మేనీటర్ కదిలిందని గ్రహించాడు.
అయితే ఆ తర్వాత చాలా ఆశ్చర్యకరంగా అడవంతటా నిశ్శబ్దం ఆవరించింది. అంటే మేనీటర్ సమీపంలో ఎక్కడన్నా పొంచి ఉండొచ్చు లేదా తన దిక్కును మార్చుకుని మరో చోటికి వెళ్ళిఉండొచ్చు.
ఏం జరిగిందీ ఇదమిత్థంగా తేల్చుకోలేనంత భయంకరమైన నీరవం.
కేరియన్ ఏనిమల్స్ సైతం శవం పక్కకి రాలేదు.
నిముషాలు గడుస్తున్నాయి గంటల్లా.
సరిగ్గా అప్పుడే ఓ అనూహ్యమయిన సంఘటన జరిగింది.
ఆ నిశీధివేళ నిర్మానుష్యంగా వున్న అడవిలో చైతన్యస్థానంలో కూర్చున్న మరెవరయినా భయంతో చెట్టుదూకి పరుగెత్తేవారు లేదా కూర్చున్న చోటనే గుండె ఆగి ప్రాణాలు వదిలేవారు.
అతనికి దిగువగా దుర్గంధాన్ని చిమ్ముతున్న శవం తల నెమ్మదిగా_చాలా నెమ్మదిగా పక్కకు తిరుగుతోంది.
ఆ మసక వెలుతురులో ఏ క్షుద్రశక్తో కదుల్చుతున్నట్టు శవం తల కదిలి జీవంలేని కళ్ళతో మంచెపైకి చూస్తుంటే ,చైతన్య శరీరం పైన రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
గగుర్పాటుతో చైతన్య గొంతు తడారిపోయింది.
భయంతో చేతులు వణుకుతుంటే బలంగా రైఫిల్ పట్టుకున్నాడు. ఇంతలో తల నెమ్మదిగా కదిలి మళ్ళీ యధాస్థానంలోకి వచ్చింది.
ఏనాడూ ఇలాంటి అనుభవం రుచిచూడని చైతన్య ఎంతగాకలవరపడ్డాడూ అంటే, అప్పటికే అతని శరీరం చెమటతో తడిసిపోయింది.
అలా ఎంతసేపు రెప్పలార్చకుండా అటే చూశాడో అతనికి గుర్తులేదు.
అతడు తల పైకెత్తేసరికి శవానికి పదిగజాల దూరంలో కూర్చుని ఉంది.
మేనీటర్?....
గుర్రుమంది అతని గుండె వణికేట్టుగా.
పెద్దపులి భారీ శరీరాన్ని చూసిన చైతన్య దాని తెగువకి ముందు ఆశ్చర్యపోయాడు.
తలనో, గుండెనో చీల్చితేనే తప్ప నేలకొరగని విపరీత పరిమాణంలో వున్న అతి భయంకరమయిన క్రూరమృగమది.
నెమ్మదిగా రైఫిల్ పైకెత్తాడు. గురి చూస్తుండగానే చెంపలపై ఏదో స్పృశించింది. ట్రిగ్గర్ పైన వేలిని కదల్చలేకపోయాడు.
ఏం జరుగుతున్నదీ ఆలోచించేలోగా ఓ త్రాచు అతని భుజాలపై నుంచి పాకి రైఫిల్ ను మజిల్ ను చుట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ నిలబడింది.
అతడి ముఖానికీ, త్రాచుకీ మధ్య వున్న దూరం కేవలం అడుగున్నర! ట్రిగ్గర్ నొక్కితే ఆ రిటార్డేషన్ కి మొహంపై కాటేస్తుందన్న భీతిని గొలిపే పొగరెక్కిన నల్లత్రాచు.
త్రాచు బుస అతని ఫాల భాగాన తాకుతుంటే అచేతనంగా ఉండిపోయాడు. క్రింద మేనీటర్, పైన చాలా దగ్గరగా ఓ విష సర్పం.
చైతన్య శరీరం చల్లబడుతోంది. అతనిచేయి వణికింది. అంతే కాటేయడానికి సిద్ధపడుతున్నట్టు త్రాచుపడగను కాస్త వెనక్కి వంచింది.
మరొక్క సెకండుకాదు_సెకండులో సగభాగం చైతన్య జాగుచేసి ఉంటే త్రాచుకోరలు అతనికుడిచేతిపై దిగబడేవి. బాధతో అతడు క్రిందికి జారి ఉంటే, అవకాశం కోసం పొంచివున్న మేనీటర్ బలమయిన తన ప్రత్యర్ధిని నోట కరుచుకుపోయేది.
అదృష్టమన్న దానికి అర్ధం కనిపించని అవకాశం కోసం ఎదురుచూడ్డం. కాదు_పైకి తన్నుకొచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవడం కూడా.
అంతే!__
మరుక్షణం చాలా వేగంగా రైఫిల్ ను త్రాచుతో సహా క్రిందికి విసిరేశాడు.
