Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 25

    ఆదిత్య పాపని కిడ్నాప్ చేశాడా? ఏం చేస్తాడు చేసి.... వాడికేం తెలుసనీ పిల్లల్ని ఎలా చూసుకోవాలో ఏం చేయాలో వాడికేం తెలుసు? తన మీద అలిగి నాలుగు రోజులు ఏ ఫ్రెండ్ ఇంట్లోనో తల దాచుకోవచ్చు కానీ, పసిపిల్లతో ఎక్కడుంటాడు? ఉద్యోగం, సద్యోగం లేకుండా చేతిలో పైసా లేకుండా ఎలా పెంచుతాడు...? లేదు ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలి? శిరీష అర్జంటుగా తన సెల్ లో మిస్డ్ కాల్స్ లిస్ట్ డయల్ కాల్ లిస్ట్ చూసింది. మిస్డ్ కాల్స్ లిస్ట్ లో రాకేష్ నెంబరుంది అది కాక మరో నెంబరుంది. ఆ రెండు నెంబర్లు పేపర్ మీద రాసుకుంది.
    ముందు రాకేష్ కి చేసింది. ఫోన్ రింగైన వెంటనే లిఫ్ట్ చేశాడు రాకేష్. "హలో అదీ" అన్నాడు. "అది కాదు రాకేష్ నేను ఆంటీని....ఆది ఇంట్లో లేడు....నీ దగ్గరి కేమైనా వచ్చాడేమో నని చేసాను..." అంది.
    "లేదాంటి మా ఇంటికి రాలేదు. వాడు వన్ వీక్ నుంచి కాలేజీ కి కూడా రాలేదు. నేనే ఫోన్ చేయాలను కుంటున్నాను ఏమందాంటీ...?"
    శిరీష కి దుఃఖంతో గొంతు బొంగురు పోయింది తమాయించు కొంటూ "ఏం కాలేదు బాబు.... నా మీద అలిగి వెళ్ళిపోయాడు వాడే వస్తాడను కున్నాను నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాను. నువ్వు కాక వాడికి ఇంకెవరు బాగా క్లోజ్,...?" అడిగింది.
    ఒక్క క్షణం అలోచించి "వాడి ఫ్రెండ్ బాబ్జీ అని ఉన్నాడు. వనస్థలి పురం లో ఉంటాడు. అప్పుడప్పుడూ వాళ్ళిద్దరూ సినిమాలకదీ వెళ్తుంటారు వాడు కాక సంజయ్ ఉన్నాడు...." అన్నాడు.
    రాకేష్ కి చదువు ధ్యాస తప్ప మరో ధ్యాస ఉండదు. సినిమాలు, షికార్లు, అతనికి నచ్చవు. చదువుకి సంబంధించినంత వరకే ఎవరితో స్నేహం చేసినా, అలాంటి వాటికి ఆదిత్య కి వేరే ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. వాళ్ళు పేర్లు గుర్తు లేవు శిరీష కి. వాళ్ళు కూడా ఈ మధ్యే ఇంజనీరింగ్ లోనే ఫ్రెండ్స్ య్యారు. ఆదిత్య ఇంజనీరింగ్ కి వచ్చాక శిరీష ఇదివరకలా అయినదానికీ, కాని దానికీ రేస్త్రిక్షన్స్ చేయడం మానేసింది. వాడు పెద్దవాడయ్యాడు . మరీ చిన్న పిల్లాడిలా కట్టడి చేస్తే సరిగా ఎదగడు అనుకోని కొంచెం ఫ్రీడం ఇచ్చింది. శిరీష నిట్టూర్చింది.
    "బాబ్జీ ఫోన్ నెంబర్ చెప్పగలవా?" అని రాకేష్ ని అడిగింది శిరీష.
    "నాకు తెలీదు అంటీ....సారీ " అన్నాడు రాకేష్.
    'ఒకే ...సరే " అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి మరో నెంబర్ డయల్ చేసింది. చాలాసేపు రింగైంది కానీ, ఆ ఫోన్ ఎవరిదో వాళ్ళు లిప్ట్ చేయలేదు. చాలాసార్లు ట్రై చేసి విసుగొచ్చి ఊరుకుంది శిరీష. మళ్ళీ భానుప్రియకి ఫోన్ చేసింది. ఆవిడ కూడా లిప్ట్ చేయలేదు. శిరీషకి ఎడుపోచ్చేసింది.
