Next Page 
ది సినీ స్టార్ పేజి 1

                                 

 

                              ది సినీ స్టార్
    
                                                               ---కొమ్మనాపల్లి గణపతిరావు
   
 

                                 

 

      బ్రతుకే శాశ్వతమని భ్రమించే మనిషిని చూసి మృత్యువు అంటూంది....
    "ఓ గావుకేక తో నేలపై అడుగుపెట్టి నీ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన పిచ్చికన్నా....బ్రతుకనే తాయిలాన్నిచ్చి నిన్ను నేల మీదకి పంపింది కొన్నాళ్ళ కాలక్షేపానికే తప్ప కాలాన్ని శాసించమని కాదుగా.....మరి ఆడుకోవాల్సిన నువ్వు ఆటలాడటం న్యాయమా చెప్పు....నువ్వంటే గిట్టని నీ మనసు నీ పుట్టిల్లు ఆ ప్రపంచమే అని మభ్యపెడితే మాత్రం నువ్వు గిట్టేక చేరాల్సింది నా ఒడిలోనే అన్న సత్యాన్ని మరిచిపోవడం ఎంత నేరం. పిచ్చినాన్నా..... నీ జీవితం శాశ్వతం కాదు తెరమీద కదిలే రంగు పాత్రవి నువ్వు.....నీలో ఒకడు సోక్రటీస్ కావచ్చు. మరొకడు గాంధీ, యింకొకడు గాడ్ సేగా బ్రతకొచ్చుగాని మీ బ్రతుకురణాల పర్యవసానం మరణమేగా....మరెందుకీ ఆరాటం పోరాటం.
    నీ పాత్ర ముగిసేదాకానే నటించాలి గాని నేనిచ్చిన జీవిత అపాత్రదానం అవి నాకు మైకం కలవరం కలిగిస్తే మరి కోపం రాదూ....నీకు తెలుసా, నిజానికి నా భయం మరణం కాదు. మరణించడం తప్పదన్న ఆలోచన. అందుకే తెగ అలసిపోయుంటావు. చివరి క్షణం తులసి తీర్ధం సేవిస్తూ సైతం కలిసి బ్రతికిన నీ వాళ్ళనే తలపోస్తావు గాని నిన్ను కన్న అమ్మలకీ నేనే మూల ప్రవర్తనని నన్ను గుర్తుచేసుకోవు అసలు నీకు సమతని, మమతని అందించి నీరు అంతులేని విశ్రాంతి అందించే అవనీ అవంతాన్ని నేనే మరి.....రా నాన్నా......ఇటురా."
    
