దొంగలు, దొంగలు దేశ ఆర్ధిక వ్యవస్థను పంచుకు తినటమే నేటి పారిశ్రామిక, ఆర్ధిక రాజనీతి దేశాన్ని కొల్లగొట్టుకు తింటున్న బడాస్వాముల తెరవెనుక రహస్యాల్ని బయటకు లాగుతున్న సందర్భంలో ఎందరో పాఠకులు అభిమానంతో నాకు కొండంత మానసిక స్థయిర్యాన్ని ఇచ్చారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
* * *
సామంత్ మొదలయిన విధ్వంసకాండ మూలంగా ఏ భైలక్షలకు పైగా నష్టం వాటిల్లింది భూపతిరావుకి. దాని మూలంగా మొదలయిన పాక్షికమైన సమ్మె మూలంగా ప్రొడక్షన్ పడిపోయింది.
భూపతిరావు ఆ చిరాకులోనే ఉన్నాడు.
కరక్ట్ గా రాత్రి తొమ్మిది గంటలకు సత్యరాజ్ జీప్ భూపతిరావు గెస్ట్ హౌస్ ముందాగింది, అందులోంచి ముందుగా లాల్ సింగ్, బిర్క్ హసీంఖాన్ లు దిగారు.
మనసులో భూపతిరావుక్కూడా అయిష్టంగానేఉంది సత్యరాజుతో సమావేశ మవ్వటం.
9-30కి భూపతిరావు క్రిందకు వచ్చాడు.
"డైరెక్టుగా విషయంలోకి వద్దాం. ఏమిటి నీ కోరిక! కార్మికుల జీతాలు పెంచాలా......? బోనస్ పెంచాలా? సదుపాయాలూ కలుగజేయాలా......?" సూటిగా ప్రశ్నించాడు భూపతిరావు.
ఆ హాల్లో ఆ ఇద్దరే ఉన్నారు. మిగతా వారంతా ఆ హాలు బయట గదిలో వెయిట్ చేస్తున్నారు.
భూపతిరావు మాటలకు సత్యరాజు కొద్దిగా ఖంగుతిన్నాడు.
అంతలోనే తిరిగి సర్దుకుంటూ "అలాంటీవేం కావు" అన్నాడు తాపీగా.
"మరి యూనియన్ లీడర్ గా నీవు కోరాల్సింది ఆ కోరికలే గదా.....?"
"ఎందుకు సార్ ముసుగులో గుద్దులాట? అవి పైకి. నలుగురికి తెలిసేలా అడిగేవి......"
భూపతిరావు సత్యరాజుని పురుగుని చూసినట్లు చూశాడు.
"నాకు కావాల్సింది ఒకటుంది. అది నా కూతుర్ని నీ పెద్దకొడుకు నాగబాబుకి చేసుకోవటం....."
త్రుళ్ళిపడ్డాడు భూపతిరావు.
ఓ క్షణం అర్థంకానట్లు చూశాడు.
"నీవనేదేమితో నా కర్థం కావటంలేదు! సమ్మెకు నా కొడుకు పెళ్ళికి ఏమిటి సంబంధం.......?" ఈసడింపుగా అన్నాడు ఆయన.
"ఈ రోజుల్లో ప్రజలకు దేశానికి మేలు చేస్తామని డాంబికాలు పలికే రాజకీయ నాయకులే ఎలక్షన్స్ లో గెలిచి గద్దెక్కగానే ఎలక్షన్స్ లో పెట్టిన ఖర్చుకు వందరెట్లు జమేసుకుంటారు. అలాగే ఈనాడు 90 శాతం యూనియన్ లీడర్సూను. నానాకష్టాలుపడి మంచి పేరు తెచ్చుకొని, ఎంతో ఖర్చుపెట్టి యూనియన్ లీడరయి చేసేది అంతే_అందుకోసమే-"
"నీకు సిగ్గుగా లేదూ......?"
"ఎందుకుసార్ సిగ్గు___? మా కార్మికులమీద కోట్లు అర్జిస్తున్నారు వాళ్ళేదైనా పెంచమని అడిగితే మాలాంటి లీడర్స్ దగ్గరకు తీసుకొని మమ్మల్ని రహస్యంగా కొనేసి మాతోటే మా సోదర కార్మికులకు__ ఫ్యాక్టరీ పైనాన్షియల్ గా అంత బాగోలేదని, పెంచిన వరకు తీసుకొని ఈ సారికి వదిలేద్దాం" అని చెప్పిస్తారు కాదంటారా......? మీ అవసరాలకి మీరు మా అవసరాలకి మేము మా వాళ్ళను మింగటం మామూలేగా?"
