సడన్ గా ఫోన్ కట్ అయింది.
కొద్దినిమిషాలసేపు, అనాలోచితంగా అయిపోయింది సూర్యవంశీ బ్రెయిన్.
కోపంగా పిడికిలి బిగించాడతను.
"ఇంకో ఇరవైనాలుగు గంటలు టైమ్... ఇంకో ఇరవైనాలుగు గంటలు టైమ్..." ఎనిమీ హెచ్చరిక అలారమ్ లా సూర్యవంశీ బ్రెయిన్ లో తిరుగుతోంది-
ఏం జరుగుతోంది.... ఏం జరుగుతోంది.
నిరంజనరావుని ఏదైనా కుట్రలో ఇరికిస్తున్నారా.....
ఆ ఆలోచనకి గజగజా వణికిపోయాడు సూర్యవంశీ.
మరే మాత్రం ఆలస్యం చెయ్యలేదు.....
పెనువేగంతో పరుగెత్తి, హీరోహోండా కిక్ కొట్టాడు-మరో రెండు క్షణాల్లో హీరో హోండా మెయిన్ రోడ్ మీద అరవై కిలోమీటర్ల వేగంతో పరుగెడుతోంది.
రిస్ట్ వాచీలో టైమ్ 3-55 నిమిషాలు చూపెడుతోంది....
తను నిరంజనరావుని కలవగలడా...?
నిరంజనరావుకు ఏదో విపత్తు జరగబోతోంది.... ఎప్పుడు.... ఎక్కడ.... ఎలా...
ఆ ప్రశ్నలకు జవాబు సూర్యవంశీ దగ్గర లేదు.
* * * * *
రైల్వేస్టేషన్ లోని పబ్లిక్ టెలీఫోన్ బూత్ దగ్గర్నించి, చివరిసారిగా సూర్యవంశీ కోసం వార్త ఆఫీసుకి ట్రైచేసి, విసుగ్గా బూత్ లోంచి బైటకొచ్చి తన కంపార్ట్ మెంట్ వేపు అడుగులు వేసాడు ఎ.సి.పి. నిరంజనరావు.
"హైద్రాబాద్ సే విశాఖపట్నం జానేవాలే గోదావరీ ఎక్స్ ప్రెస్...." స్పీకర్లోంచి మొదటి ప్రకటన వెలువడడం, ఇంజను హోరుమని విజిల్ వెయ్యడం....రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ గా మారడం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి....
గ్రీన్ సిగ్నల్.... ఎల్లో సిగ్నల్ గా మారుతున్న సమయంలో-
ఫస్టు క్లాస్ ఎ.సి. కోచ్ లోకి అడుగుపెట్టాడు నిరంజనరావు.
అతని చూపులు... ఆఖరుసారిగా ప్లాట్ ఫారాన్ని కలియజూసాయి...
ఎక్కడా ఫ్లాట్ ఫారమ్మీద సూర్యవంశీ జాడలేదు...
రెండే రెండు క్షణాలు....
ట్రైన్ కదలడం మొదలైంది...
సరిగ్గా అదే సమయంలో, అంతవరకూ సిగరెట్ షాపు దగ్గర, సిగరెట్ కాల్చుకుని తీరుబడిగా నిలబడిన వ్యక్తి, సిగరెట్ బట్ ని పక్కన పడేసి బూటు కాలితో తొక్కి-
ఎ.సి.కోచ్ వేపు పరుగెత్తి, ఐరన్ రాడ్ పట్టుకుని, ఫుట్ బోర్డ్ మీద కాలువేసి, లోనికి అడుగుపెట్టాడు.
బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్.... స్కై బ్లూ సూటు... కంపెనీ ఎగ్జిక్యూటివ్ లా ఉన్నాడతను...
లోనికి అడుగుపెడుతూ వాషింగ్ బేసిన్ దగ్గర మిర్రర్ లో తన ముఖాన్ని ఒకసారి చూసుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో-
అతని నోట్లోని పై పళ్ళ మధ్య నున్న స్టీల్ రాడ్ తళుక్కుమని మెరిసింది-
ట్రైన్ వేగం పెరిగింది.....
మూడు నిమిషాల్లో ట్రైన్ ప్లాట్ ఫారాన్ని వదిలి వెళ్ళిపోయింది.
