ఆ రోజూ... మనం జైల్లో నుంచీ తప్పించుకు పారిపోయాం! ఆ రోజు అప్పటినుంచీ ఇక్కడే వున్నాను."
ఆ రోజు ఇంకా కళ్ళకి కట్టినట్లు గుర్తుంది సత్యనారాయణ సింగ్ కి. తాము జైల్లోనుంచీ పారిపోవడం....వెనకనుంచి తుపాకి కాల్పులు.....తామిద్దరూ చెరోదోవా అయిపోవడం.
అప్పటినుంచీ ఇక్కడే వుండిపోయాడా తన మిత్రుడు.
నమ్మలేనట్లు చూస్తూ అన్నాడు సింగ్.
"నువ్వు తుపాకిగుండు చనిపోయివుంటావనో, సముద్రంలో మునిగిపోయి వుంటాననీ అనుకున్నాను సీతాపతీ! పోలీసుల హడావిడి తగ్గిన తర్వాత మళ్ళీ వెనక్కి ఈదుకుంటూ వచ్చి నీ కోసం చాలా వెదికాను. చివరికి నువ్వు సముద్రంలో మునిగిపోయి వుంటావని రూఢి చేసుకున్నాను."
దగ్గరగా వెళ్ళి అభిమానంగా సింగ్ భుజాలు పట్టుకున్నాడు సీతాపతి.
"అయితే ఈ మరణాయుధాలు ఇక్కడ ఉన్నట్లు నీక్కూడా తెలుసన్నమాట! అప్పుడప్పుడు తెల్లతోళ్ళు కొందరు వచ్చి ఇక్కడ ఆయుధాలు దించడం, ఈ గుహలలో దాచడం చాటునుంచీ నేను గమనిస్తూనే వున్నాను, సత్యం! ఎన్నోసార్లు అనుకున్నాను. నాటుబాంబు దొరికితేనే దాన్ని తెల్లదొరలమీద వేసిన ఘనుడివి నువ్వు ఇన్ని ఆయుధాలు నీ చేతపడితే బ్రిటిష్ సామ్రాజ్యానే గడగడలాడించే వాడివికదా అని. భేష్ భేష్ మొత్తానికి నువ్వు కూడా ఈ ఆయుధాల రహస్యం కనుక్కున్నావన్నమాట. నేను ఇంకో గొప్ప విశేషం కూడా కనిపెట్టాను సత్యం!" ఉప్పొంగి పోతున్నాడు ఆయన.
"ఏమిటది?" అన్నాడు సింగ్. అతని మొహం పాలిపోయి వుంది.
అతనివైపు సంతోషంగా చూస్తూ చెప్పడం మొదలెట్టాడు సీతాపతి.
"దేశభక్తి ప్రసక్తి వస్తే నిన్ను చెప్పి మరొకరి పేరు చెప్పాలి సత్యం!"
" 'నా దేశం కోసమే నా దేహం!' అని ఎలుగెత్తి అరిచినవాడివి నువ్వు. నీ సహచర్యంలో నేనూ కొన్ని మంచి పనులు చెయ్యడం నేర్చుకున్నాను నిత్యం! దేశం కోసం ఒక నిధిని కనిపెట్టాను. ఈ ద్వీపంలో."
"నిధా?"
అవును, నూటపాతిక సంవత్సరాల క్రితం రంగరాజు అనే వీరుడు దేశం కోసం దాచిన బంగారాన్ని నేను బయటకు తీశాను సత్యం! ఇప్పటి దాకా ఈ కుర్రాడితో అదే చెబుతున్నాను ఈ పెన్నిధి అంతా మా సత్యానికి అప్పగిస్తే అతను దెబ్బతో దేశాన్ని దాస్యంలో నుంచీ తప్పించగలడు కదా అని" అని హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు ఆగాడు ఆయన.
"నీకు ఈ సంగతి తెలుసా సత్యం! మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందిట. ఈ కుర్రాడు చెప్పేదాకా నాకు తెలియనే తెలియదు."
ఆయన కళ్ళవెంబడి ఆనందబాష్పాలు కారిపోతున్నాయి.
