పక్క దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చేత్తో తాకింది. మెత్తటి డన్ లాప్, బూరుగదూది తలగడలు- అబ్బ! ఎంత హాయిగా వుంటుంది దీనిమీద పడుకుంటే
స్టాండ్ కి ఎన్నో హంగర్లనిండా రకరకాల షర్టులు, ప్యాంట్సు వేలాడుతున్నాయి.
అబ్బ! ఎన్ని జతలు? సుబ్బారావు వెలిసిపోయిన రెండు టెర్లిన్ షర్టులు ఆ స్థానంలో కన్పించాయి. ప్చ్- దేనికన్నా పెట్టిపుట్టాలి. ఆ బట్టలు అన్నీ ఘుమఘుమలాడుతున్నాయి.
ఓ షర్టు చేత్తో పట్టుకుంది. ఎంత మెత్తగా జారిపోతూంది? మురారి చేయి పట్టుకున్న అనుభూతే కల్గింది ఆమెకి. గదంతా ప్రతిదీ కుతూహలంగా చూస్తుంది.
వీటన్నింటికి అధికారిణి కావల్సింది తాను! ఈ సుబ్బారావు కారణంగా ఆ అవకాశం జారిపోయింది.
"ఏమండోయ్ జ్యోతిగారూ! ఈపూటకి ముస్తాబు అవదా? కాఫీ చల్లారిపోతూంది, రండి" డ్రాయింగ్ రూములోంచే కేకపెట్టాడు.
జ్యోతి సిగ్గుపడి గబగబ బెడ్ రూములోంచి వెళ్ళింది.
'ఏమిటి, గదిలో కాసేపు నిద్రపోయారా? లేక నా పౌడర్ అంతా ఆఖరుచేసేశారా గదిలో కూర్చుని?' అన్నాడు మురారి చనువుగా నవ్వి.
జ్యోతి నవ్వింది సిగ్గుగా.
వంటవాడు బిస్కెట్లు, ఏపిల్ ముక్కలు, కాఫీ పెట్టాడు.
ఒక కప్పు జ్యోతికి అందించాడు మురారి. "బిస్కెట్సు తీసుకోండి" అన్నాడు.
జ్యోతికి ఆకలిదంచుతున్నా- బిస్కెట్లు, ఎపిల్సు సుష్టుగా తినాలని ఉన్నా, నాజూగ్గా కాఫీతో ఒక బిస్కెట్టు కొరికింది. కాఫీ పూర్తిచేసి ఒక ఆపిల్ ముక్క తీసుకుంది.
"అదేమిటి అన్నీ అలాగే వున్నాయి? తినండి" అన్నాడు మురారి.
"అబ్బ! వద్దండీ. హెవీగావుంది" అంది జ్యోతి స్టెయిలిష్ గా.
"ఈ రోజు మీ ధర్మానా అని మంచిపిక్చరు చూశాను. మీరు చెప్పకపోతే వచ్చినట్టే తెలిసేదికాదు. పిక్చరు బావుంది. విజయానంద్ బాగా చేశాడు. కథమాత్రం కాపీ. ఎ. జె. క్రానిక్ 'ది సిటడల్'కథ చివర్లో మాత్రం మార్చాడు. సినిమా చూస్తుంటే ఏదో చదివినది గుర్తువచ్చింది. ఇంటికిరాగానే చూశాను. ఇదిగో ఈ పుస్తకం తిరగేయగానే బోధపడిపోయింది. చదివి చూడండి మీకూ తెలుస్తుంది. ఇదిగో ఈ పుస్తకాలు తీసికెళ్ళండి. చాలా? అయ్యాక మళ్ళీ యిస్తాను" అన్నాడు మురారి.
కాఫీ తాగడం పూర్తయిన జ్యోతి లేచేప్రయత్నం చెయ్యలేదు. అతని సన్నిధినించి వదలాలనిపించడంలేదు ఆమెకి అతను ఏదన్నా చెప్తూంటే అలా అతన్ని చూస్తూ వినాలని వుంది.
మురారికి కాసేపు పడుకుంటే బాగుండునని వుంది. ఆమె లేవకుండా తను లేవడం బాగుండదని ఐదునిమిషాలు ఇవీ అవీ చెప్పి ఆఖరికి "పదండి, మిమ్మల్ని డ్రాప్ చేశాక నాకు కాస్త పనివుంది, ఒకర్ని కలుసుకోవాలి" అన్నాడు.