    "ఏంటి ఇలా జరిగింది....? ఎలా పెంచాలనుకున్నాను వాడ్ని.... ఇలా తయారయ్యాడు. నిజంగానే భాను అన్నట్టు వీడు సైకోలా తయారయ్యాడా...? ఏం చేయాలిప్పుడు? శిరీష వివేక్ కి ఫోన్ చేసి బేలగా అంది. వివేక్ ....నాకు భయంగా ఉంది అది కనిపించడం లేదు...." అంటూ బావురుమంది.
    కంగారు పడిన వివేక్'అరరే ఏడవకు...! నేను వస్తున్నాను. ఊరుకో శిరీషా ప్లీజ్ వాడెక్కడికి వెళ్ళడు నేనున్నాగా చూస్తాను.." అంటూ ఫోన్ పెట్టేసి వెంటనే బయల్దేరాడు.
    భానుప్రియ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలను కుంది. కానీ, వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేదని ఆమెకే అనిపించింది.
    ఒక్కసారి స్టేషన్ కెళ్ళి తను ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏమని కంప్లయింట్ చేయాలి? అని ఆలోచిస్తే అవును యేమని చేయాలి అనిపించింది. పాపని  ఎవరో కిడ్నాప్ చేసారు . ఆపాప ఎవరి పాప? ఆ పాప తండ్రి ఎవరు? పెళ్ళి కాలేదా? ఎందుకు కాలేదు?" పెళ్ళి కాకుండా పిల్లని కన్నదా? వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి చెత్త ప్రశ్నలే వేస్తారు.
    భానుప్రియ వెనక్కి తిరిగి మళ్ళీ హాస్పిటల్ కి వచ్చేసింది.
    నేరుగా డాక్టర్ రూం కెళ్ళింది. అప్పుడే వచ్చింది డాక్టర్. భానుప్రియ ను చూడగానే. "పాప గురించి కంప్లయింట్ చేశారా...?" అంది భానుప్రియ సీరియస్ గా . "నేను చేయడం ఏంటి....? మీరు చేయాలి....?" మీరు రెస్పాన్స్ బుల్ . మీ హాస్పిటల్ లో పిల్లలకి సెక్యూరిటీ లేదంటే మీకు,మీ హాస్పిటల్ కి బాడ్  నేమ్ వస్తుంది కదా...! మీరసలు రాత్రి  నుంచి ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నారో నాకర్ధం కావడం లేదు...." అంది.
    డాక్టర్ కాసేపు ఏమీ అర్ధం కానిదానిలా అయోమయంగా చూసింది. తరవాత సీరియస్ గా "మేడం మీరేం మాట్లాడుతున్నారో మీకర్ధమావుతోందా....? రాత్రి అనుకున్నాం కదా ఉదయం డెసిషన్ తీసుకుందాం అని ఇంతలోకే మీకంత కోపం ఎందు కొచ్చిందో నాకర్ధం కావడం లేదు..." అంది.
    "మీకెలా అర్ధమవుతుంది నా బాధ.... మీకర్ధం కాదు...." అలా అంటుండగానే ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    ఆవిడ పరిస్థితి అర్ధం చేసుకున్నదాని లా మృదువుగా అంది డాక్టర్ ప్రవీణ. 'ఆవేశం తగ్గించుకొని ఆలోచించండి భానుప్రియ గారూ... పోలీసులకి యేమని చెప్తారు? మీరు వద్దనుకున్న పాప ఎక్కడుంటే మీకేం. ఒకవేళ మీరనుకుంటున్నట్టు ఆ అబ్బాయే కిడ్నాప్ చేస్తే తండ్రి దగ్గర క్షేమంగా ఉంటుంది కదా...!"
    "వాడు ఆ పాపని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడని మీరు గ్యారంటీ ఇవ్వగలరా?"
    "చేయడు, ఒకవేళ చేసినా మీకేం ఇబ్బంది. మీ అమ్మాయి ఎలాగూ ఇక్కడుండదు బెంగుళూరు వెళ్తుంది.
    "కానీ...." భాను ఏం మాట్లాడలేకపోయింది. ఆవిడ అన్నది నిజమే కానీ, ఏంటో భయంగా ఉంది. భయం కన్నా ఎక్కువ కోపం వస్తోంది. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసింది తను ఇలా జరగడం ఏంటి...?
    "మీరనవసరంగా ఆందోళన పడుతున్నారు. మీ అమ్మాయికి కొంచెం ఓపిక వస్తే ఇంటికి తీసుకెళ్ళి హాయిగా పదిరోజులు రెస్ట్ ఇచ్చి బెంగుళూరు పంపించేయండి..."
