Home » Yandamuri veerendranath » మరణ మృదంగం


    ఏదో అపాయసూచన.

    ఇన్ స్పెక్టర్ ఇంకా లోపల్నుంచి రాలేదు.

    ఆమె లేచింది. లోపలికి తొంగిచూసింది. ధైర్యంచేసి లోపలికి వెళ్ళింది. ఆ గది ఖాళీగా వుంది. మరింత లోపలికి వెళ్ళింది.

    లోపల చిన్నగది. దానిగోడకి అనుకుని అటువైపు తిరిగి చిన్న స్వరంతో మాట్లాడుతున్నాడు ఇన్ స్పెక్టర్.

    'అవును..... మరి కొంచెంసేపు ఆపుతాను. జీపు వేసుకుని వచ్చెయ్యండి..... అమ్మో, చాలా తెలుసు ఆమెకి-'

    రన్.

    రన్.

    రన్ ఉత్పలా రన్.

    వేటగాళ్ళుచేసే  చప్పుళ్ళకి నాలుగుకాళ్ళూ రివ్వునచాచి పరుగెత్తే జింకలా ఆమె అక్కణ్ణుంచి పరుగెత్తింది. గుండె చప్పుడే మృదంగ నాదమవ్వగా, శరీరం వీణ తీవెలా కంపిస్తూ వుండగా ఆమె గాలితో పోటీపడింది. నుదురు గంగాతీరమైంది.

    ఆ పోలీస్ స్టేషన్ లాకప్ లోనే అనూష అరెస్ట్ కాబడి వున్నదని ఆమెకి తెలీదు.


                                                          17

    రామబ్రహ్మం గాఢ నిద్రలో వున్నాడు. అతడి రూము ఇంటికి ముందు భాగంలో వుంది. పనిలేని చాలామందిలాగే అతడు జీవితంలో చాలా భాగం నిద్రలో వుండటాన్ని ప్రేమించటం నేర్చుకున్నాడు. అందరు నిరుద్యోగుల్లాగే 'ఐ యామ్ ఓ.కే యు ఆర్ నాట్ ఓ.కే ' స్టేజిలో వుండి, ఇంటి వారికి మానసికంగా దూరంగా ముందున్న గదిని తన నివాసం చేసుకుని, అందులోనే ఎక్కువకాలం ఒంటరిగా గడుపుతున్నాడు. తెలతెలవారుతూ వుండగా వినిపించిన తలుపు చప్పుడుకి నిద్రలేచి బద్ధకంగా వళ్ళు విరుచుకుని వెళ్ళి తలుపు తీశాడు.

    ఎదురుగా ఉత్పల!

    అతడు ఆశ్చర్యంతో అడుగు వెనక్కివేసాడు. తన గదికి ఆ అమ్మాయి ఎప్పుడూ రానిది..... అందులోనూ అంత ప్రొద్దున్నే.....

    అతడు ఆశ్చర్యంలో వుండగానే ఆమె లోపలికి వచ్చింది.

    "రామం. నేను ప్రమాదంలో వున్నాను".

    "ప్రమాదమా? ఏమిటది?

    "అవన్నీ చెప్పి నిన్నుకూడా ప్రమాదంలోకి లాగటం నాకిష్టంలేదు. నేనిక్కణ్ణుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎంత తొందరగా ఆ పని జరిగితే అంతమంచిది".

    "అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటంలేదు. ఏమైనా చేసావా?" అతడి కళ్ళలో అదోలాటి అనుమానం కదలాడింది. ఆమె స్టన్ అయింది. అంత తొందరగా అతడానిర్ణయానికి వస్తాడని ఆమె వూహించలేదు. అతడికి కలిగిన అనుమానం తనలో కలిగిస్తూన్న అసహ్యాన్ని నొక్కి పెడుతూ, ప్రాధేయపడుతున్నట్టుగా, "రామం. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియటానికి వీల్లేదు. నా ప్రాణాలు చాలా ప్రమాదంలో వున్నాయి. ఏదైనా చేసి, కొంత కాలంపాటు నాకెక్కడైనా నెలవు చూపించు. దూరంగా వెళ్ళిపోవాలి నేను! ఎవరికీ తెలియకూడదు" అంది.

