Home » Sri N T Rama Rao » Sri N T Rama Rao Prasangalu


 

మన కార్యక్రమాలే మన నిజాయితీకి నిదర్శనాలు 

 

    మనకు ప్రాంతీయ ద్వేషం లేదు. ప్రాంతీయ భేదం లేదు. మనమంతా ఒక్కటే. తెలుగు జాతి ఒక్కటి. తెలుగువారు ఒక్కటి. గతంలో ఈ విధంగానే విద్వేషాలు సృష్టించి స్వర్ధపరులైనటువంటి రాజకీయనాయకులు ఎన్నో ఎన్నో ద్వేషభావాలు కల్పించారు. ఈనాడు అదృష్టవశాత్తు తెలుగు జాతి అంతా ఒక్కటిగా మెలుగుతున్నది. ఆరుకోట్ల ప్రజానీకం తెలుగు రాష్ట్రాభివృద్ధికి కంకణం కట్టుకొన్నది.
    ఏవిధంగా నైనా సరే ఎప్పటికైనా సరే ఆ జాతీయ విద్వేషాలు కాని, ఆ ప్రాంతీయ భేదాలు గాని మనలో రాకూడదని ఎప్పటికప్పుడు గతాన్ని విస్మరించి భవిష్యత్తుకు పూలబాట వేసుకుంటూ మందుకు సాగాలని, సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. అందుకే ఈనాడు ఆ ప్రాంతం ఆ ప్రాంతం అనే భేదం లేకుండా ఎవరికైతే అవసరాలున్నాయో, ఎవరైతే త్రాగటానికి మంచినీరు లేక బాధపడుతున్నారో ఒక ప్రక్క కృష్ణా, గోదావరి , తుంగభద్ర, పెన్నా, సువర్ణ ఇత్యాది నదీ జలాలున్నప్పటికీ ఇంకా గొంతుతడవక మండు టెండల్లో మందిపోతున్నారో అటువంటి సోదరులకు త్రాగటానికి గుక్కెడు మంచినీళ్ళయినా అందించడం ధర్మంగా మన ప్రభుత్వం భావిస్తున్నదని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఈనాడు ఇటువంటి కార్యక్రామాన్ని మీరందరూ ప్రభుత్వం పట్ల ఉంచిన విశ్వాసానికి ఒక ప్రతిరూపంగా మీకు నివేదనగా అందజేస్తూన్నాను.
    మనది వ్యవసాయం ముఖ్యంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈనాడు రైతు క్షేమంగా వుంటేనే కాని దేశానికి సంక్షేమం లేదు. రైతు, కార్మికులు, రైతు కూలీలు చిరునవ్వుతో ముందుకు నడిపిస్తేనే గాని ఈ దేశానికి మనుగడ లేదు. అది నా నమ్మకం. అందుకనే ముఖ్యంగా ఈనాడు పంటలు పండించి దేశానికింత కూడు పెడ్తున్న అన్నదాత రైతు సంక్షేమం కోరడం ప్రభుత్వ ధర్మంగా భావిస్తున్నాను. ఆ రైతును అంటిపెట్టుకుని ఆ రైతు నీడలో వెలుగుతూ దినదిన గండంగా మండిపోయిన డొక్కలతో , ఎండిపోయిన శరీరంతో కొడుగుడులాడుతున్నటువంటి కోటానుకోట్ల వ్యవసాయ కార్ముకుల సంక్షేమం చూడాటం కూడా ప్రభుత్వ ధర్మమని నేను విశ్వసిస్తున్నాను. ఈనాడు మనకున్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకుని ఏ విధంగానైనా సరే మన రాష్ట్ర సమృద్దిని సాధించడం ప్రభుత్వ లక్ష్యమని నేను నమ్ముతున్నాను.
    ఈనాడు పరిశుద్దమైనటువంటి పరిపాలన ప్రజలకందివ్వాలి. నీతి నిజాయితిలో ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రజాక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేయాలి. ఇదే మా ధ్యేయం. మన అడబడుచులందరూ ఎంతో ఆప్యాయతతో గెలిపించారు. వారి ఋణం తీర్చడమేలాగు. ఈనాడు జనాభాలో యాభై శాతం ఉన్న ఆడపడుచుల సంక్షేమం చూడడం అవసరం. అదే మా ధ్యేయం. అందుకే పురుషులతో పాటు స్త్రీలకూ కూడా అస్థిట్లో సమాన హక్కులు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈనాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వారి జీవన విధానాలను వారు స్వతంత్రంగా సాగించుకోడానికి అవకాశం కల్పించాలనే ధ్యేయంతో మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఇవన్నీ మా ఆడబిడ్డల సంక్షేమానికని, వారి రుణం తీర్చుకోడానికని సవినయంగా నేను మనవి చేస్తున్నాను.
