీ ఇది ప్రభుత్వ లక్ష్యం. దీని ఆకృతిగా ఈ పధకాన్ని రూపొందించడానికి కృషి జరుగుతుంది.
    ఇది యువశక్తికి, నిర్మాణ కృషికి ఒక గుర్తుగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనాడు ఎంతో ఆశతో, ఆప్యాయతతో అందరూ వచ్చారు, ఆశీర్వదించారు. మీ చల్లని, ఆశీస్సులు, అండదండలు ఉన్నంతవరకు మా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాల్ని కృతనిశ్చయంతో, ద్విగుణీకృతోత్సాహంతో , నిర్విఘ్నంగా నెరవేర్చడానికి కృషి చేస్తుందని మీ కందరికీ నేను మరొక్కసారి హామీ యిస్తున్నాను. ఈనాడు ప్రభుత్వమే మీరు, మీదే ఈ ప్రభుత్వం . మీ సంక్షేమానికే యిది పాటు పడుతుంది. పేద జనోద్దరణే ఆదర్శంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మీ విశ్వాసానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా , దీటుగా నిలబడి మీ అందరి సంక్షేమానికి పాటు పడుతుందని సవినయంగా మనవిచేస్తూ ; ఎంతో ఆప్యాయతతో, ఆదరంతో ఈనాడు ఇంతదూరమైనా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, అనదికారులకు అటు తమిళనాడు, ఇటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ, పత్రికా విలేకరులందరికీ, పెద్దలకు , పూజ్యులకు, సోదరులకు, సోదరీమణులకు మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ; ఈనాడు మనం చేపట్టిన ఈ కార్యక్రమం జయప్రదం కావాలని, అతి త్వరితంగా రూపుదిద్దుకోవాలని మీరందరూ కూడా నిండు మనసుతో ఆ భగవంతున్ని ప్రార్ధించి ఈ ప్రభుత్వ కృషిని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

 




Related Novels


40 Years of TDP

Sri N T Rama Rao Prasangalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.