భూపతిరావు తేలు కుట్టిన దొంగలా మిగిలిపోయాడు.
"ఎందుకు సార్ హిపోక్రసి? ఈ దేశ ప్రజలు బాగుపడాలని, దేశం ఆర్థికంగా ముందుకు నడవాలని మీకూలేదు, మాకూలేదు, మనం దొంగలం......కలిసి ఊర్లు పంచుకుంటే పోలా.....?" నిష్కర్షగా మాట్లాడుతున్న సత్యరాజువైపు సాలోచనగా చూశాడు ఆ భూపతిరావు. అతనన్న దానిలో నిజం ఉంది గనుక ఏం మాట్లాడలేక పోయాడు భూపతిరావు.
"సరే ఇంతకి అనేదేమిటి? నాకు ఈ సమ్మె ఆగిపోవాలి......" తన అభిప్రాయాన్ని చెప్పాడు భూపతిరావు.
"అనేదేముంది..........నా ఒకే ఒక కూతుర్ని మీ కోడల్ని చేసుకోవాలి............" స్థిరంగా అన్నాడు సత్యరాజు.
భూపతిరావు బలవంతాన అనుచుకుంటున్నాడు పెల్లుబుకుతున్న ఆవేశాన్ని, కార్యదక్షత ఉన్నావాడు గనుక, తనకావ్యక్తి అవసరం ఉందికనుకనే ఆగిపోయాడు లేదంటే అక్కడక్కడే సత్యరాజుని పాతి పెట్టేసే వాడు.
"అది కుదరదు సత్యరాజు నా చిన్నకొడుకు నేను చెప్పినట్లు వింటాడు. మా పెద్దవాడిది అంతా వాళ్ళమ్మ పోలిక. తనకు నచ్చిందాన్నే పట్టుకు వేలాడే మొండివాడు. అసలు వాడికి నా యాక్టివిటీస్ నచ్చవు___" భూపతిరావు సత్యరాజుకి నచ్చచెబుతున్నాడు.
"పోనీ మీ చిన్నకొడుక్కే చేసుకోండి........." సత్యరాజు మధ్య లోనే అడ్డం తిరిగిపోయాడు.
పెద్దవాడికి కాకుండా చిన్న వాడికి పెళ్ళిచేయటం ఆచారం కాదు......" భూపతిరావు తిరిగి అడ్డెసాడు.
చూస్తూంటే మీకే ఇష్టం లేనట్లుగా తోస్తోంది, నేను మిమ్మల్ని బెదిరించటం లేదు, కాదంటే పరిస్థితేమిటో చెప్పాగా అది సంగతి"
అంతలో అక్కడున్న ఫోన్ మోగింది ఆ హాల్లో ఉన్న ఆ ఫోన్ నెంబర్ చాలా తక్కువ మందికే తెలుసు.
టెలిఫోన్ డైరెక్టరీలోకి ఎక్కకుండా అరేంజ్ మెంటు చేసుకొని కాన్ ఫిడెన్షియల్ గా ఉంచుకొన్న ఫోను అది.
భూపతిరావు ఫోన్ ఎత్తాడు. అవతలవైపు దినేష్ ఉన్నట్లుగా వెంటనే తెలుసుకున్నాడు.
"ఏమిటి చెప్పు......" భూపతిరావు నెమ్మదిగా అన్నాడు.
"..............."
"అలాగా......."
"................."
"దెన్___ప్రొసీడ్ " అంటూ ఫోన్ పెట్టేసి సత్యరాజ్ వైపు తిరిగి" నా నిర్ణయాన్నేను చెప్పాను. అది కాకుండా మరేదన్నా అడుగు చేస్తాను. లేదంటే వెళ్ళిరా. బలాబలాలు బయటే చూసుకుందాం, నువ్వెళ్ళోచ్చు" అన్నాడు భూపతిరావు ఖండితంగా. అంతకుముందు కనిపించని ధైర్యమేదో భూపతిరావులో అప్పటికప్పుడే చోటు చేసుకున్నట్లు గమనించాడు సత్యరాజ్.
ఓ క్షణం ఏం పాలుపోలేదు. అంత హఠాత్తుగా భూపతిరావు అలా రివర్స్ అవుతాడనుకోలేదు బేరానికి కోస్తాడని ఊహిస్తున్న టైములో వచ్చిన ఫోన్ అతనిలో ధైర్యాన్ని నింపి ఉండాలి. ఆ ఫోన్ చేసిందెవరు......? అతని ఊహకు అందలేదు బెదిరిస్తున్న ధోరణిలో విసురుగా బయటకు వెళ్ళిపోయాడు సత్యరాజ్.
* * *