    ఈనాడు ప్రజలకు ప్రభుత్వానికి భేదం లేదు. దూరం లేదు. మేమందరం మీవాళ్ళం , మీలో ఉన్నవాళ్ళం, మీతో కలిసి మెలిసి తిరగాలనుకుంటున్నవాళ్ళం. ఈనాడు అన్నీ వదులుకుని ప్రజలే మా ఊపిరిగా , దేశమే మా ధ్యేయంగా వచ్చినటువంటివాళ్ళం. ఈనాడు ప్రభుత్వం మీది, మీరే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పాలకులు. ప్రజలే ఈనాడు పాలకులు. అదీ ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం. అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వబడాలి. అందరికీ సమానమైన విద్యా విశేషాలు లభించేటటువంటి విధానాలను ఆర్ధిక సమానత్వాన్ని ప్రభుత్వం సాధించాలి. అప్పుడు గాని సమసమానత్వం మనకు రాదు. కబుర్లు పై నుండి చెపుతూ క్రిందున్న వాళ్ళని ఆ మురికిగుంటల్లోనే, మురికివాడల్లోనే వుంచడం న్యాయం కాదు. అదెప్పటికి కూడా సమాజానికి మంచిది కాదు. ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ తెలుగు జాతి కళ్ళు తెరచింది. ఈనాడు వ్యర్ధపు మాటలు చెప్పి, అబద్దాలు చెప్పి జన సమూహాన్ని నమ్మించే రోజులు పోయాయి. ఏమైనా సరే మన కార్యక్రమాలే మనకు నిజాయితిని రుజువు చేయాలి. మన విధానాలే మన ప్రజాసేవకు నిదర్శనాలుగా వుండిపోవాలి. అందుకే ఈనాడు ఈ నల్గొండ జిల్లాకు ఈవిధంగా వనరులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పం. ఈనాడు రాయలసీమ, తెలంగాణా, రెండూ రెండు కళ్ళు తెలుగుజాతికి. ఈనాడు మెట్ట ప్రాంతాలుగా వుండి త్రాగడానికి నీరందక - ఎదురుగుండానే కన్పిస్తూ వున్నది కృష్ణానది --- కాని పైకొచ్చే అవకాశం లేదు. అటువంటి అవకాశాలు కల్పించి మన తెలుగు తల్లిని సస్యశ్యామలం చేసి మల్లెపూలతో పరావళ్ళు త్రొక్కే విధంగా ఆరాధించుకోవడం తెలుగుజాతి కర్తవ్యం. అందుకే ఈరోజు ఈనాడు శ్రీశైలం ఎడమకాలువ రెగ్యులేటర్ కు పునాది వేయడం జరిగింది. 3 లక్షల ఎకరాల సాగుబడికి ఈనాడు నాంది పల్కింది ప్రభుత్వం. ఇప్పుడు కాదు నాకు ఆనందం. ఈనాడు మీ దేవరకొండ ప్రక్కనుండే ఆ కాలువ వెళుతుంటే , మీరందరూ ఆనీళ్ళు త్రాగుతుంటే అది చూడాలి నేను. ఆరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆనాడు మళ్ళీ మీ  దర్శనం కోసం ఇక్కడికి వస్తానని నేను మీ అందరికి మనవి చేస్తున్నాను .


    1983 మే 7 న దేవరకొండ లో శ్రీశైలం ఎడమకాలువ రెగ్యులేటర్ కు శంకుస్థాపన సందర్భంగా ......

 




Related Novels


40 Years of TDP

Sri N T Rama Rao Prasangalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.