అలికిడికి ఆదిలక్ష్మి కళ్ళు తెరిచింది. భర్తను చూసి లేచి నిల్చుంది.
'ఏమండీ!' ఆదిలక్ష్మి ఏడుపు గొంతు.
షణ్ముఖం కసిగా వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు.
మూసుకున్న తలుపుకేసి చూస్తూ నిట్టూర్పు విడిచింది.
* * *
"ఒరేయ్ పెదబాబూ! మీ నాన్నను లేపరా ఎనిమిది దాటింది. ఇంకా నిద్రేమిటి!" కొడుకుని పిల్చి అన్నది ఆదిలక్ష్మి.
ప్రసాదు తలుపు కొట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. తండ్రి పడుకునే నులకమంచం ప్రసాదు ముఖంలోకి బోసిగా చూసింది.
"అమ్మా? నాన్న కన్పడ్డంలేదు?" బిక్కమోహంతో అన్నాడు ప్రసాదు.
ఆదిలక్ష్మి మాటా పలుకూ లేకుండా కుప్పకూలిపోయింది.
'ఒరే నాయనా! ఏమైపోయావురా' తల్లి రాగాలు పెట్టసాగింది.
మధ్యాహ్నం పోలీసులు షణ్ముఖం ఇంటిని ముట్టడించారు. ఇల్లూ, దొడ్డి అంతా సోదా చేశారు. ఇంట్లో అడగాల్సిన ప్రశ్నలు అడిగి పోలీసులు వెళ్ళిపోయారు.
వీధి వాకిలి ముందు జనం చేరారు.
'మనిషి చూస్తే బుద్దిమంతుడిలా కన్పించేవాడు.'
'బాగా చదువుకున్నవాడు! ఇదేం పని'
"ఒకటా రెండా....ఇరవై వేలు...." తలా ఒక మాట అంటున్నారు.
ఆదిలక్ష్మి బిడ్డల్ని ఒళ్లో పడుకోబెట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ వుంది.
తల్లి మంగమ్మ గుండెలు బాదుకుంటూ భోరు భోరున ఏడుస్తో వుంది.
మూడోరోజు రాత్రి ఆదిలక్ష్మి అన్నయ్య రంగనాథం విజయవాడనుంచి వచ్చాడు.
'అన్నయ్యా!' అన్నను చుట్టుకొని ఆదిలక్ష్మి గుండెలు పగిలేలా రోదించింది.
"ఊరుకో అమ్మాయ్! ఏం చేస్తాం రేపు కృష్ణా ఎక్స్ ప్రెసుకు వెళ్దాం. సామాను సర్దు!" అన్నాడు రంగనాథం.
"నీ సంసారమే అంతంత మాత్రంగా వుందే ఇంతమందినీ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావ్ అన్నయ్యా?" ఏడుస్తూనే అన్నది.
"పోయినవాడు పోయినా__గుడ్డిలో మెల్లగా ఒక దారి చూపించి పోయాడులే. నీ బిడ్డలు చదువుకొని ప్రయోజకులు అయిందాకా సుఖంగా బతకొచ్చులే!" చెల్లెలు చెవి దగ్గిర చిన్నగా అన్నాడు రంగనాథం.
ఆదిలక్ష్మి వెర్రిదానిలా అన్నయ్య ముఖంలోకి చూసింది.
'ఊఁ త్వరగా సామాను సర్దుకో! మళ్ళీ చీకటితోనే లేవాలి.' అన్నాడు రంగనాథం.
(ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక దీపావళి స్పెషల్ 1975)


