Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 20

    "సరే నీఇష్టం __ నువ్వు సేవ్వులుకి సేప్పులు తొడిగిందానిని సేప్పితే ఇనిపించుకోవు ఎల్లేలూ " అని  గుడ్డకప్పుకుని గుడ్డాలు తన్నీసేనాడు సీతాల మొగుడు సీతన్న.
    సీతాలు గిర్రునతిరిగి చేరచేరమనినడిసి గోతినికప్పి పునాదులు పనిజేస్తున్న జుట్టులో కలసిపోయింది. మొగుడు బదులు పెళ్ళం పనిలోకి వచ్చిందని జట్టోలుకి తెలిసిపోయింది.
    సీతాలు పనిజేస్తుండే మేస్త్రీకి కనిపించనివ్వకుండా జట్టోలు ఎంత సాటుంటున్నా ఆ కాకికల్లోడు సీతాలుని సూసేసినాడు.
    "ఓలే సీతాలు ఎవుల్ని అడిగి పనిలోకొచ్చేవే అసలు నువ్వు నలుగు రోజులుంచి పనిలోకిరాలేదు. నాతానిసెప్పకుండా నన్నడగకుండా పొద్దున్న పూట పనిలోకి రాకుండా మధ్యాన్నంపూట నిన్నేవడే పనిలోకిసేరిపించుకున్నాడు!" అని మేస్త్రీ అధికారయుతంగా ప్రశ్నించేడు.
    "అదికాదు మేస్త్రీబాబూ! మీ పనోడు వంట్లోను, సుఖంనేదని వుడిపోనాడు ఒకపూటపనికొచ్చి ఒకపూటవుండిపోతే రావలిసిన రోజుకూలీరాదని అతగాని బదులు నానోచ్చనుబాబూ" అని మాయమర్మం లేకుండా చెప్పింది సీతాలు.
    "అయితే  మొగోడు పనికి మొగుడో రావాలగాని ఆడదానివొస్తే ఎలా గావుతాదే ఇదేటి ధర్మసత్రమానుకుంటున్నావేటి?
    "ఏంటిబాబూ! అతగాడు సేసిపని నానుసెయ్యనేనాఏటి? మావెంటి రాటరాయాలా __ గీతరాయాలా రాలేత్తడం మన్నుపిసికడమేకదా?
    అదెలా గవుతాదే పంచదారా తియ్యగుంటాదీ బెల్లంకూడా తియ్యగుంటాది కాని రెట్లు వేరేగుంటాయి. ఇదీ అంతే అర్దమయిందా. ఇక  ఇంటికి దారితియ్యి" అని మేస్త్రీ అనగానే సీతాలుకి కొంచెం కోపం వచ్చింది.
    "|ఎల్తాను గాని బాబూ, మనుషుల్ని పంచదారాతోనీ, బెల్లంతోనీ సరిపోల్చితే సరిపోదు. ఇలువులు మాట్లాడాల __ మీరిచ్చింది నాలుగు రూపాయలు కూలి. అందులోనూ రెండు రూపాయల కూలికి పొద్దున్న మా యజమాని పనిజేసేవాడు. ఆ వుండిపోయిన రెండు రూపాయల డబ్బులుకి నాను పనిసేయ్యడానికొచ్చినాను. ఏటిమీకు నట్టమైపోయింది ఆమత్రంధర్మం  సూపనేరా బాబూ....? అడగవలసిన మాట నిలదీసి అడిగీసింది సీతాలు.
    "నీకు ధర్మమే కావాలంటే నా ఇంటికిరా __ మూడు పిడికేలు ముష్టేత్తాను. పనీ పాటుదగ్గిర దానధర్మాలు పనికిరావు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే.... అదుగో నీ మాటలూ ఇనికొని పనోలు పనులు మానిస్తన్నారు. నన్నట్టే ఇసిగించి కోపం రానివ్వకు. నీదారిని నువ్వెళ్ళిపో __ నేడా ... మెడపట్టి గెంటి౦చిత్తాను" అని కూలొల్ని ఎలాగతిట్టినా అడిగినోడు లేడన్నట్టు అనీసేడు కనకయ్య.
    మేస్త్రీ _ మెడపట్టి గెంటుతానన్న మాట సీతాలుకీ శీరసుకెక్కింది.
    "అయినా నానేలాగా మాట్లాడుతున్నాను__ నువ్వెలాగ మాట్లాడుతున్నావోయ్ ఓయ్ __ మేస్త్రీ"
    "ఆ. ఓయ్ ! ఓయ్ అంటావే నన్ను!"
