15 వవారం సీరియల్
"వివేక్!" అన్నాను. శరత్ చంద్ర పట్టు సడలిపోయింది.
వివేక్ నా ఊహకి భిన్నంగా శరత్ దగ్గరకొచ్చి, అతని కాలర్ దగ్గర గట్టిగా పట్టుకుని, "స్త్రీ ని ఎట్రాక్ట్ చేయడం చేతగాని వెధవలు చేసే పనిరా రేప్!" అన్నాడు ఆవేశంతో ఒణికిపోతూ.
ఆ తర్వాత అతన్ని వదిలిపెడ్తూ "నా భార్య నీ ఇంటికి వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు... ఇదే ఇన్సిడెంట్ నా ఇంట్లో జరిగుంటే...నీ బాడీలో ఏ పార్టూ షేప్ లో వుండేది కాదు!" అన్నాడు.
శరత్ చంద్ర అనూహ్యమైన ఈ పరిణామనికి షాక్ తిన్నట్లుగా నెమ్మదిగా సోఫాలో కూలబడిపోయాడు.
"పద..." అన్నాడు వివేక్.
నేను అతని వెంట నడిచాను.
"నీతో గంటసేపు ఫోన్లో మాట్లాడి 'మీరు చాలా బాగా మాట్లాడ్తారు' అని సంతోషించిన మగాడు..... అదే తన ఇంటి ఫోన్ ఎంగేజ్ వస్తే తట్టుకోలేక 'ఎవరితో మాట్లాడానే.... సంసారులు చేసే పనేనా ఇదీ!' అని భార్యని నిలదీస్తాడు! ఈ నైజం తెలీక మీరు మోసపోతుంటారు" కార్లో అన్నాడు వివేక్.
నేను ముఖాన్ని చేతుల్లో దాచేసుకున్నాను.
"అప్పుడే ఏవైంది? ఇంకా ముందుముందు చాలా మంది మగాళ్ళని ఫేస్ చేస్తావుగా... అప్పుడు తెలుస్తుంది, బాగా మాట్లాడేవాడికీ....బాగా ప్రవర్తించేవాడికీ మధ్య నున్న తేడా!" అన్నాడు.
ఇలా మాటలతో చిత్రవధచేసేబదులు నా చెంప మీద ఈడ్చికొట్టచ్చుగా! నువ్వు ఎందుకు వాడితో వెళ్ళావు? అని తిట్టోచ్చుగా! అనిపించింది.
"ఇక్కడ వున్నానని ఎలా తెలిసిందీ?" బలహీనమైన గొంతుతో అడిగాను.
"ఇన్ స్పెక్టర్ ఫోన్ చేసి శరత్ చంద్రతో వెళ్ళవని చెప్పాడు" అన్నాడు.
"మీకు...మీకు ఆ ఇన్ స్పెక్టర్ తెలుసా?"
"ఆఁ...అతను సాయంత్రందాకా స్టేషన్ కి రాకుండా వున్నది నాతో కార్డ్స్ ఆడుతూ కూర్చోవడం వల్లనే!" సిగరెట్ వెలిగించుకుంటూ తాపీగా చెపాడు.
నా మనసు భగ్గుమంది!
"ఈ శరత్ చంద్ర మధ్యలో రాకపోతే ఈ రాత్రికి మీకు స్టేషన్ విడిదయ్యేది!" అన్నాడు.
"ఛీ!" అన్నాను ఛీత్కారంగా.
"నాకూ అలాగే అనిపిస్తోంది!" అన్నాడు.
* * *
అతనివెంట నడుస్తూవుంటే అందరి కళ్ళూ గుచ్చి గుచ్చి నన్నే చూస్తున్నట్లు అనిపించాయి
నాకు ఎంత నిస్త్రాణగా వుందంటే.... ఆ మెట్ల మీదే పడుకునిపోవాలనిపించింది.
ఇంట్లోకి రాగానే మరో షాక్! నాకళ్లని నేనే నమ్మలేకపోయాను. అమ్మమ్మ ఎదురొచ్చింది!
