Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


                   
                                              నల్లజర్ల రోడ్డు

    నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు. అవధానిగారు ఇలాగ అనేటప్పటికి మేమందరం ఫక్కున నవ్వాం. కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండి దారాల్లా మెరిశాయి.

    "చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపెడతాయో మీకు తెలియదు" అన్నారు మళ్ళీ.

    "చెప్పండి , మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే వుంది. వినటానికి సిద్దంగా ఉన్నాం" అన్నాను నేను.

    "ఈ రాత్రికింక లైట్లురావు. ఎక్కడో తీగ తెగిపోయివుంటుంది" అన్నాడు నారాయణ.

    "తోట అంతా చీకటైపోయింది" అన్నాడు నెర్వస్ గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్ళతో బల్లమీద ఆదితాళం వేస్తున్నాడు. "ఇంకా కొవ్వొత్తులున్నాయండీ!" అని అడిగాడు.

    అవధానిగారు తల వూపారు -ఉన్నాయన్నట్టు.

    "ఈ తోటా, తోటలో మీ బంగళా, మీరు చేసిన విందూ -ఓహ్! మరచిపోలేం" అన్నాడు నారాయణ.

    "ఊరికి ఇంత దూరంగా ఈ తోట వుండడమే అంత బాగాలేదు" అన్నాడాచారి.

    "చెప్పండి కథ" అన్నాను నేను.

    "కథా?" నిరసనగా చూశారు అవధానిగారు.

    "అదే! అదే! మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన -" అని సర్దుకున్నాను. అవధానిగారు కవీకాదు; కథకుడూకాదు. జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు.

    ఆయన చెప్పడం మొదలు పెట్టారు.

    "ఏలూరులో చూసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ప్లీడరుగారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక, కారు స్టార్టు చేశాడు రామచంద్రం. పది గంటలు దాటింది రాత్రి. నాగభూషణం మామయ్యా, నేనూ వెనకాల సీటులో కూర్చున్నాం. ప్లీడరుగారు కారుదగ్గరికి వచ్చి "నా మాట విన్నారు కాదు" అన్నారు. "అబ్బే ఎంత సేపండీ, సరిగ్గా తొక్కితే ఒక గంటన్నరలో తణుకులో పడతాం. మీరేం యిదవకండి" అన్నాడు రామచంద్రం.

    "కలక్టరుగారి ఇంట్లో పెళ్ళి సరీగా ఉదయం ఏడు గంటలకి. నా మీదా, రామచంద్రం మీద భరోసా వేసుకుని కూర్చున్నారు కలక్టరుగారు" అన్నాడు నాగభూషణం మామయ్య.

    "అమ్మమ్మ! ఎంతమాట! కలక్టరుగారింట్లో శుభకార్యమంటే వేరే చెప్పాలా!" అన్నారు ప్లీడరుగారు. యావద్విషయాన్నీ గ్రహించినవారై.

    కారు సాగింది "అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. అప్పటికి మీరెవరూ పుట్టివుండరు" అన్నారు అవధానిగారు మా అందరికేసి చూసి.

    "అటువంటి ప్రమాదం సంభవించే సూచనలుకూడా వాతావరణంలో ఉండి ఉండవండి" అన్నాడు నారాయణ.

    తోటలో గలగల చప్పుడైంది. ఆచారి ఉలిక్కిపడి  "దొంగలేమో" అన్నాడు.

    "పక్షులు చెట్లలో కదులుతున్నాయి. అంతే" అన్నారు అవధానిగారు.

    "కథలోకి రండి" అన్నాను నేను.

    "అంటే -?" కోపంగా చూశారు అవధానిగారు.

    "అదేనండి, మీ చిన్నప్పటి -"

    అవధానిగారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి ఇలా చెప్పసాగారు.
 
    ఆరుమైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బానెట్ చూశాడు.

    "వెధవ కారులా వుంది. నడచి వెనక్కిపోదాం పద. ఎందుకేనా మంచిది" అన్నాడు నాగభూషణం మామయ్య.
 
    "అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగాని ఈ కారుని తిడితే మాత్రం నే నూరుకోను. అసలీ ఇంజనులాంటిది ఇంియాలో వుండదు" అన్నాడు రామచంద్రం.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.