    "నేకపోతే నానేటన్నానానీ, కొడతానూ, తిడతానూ అంతన్నావు నా మేగుడుబదులు ఒకపూట పనిజేత్తా నన్నాను. అలగంతే తప్పా! ఎన్నిసార్లు _ ఎన్నిసార్లు మావుం నీకు తగులూ, మిగులూ పనులు ఎక్కువ సేయ్యలేదు. రేండురూపాయలు  కూలికాదా అదా, మగా తేడాతీత్తన్నావు. ఇదా! ఈసిదిగి పోయిన సేత్తులోని ఎన్నిమేడలు మావుం కట్టలేదు! ఇదా __ ఈతొక్క లెక్కి పోయిన కాలుతోని ఎన్ని తార్రోడ్డులు పొయ్యినేదు? ఇదా ఈ నెత్తిమీద పుళ్ళు పుట్టినట్టు ఎన్ని సిమెంటు బత్తాలు మొయ్యినేదు. ఏ పనీ సేయ్యికుండా__ మీ రెంత దాసుకుంతన్నారో __ ఎంత తింతన్నారో అందరికీ తెలుసు బాబూ! మావుం మీలాగా దాసుకోవడానికి డబ్బాదగలేదు. ఆ పూటకి ఇంత గెంజిసేసుకో డానికి తాగుతున్నాము. అంతకన్నా మామేటీ మిగిలించుకోనేదు __ ఆ ముండ బంగారానికే నువ్విన్ని తిట్టులు తిడతున్నావు ఇన్ని బాధలు పెడతాన్నావు. మాకేకాదు __ నీకైనా ఏటి ముగుల్తుంది సెప్పు. మావుం సిన్నకూలోం. నువ్వు పెద్దకూలోడువు అంతే తేడ," అని కడుపులో ఎర్రిని కక్కేసింది సీతాలు.
    'పెద్దకూలోడువు' అన్నమాట కనకయ్య మేస్త్రీకి ఎక్కడలేని కోపం పుట్టించింది.
    "ఒలె నన్ను కూలోడువంటావే కూల్దానా కూడులేనిదానా ఒలె నేను సరిసదువుకున్ననే __ అప్పుడు  పదిసదువంటే  ఇప్పుడు బి.ఏ తెలుసా . పనికి రానిదానా నువ్వు నేచ్చినా పనివ్వను __ తిన్నగెల్లు ఎల్లకవున్నావా నా కూతురు కానా గుణపాముతోనే గుండెమీద పొడిసిత్తాను." గుడ్డేల్లబెట్టేడు మేస్త్రీ.
    "నా నెల్లను ఇక్కడే వుంతాను __ నువ్వేటిసేత్తావో సూత్తాను" నిలబడి ఎక్కిరిస్తున్నట్టు  అక్కడే వుండిపోయింది సీతాలు.
    తగువు ముదిరిందని పనోలందరూ పనులుమాని పసిగదతన్నారు.
    "ఒలె __ ఎల్తావా ఎల్లవా " కొండలు పగిలేటట్టు కేకేసిగుణపామే త్తేడు మేస్త్రీ.
    "రా కొట్టు నువ్వు కొట్టకపోతే మొగోడువుకాదుఆడదానిని మీసంలేనో డువీ," సీతాలు కూడా జంకకుండా పల్లెటూరుపడుచునిపించింది.
    "అంతే!
    కనకయ్య మేస్త్రీ  ఆ మొండిగుణపాము పట్టుకుని రాసామెండలాగ __ రయ్యిమని సీతాలు మీదపడి ఒక్క పోతూపోడిచేడు __
    సన్నంగావున్న  సీతాలు గేతులాగ ఎగిరి కిందపడింది __ కనకయ్య మరొక్క పోటు పొడిసేడు అది జెబ్బమీద తగిలి పక్కకి విసురుకుంది _
    సీతాలు 'ఒలంమా సచ్చివున్నా నాయినో.... ' అని జబ్బ మీద రక్తాన్ని జూసి కాలివిరిగిపోయిన కాకిపిల్లలా గాకావుకావుమంటూ కళ్ళు తిరిగిదోలిగెల్లింది.
    పనోలు పటుగుపరుగునవచ్చి పట్టుకున్నారు కొందరు. ఆమెను పైకెత్తి అడ్డాల్లో పెట్టుకున్నారు.  మరికొందరు  గుడ్డలతో విసురుతున్నారు సీతాలు కళ్ళు తెలవేయ్యడంజూసి ఒకడు నీరు తెదానికివెళ్ళేడు.
    ఈ విధంగా పనోలు సీతాలుని  బతికించుకోవడానికి  చేస్తున్నా ప్రయత్నాలలో మధ్య మధ్యనీ ప్రక్కనున్న కనకయ్యని కసితో చూస్తున్నారు. గుక్కలు మ్రింగుతూ పల్లి పటపట కోరుకుతున్నారు __
    కనకయ్యకు ప్రాణాలు నెత్తికెల్లినాయి. మనసులో బతుకు భయంపట్టుకుంది.
    "అంతే__
    కనకయ్య మెల్లగా ఆ రోడ్డు మలుపు తిరిగి ఆ వెంటనే మరో మలుపు తిరిగి ఆ వెంటనే ఇంకోమలుపు తిరిగి వెతికినా వీలుకాని దారుల్లో దూరి పరుగుతీసేడు __

 Previous Page Next Page