Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
విసుగెత్తి చివరికి గొంగళీ పురుగులు
బల్లపరుపుగా పరచుకున్న తన జీవితాన్ని పరుపుచుట్టలా చుట్టి
ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటుంటే
పెళ్ళాంమాట వినబడి, బాస్ కేక వినబడి
భయంతో గజగజ వణుకుతూ
తిరిగి తన జీవితాన్ని బల్లపరుపుగా పరచుకుని
దానిమీద నిద్రపోయింది గొంగళీపురుగు
సగం సగం తిన్న కలల్ని నెమరేస్తూ
సగం సగం చచ్చిన ప్రాణాల్ని జోకొట్టుతూ.
* * *
---1958
అద్వితీయం
నామీద నీ చూపు చీకట్లు ముసురుకుని
నీ మీద నా రూపు వెన్నెలలు పరచుకుని
నా కలల నీ పెన్నెరుల అల లొక్కపరి పొంగి
నీ కనుల నా కాంక్ష లాసజ్య ధనువులై
నా గుండె నీ పాట బాడబమ్మై రేగి
నీ తనువు నా కౌగిలిని తటిద్గానమై సాగి
అటు కాల మిటు విశ్వమొక్క త్రుటిలో ఎదిగి,
ఇటు నా బ్రతుకు కొసల నీవు నీ బ్రతుకు మొదల నేను
నీవు నా ఆశ కవధివై నేను నీ స్త్రీత్వమున కాహుతినై
నా బ్రతుకు పచ్చనిగట్ల నీవు మిన్నాగువై చుట్టుకుని
నీ స్త్రీత్వంపు నెత్తుటిబొట్ల నేను ఎరు పెరుపు రూపమ్ము దాల్చుకొని
నీవీ భీకర మధ్యాహ్న ఆతపమ్మున నాలోని పురుషత్వము వెదకికొని
నేనీ శరత్పూర్ణిమల నీ నగ్నలాలస నిమ్నగల నీదుకొని
నీ ఋతురాజ్ఞి నా తనువెల్ల నీ అనుకూల పవనములు వీచి
ఓ సురవేణి నీ క్రతుహోమ గుండమున నా జీవితమునే వ్రేల్చి
నీలో కొలది కొలది నశించు నాలో తరతరమ్ముల వికసించి
నాలో ఒదిగి ఒదిగి ఆక్రమించు నీలోపలనే కదలి పునరుద్భవించి
ఇది సృష్టి ఇది మిధస్సమాశ్లేషచరిత తను యష్టి
నేనొక పరమేష్టి
ఇది నీవు ఇది నేను ఇరువురము ఒకటైన యీ నిమేషమ్ము
విశ్వరహస్యమ్ము
* * *
---1958



