అది కూడా చాలా పెద్ద భవనమే! చుట్టూ విశాలమయిన గార్డెన్.
లిప్ట్ లో సెకండ్ ఫ్లోర్ చేర్తుకున్నారు. విశాలయిన గదిలోకి అడుగు పెడుతూనే టక్కున ఆగిపోయాడతను. గుండె వేగంగా కొట్టుకోసాగింది.
ఎదురుగా సోఫాలో కూర్చుని వున్నాడు అర్జున్. కె.యన్. అర్జున్. ప్లాస్టిక్ సర్జరీ చేశాక తన ముఖం ఎలా వుందో అచ్చం అలాగే -
పక్కనే కూర్చుని వుందామే - చిరునవ్వుతో తనవంక చూస్తూ .....మరోవైపు సహదేవ్.
"కమాన్ - కమాన్ మిస్టర్ సురేష్" ఆహ్వానించాడు అర్జున్.
సురేష్ తేరుకుని ముందుకి నడిచాడు.
"కూర్చో!"
అతను అర్జున్ కేదురుగ్గా కూర్చున్నాడు. అర్జున్ అతని వంకే పరీక్షగా చూస్తున్నాడు.
సహదేవ్ అర్జున్ ముఖం వైపు ఆత్రుతగా చూస్తున్నాడు.
"ఫైన్ జాబ్ సహదేవ్!" అన్నాడు అర్జున్ కొద్ది నిమిషాల తరువాత.
"రేపట్నుంచి ఆఫీస్ కి పంపిస్తున్నాం సర్."
"ఓ.కే !" విష్ణు సైగ చేస్తూ అన్నాడతను.
"కమాన్ సురేష్! వెళ్దాం పద" అన్నాడు అతని ఆ సైగను అర్ధం చేసుకుని. ఇద్దరూ ఆ గదిలోంచి బయటికొచ్చి దాని నానుకునే వున్న మరో గది తలుపు తెరిచాడు.
సురేష్ ఆ గదిలోకి నడిచాడు. డేకోలాం ఫర్నిచర్, ఫోం బెడ్స్ నేల మీద తివాచీలు , రంగుల కర్టేన్సు తో వెలిగిపోతోంది గది.
"ఇంక విశ్రాంతి తీసుకోవచ్చు సురేష్! ఏం కావాలన్నా నేను బయటే వుంటాను" అన్నాడు విష్ణు.
"మీకో విషయం చెప్పాలి...." అన్నాడు అతను.
"ఏమిటది?"
"నన్ను సురేష్ అని పిలవటం మానెయ్యటం మంచిది. రేపు ఇంకెవరి ఎదురుగ్గా నయినా సరే ఇలాగే పిలిస్తే కధంతా బయటి కొస్తుంది."
విష్ణు తెల్లబోయాడు. అతని భయంకరమైన మోహంలో కళ వచ్చింది.
"ఫర్వాలేదు మీకు చాలా తెలివుంది" అన్నాడు నవ్వుతూ.
"అవసరం విష్ణూ! లేకపోతె కేరీయర్ రూయిన్ అయిపోతుంది. ఉద్యోగం కాస్తా పోతుంది."
"గుడ్ నైట్ " అంటూ తలుపు వేసుకుని బయటికెళ్ళాడతను.
సురేష్ త్వరగా బట్టలు మార్చుకుని పడుకున్నాడు. అరగంట గడిచినా నిద్ర పట్టటం లేదు. ఆ యువతి రూపమే కళ్ళముందు కదులుతోంది. ఎంత అందంగా వుందామే.
26-20-22 సందేహం లేదు.'
హటాత్తుగా తులసి గుర్తు కొచ్చిందతనికి. మనసంతా అదోలా అయి పోయింది. ఏం చేస్తుండుంటుంది బ్యూటీ పుల్ గాళ్? తను చెప్పకుండా పారిపోయినందుకు ఎంతో మండిపడుతుంటూదా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వుంటుందా/ లేక తనే ఉత్తరం రాస్తాడని ఎదురు చూస్తుంఉంటుందా? ఆరు నెలలయ్యాక తను ఇంటికెళితే ఏం జరుగుతుంది? తనే రమేష్ అంటే ఎలా నమ్ముతుంది? దిగాలు పడిపోయాడతను.
ఒకటే సంతృప్తి ప్రస్తుతానికి ....తులసి ఆర్ధికంగా ఎలాంటి బాధలూ పడదు. అదే తను సాధించిన గొప్ప విజయం.