    ఆవిడ అలా అనగానే భానుప్రియ కళ్ళు మూసుకుని ఉద్వేగం అణుచుకుంటూ అంది "సారీ డాక్టర్ ....నాకేం పాలు పోవడం లేదు. ఇప్పుడు వాళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్లకి మాట ఇచ్చాం కదా పిల్ల ఏదీ అంటే ఏం చెప్పాలి...? మీ మీద నమ్మకంతో, మీరు మాకు సాయం చేస్తున్నారని మా అమ్మాయిని బెంగుళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేయించాను. ఎవరికీ తెలియకుండా ఎంత రహస్యంగా చేసినా ఇలా జరిగిందంటే నాకేం అర్ధం కావడం లేదు. నాకు ఖచ్చితంగా అనుమానంగా ఉంది. మీ అయానో, నర్సో అవతలి వ్యక్తీ కి సహకరించారు. లేకపోతె ఇంత పకడ్భందీగా ప్లాన్ చేయలేరు చేసినా అమలు చేయలేరు వాళ్ళెవరో తెలుసుకోండి..."
    "మాట ఇచ్చింది మీరు కాదు నేను మీకు వాళ్ళెవరో కూడా తెలియదు కదా. నేను చూసుకుంటాను... మీరు ముందు కొంచెం వేడి కాఫీ తాగిరిలాక్స్ అవండి. మీరు ఇవ్వమంటే నేను ఇప్పుడే పోలీస్ రిపోర్టు ఇస్తాను..."
    "నాకేం వద్దు...." తల పట్టుకుని కుర్చీలో కూలబడింది భాను. గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోతుందనుకున్న విషయం పాప కిడ్నాప్ తో రచ్చ కేక్కుతుందన్న భయం పట్టుకుంది భానుకి.
    డాక్టర్ స్వరంలో కొంత సానుభూతి, మరికొంత ఓదార్పు కలిపి అంది. "కాఫీ తాగండి..."
    ఆయా వేడిగా ఉన్న కాఫీ కప్పులో పోసి భానుప్రియ కి అందించింది.
    మౌనంగా కాఫీ కప్పు అందుకుంది భానుప్రియ.
    "కాఫీ తాగి మీరు రూం కి వెళ్ళండి. మీ అమ్మాయికి కాఫీ అది ఇవ్వండి. ఆమె సంగతి చూడండి. నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. సారీ చెప్తాను. మీరు ఈ సంగతి నాకోది లేసి, మీ అమ్మాయి హెల్త్ చూసుకోండి. మధ్యాహ్నం డిశ్చార్జి చేస్తాను.ఆమెని ఇంటికి తీసుకెళ్ళండి. నేను ఇంటికే వచ్చి చూస్తాను సరేనా...?"
    భానుప్రియ మౌనంగా కాఫీ తాగి, కప్పు ఆయా చేతికిచ్చి ప్రఖ్య పడుకున్న గదిలోకి వెళ్ళిపోయింది.
    డాక్టర్ ప్రవీణ కి కాస్సేపు తను పొరపాటు చేసిందా అనిపించింది. అనవసరంగా ఆ కుర్రవాడిని తను ప్రోత్సహించింది. అయినా వాడు పాపని అలా ఎలా ఎత్తికెళ్ళాడు....? తనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అతనికి సహకరించిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఇన్నో రోజుల నుంచీ తన ద్వారానే అన్ని విషయాలు తెలుసుకుంటున్న అతను పాపని అడిగితె లీగల్ గానే ఇస్తానంది కదా....!" మరి తొందరపడి ఎందుకిలా చేశాడు...? ఆవిడకి అంతా అయోమయంగా అనిపించింది. ఈ ఆరు నెల్లుగా తానెంతో జాగ్రత్తగా మానేజ్ చేస్తూ వచ్చిన విషయం ఇవాళ ఇలా రచ్చ కీడ్చబడింది. ఏం చేయాలో ఆవిడకి అర్ధం కాలేదు. కాసేపలా కూర్చుని నెమ్మదిగా తల పంకిస్తూ ఫోన్ దగ్గరికి జరుపుకుంది.

                                                 ***

    టోల్ గేట్ సమీపిస్తుంటే ఇద్దరికీ ఒక్కసారిగా భయం వేసింది. పాప ఏడవకుండా ఉంటే కారులో ఎవరున్నారో పట్టించుకోరు డబ్బులు తీసేసుకుని పంపిస్తారు. ఒకవేళ పాప ఏడిస్తే! ఇద్దరు కుర్రాళ్ళు మాత్రం ఉన్న కార్లో చిన్నారి పాపాయి ఉంటె ఎవరికైనా అనుమానం వస్తుంది. ఏం చేయాలో తోచలేదు ఆదిత్య కి.

 Previous Page Next Page