అతడు తనలో కలిగిన భయాందోళన నుంచి తేరుకోవడానికి ఎంతసేపు పట్టిందో గుర్తులేదు. క్రిందికి చూసేసరికి రైఫిల్ ను చుట్టుకుని వుండాల్సిన త్రాచు మాయమయింది. బహుశా ఏ పొదల్లోకో దూరిపోయి వుండొచ్చు.
దూరంగా చేయని నేరానికి శిక్షింపబడిన నిర్దోషిలా ఎద్దు రంకె వేస్తుంటే అటు చూశాడు.
ఆశ్చర్యం. అక్కడ పులి కూడా లేదు. అంటే ....రైఫిల్ క్రిందికి విసిరివేయగానే ప్రమాదం వాటిల్లబోతోందని పరుగు తీసిందా?
ఇప్పుడేం చేయాలి?
శవంకేసి చూశాడు. వెన్నెల కాంతిలో ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తూంది. అంటే ఇందాక కేవలం భయంతో తన ఇంద్రియాలే తనను మోసం చేశాయా?
హఠాత్తుగా అతడు కూర్చున్న చెట్టే ఊగింది బలంగా ఏ భూతమో ఆవహించినట్టు. అజాగ్రత్తగా వుంటే మంచెపై నుంచి క్రిందికి జారే వాడే.
వెనక్కి వంగి చూశాడు.
అతనికి క్రిందుగా చెట్టు బోదెను గోళ్ళతో గుచ్చుతూ పై కెక్కాలని విశ్వప్రయత్నం చేస్తూంది మేనీటర్.
ఓ అర్దరాత్రివేళ క్రూరమృగాలకు, విషసర్పాలకు నిలయమయిన అడవిలో చైతన్య తానెంత అపాయకరమైన స్థితిలో మిగిలిందీ గ్రహించాడు.
ఆ తర్వాత ప్రతి సంఘటనా చాలా వేగంగా జరగడం మొదలుపెట్టింది.
నిరాయుధుడైన వ్యక్తిగా అతన్ని గుర్తించడంతో పట్టు సడలిన పెద్దపులి క్రిందికి జారి గుర్రుమంటూ మళ్ళీ బోదెను గోళ్ళతో గుచ్చి పై కెగురుతోంది,
అదృష్టవసాత్తూ అతడెన్నుకున్నది నిలువుగా ఎదిగిన చెట్టు బోదెపై సుమారు పదిహేను అడుగుల ఎత్తున ఉన్న కొమ్మ భాగాన్ని.
ఇలాంటి స్థితిలో_అంటే అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మామూలు పులి ప్రాణ భీతితో దూరంగా పరుగెత్తేది. కాని ఇది మనిషంటే అణుమాత్రమైనా భయంలేని మేనీటర్.
అదే చిరుతపులైతే ఈపాటికి సునాయాసంగా చెట్టుపైకి చేరగలిగేది.
అంత బలమయిన సింధూర చెట్టుకూడా మేనీటర్ దూకుడికి ఊగిపోతుంటే తనను తాను రక్షించుకునే ప్రయత్నంగా మంచె అంచున ఉన్న కాళ్ళను దగ్గరగా ముడుచుకున్నాడు.
అతడున్నది భూమికి పదిహేను అడుగుల ఎత్తులో.
పులి నోటినుంచి సుమారు పది అడుగులు.
పులి నోటినుంచి తోక వరకు గల పది అడుగుల్లో తోక భాగాన్ని మైనస్ చేసి పంజా కదలికను కలిపితే మేనీటర్ 'స్ట్రెచింగ్ రేంజ్' సుమారు ఏడు అడుగుల వరకు వుంటుంది.
మరికొన్ని అడుగుల ఎత్తులో మంచె ఏర్పాటు చేయబడి ఉంటే పులి చేస్తున్నది కేవలం విఫల ప్రయత్నంగానే మిగిలేది.
కాని పది అడుగుల పొడవు వున్న మేనీటర్ బోదెపై నిలువుగా ఆనుకుని కుడి పంజాను చాలా బలంగా మంచెను కదిల్చి బేలన్స్ తప్పి దభేలున వెనక్కి పడిపోయింది.
పులిగోళ్ళ తాకిడికి కొమ్మలతో, వెదుళ్ళతో తయారుచేయబడిన మంచె జల్లెడగా మారటమే కాదు, దానిపై కూచున్న చైతన్య పొరపాటున ఎడమ పక్కకు జరగబోయి, తొట్రుపాటుతో చతికిలబడటంతో గోళ్ళు అతని పేంటును చీల్చి రక్తం చివ్వున బయటకు చిమ్మింది.
బాధగా మూలిగిన చైతన్య క్రిందికి జారి పడిపోయి నిస్సత్తుగా పై కొమ్మను అందుకుని దానిపైకి ఎగబ్రాకేడు.
తన ప్రయత్నాన్ని మరో రెండుమార్లు ముందు విధంగానే కొనసాగించిన మేనీటర్ మంచెను పూర్తిగా చిందరవందరచేసి క్రిందకుపడి, ఆ తర్వాత గుబురుగా వున్న కొమ్మల్లో నక్కిన చైతన్యను వో పది నిముషాలపాటు గుర్రుగా చూసి హఠాత్తుగా అడవిలోకి పరుగెత్తింది.