సింగ్ కళ్ళలో కూడా నీళ్ళు నిలిచాయి.
"తెలుసు సీతాపతి."
"ఎలా తెలుసు?" అని మళ్ళీ ఆగిపోయాడు సీతాపతి.
"నువ్వు కూడా ఇన్ని రోజులూ నాలాగే అడవుల్లో ఉన్నావా సత్యం? లేకపోతే మెయిన్ లాండు చేరుకున్నావా?"
"నలభై ఏళ్ళ క్రితమే మెయిన్ లాండు చేరుకున్నాను సీతాపతీ."
సీతాపతి మొహంలో అనుమానం తొంగి చూసింది.
"మరి ఈ ఆయుధాల సంగతి నీకెలా తెలుసు?"
సింగు కళ్ళలో నుంచీ నీళ్ళు జల జలా రాలాయి. ఆపాద మస్తకం కంపిస్తున్నాడు తను వయసు వందేళ్ళు మీద పడినట్లు కృంగిపోయాడు. వెన్నెముక విరిగిపోయినట్లు బలహీనంగా జారి సీతాపతి కాళ్ళ దగ్గర కూలబడి పోయాడు.
"నన్ను క్షమించు సీతాపతీ!" అన్నాడు వెక్కుతూ.
తెల్లబోయాడు సీతాపతి "నేను నిన్ను క్షమించడమేమిటి సత్యం! నువ్వు మహాత్యుడి లాంటి వాడివి."
"మహాత్ముడితో నన్ను పోల్చి ఆయన్ని అవమానపరచకు సీతాపతీ, నేను మహాత్ముడిని కాను, మహా పాపాత్ముడిని నిజంగానే. 'నా దేశం కోసమే నా దేహం' అని ఎలుగిత్తి అరిచిన ఈ సత్యమే, దేహాన్ని సుఖ పెట్టడం కోసం దేహాన్ని తాకట్టు పెట్టేయ్యాలని తాపత్రయపడ్డాడు సీతాపతీ! నమ్మిన వాళ్ళని పరాయిదేశాలకి అమ్మాలని చూసిన ద్రోహిని నేను సీతాపతీ."
"సీతాపతి పాదాలని పట్టుకుని విలపించడం మొదలెట్టాడు అతను.
సింగ్ చెబుతున్నదేదీ తనకు అంతుబట్టనట్లు చూస్తూ నిలబడి పోయాడు సీతాపతి "అసలేం జరిగింది సత్యం?" అన్నాడు చాలాసేపటి తరువాత, నెమ్మదిగా ఏం జవాబు వినవలసివస్తుందో అన్న భయం ఆయన మొహంలో ప్రస్ఫుటంగా కనబడుతోంది.
చిన్న పిల్లాడిలా నేలమీద పడి రోదిస్తున్నాడు సింగ్. భ్రమలో వుండి, దేశం కోసం ఇంకా అడవుల్లోనే వుంటూ, లేని శత్రువులని తప్పించుకు తిరుగుతూ, వచ్చేసిన స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిపే ప్రయత్నాలలో నిండు జీవితాన్ని వృధా చేసుకున్న మిత్రుడిని చూస్తూ వుంటే, పాలు తాగిన రొమ్మునే గుద్దినట్లున్న తన ప్రవర్తన గుర్తొచ్చి దుఃఖం ఆగడంలేదు అతనికి. నోట మాట రావడంలేదు.
అతను మాట్లాడే స్థితిలో లేడని గమనించాడు సాగర్. "జరిగిందేమిటో నేను చెబుతాను" అన్నాడు నెమ్మదిగా.
అనూహ్య అతనివైపు ఆశ్చర్యంగా చూసింది. మంచు పిడుగు లాంటి వాడితను. తొణక్కుండా బెణక్కుండానే ఇన్ని విషయాలు ఎప్పుడు తెలుసుకున్నాడు!
ఆమె ఆశ్చర్యనుంచీ తేరుకోకముందే, సాగర్ చెప్పడం మొదతెట్టాడు.
