Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 1

                                 

 

                                   సూర్యుడు దిగిపోయాడు
                                                               ---కొమ్మూరి వేణుగోపాలరావు
    
                                   
  

    సముద్రుడు అనంత విశ్వంలా  గోచరించే ఆ మహా గోళాన్ని, ఎర్రగా వెలిగిపోయే సూర్యబింబాన్ని కొద్ది సేపట్లో కబళించి వేస్తాడు.
    వొట్టి సముద్రుడు కాదు.
    మూడు మహాసముద్రాలు కలిసే అనంతంలోని సమ్మేళనం.
    తీరమంతా ఆ అపూర్వ దృశ్యాన్ని చూడటానికి ఎక్కడ పడితే అక్కడ జనం.
    అది కన్యాకుమారి.
    వివేకానంద రాక్ కేసిల్ కూడా మనుషులతో నిండిపోయి వుంది.
    దూరాన ఎక్కడో కనిపించీ కనిపించనట్లు, నీటి అంచున మునిగిపోతున్నట్లు ఒకటీ, అరా పడవలు కదులుతున్నాయి.
    సూర్యబింబం సముద్ర గర్భంలో కలసిపోయేందుకు యింకా వ్యవధి వుంది.
    ఆ సమయంలో ఒక వ్యక్తి యిసుకలో అడుగు తీసి అడుగు వేస్తూ "ముందుకు వెడితే బాగా కనబడుతుంది ఇంకా బాగా కనబడుతుంది" అనుకుంటూ నడుస్తున్నాడు అతని పేరు అనంతమూర్తి.
    అరవై ఏళ్ళు దాటినా అతని ముఖంలో వార్ధక్య చాయలంతగా కానరావటంలేదు. జుట్టు చాలావరకు తెల్లబడిందిగానీ, ఎక్కువగా రాలిపోలేదేమో బట్టతల చిహ్నాలేమీ లేవు. కళ్ళచుట్టూ నలుపు చారల్లాంటి వేమీ లేవు. కళ్ళలో కాంతీ నశించలేదు.
    అతను నిన్న రాత్రే కన్యాకుమారి వచ్చాడు.
    తెల్లవారుఝామునే లేచి లాంచీమీద వివేకానంద రాక్ కేసిల్ కు వెళ్ళి అక్కడ వందలాది ప్రజల మధ్య నిలబడి సూర్యోదయ దృశ్యాన్ని తిలకించాడు. సూర్యుడు అనంత వ్యాప్తమై వున్న నీటి మధ్య ఎక్కడ్నుంచో కాస్త కాస్త బయటకు చొచ్చుకువస్తాడు. తర్వాత చెర విడిపించుకున్నట్లు పూర్తిగా బయటపడి, ఏ మేఘాల మధ్యలో కాసేపు సేద తీర్చుకుని, యిహ ప్రయాణం మొదలుపెడతాడు.
    అది చూడ్డం అయిపోయాక ఆ కొండమీది మందిర మంతా కలయతిరిగి, అక్కడి విశేషాలు చూస్తూ, ఆ తర్వాత అక్కడ లైబ్రరీలో తనకు కావలసిన పుస్తకాలు కొన్ని కొనుక్కున్నాడు.
    వివేకానందుడు అమెరికా వెళ్ళేముందు మానసిక పరిపక్వత కోసం అనేక ప్రదేశాలు తిరిగి ఇక్కడికి వచ్చాక యీ ప్రాంతం ఆకర్షించిందిట. తీరాన్నుంచి సముద్రంలో దాదాపు మైలుదూరం వున్న కొండ దగ్గరకు యీదుకుంటూ వెళ్ళి అక్కడ మూడురోజులపాటూ అన్నం నీళ్ళూ లేకుండా తపస్సు లాంటి సమాధిలో వుండిపోయాడుట. అక్కడే అతడికి మనస్సు వికసించి పూర్ణ విజ్ఞానం కలిగిందట.
    రాక్ కేసిల్ నుంచి తిరిగి వచ్చాక ప్రొద్దుటి నుంచీ యింతవరకూ గుడి వగైరాలు చూడటం, తనకు నచ్చిన గవ్వలు, బుల్లిబుల్లి చాపలు కొనుక్కోవటం-యిత్యాదులు పూర్తి చేసుకుని యిప్పుడు సూర్యాస్తమయాన్ని సందర్శించటానికి మళ్ళీ సముద్ర తీరానికి వచ్చాడు.