                                                          *    *    *    *
    
    "ఇటెక్కడికి?"
    కారు తేనాంపేట వైపు మళ్ళుతుంటే అడిగింది సుకృతి.
    రెండు పదుల వయసు దాటని సుకృతి మద్రాసు ఎయిర్ పోర్టులో దిగింది ఇరవై నిమిషాల క్రితమే. ఇండియాని విడిచిపెట్టి  ఆరేళ్ళయింది అమెరికాలో మెడిసిన్ చేయాలనే అమ్మ కోరిక తీర్చాలని వెళ్ళిన సుకృతికి మొన్ననే ఫోన్ లో చెప్పారు అమ్మకి బాగోలేదని అందుకే వెంటనే బయలుదేరింది.
    అసలు ప్రతి సంవత్సరామూ ఓసారైనా అమ్మని చూడటానికి తన దేశం రావాలనుకునేది కానీ అమ్మే పడనిచ్చేది కాదు. మెడిసిన్ అయ్యాకనే ఈ దేశంలో అడుగు పెట్టాలన్నది అమ్మ అభ్యర్ధన మాత్రమే కాదు ఆదేశం కూడా.
    సుమారు అరవై నాలుగు గంటలు బడలికా, టెన్షన్ గా గడిపిన సుకృతి మరోసారి రెట్టించింది తన పక్కనే కూర్చున్న అలివేలును చూస్తూ "ఆంటీ.....మిమ్మల్నే."
    బయటికి చూస్తూ కూర్చున్న అలివేలు వెంటనే జవాబు చెప్పలేక పోయింది. చెప్పలేక కాదు. ఎలా చెప్పాలో తెలీక....సుమారు ముఫ్ఫై సంవత్సరాలు వయసున్న అలివేలు సహజంగా ధైర్యవంతురాలే కానీ యిప్పుడు చాలా ఆందోళన పడుతూంది.
    ఎప్పుడో ఈ దేశం విడిచివెళ్ళిన సుకృతికి యిక్కడెం జరిగిందీ తెలీదు. ఆమెకు తెలిసింది ఒక్కటే. తెలుగు చలనచిత్రరంగాన్ని సుమారు ఒకటిన్నర దశాబ్దాల పాటు ఏలిన రాజ్యం కూతురు తను....దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నటిగా అమ్మ ప్రశస్తి గురించి మాత్రమే కాదు తను కోట్లకి వారసురాలనే అనుకుంటూంది యింకా. తప్పు సుకృతిది కాదు. అలా పెంచింది రాజ్యం. ఆమెను తను ఏమైనా ఆర్ధికంగా ఎంత పతనమైనాగాని మానసికంగా ఎంత అలిసినాగాని సుకృతికి తెలియకూడదనే ఆమెను స్టేట్స్ లో చదివించడానికి సిద్దపడింది.
    "ఆంటీ" అలివేలు చేతుల్ని పట్టుకుంది సుకృతి. "అసలేం జరిగింది....జవాబు చెప్పవేం?"
    కళ్ళలో ఉబకపోయిన కన్నీళ్ళని బలవంతంగా ఆపుకున్న అలీవేలు అప్పుడు చూసింది సుకృతిని.
    అదే లాలిత్యం. అమెరికాలో చదువు కుంటున్నా గాని ఏ భేషజమూ కనిపించని అప్పటి అమాయకత్వమే. ఆ తల్లి సంస్కారానికి సుకృతి వారసురాలే అనిపించిందో లేక ఈ పసికందుకు వాస్తవం తెలిస్తే ఏమౌతుందన్న భయమే మేదిలిందో ఆప్యాయంగా స్పృశించింది. బృందావనంలో నందివర్ధనమంత సుకుమారంగా కనిపిస్తున్న సుకృతిని లాలనగా దగ్గరకు లాక్కుంది.
    రాజ్యంతో అలివేలుకున్న పరిచయం యిప్పటిది కాదు. ఆ పరిచయానికే సుకృతి అంతరంగంలో వెలిగిపోతున్న సమయంలో అలివేలు కూడా ఫీల్డుకి వచ్చింది. తనూ ప్రముఖ నటి కావాలనుకుంది గాని పరువు నటిగా మిగిలిపోయింది. అయినా చింతించదామె. స్వయంకృతమిది. అలాగే సరిపెట్టుకుంటూంది. అయితే ఆమె రాజ్యానికి చాలా ఆత్మీయురాలు కాగలిగింది. రాజ్యం జీవితంలోని ప్రతి ఎగుడు దిగుడు అలివేలుకి తెలుసు......అలివేలు స్థితి గురించి రాజ్యానికి తెలుసు. అయినా తనతో వుండమని రాజ్యం అడిగిన ప్రతిసారీ తిరస్కరించింది స్నేహాన్ని దుర్వినియోగపరచు కోవడం యిష్టం లేదంటూ జూనియర్ ఆర్టిస్టులుండే స్లమ్స్ లోనే తన జీవితాన్ని కొనసాగించడం అలవాటు చేసుకుంది. రాజ్యంతో అంత చనువు వుండబట్టే యిప్పుడు సర్వం కోల్పోయిన రాజ్యాన్ని చూసే దిక్కు పోవడంతో తన యింటికి తీసుకువచ్చింది. ఏ మహానటికీ ఎదురు కాని దుస్థితి అది. ఎందుకిలా జరిగినా కాని సుకృతి తట్టుకుని నిలబడగలగాలి.

Next Page