"ఒకప్పుడు స్వతంత్రం కోసం అలమటించి పోయారు ప్రజలు. ఒకసారి స్వతంత్రం వచ్చాక ఇక దాని విలువ అర్థం కాకుండా పోయింది జనానికి గడిచిన గడ్డురోజులు మరిచిపోయారు అందరూ ఎవడు ఎంత ఎక్కువగా దేశాన్ని దోచుకోగలిగితే అంత గొప్ప అనుకునే దరిద్రపు రోజులు దాపురించాయి. సీతాపతిగారిలా దేశం దేశం అంటూ కలవరించే వాళ్ళ చేతికి చిప్పే గతి అవుతోంది. రాజకీయాలు డబ్బున్నవాళ్ళ రాస క్రీడలుగా మారిపోయాయి.
అందుకని దేశంకోసం పాటుపడిన సత్యనారాయణ సింగ్ లాంటి వాళ్ళు కొందరు కూడా పరిస్థితులతో రాజీపడడం తిప్పనిసరి అయిపోయింది.
సింగ్ కూడా తనంతట తాను మారిపోయి ఉండేవాడు కాదు. ఆయన మీద తన దుష్ట ప్రభావం చూసి ఆయన్ని చెడువైపు మళ్ళించిన వ్యక్తి స్వరూపరాణి."
తల దించుకున్నాడు సింగ్.
సాగర్ చెబుతానే వున్నాడు.
"తెగిన గాలిపటంలా చిన్నతనంనుంచీ ఎన్నో దేశాలు తిరిగిన మనిషి స్వరూప. ఆ తిరుగుడులో ఆమెకు కొన్ని దేశాల గూఢచారి ముఠాలతో పరిచయం కలిగింది. వాళ్ళు ఆమె అందచందాలనీ, తెలివితేటలనీ ఎరగా పెట్టి రహస్య సమాచారం సేకరిస్తూ వుండేవారు.
రత్నగర్భ అయిన భారతదేశం మీద పరాయి దేశస్థుల కన్నుపడుతూ ఉండడం చరిత్రకి అందని కాలం నుంచీ జరుగుతూ ఉన్నదే.
అండమాన్స్ లో ఉన్న ఈ నిర్జన ద్వీపంలో ఆయుధాలు పేర్చిదీన్ని బేస్ గా చేసుకుని, ఇక్కడనుంచీ ఆకస్మాత్తుగా ఇండియా మీద దాడి చెయ్యాలని చూస్తోంది. మిత్ర వచనాలు వల్లిస్తూ, శతృకలాపాలు సాగించే దేశమొకటి.
షిప్పింగ్ బెజినెస్ లో ఉన్న సింగ్ ద్వారా సులువుగా ఈ పని సాధించదలుచుకున్నారు వాళ్లు. స్వరూప వాళ్ళ కిరాయి మనిషి. సింగ్ తో ఆమె పెళ్ళి ఉత్త నాటకం! పని సాధించటం కోసం పన్నినవల అంతే!
వయసు మళ్ళిన సింగ్ గారు ఆ వలలో తలకిందులుగా పడిపోయారు. పడుచు పెళ్ళాం మోజులో నిలువునా కూరుకుపోయారు. ఆమె ఆడించినట్లల్లా ఆడి, విదేశీ ఏజెంటుగా మారారు."
అతను మాట్లాడుతున్న ఒక్కొక్క మాటా ఒక్కొక్క ఈటెలా తన మనసులో గుచ్చుకుంటూ వుండగా, తల నేల కేసి బాదుకుంటూ రోదిస్తున్నాడు సింగ్.
చెబుతూనే వున్నాడు సాగర్.
"విదేశీ ఆయుధాలని ఎవరికీ అనుమానం కలగకుండా బోట్లలో ఇక్కడికి చేరవేస్తోంది సింగ్ గారి షిప్పింగ్ కంపెనీ.
లేటస్ట్ గా ఆయనకి అప్పగించబడిన డ్యూటీ శక్తివంతమైన ట్రాన్స్ మీటర్ ని మరొకదాన్ని తెచ్చి ఇక్కడ సెటప్ చెయ్యడం.
