Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
పచ్చని పచ్చికల మధ్య
విచ్చిన తోటల మధ్య
వెచ్చని స్వప్నాల మధ్య
మచ్చికపడని పావురాల మధ్య
పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య
పరుగెత్తే నిర్ఝరుల మధ్య
తెరలెత్తే మునిమాపుల మధ్య
ఇప్పటికీ చూడగలవు నా తొలి యౌవనపు గుర్తులు
ఇప్పటిక వినిపిస్తవి నాటి స్వప్న వంశీరవమ్ములు
కాలవ గట్టునున్న ఈ కడిమిచెట్టుకు తెలుసు
మనం చెప్పుకున్న రహస్యాలు
ఊరి చివరినున్న మామిడి తోపుకు తెలుసు
మనం కలలుగన్న ఆదర్శాలు
ఇంటి వెనుకనున్న ఎర్రగన్నేరుకు తెలుసు
చిక్కబడుతూన్న సంజె చీకట్ల చాలులో
కలసిన పెదవుల నిశ్వాసాలు
అందాన్ని చూసినప్పుడల్లా స్పందించిపోయాం
బాధను కని కరుణతో కన్నీరు విడిచాం
శత్రువెదురైతే కండలపైకి చొక్కా చేతులు మడిచాం
పారిజాతపు పువ్వుల్లాంటి నవ్వుల్ని విరజిమ్ముకుంటూ
ప్రతి వీధినీ ప్రతి యింటినీ ప్రతి గుండెనీ శోభింపచేశాం
అమాయకమైన కళ్ళతో బాధ్యతలు లేని బలంతో
స్వచ్ఛమైన స్వేచ్ఛతో ఉషఃకాంతివంటి ఊహతో
భవిష్య దభిముఖంగా సుఖంగా సాగిపోయాం
ఎన్ని రకాల రంగు రంగుల పువ్వుల మాలలు
కిటికీలకు మెరిసే గాజుగొట్టాల జాలరులు
నేలమీద మొఖముల్ తివాసీలు అత్తరు గుబాళింపులు
జవరాళ్ళ జవ్వాడే నడుములపై ఊగే వాల్జడలు
బాధ్యతలేని అధరాల చిటిలే నవ్వుల వైడూర్యాలు
ప్రతీ ఒక్క నిముషం ఒక్కొక్క ఒమార్ ఖయ్యాం
రుబాయత్ పద్యాలవంటి రోజులవి ఏవి ప్రియతమ్
చప్పుడు కాకుండా ఎవరు హరించారు మన పెన్నిధిని