సరిగ్గా-
అప్పుడే చెమటలు కక్కుతూ స్టేషన్లోకి పరుగెత్తుకుని వచ్చాడు సూర్యవంశీ.
నాలుగో నెంబర్ ఫ్లాట్ ఫారం బోసిగా కనిపించడంతో వెలవెల బోయింది సూర్యవంశీ ముఖం.
మాటలు రానివాడిలా అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు సూర్యవంశీ.
* * * * *
సరిగ్గా 24 గంటల తర్వాత-
రాళ్ళు, గుట్టలతో నిండి ఉందా ప్రాంతం మధ్యలోంచి సాగిన ఎగుడు, దిగుడు రోడ్డు-అక్కడక్కడ వెలుగుతున్న వీధిలైట్ల కాంతి మసక మసకగా ఉంది.
దూరంగా సముద్ర తరంగాల శబ్దం, ఎవరో రోధిస్తున్నట్టుగా ఉంది. సముద్రానికి కుడివేపున్న మువ్వలవానిపాలేనికి కొంచెం దూరంలో విసిరేసినట్టుగా ఉన్న కొత్తగా కడుతున్న బిల్డింగుల్లో, ఓ బిల్డింగు నిశ్శబ్దంగా ఉంది.
ఆ బిల్డింగుకి కొంచెం దూరంలోనున్న రోడ్డు మలుపు దగ్గరికి వచ్చింది పాత అంబాసిడర్ కారు ఒకటి.
ఆ కారు విండో లోంచి దూరంగా కన్పిస్తున్న ఆ ఇంటి వేపు చూసాడు ఆ కార్లో స్టీరింగు ముందు కూర్చున్న ఆ వ్యక్తి.
కారు మలుపు తిరిగి, ఆ బిల్డింగుకి ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఓ చెట్టుకింద ఆగింది.
కారులోంచి అతను బయటకు దిగి, చేతి వాచీ వేపు చూసుకున్నాడు.
మెరుస్తున్న రేడియం ముల్లులు 10-15 నిమిషాల టైమ్ ని చూపిస్తూన్నాయి.
* * * * *
సరిగ్గా 10-15 నిమిషాలైంది.
"గుడ్ నైట్ బేబీ...." వీడియో సినిమా చూస్తున్న ఇరవై ఏళ్ళ అర్పణ తలతిప్పి, నవ్వుతూ చూసింది డోర్ వేపు.
డోర్ దగ్గర అటు ఇటూ ద్వారబందమ్మీద చేతులేసి, నిలబడున్నాడు ఎ.సి.పి నిరంజనరావు.
"రేపు డ్యూటీలో జాయిన్ అవుతున్నారా డాడీ...." అడిగింది అర్పణ.
"ఎస్. బేబీ.... మార్నింగ్ నువ్వు లేచేసరికే నేను వెళ్ళిపోతాను.... మధ్యాహ్నం..... మీ కాలేజీకొచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాను... సరేనా?" ప్రేమగా కూతురి వేపు చూస్తూ అన్నాడు నిరంజనరావు.
"నాకు రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి.... ఎర్లీగా వెళ్ళాలి" చెప్పింది అర్పణ.
కూతురి వేపు ఒకసారి ప్రేమగా చూసి, టీపాయ్ మీదున్న ఇంగ్లీష్ మేగజైన్ ని తీసుకుని, తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు నిరంజనరావు.
కొన్ని నిమిషాల తర్వాత, వి.సి.పి.ని, టీ.వి.ని ఆఫ్ చేసి, టీపాయ్ వేపు చూసింది అర్పణ.
పాలగ్లాసు కన్పించలేదు. బెడ్ మీదకు వెళ్ళే ముందు ప్రతి రాత్రి పాలు తాగడం అర్పణకు అలవాటు.
వంట మనిషి ఎందుకు పెట్టలేదో అర్ధం కాలేదు. మేడమెట్లు దిగి కిచెన్ వేపు నడిచింది.
కిచెన్ రూమ్ గడియ పెట్టిఉంది-కిచెన్ రూమ్ పక్కనున్న బేక్ డోర్ వారగావేసి ఉంది. అంటే... వంట మనిషి అవుట్ హౌస్ కెళ్ళిందా?
బేక్ డోర్ లోంచి బయటికొచ్చి, పదడుగుల దూరంలో, బౌండ్రీ వాల్ పక్కనున్న అవుట్ హౌస్ వేపు చూసింది.