* * * *
మర్నాడు ఉదయం విష్ణు నిద్ర లేపుతుంటే మెలకువ వచ్చింది.
"కామన్ హరియప్! ఇవాల్టి నుంచీ ఉద్యోగంలో ప్రవేశిస్తున్నావ్"
సురేష్ గుండె కొద్ది సేపు వేగంగా కొట్టుకుంది. ఏదో భయం ..........ఇవాళే ఏదో జరుగబోతోంది తనకు. తన సిక్త్ సెన్స్ చెప్తోంది.
ఏదీ లేకపోతె పది లక్షలు ఇవ్వటానికి వాళ్ళు వాజమ్మలు కారు.
మరో గంటలో కార్లో కుర్చున్నాడతను. ముందు సీట్లో విష్ణు కారు శరవేగంతో పోతోంది.
ఇండస్ట్రియల్ ఏరియా కొచ్చేసింది.
"మధురి ఇండస్ట్రీస్" ప్రహరీ గోడ మొదలయ్యింది. లోపల ఎన్నో పరిశ్రమలు. గేటు దగ్గర తుపాకులతో వున్న సెక్యురిటీ గార్డ్స్ సెల్యూట్ కొట్టారు. కారు ఆఫీస్ భవనం దగ్గర ఆగింది. సురేష్ కారు దిగాడు. చాలా మంది పుల్ సూట్ లో వేచి వున్నారు. అందరూ నమస్కారాలు చేశారతనికి.
అతను చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశాడు.
"మాకు చాలా సంతోషంగా వుంది సార్.....త్వరగా మీ ఆరోగ్యం కోలుకున్నందుకు."
అతను చేయి వూపి లిప్టు దగ్గరకు నడిచాడు విష్ణుతో.
విష్ణు కోటు లోపల్నుంచి రివాల్వర్ అస్పష్టంగా కనబడుతోంది.
విష్ణు వెంబడే ఓ గదిలోకి నడిచాడతను.
చాలా విశాలమయిన చాంబర్ అది. సినిమాల్లో సెట్టింగ్ లా మరో హారంగా కనబడుతోంది. వలయాకారంగా వున్న పెద్ద టేబుల్, వెనుక కుషాన్ రివాల్వింగ్ కుర్చీ. ముందు వలయాకారంలో పది కుర్చీలూ, గోడల దగ్గర సోఫాలు, కింద మెత్తని తివాచి , ఓ పక్క క్రోటన్స్ మొక్కలూ, గోడకు అద్భుతమైన పెయింటింగ్స్ , టేబుల్ మీద ఫోను బ్లూ కలర్ తో సరికొత్త షేప్ లో కొత్తగా మెరిసిపోతోంది.
"మీ యాక్షన్ చాలా బావుంది మిస్టర్ సురేష్! రియల్ అర్జున్ లాగున్నావు. స్టేజీ మీద చాలా అనుభవము వుండి వుండాలి.'
"ప్లీజ్! మీ అలవాటు మార్చుకోండి. నా పేరు అర్జున్ ఇక్కడ...."
విష్ణు మోహంలో క్షణ కాలం కోపం తొంగి చూసింది.
"ఓ.కే ....ఓ.కే .....సార్" అన్నాడు హేళనగా.
"గుడ్ మాణింగ్ సర్!"
సురేష్ తలతిప్పి పక్కకు చూశాడు . పక్కనే బాంబ్ పేలినట్లు అదిరిపడ్డాడు. ఆమె ప్రత్యూష! లైబ్రరియన్ ప్రత్యూష! తన ఫ్రెండ్ ప్రత్యూష.
"ఆయామ్ రెడీ" అన్న ప్రత్యూష.
'ఆయామ్ యువర్ న్యూ సెక్రటరీ సర్"
"హలో ! ప్రత్యుషా...." అనేసి నాలిక్కరుచుకున్నాడతను.
ఆమె ఆశ్చర్యపోయింది. విష్ణు పొడిదగ్గు దగ్గాడు.
సురేష్ కి గుర్తు కొచ్చింది. తనకూ, అర్జున్ కీ వున్న కొద్ది పాటి తేడాలు తెలుసుకోకుండా వుండటానికి కొత్త సెక్రటరీని ఏర్పాటు చేశారని చెప్పారు.