"పాపతల్లీ...నా బంగారం....నీ కెంత భక్తే? కార్తీక మాసం అని వనభోజనానికి వెళ్లావుటకదా....అబ్బాయి చెప్పాడు" అంటూ వచ్చి కౌగలించుకుంది.
అమ్మమ్మని కౌగలించుకోగానే పాపభీతితో నా కళ్ళనిండా నీళ్ళోచ్చాయి. ఆవిడ భుజం మీద నుండే వివేక్ చూశాను కృతజ్ఞతగా!
అతడు తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
"నీకు ఇష్టమని అమ్మ జున్ను పంపించింది. ప్రొద్దుట ఎప్పుడు తిన్నావో ఏమో! అసలే ఇంట్లో తప్పబయట మెతుకు కోరకవు. గోంగూరపచ్చడీ, గడ్డపెరుగూతో నా చేత్తో ఓ ముద్ద తిందువుగాని రా!" అంటూ అమ్మమ్మ వడ్డించి, వద్దన్నకొద్దీ కొసరికొసరి తినిపించింది.
అమ్మమ్మ ఒడిలో పడుకుంటే, ప్రొద్దుట్నుండీ పడిన వేదనా, పొందిన చేదు అనుభావాలూ సమసిపోయి. స్వర్గంలో విహారిస్తున్నట్లుగా వుంది.
"అబ్బాయి చెప్పాడు. ఈమధ్య పని ఎక్కువగా వుంటున్నది కాబట్టి రాత్రుళ్లు మేలుకుంటున్నాడట. అందుకని పక్కలు వేరు చేసుకుంటారుటే పిచ్చి మొహమా? భార్యభర్తలు ఆకూపోకల్లా కలిసుంటేనే పడుతుందే కడుపు!" అంది.
నేను కళ్ళుమూసుకున్నాను.
"మునిమనవడికోసం కొమ్ము చెంబూ, వెండి ఉగ్గుగిన్నే. మొలతాడూ చెయ్యమన్నాను. ఏమే! ఇంకా ఆఁ...ఊఁ....అనవేం? నేను పంపిస్తున్న సంతాన గోపాలస్వామిప్రసాదాలు అందుతున్నాయా?" అంది.
గుక్కతిప్పుకోకుండా ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నేను కళ్ళుమూసుకుని నిద్ర అభినయించాను.
"పిచ్చితల్లి! ఎవరి దృష్టిపడిందో, చెపంలు లోపలికి పోయి చిక్కిపోయింది" అని అమ్మమ్మ ఆప్యాయంగా నా చెపంలు నిమిరింది.
'నీ మనవరాలిమీద చాలామంది దృష్టిపడింది అమ్మమ్మా...నీ పూజలవల్లే మళ్ళీ పవిత్రంగా ఇల్లు చేరగలిగింది!' అనుకున్నాను.
* * *
అమ్మమ్మ వచ్చిందని తెలిసి మరునాడు ఉషా, సుమతీ చూడడానికి వచ్చారు. ఆవిడ పెట్టెలోంచి గారడీవాడు వస్తువులు తీసినట్లు తీస్తూనేవుండడం వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు.
"మా పాపతల్లి కడుపు పండితే, మునిమనవడ్ని ఎత్తుకుని మురిసి ఆ తర్వాతే పోవాలని వుందర్రా!" ఆవిడ మళ్ళీ నా కడుపు సోది ప్రారంభించింది.
నేను ఓ పుస్తకం తీసుకుని చదువుతున్నట్లుగా అందులో తలదూర్చి కూర్చున్నాను.
"మీ రాందే కానీ మీ మనవరాలిలో ప్రయత్నమే లేదూ..." అని కిసుక్కున నవ్వింది ఉష.
నేను ఉషవైపు 'అలాగేనా మాట్లాడడం' అన్నట్లు చిరుకోపంగా చూశాను.
సుమతి వెంటనే ఉత్సాహంగా "రోజూ పండు తాంబూలం , పువ్వు తాంబూలం ఇస్తుంటేనే మా బుజ్జిగాడు కడుపున పడ్డాడు!" అంది.
