క్లాస్ రూమ్ లోకి నడిచారిద్దరూ.
మరో అయిదు నిముషాల తర్వాత లెక్చరర్ క్లాస్ రూమ్ లోకి వచ్చాడు.
బల్లకి చివరగా గుమ్మం దగ్గర కూర్చుంది స్వర్ణ.
అదే ఆమె చేసిన తప్పు.
లెక్చరర్ నోట్స్ డిక్టేట్ చేస్తున్నాడు క్లాసు నిశ్శబ్దంగా ఉంది. అందరూ నోట్స్ తీసుకొంటున్నారు.
వరండాలో అడుగుల చప్పుడు.
పక్క క్లాసులోనా? స్వర్ణకి గుండెలో రైళ్ళు పరుగెడుతున్నాయి.
తలుపు వెనకగా ఎవరో నించున్నారు. మునివేళ్ళతో దానిమీద కొట్టిన చప్పుడు......
అటు చూడకూడదనుకొంటూనే తల తిప్పి చూసింది స్వర్ణ.
తలుపు వెనకగా జెన్నీ క్లాసులో ఎవరికీ కనపడకుండా నిలబడి ఉన్నాడు.
వికృతమైన చూపు.
అతని కళ్ళు కఠినంగా ఉన్నాయి.
భయంగా అశ్వని కేసి చూసింది. ఆమె నోట్స్ రాస్తోంది.
"టిక్ టిక్ టిక్" మెల్లగా తలుపు పైన చప్పుడు.
ఆమె మొహంపైన చిరుచెమటలు పోస్తున్నాయి.
ఆమె ఈసారి తల తిప్పకుండానే కళ్ళు చివరనుంచి చూసింది.
చిన్న కవర్ని ఆమె కాళ్ళ దగ్గర పడేశాడు జెన్నీ.
"చెప్పినట్టు చెయ్యలేకపోతే నిన్నేం చేస్తానో తెలుసుగా" అన్నట్టు చూశాడు జెన్నీ.
స్వర్ణకి ఏడుపొస్తోంది.
గబుక్కున ఓ కాలిని ఆ కవరుపైన పెట్టింది.
అశ్వని తన పక్కనే ఉందన్న ధైర్యంతో అప్పటివరకూ ఉంది స్వర్ణ.
ఆ ధైర్యం ఇప్పుడు పూర్తిగా సన్నగిల్లింది.
అశ్వనికి సైతం తెలీయకుండా వెళ్ళి రిపోర్టు ఇవ్వాలి ఈశ్వర్ ఆ ప్రేమలేఖని తనకి రాశాడని.
ఈశ్వర్, అతని మనుషులు ఊరుకుంటారా?
ఆమెకి చలిజ్వరం వస్తున్నట్టుగా ఉంది.
ఆమె నవనాడులూ కుంగిపోతున్నాయి.
కాలేజీలో తన పరువుపోవడానికి మరెంతో సేపు పట్టదు.
అంతకంటే ఆ జెన్నీగాడి మోటుచేతిలో మూడోకంటి వాడికి తెలియకుండా నలిగిపోవడం మంచిది.
ఈశ్వర్ పైన రిపోర్టు చేశాక తనని కాలేజీలో ఎలా చూస్తారో అందరూ.
చిత్ర.....చిత్ర..... చంపేస్తుంది.
మళ్ళీ చప్పుడయింది. చూడకూడదు చూడకూడదు అనుకొంటూనే తల తిప్పి చూసింది.
ఆ కవర్ని తీసుకోమన్నట్టు సైగ చేశాడు జెన్నీ.
అంతే. అశ్వని కూడా గమనించకుండా ఆ కవర్ని మెల్లగా తీసి పుస్తకంలో పెట్టుకుంది స్వర్ణ.
జెన్నీ పెదవులపైన నవ్వు.
విషపు నవ్వు.
ఇంకా అక్కడే నించున్నాడతను.
దేనికి?
అతను వెళ్ళిపోతే బాగుండుననిపిస్తోంది.
భయంగా చూసింది మళ్ళీ.
జెన్నీ చేతిలో కత్తి తళుక్కున మెరుస్తోంది.
స్వర్ణ క్షణం పాటు కళ్ళు మూసుకొంది!
స్వర్ణకి శరీరంలోంచి రక్తం తోడేసినట్టుగా ఉంది.
జెన్నీ అక్కడి నుంచి కదలలేదు.
కత్తితోనే సైగ చేస్తున్నాడు.
"లే...... లేచి బయల్దేరు" అన్నట్టు చూపు.
తప్పదిక. అతడు చెప్పినట్టు ఆడవలసిన తోలుబొమ్మలా ఉంది పరిస్థితి.
మెసేజ్ అర్ధం అవుతూనే ఉంది. కానీ ఎలా?
క్లాసులో లేచి నిలబడి గట్టిగా అరవాలనుంది ఆమెకి.
ఈ ఆపదనుంచి తనని గట్టెక్కించేదెవరు?
ఏడుపొస్తోంది! కానీ భయంతో అది గొంతు దాటి బయటికి రావడంలేదు.
కత్తిపీట ముందు కూర్చుని జెన్నీగాడిని ఉల్లిపాయ తరిగినట్టు తరగాలనుంది స్వర్ణకి.
"టక్ టక్ టక్" మళ్ళీ చప్పుడు చేశాడు.
జెన్నీ కత్తిని ఎగరేసి పిడిని పట్టుకున్నాడు.
క్లాసులోంచి బయటపడాలి.
అశ్వనికేసి చూసింది స్వర్ణ. క్లాసు రూమ్ కావడం వల్ల ఆమె కొంచెం అజాగ్రత్తగా ఉంది.
అదే బోలెడు అడ్వాంటేజ్ అయింది జెన్నీకి. స్వర్ణ నోట్ బుక్ ని, బ్యాగ్ ని తీసుకొని క్లాసులోంచి బయటికి నడిచింది. అది చూసి వెంటనే జెన్నీ పక్కకి తప్పుకున్నాడు.
స్వర్ణ అలా ఊహించని రీతిలో బయటికి వెళ్ళడం చూసి అశ్వని నివ్వెరబోయింది. తేరుకుని గబుక్కున లేచి నిలబడింది - ఆమెని ఆపడానికి. కానీ ఆమె నించోడం చూసి లెక్చరర్ -