    అరవై ఏళ్ల అనంతమూర్తి.
    ఫ్యాంటూ, షర్టూ వేసుకున్నాడు. వెన్ను వొంగ లేదు. నిటారుగా, హుందాగా నడుస్తున్నాడు. అడుగుల కదలికలో ఆరోగ్యంతోబాటు, ఆత్మవిశ్వాసం కూడా ప్రస్ఫుటమౌతోంది.
    "ఇంకా ముందుకు....యింకా ముందుకు" అనుకుంటు చకచకమని నడుస్తున్నాడు.
    ఉన్నట్లుండి ఆగిపోయాడు. అతని చూపులు యిసుకలో ఓ ప్రక్కన తలవంచుకు కూర్చున్న ఓ వ్యక్తిమీద పడ్డాయి.
    కనుబొమలు ముడిపడ్డాయి. "ఎవరది? రాఘవ కాదు కదా" అనుకుంటూ దగ్గర కెళ్ళాడు.
    ప్రక్కనే ఓ మనిషి నిలబడటం గమనించి ఆ వ్యక్తి తల ఎత్తాడు. అవును రాఘవే!
    "రాఘవా!" అన్నాడు అనంతమూర్తి ఆనందాశ్చర్యాలతో.
    ఆ వ్యక్తికి గడ్డం బాగా పెరిగివుంది. డెబ్బయి ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడుగాని అరవైకన్నా ఎక్కువ వుండివుండవు. నెత్తిమీద జుట్టు-ఏ మూలనో తప్ప మిగతాదంతా ఊడిపోయింది. కళ్ళలో కాంతి తరిగి గాజు కళ్ళలా కదుల్తున్నాయి. పంచా, చొక్కా, వేసుకున్నాడు. అని శుభ్రంగానే వుండి వుండవచ్చు; కాని మనిషిలోని వెల్తి మాత్రం దాచలేక పోతున్నాయి.
    "మూర్తీ! నువ్వా?" అన్నాడు. అతని కంఠంలో ఆనందమూ లేదు. ఆర్ద్రతా లేదు. వాడిగా వుంది.
    "అవును నేనే నీ అనంతమూర్తిని" అంటూ యిసుకలో అతని ప్రక్కన కూర్చున్నాడు.
    "ఎప్పుడొచ్చావు?"
    "రాత్రి నువ్వు?"
    "ఇక్కడే వుంటున్నాను."
    "అంటే?"
    "వివేకానందాశ్రమంలొ వుంటున్నాను. సంవత్సరం బట్టీ."
    "నీకోసం ఎంతో గాలించాను. చాలా మందిని వాకబు చేశాను. చివరకు ఇక్కడ దొరికావు?"
    "దొరకలేదు కనిపించాను."
    "అంటే?"
    "జీవితం నాకు దొరకలేదు. నేనే అందరకూ దొరుకుతూ వచ్చాను. ఇహ దొరకను."
    "ఈ వయస్సులో......యిహ దొరికి లాభంలేదు" అనంతమూర్తి నవ్వాడు.
    రాఘవరావు నవ్వలేదు. పడిలేచే సముద్ర తరంగాల వైపు చూస్తున్నాడు. అతని ముఖంలో కూడా భాన కెరటాలు బలహీనంగా పదిలేస్తున్నట్లు కదుల్తున్నాయి.
    చెయ్యిచాచి స్నేహితుడిచేతిని ఆబగా పట్టుకున్నాడు. బలమైన అతని వేళ్ళమీద బలములేని యితని వ్రేళ్ళు జాలిగా వణుకుతున్నాయి.
    "ఎన్నాళ్ళకు....ఎన్నాళ్ళ కు చూశాను?"
    చేతివ్రేళ్ళ వొణుకు గొంతుదాకా ప్రాకినట్లయింది.
    "మూర్తీ! గుర్తుందా?"
    అనంతమూర్తి స్నేహితుడి ముఖంలోకి తరిచి తరిచి చూస్తున్నాడు.
    "మన బాల్యం, అప్పటి ఆశయాలు, అభిరుచులు. అప్పుడు....ఇలాంటిదే సముద్రం, యిలానే పడిలేచే తరంగాలు, ఇంత మధురంగానే హోరు..."
    అనంతమూర్తికి తాము పుట్టిపెరిగిన కాకినాడ, ఆడుకున్న సముద్రతీరం, అలనాటి సంఘటనలూ కళ్ళముందు కదలాడుతున్నాయి.
    "తరుచు సముద్రతీరానికి వెళ్ళేవాళ్ళం. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాళ్ళం. మన ఆశలు..."

Next Page