జ్యోతి బలవంతాన లేచింది. గుమ్మందగ్గిర ఒక్కక్షణం తచ్చాడింది. జ్యోతికి తలుపు తీసిపట్టుకొన్న అతను చటుక్కున దగ్గరికి వస్తాడేమోనన్నట్టు ఆశించింది.
ప్చ్ - మురారి పిరికివాడు అనుకుంది కినుకుగా కారెక్కుతూ. కనీసం కారులో వెడుతుండగా అయినా భుజంచుట్టూ చేయివేసి లాక్కోకూడదూ? పోనీ పట్టపగలు నడిరోడ్డు అనుకుంటే కనీసం చెయ్యి చేతిలోకి తీసుకోకూడదూ? ప్చ్ - ఈ మురారి వుత్త పిరికివాడులా వున్నాడు. ఆడదయినా తనకున్నపాటి చొరవలేదు. కారు ఇంటిముందు ఆగాక చాలా నిరుత్సాహంగా, నిరాశగా కారుదిగింది జ్యోతి.
"గుడ్ యీవెనింగ్! సుబ్బారావు వచ్చాక చెప్పండి వచ్చానని" అంటూ కారు ఆపకుండానే స్టార్టుచేసి వెళ్ళిపోయాడు మురారి.
కాళ్ళీడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది జ్యోతి.
* * * *
సుబ్బారావు ఆ మర్నాడు ఊరినించి వచ్చాడు.
జ్యోతి కనీసం మామగారికెలావుంది అనికూడా అడగలేదు.
నిన్నటినుంచి జ్యోతి మూడ్ మరీ పాడయిందేమో చాలా ముభావంగా పల్కరించనయినా పల్కరించలేదు.
సుబ్బారావే తండ్రికి హార్ట్ఎటాక్ వచ్చి కాసేపు బాధపడ్డాక తగ్గిందని, ఇప్పుడు బాగానే వుందనీ చెప్పాడు.
"ఊఁ హు" అంది ముభావంగ
"ఏం అలా వున్నావు?" అన్నాడు సుబ్బారావు, రాత్రంతా నిద్రలేక ఆలోచనలతో వాడిపోయిన మొహంచూసి.
"ఎలా వున్నాను? ఏం లేదు" అంది జ్యోతి నుదురు చిట్లించి.
ఆమె ఏం లేదన్నా, ఆమె ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నదనీ, దేని గురించో మాధనపడుతున్నదన్న సంగతి ఆమె మొహం స్పష్టంగా తెలియ చెపుతూంది.
సుబ్బారావు భోజనం చేస్తూ యధాలాపంగా "నిన్న ఆదివారం మురారిగాని వచ్చాడా?" అన్నాడు.
జ్యోతి ఒక్కక్షణం తడబడింది. చెప్పాలా, వద్దా అన్న సందిగ్ధతలో పడింది. తను చెప్పకపోయినా మురారి చెప్పచ్చు. "ఆ -వచ్చారు. మీగురించి అడిగారు. ఇవాళ ఊరికి వెడుతున్నారట. వచ్చాక వస్తానని చెప్పారు" అంది.
ఆ రాత్రి సుబ్బారావుని భరించడం ఎప్పటికంటె కష్టమైపోయింది జ్యోతికి. అతని స్పర్శకి ఆమె మనసు, శారీరం అన్నీ ఎదురు తిరిగాయి. జుగుప్స భరించలేక..... "ఇంక నావల్లకాదు, నావల్లకాదు" అనుకుంటూ సుబ్బారావు చేతిలో బిగుసుకున్నట్లుందిపోయింది.
"మురారీ! నన్ను రక్షించు - నన్నీ నరకంనించి తప్పించు...." ఆమె మనసులో దేముడ్ని ప్రార్థించుతున్నట్లు ఆవేదనగా మురారిని తలుచుకుంది.
* * * *
వారం తరువాత సుబ్బారావు ఆరోజు ఆఫీసునించి వచ్చాక కాఫీ తాగుతూ "మురారి ఫోను చేశాడు ఆఫీసులో వుండగా...." అన్నాడు జ్యోతివంక చూసి.