"నాకూ తెలిసింది మిమ్మల్ని ఎపాయింట్ చేశారని. చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి మీరు. ఏ మాత్రం లాప్స్ కనిపించినా అయ్ విల్ షాక్ యూ" కఠినంగా అన్నాడతను.
ఆమె కళ్ళల్లో బెదురూ కనిపించింది. విష్ణు నమ్మలేనట్లు చూస్తున్నాడు.
"ఐ విల్ డూ మై బెస్ట్ సర్!"
"ఎస్! ఐ డిజర్విట్! వాటార్ ది ఎపాయింట్ మెంట్స్?"
"ప్రెస్ పార్టీ వెయిట్ చేస్తున్నారండీ"
'ఓ.కే. పంపించండి."
ఆమె బయటికెళ్ళి పోయింది.
విష్ణు అతని భుజం తట్టాడు. "మేము వూహించిన దానికన్నా చాలా స్మార్ట్ నువ్వు."
"ఆఫీస్ లో పర్సనల్ టాక్ వద్దు" సీరియస్ గా అన్నాడు సురేష్.
విష్ణు కీ మళ్ళీ కోపం ముంచుకొచ్చింది.
"షటప్ ! నేనేం చేయాలో , ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. అతి తెలివి ప్రదర్శించకు" అన్నాడతను.
మరుక్షణంలో తలుపు తెరచుకుని బిలబిలమంటూ కొంతమంది రిపోర్తర్లూ , పోటో గ్రాఫర్లూ లోపలకు జొరబడ్డారు.
వెనుక వైపు గదిలో నుంచి తలుపు తెరచుకుని సహదేవ్ వచ్చి సురేష్ కి దూరంగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.
రిపోర్టర్స్ లో నుంచి ఓ పొడగాటి వ్యక్తీ లేచి నిలబడ్డాడు.
"ఇన్ని రోజుల తర్వాతయినా ఎపాయింట్ మెంట్ ఇచ్చినందుకు చాలా ధాంక్స్ సర్! మాక్కావలసిన ఇన్ ఫర్మేషన్ యిస్తే వుయ్ విల్ బి గ్రేట్ పుల్ టు యూ"
"ప్లీజ్ ప్రొసీడ్! డోంట్ వెస్ట్ యువర్ టైం....." అసహనంగా అన్నాడు సురేష్ అతి వేగంగా....మెరుపులా......మాట్లాడుతూ , అతని వేగానికి, షార్ప్ నెస్ కి విష్ణు నివ్వెరపోయాడు. సహదేవ్ నోరు తెరిచాడు.
"ఏప్రిల్ 82 లో మీ కంపెని షేర్స్ మీద వత్తిడి రావటం వలన మీ మేనేజ్ మెంట్ సుమారు ఎనిమిది లక్షల షేర్లు నాన్ రేసిరెంట్ ఇండియన్స్ కోసం కొన్నది. మళ్ళీ 82 లో మళ్ళీ వత్తిడి వచ్చిందనే సాకుతో మళ్ళీ మీ మేనేజ్ మెంట్ మరో పది లక్షల షేర్లు కొనుక్కుంది! ఇదీ నాన్ రేసిరెంట్ ఇండియన్స్ కోసమే. అంటే సుమారు 22 కోట్ల రూపాయలు విదేశీ భారతీయులు కొనుక్కున్నారు. కానీ అప్పటి రూల్స్ ప్రకారం విదేశీ భారతీయుడు మన దేశంలో లక్ష రూపాయలకు మించి షేర్లు కొనే అధికారం లేదు. అంటే మీ 22 కోట్ల రూపాయలకు 188 విదేశీ భారతీయులు కావాలి కానీ లేరు.
కేవలం పదకొండు మంది మాత్రమే వున్నారు. అప్పుడు మీరు ఈ సమస్య నుంచి తప్పించుకోటానికి మీ పరపతి నుపయోగించి కేంద్ర ఆర్ధిక మంత్రితో కొత్త రూల్ పాస్ చేయించారు. దాని ప్రకారం ఒక్క ఎన్. ఆర్. ఐ. ఒక లక్ష ఫేస్ వాల్యు వరకే కొనగలడన్న నిబంధన తొలగి పోయింది. అదీ 72 గంటల్లో! కనుక ఈ విషయంలో పెద్ద ప్రాడ్ జరిగిందని నా అభిప్రాయం. మీ సమాధానమేమిటి?"