    "అసలేం జరిగిందో చెప్పకుండా ఏమిటిదంతా" అన్నాడతడు విసుగ్గా.

    "వద్దు రామం! ఇది తెలుస్తే నీకూ ప్రమాదమే! అందుకే మా ఇంట్లో వారికి కూడా ఇది చెప్పకుండానే వచ్చేసాను. ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా ఏమీ చెప్పలేను. నన్ను క్షమించు. నాకు బయట ప్రపంచం ఏమీ తెలియదు. ప్లీజ్! నన్ను కొన్నిరోజులపాటు ఎక్కడైనా దాచే ప్రయత్నం చెయ్యి. కావాలంటే ఎవరింట్లోనైనా అంట్లు తోమమన్నా తోముతాను. కానీ నేను మాత్రం వెళ్ళిపోవాలి...... దూరంగా వెళ్ళిపోవాలి..."

    "నేను మాత్రం ఎక్కడికి పంపగలను? నాకెవరు తెలుసు?"

    తన బాధనీ భావాన్నీ అర్థం చేసుకోకుండా అంత తేలిగ్గా అతడామాట అనేయటం చూసి ఆమె మనసు చివ్వుక్కుమంది. అనూష మాటలతోనే సగం విరిగి పోయిన మనసు అతడి ప్రవర్తనని అద్దంలా ఇప్పుడు చూపసాగింది. ఎటూ దారితోచని పరిస్థితుల్లో ఆఖరి ప్రయత్నంగా అతడిని ఆశ్రయిద్డామనుకుంది. ఎంత కాదనుకున్నా తాము స్నేహితుల్లా ఎన్నో మాట్లాడుకున్నారు. ఒకప్పుడు ఆ కళ్ళలో కనపడిన ఆరాధనాభావం ఇప్పుడు సమస్య ఎదురయ్యేసరికి, పరిస్థితిని దాటవెయ్యాలనే భావంలోకి మారింది. ఆమెకి అనూష మాటలు గుర్తొచ్చాయి..... చాలామంది మనుషులు, ముఖ్యంగా మొగవాళ్ళలా కనిపించే చాలామంది పెళుసులు..... సమస్య ఎదురయ్యేసరికి జావకారి పోతారు. ప్రేమికులు అందరూ ఒకరి కష్టాల్లో ఒకరు  పాలుపంచుకోరు. అయినా ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవటానికి వాళ్ళు ప్రేమికులే కానవసరం లేదు.

    అంత విపత్కర పరిస్థితిలోనూ ఆమెకి నవ్వొచ్చింది. ఇతడినా తను ప్రేమించాననుకుంది?... ఊహలు పూరేకుల్లా విడిపోయి చేదువాస్తవం అగ్నిగోళంలా మండుతూ కనిపించింది. "వెళ్ళొస్తాను రామం" అంది తలుపు దగ్గిర ఉద్యిక్తురాలవుతూ.

    "ఏమైంది ఉత్పలా? నాకు చెప్పవూ?"

    చెపుతాను రామం. కానీ ఈ విషయం నీకు తెలిసిందన్నవార్త వాళ్ళు గ్రహించిన మరుక్షణం, నీకెంత తెలిసిందో వాళ్ళు తెలుసుకోవటానికీ, ఒక్కొక్క రహస్యం నీ నుంచి బయట పెట్టిందటానికీ ఒక్కొక్క చోట నీ చర్మం వలుస్తారు. అందుకే ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియటానికి వీల్లేదన్నాను. వాళ్ళు  ఎంత శక్తివంతులంటే, ఈ పాటికే నేను ఇక్కడకు వచ్చిన వార్త వాళ్ళకి చేరివుంటుంది. ఇంకో గంటలో వచ్చి నిన్ను చుట్టుముడతారు. చెప్పు! నీకు ధైర్యం వుందా నన్ను రక్షించడానికి......?"

    అంత సూటిగా ఆమె అడిగేసరికి అతడు నిరుత్తురడయ్యాడు. "వాళ్ళెవరు?" అన్నాడు. అతడి గొంతు హీనంగా ధ్వనించింది.

    "దేశమంతా విస్తరించి వున్న ఒక గ్యాంగు".