"అంటే మీవారి ప్రమేయమేమ లేదా?" ఉష ఉడికిస్తూ అడిగింది.
సుమతి టపటపా లెంపలేసుకుంది.
ఉష ఊరుకోకుండా "పతివ్రతలకి పిల్లలు చెవుల లోంచీ, ముక్కుల లోంచీ పుడ్తారటకదా!" అంది.
"ఉష్....ఉషా!" నేను నోటిమీద వేలేసుకుని చూపించాను. అమ్మమ్మ రకరకాల ప్రసాదం పోట్లాలూ, వ్రతకథలూ, దేవుళ్ళ పటాలూ పెట్టేలోంచి తీస్తూనే వుంది. ఆఖరిగా 'సంతానంకోసం ఏం చెయ్యాలి' అనే పుస్తకం బయటికి తీసింది.
"అమ్మో....అమ్మమ్మగారు రసికురాలే సుమా!" అంది నా చెవిలో ఉష.
నేనుకూడా రహస్యంగా "నువ్వనుకునేదేం వుండదులే. అందులో సంతానం కోసం నోచే నోములుంటాయి" అన్నాను.
ఆవిడ ఓ ప్యాకెట్టు బయటికి తీస్తూ "మన పెరట్లో గోరింటాకే....రుబ్బి తీసుకొచ్చాను. అందరూ ఎంచక్కా రాత్రికి పెట్టుకోండి!" అంది.
"ఉష "అమ్మో! రాత్రికి క్యాంప్ నుండి మా ఆయనోస్తున్నాడు. నేనెలా పెట్టుకుంటానూ?" అంది.
సుమతికూడా సిగ్గుగా"ఈరోజు బుధవారంనాకూ వద్దు!" అంది. బుధవారంనాడు ఆమెకి వారం లేదు.
"అన్యూహకి రెండు చేతులకి, రెండు కాళ్ళకీ పెట్టండి" అని ఉఅష ఉచిత సలహా పారేసింది.
తర్వాత అమ్మమ్మ ఇచ్చిన మిఠాయిలతో, పండ్లతో వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోగానే పెద్ద గాలిదుమారంలా విజయ వచ్చేసి "గ్రానీ... హౌ ఆర్ యూ! నాకోసం ఏం తెచ్చావు?" అంటూ చుట్టేసుకుంది ఆవిడ్ని.
"అబ్బ! వదలవే తల్లీ! నీ కోసం తాడు చేయిస్తున్నాను. మంచి కుర్రాడ్ని చూసి నీ ముక్కుతాడు వేయించేస్తాను" అంది ఆవిడ
"యూ మీన్ పెళ్ళి!" అని విజయ పకపకా నవ్వి "చేసుకున్నవాళ్ళందరూ ఏం సుఖపడ్తున్నారులే అమ్మమ్మా!" అంది.
నేను దానివైపు బెదురుగా చూశాను.
అది పట్టించుకోకుండా "రోజూ బోలెడుమంది దంపతులని చూస్తున్నాను. పెళ్ళయిన నెలలోనో, రెండో నెలలోనో విదాకులని పరిగెత్తుకొస్తారు!
వాళ్ళు చెప్పే కారణాలు ఏవిటో చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు! ఇంకొక అమ్మాయికి భర్త మాట్లాడే భాష తన ప్రాంతంవాళ్ళు మాట్లాడేదిలా లేదుట!
ఒక జిల్లావాళ్ళకీ వేరే జిల్లావాళ్ళకీ ఆచారవ్యవహరాల్లో వుండే తేడా! ఒక శాఖకీ మరో శాఖకీ వుండే వింత పద్ధతులూ , వంటలలో వచ్చే మార్పూలూ, పెరిగిన వాతావరణానికి, అత్తవారింటికీ అలవాట్లలో వున్న భేదం, మగపిల్లలకి వ్యక్తిత్వం లేకపోవడం... ఆడపిల్లలకి ఆత్మగారవం అంటే తప్పుడు అభిప్రాయాలేర్పడడం....ఇంకా....
