ఇన్ స్పెక్టర్ ఒకనాడు కల్పించిన కధకి వందపిలకలు పుట్టుకువచ్చాయి అని ఇటు బన్సీలాల్ కి తెలియదు. అటు అతనికి తెలియదు.
అసలు కధ ఎవరికీ తెలియకుండా మంచివాళ్ళని రక్షిస్తూ చెడ్డవాళ్ళని గడ్డి తినిపిస్తూ వున్న శక్తిమాయి తెర వెనుకనే ఉండిపోయింది. కాగలకార్యం గంధర్వులే తీరుస్తారన్న నమ్మకం ఆమెకి వుంది.
ఇప్పుడు జరుగుతున్నదీ అదే.
ఇన్ స్పెక్టర్ రోగం కుదర్చబోతున్నాడు బన్సీలాల్. బన్సీలాల్ రోగం మరోసారి కుదర్చకపోతే లాభం లేదనుకుంటున్నాడు అతడు.
ఎవరిరోగం ఎవరు కుదురుస్తారన్నది వేచి చూడాల్సిన విషయం.
అతను వెళ్ళిన తరువాత లోతుగా ఆలోచించి మాయరోగానికి మందు కనిపెట్టాడు బన్సీలాల్.
"ఈ దెబ్బతో దెయ్యం వదలాలి."
కసికసిగా అనుకున్నాడు బన్సీలాల్.
27
అందమైన అమ్మాయి...
వయస్సు నిండా యిరవై....పేరు సుందరి.
పోలీసు స్టేషన్ కి తీసుకురాబడింది. అదీ మామూలుగా కాదు నేరం మోపబడి...జోగయ్య బజారు రౌడీ సినిమాలలో రౌడీలువున్నట్లే అదే వేషధారణతో వుంటాడు. గళ్ళ లుంగి, బుర్రమీసాలు, బోడిగుండు, నడుంచుట్టూ బెత్తెడు వెడల్పు బెల్టు, జబ్బలకి తాయిత్తులు, భయంకరంగా ఉండే కళ్ళు, కసాయి చూపులు జోగయ్య వకటో నెంబర్ రౌడీ. మొద్దువెధవలాగా మెలగటం తప్ప ఉత్తం, మధ్యం బొత్తిగా తెలియదు.
ఆకలి వేస్తే తినటం, కోరిక పుడితే తీర్చుకోటం ఏదయినా వెధవ పని చేయాలంటే వెంటనే చేసి రావటం అంతే తెలుసు...చూసి రమ్మంటే చూసి రావటమేగాక చేసి కూడా వస్తాడు కనుకనే కొందరి పెద్దవాళ్ళ అండ వాడికి వుంది. డానికి తోడు పోలీసువాళ్ళ కుక్కలాంటి వాడు. తనని పోలీసులు పట్టుకోకుండా ఉండాలంటే వాళ్ళకి సాయం చేయాలి.
అదెలాగంటే...
రౌడీలు దొంగల మధ్య తిరిగే జోగయ్య వాళ్ళతో స్నేహంగా వుండి, వాళ్ళ గుట్టుమట్లు తెలుసుకుని రెండో కంటికి తెలియకుండా వాళ్ళ ఆచూకీ పోలీసులకిచ్చేవాడు. దొంగని దొంగసొత్తుతో సహా పట్టుకోతం వాళ్ళకి తేలిక అయ్యేది. అందువలన జోగయ్యని చూసీ చూడనట్లు వదిలేసేవాడు.
జోగయ్య కంటికి అందమయిన అమ్మాయి కనిపించింది. వెంటనే వాడిలో కోరిక బుస బుస పొంగింది. అక్కడి కక్కడే ఏదేదో చేయబోయాడు. మల్లెపూవులా వున్న ఆ పిల్ల కరాటే షాట్ ఒకటి ఇచ్చి పారిపోయింది.
అంతే! జోగయ్య పగ పట్టాడు. సమయం కోసం చూస్తున్నాడు. ఈ తఫా పెద్ద కేసులో జోగయ్యని ఇరికించటం జరిగింది అప్పుడు ఇన్ స్పెక్టర్ కి పెద్ద పెట్టున ఆశ చూపి బయటపడ్డాడు. దాంతో ఓ బజారు రౌడీకి, పోలీసు అధికారికి స్నేహం ఏర్పడింది. స్నేహం నిలుపుకోవాలి కదా!
సుందరి పొందు తను పొందేకన్నా, ఇన్ స్పెక్టర్ కి నైవేద్యంగా అర్పిస్తే! దాని రోగము కుదురుతుంది, తన పని అవుతుంది.
ఈ ఆలోచన చేసిన జోగయ్య "రంభలాంటి పిల్ల వుంది సార్! దానికి రక రకాల పట్లు వచ్చు. ఓ పట్టాన లొంగదు. మీలాంటి మొనగాడు మాత్రమే దానిని ఓ పట్టు పట్టగలరు" అంటూ అదే పనిగా ఊదరకొట్టాడు.
ఇన్ స్పెక్టర్ కి పెర పెర పుట్టింది.
ఫలితం!
ఇటు జోగయ్య అటు ఇద్దరు పోలీసులు దారికాచి సుందరిని పట్టుకున్నారు. పోలీసువాడు తలుచుకోవాలేగాని కాని పని ఏముంది? దొంగతనం నేరం మీద సుందరిని పోలీసుస్టేషనుకి లాక్కొచ్చారు.
ఆ సాయంత్రం అల్లా పోలీసు స్టేషనులో వున్నా సుందరి రాత్రికి దూరంగా వున్న బంగ్లాకి తరలించబడింది.
ఇన్ స్పెక్టర్ గారి జీపులో సుందరిని కట్టి పడేశారు...సుందరిని బంగ్లాలో చేర్చివచ్చింది జీపు. అధికార దుర్వినియోగం లాంటి పెద్ద మాటలు ఆ పోలీసు వాహనానికి తెలియవు.
ఇన్ స్పెక్టర్ మగువ, మధ్యానికి బానిస.
ఇన్ స్పెక్టర్ నైవేద్యం పెడితే తర్వాత ఆ ప్రసాదాన్ని వంతుల వారీగా ఆరగించవచ్చని గోతికింద నక్కల్లా బంగ్లా బయట కాచుకుని వున్నారు. జోగయ్య, మరి ఇద్దరు కానిస్టేబుల్స్.
బంగ్లా లోపల...
సుందరి సాధారణమయిన ఆడపిల్ల కాదని, కాస్త సందుయిస్తే జర్రునే జారిపోతుందని అయిదు నిమిషాలలోనే అర్ధం చేసుకున్న ఇన్ స్పెక్టర్ తన చేతిలో బెల్టుకి పని కల్పించాడు. డొక్కలో ఈడ్చి పెట్టి తన్నాడు. పొత్తికడుపు మీద పిడిగుద్దులు గుద్దాడు...