    "వాళ్ళ వలల్లో నువ్వు ఎలా చిక్కుకున్నావు?"

    "అవన్నీ చెప్పటానికి టైమ్ లేదు".

    "చెప్పకపోతే ఎలా? ఏదో చేసే వుంటావు. ఏం చేసావ్?" విసుగ్గా అన్నాడు. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. సూటిగా  అతడివైపు చూసింది. నెమ్మదిగా "వెళ్ళొస్తాను రామం. బహుశ మనం మరెప్పటికీ కలుసుకోకపోవచ్చు" అంది, ఇక అక్కడేమీ చెయ్యటానికి లేనట్టు.

    "ఎక్కడికి వెళ్తావు ఉత్పలా?"

    "తెలీదు. నీ కర్చీఫ్ ఇస్తావా రామం?"

    "ఎందుకు? జ్ఞాపకార్థమా?"

    "లేదు. కట్టుబట్టల్తో బయటపడ్డాను..... చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. దార్లో కన్నీళ్ళు తుడుచుకోవటానికి".

   
                                                   *    *    *


    ఆ రాత్రి ఆ నగరపు మాఫియా గాంగ్ ఏదీ నిద్రపోలేదు.

    I.G.I ల ద్వారా (ఇంటర్ గ్రూప్ ఇన్ఫార్మెంట్స్) గణేష్ దలపు కొన్ని రహస్యాలు ఒకమ్మాయికి తెలిసాయనీ, ఆ అమ్మాయి ఇంకా బ్రతికే వుందన్న వార్త కొన్ని గ్రూపులకి అందింది. తమలో తమకి ఎన్ని గొడవలున్నా పోలీసుల్ని ఎదుర్కోవలసి వచ్చేసరికి ఈ దళాలన్నీ ఒకటవుతాయి.

    ఆ రోజు ప్రొద్దున్న ఏడింటికి సలీంశంకర్ అనుచరుడు రామూ ఆస్పత్రికి వెళ్ళి, ఉత్పల ఉద్యోగం కోసం పెట్టిన అప్లికేషన్ లో వున్న ఫోటోని సంపాదించాడు. ఆ ఫోటో కాపీలతో వేట ప్రారంభమయింది.

    విశ్వేశ్వరశాస్త్రికిగానీ, ఆ కుటుంబానికి గానీ ఉత్పల సంగతి ఏమైందీ తెలియదని రూఢీ అయింది. వాళ్ళు ఆ అమ్మాయికోసం నిజంగానే కంగారు పడుతున్నారని నమ్మకం కుదిరాక వాళ్లని వదిలిపెట్టాడు సలీంశంకర్. ఉత్పల అదొకటి మంచిపని చేసింది. ఆమె ఏ మాత్రం హింట్ ఇచ్చినా, ఆ సంగతి చిత్రవధ చేసైనా బయటపడేలా చేసి వుండేవాడు. అవతలి మనిషి నిజం చెపుతున్నాడా అబద్ధం చెపుతున్నాడా అన్నది తెలుసుకోవటం మాఫియాకి వెన్నతో పెట్టిన విద్య.

    పోలీసులే తమ కూతురికోసం తిరుగుతూ వుండటంతో మరొక రిపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచన విశ్వేశ్వరశాస్త్రికి రాలేదు. ఉత్పల మాయమైపోవటంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోసాగింది. ఆ కుటుంబంలో అందరు సభ్యులమధ్యా ప్రేమాను రాగాల బంధాలు చాలా దట్టంగా అల్లుకొని వున్నాయి. ఆమె తల్లి అన్నం తినటం మానేసింది. పైకి గంభీరంగా కనపడ్డా, విశ్వేశ్వర శాస్త్రి మానసికంగా కృంగిపోయాడు. ఆయనకి కూతుళ్ళంటే, ముఖ్యంగా ఉత్పలంటే చాలా అభిమానం. మాలినీ, ద్విపదల్లా కాకుండా ఉత్పలమాలపద్యంలాగే సరళమైంది. ప్రతీ పాదంలోనూ లాలిత్యమున్నది. బయట ప్రపంచం గురించి ఏమీ తెలియని ఆ అమ్మాయిని అంత హఠాత్తుగా పోలీసుల్ని చూసి ఎందుకు పారిపోవలసి వచ్చిందో ఆయనకి అర్థంకాలేదు. మొత్తంమీద ఆ ఇల్లు ఆ రాత్రి శ్మశానమైంది.