అల్లుళ్ళయ్యేసరికి ప్రధానమంత్రి పదవి వచ్చినట్లుగా ఊహించుకుని, నేలమీద నడవకుండా నేరుగా మామగారి తలమీదే పాదంమోపే మగాళ్లూ, పుట్టింట్లో అణిగిమణిగి పడున్నా, అత్తింట్లో ఆధిపత్యం అంతా నాకే కావాలనుకునే ఆడపిల్లలూ ..... చెప్పే కారణాలు ఒకటా? రెండా? ప్రతీదీ విడిపోవడానికి ఓ కారణంగానే చెప్తారు!" అని ఆగింది.
"అవ్వ! ఇంతోటి కారణాలకే విడిపోతారుటే?" అంటూ అమ్మమ్మ నావైపు తిరిగింది.
నేను యమ సీరియస్ గా చేతిలో వున్న బుక్ చదవడం మొదలుపెట్టాను.
విజయ నన్ను చూసి నవ్వుతూ "ఆహ! పంజాబీ డ్రెస్ వేసుకోమన్నాడనీ, ఇంగ్లీషు సినిమాలు చూడమన్నాడనీ , వంకాయకూర వండోద్దన్నాడనీ కూడా విడిపోయేవాళ్ళున్నారు!" అంది.
అమ్మమ్మకి ఒళ్ళు మండిపోయినట్లుంది. నాతో "విన్నావుటే పాపా!" అంది.
నేను "ఆఁ....ఆఁ..." పొడిపొడిగా అంటూ విజయ వైపు కొరకొరా చూశాను.
అమ్మమ్మ కోపంగా "మాయరోగాలు కాకపోతే! ఆ రోజుల్లో మాకులా ఉమ్మడి సంసారాల్లో పదిమంది మధ్యన పడి సంసారాలు చేస్తున్నారా? మొగుడి అడుగులకి మడుగులోత్తున్నారా? ముక్కుపచ్చలారని వయసులో ముడెట్టుకుంటున్నారా? మొగుడంటే పూర్తిగా అర్ధం కాకుండానే తల్లిగా మారుతున్నారా? అంతా ఈ ఇంగ్లీషు చదువులోచ్చి చేశాయి!
ఏ మాటకా మాటే! ఈ కట్నం చావులూ, ఆడపిల్లని అత్తవారింట్లో ఈ రకంగా వేధించడాలూ మా కాలంలో తక్కువే! ఏదో ముందుకోస్తున్నాం.... ముందుకోస్తున్నాం అంటూ మైకులు అరిగేలా అరవడం తప్ప.... ఏం సాదిస్తున్నారే వీళ్లంతా?" అంది.
గట్టిగా చప్పట్లు వినిపించి వెనక్కి తిరిగితే గుమ్మంలో వివేక్ నిలబడి కనిపించాడు.
విజయ వివేక్ తో - "టైమ్ కోచ్చావు.... రా! అమ్మమ్మ ఆడవాళ్ళని దుయ్యబడుతోంది.... కానీ చెప్పు ఇద్దర్లోనూ వుంటోంది. ఇద్దరూ నిన్నటివరకూ వేరువేరు పరిస్ధితుల్లో అలవాట్లలో పెరిగి, ఈ రోజు నుండీ ఓకే ఇంట్లో తమకంటూ ఓ పద్ధతి ఏర్పరుచుకుని బ్రతకడానికి కొంత సమయం పడుతుంది!
ఆ సమయం కూడా ఇవ్వకుండానే, ;నువ్వు నా కోసం నీ పద్దతులు మార్చుకో...లేకుంటే వెళ్ళిపో....' అనడానికి ఇదేమైనా చిన్నపిల్లల ఆటా? ఒక కొమ్మని తెచ్చి ఇంకొక చోట నాటితే అది ఆ వాతావరణానికి అలవాటుపడి వేళ్లూటంత సమయం కూడా ఒక మనిషికి కొత్త వాతావరణంలో ఇమడడానికి ఇవ్వకపోతే ఎలా?" అంది.