ఆ ట్రాన్స్ మీటర్ ని సింగ్ గారి కేబిన్ కింద అమర్చారు వాళ్లు. ప్రయాణానికి ముందు కేబిన్ ని రీమోడల్ చేయిస్తున్నాను విషయాలని. వాళ్లు అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి మరో ట్రాన్స్ మీటర్ ఇక్కడ చేరి వుండేది. శత్రువుల కార్యకలాపాలు మరింత ఉధృతమయ్యేవి."
తన చెవులని తనే నమ్మలేనట్లు నిశ్చేష్టుడై చూస్తున్నాడు సీతాపతి.
"సత్యం.....నువ్వా....నువ్వు.....చేశావా ఈ పనులు?"
అవమాన భారంలో కుచించుకుపోతున్న సింగ్ హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చి, చటుక్కున రివాల్వర్ అందుకున్నాడు.
బారెల్ ని తన కణతలకి ఆనించి ట్రిగ్గర్ నొక్కాడు.
ఆ లోపలే మెరుపులా అతన్ని చేరుకున్నాడు సాగర్. అతని కణతలకు గురిపెట్టి ఉన్న రివాల్వర్ ని బలంగా లాగేశాడు.
పెద్ద శబ్దంతో రివాల్వర్ పేలింది. బుల్లెట్ వచ్చి సాగర్ భుజంలో దిగబడిపోయింది.
"సాగర్!" అని కేక పెట్టింది అనూహ్య విహ్వలంగా.
తనకు తగిలిన గాయాల్ని లెక్క చేయకుండా సింగ్ ని బలంగా పట్టేసుకున్నాడు సాగర్. "మీరు చేసిన నేరం ఎలాంటిది అయినా సరే, దానికి మీకు మీరే శిక్ష విధించుకునే హక్కులేదు. దాన్ని చట్టమే నిర్ణయించాలి" అన్నాడు.
తల వంచుకున్నాడు సింగ్.
బుల్లెట్ సాగర్ భుజంలో నిప్పుకణికెలా బాధపెడుతోంది.
దాన్ని వెంటనే బయటికి తియ్యకపోతే ప్రమాదమని తెలుసు సాగర్ కి.
"నువ్వు అటు తిరిగి కళ్లు మూసుకో" అన్నాడు అనూహ్యతో.
"ఎందుకు?" అంది సందేహంగా.
"ఏం కాదు. వెనక్కి తిరుగు.
తిరిగి నిలబడింది అనూహ్య.
వంగి, ఒక తుపాకికి ముందు అమర్చి ఉన్న బాయొనెట్ అనే చిన్న కత్తిని తీశాడు సాగర్. పళ్ళు బిగపట్టి, బాధని సహిస్తూ భుజంలో గుచ్చుకున్న బుల్లెట్ తియ్యడం మొదలెట్టాడు.
వెనక్కి తిరిగి నిలుచున్నా అతను చేస్తున్నదేమిటో అర్ధమవుతోంది అనూహ్యకి పెదిమలు కొరికిపట్టి దుఃఖాన్ని ఆపుకుంటోంది ఆమె.
ఎముకదాకా వెళ్ళిపోయింది బుల్లెట్.
పదునయిన కత్తిమొన చర్మాన్నీ కండని చీలుస్తూ, ఎముకకి తగులుతూ, బుల్లెట్ ని బయటికి తేవడానికి ప్రయత్నిస్తోంది. సహింపనలవికాని బాధ కలుగుతోంది సాగర్ కి.
అయినా భరిస్తున్నాడు అతను.
ఉన్నట్లుండి బయటకు వచ్చేసి, కింద పడిపోయింది బుల్లెట్.
అది నేలమీద పడిన శబ్దం వినగానే చివుక్కున వెను తిరిగింది అనూహ్య. వెంటనే కసిగా ఆ బుల్లెట్ ని కాలితో తన్నింది. ఒక్క అంగలో సాగర్ దగ్గరికి వచ్చి, అతని భుజాన్నించి కారుతున్న రక్తాన్ని తన చేతులతో ఆపాలని వ్యర్థ ప్రయత్నం చేసింది.