    మరుసటిరోజు పేపరు రాగానే నగరం అట్టుడికినట్టు ఉడికిపోయింది.

    ఆస్పత్రిలో ఆరు హత్యలు, కొంత దూరంలో మరొక ఇంట్లో దంపతుల హత్య, ఆ దంపతుల్లో ఒకరు అదే ఆస్పత్రిలో పనిచేసేవారవటం -ఎక్కడ చూసినా ఇదే చర్చ. ముఖ్యంగా ఆస్పత్రి ముందు జీపు ఆపి, లోపలికి దుండగులు ప్రవేశించి స్టెన్ గన్ తో వరుసగా హత్యలు చేసిన వైనం ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసింది.

    పేపర్లో ఈ వార్త వసంత్ దాదాని ఆకట్టుకోలేదు. మరో వార్త అతడిని కలత పెట్టింది.

    'నార్కోటిక్స్' చట్టం ప్రవేశపెట్టబడింది. ఇదో గొడ్డలిపెట్టు. బి.యస్. ఎఫ్. (దేశపు ఎల్లల్ని కాపలా కాసేదళం)కి ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి. అంటే లంచాల రేటు పెరుగుతుందన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల మార్పిడి పెద్ద ఎత్తున జరగబోతూందన్న వార్త బయటికి పొక్కింది.

    ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ద్వారా 'కొన్ని' విషయాలు బయటకు పోక్కాయంటే మొత్తం మాఫియా పేకముక్కల్లా కూలిపోతుంది. ముఖ్యులైన రాజకీయ నాయకులలో కనీసం నలభైమంది కటకటాల వెనుక వుంటారు. ఒక  బాధ్యతగల పౌరుడిగా దేశపు పరిస్థితులు అలా అల్లకల్లోలం అవకుండా చూడటం తనధర్మం. దేశమంతా చాలా సుభిక్షంగా, సురక్షితంగా వుందని సామాన్య పౌరులు  అనుకున్నంత వరకే ఫాసిస్టు, కేపిటలిస్టుల చర్యలు నిరాటంకంగా కొనసాగుతాయి. ప్రజాస్వామ్యం ద్వారా కొల్లగొట్టటం వీలవుతుంది.

    విషయం ఏమైందో తెలుసుకోవటం కోసం, రిసీవర్ ఎత్తి, వసంత్ దాదా సలీంశంకర్ కి ఫోన్ చేయబోయాడు. కానీ అంతలోనే ఫోన్ మ్రోగింది.

    "ఎవరూ" అన్నాడు.

    "నేనూ, రాముని దాదా."

    "ఏం రామూ ఏమైంది?"

    "ఆ అమ్మాయి కనపడింది. ఇక్కడే వుంది."

    వసంత్ దాదా షార్ప్ గా అడిగాడు. ".....ఎక్కడా?"

    "బస్ స్టాండ్ లో...."

    "ఏం చేస్తున్నారు మనవాళ్ళు"

    "నలుగురైదుగురు ఇక్కడే వున్నారు. మిగతా దళం వాళ్ళు ఒకరిద్దరుకూడా ఆమెని గుర్తుపట్టారు. వాళ్ళింకా రంగంలోకి దిగలేదు. ఇంతమంది ప్రయాణీకుల మధ్య ఆవిడ దగ్గిర్నుంచి ఆ కాగితాల్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూవుండి వుంటారు బహుశ!"

    "మరి నువ్వేం చేయదల్చుకున్నావు?"

    రామూ ఇబ్బందిగా, "చాలామంది జనం వున్నారు దాదా. కావాలంటే ఏదో విధంగా చంపెయ్యవచ్చుగానీ వెంటనే జనం మూగుతారు. శవం నుంచి వుత్తరం తీయటం కష్టమవుతుందేమో అని ఆలోచిస్తున్నాను" అన్నాడు.

    "ఆ అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు?"

    "టిక్కెట్లిచ్చే కౌంటరు క్యూ పక్కన నిలబడి వుంది".

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra