Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 17

    వీళ్లని చూడగానే "వెల్ కమ్ రండి" అంటూ లోపలికి ఆహ్వానించింది హర్షిత. చెయ్యేసి కౌగిలించుకుని ఆహ్వానించాడు ఆనందమూర్తి "రారా అగ్గిరాముడా!" అంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు ఆనందమూర్తి. " అగ్గిరాముడా అంటూ పిలిచి మళ్లీ అతనికి కోపం తెప్పించకండి" నవ్వుతూ అంది హర్షిత.

    "వీడి మాటలు నేను లెక్క చేస్తేకద. ఆ సంతి వాడికీ తెలుసు. అనుకొనీ" అన్నాడు ఫణి నవ్వుతూ.

    స్నేహితులిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే సంబరపడిపోయింది లతిక. ముగ్గురూ కూర్చుని కబుర్లలో పడ్డారు.

    "ఏమిట్రా! నీ మేరేజ్ డేకి మేమిద్దరమేగా గెస్టులం. ఏ హడావుడీ లేదే?" అడిగాడు ఫణి.

    "నాకు కావలసింది హడావుడీ, బోలెడంత మంది గెస్టులు కాదు, నాకు నచ్చినవాళ్ళు మాత్రమే" అన్నాడు ఆనందమూర్తి.

    "కరెక్ట్" అలాగే వుండాలి అంది లతిక.

    ఫణి లతికవైపు చూశాడు. "మరయితే మన మేరేజ్ డేకి ఎవరెవర్నో పిలవమన్నావెందుకు?"

    "వాళ్ళందరూ గొప్ప గొప్ప డాక్టర్లు. ఎప్పుడైనా పిలవాలి, అని మీరు అనేవారు కదా! అందుకే పెళ్ళిరోజు పిలిచేస్తే పోతుందని పిలవమన్నాను" అంది లతిక.

    "ఓహో! మళ్లీ అది నా తప్పే?" అన్నాడు ఫణి.

    "నో ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్........" అంది హర్షిత

    అంతలో ఫోన్ మోగింది. హర్షిత ఫోన్ తీసి "హల్లో" అంది.

    "ఫణీ! నీకే ఈ ఫోను" అంది.

    ఫణి వెళ్ళి హర్షిత చేతిలోనుంచి రిసీవర్ అందుకున్నాడు.  "డాక్టర్ ఫణికుమార్ స్పీకింగ్" అన్నాడు. వెంటనే అతని ముఖ కవళికలు మారిపోయాయి.

    "హాఁ....." అన్నాడు షాక్ తగిలినట్టు. అందరూ అతనికేసి చూశారు. ఆత్రుతతో.

    "ఏరా? ఏమయింది?" ఫణి భుజంమీద చెయ్యి వేసి అడిగాడు ఆనందమూర్తి.

    అవతల వాళ్ళు ఏదో చెబుతూనే వున్నారు. రిసీవర్ ఒక్క క్షణం దూరంగా పెట్టి,  "వామనరావు పోయాట్ట. అయిదు నిమిషాలయిందిట" అన్నాడు.

    మిగతా ముగ్గురూ ఆ వార్త విని, అదిరిపడ్డారు. ఆనందమూర్తి స్థాణువులా అయిపోయాడు. హర్షితా, లతికా, ఫణివైపే చూస్తూ ఉండిపోయారు, చలనం లేని వారిలా...... ఫణికుమార్ ఫోన్ లో ఏదేదో అడుగుతున్నాడు. ఆనందమూర్తి మాత్రం ఈ లోకంలో లేడు. ఆలోచనల్లో మునిగిపోయాడు. "ఏమిటి ఫణీ! వామనరావు చనిపోయాడా? ఎలా?" ఆందోళనగా అడిగాడు ఆనందమూర్తి.

    "ఏమో, ఎందువల్ల అలా జరిగిందో అర్ధం కావటంలేదు. నేను వెంటనే డిస్పెన్సరీకి వెళ్ళాలి" అంటూ లేచాడు ఫణికుమార్.

    "నేనూ రానా?" అడిగాడు ఆనందమూర్తి.

    "వద్దు. ఇప్పుడు నువ్వు వచ్చి చేసేదేం లేదు. లతికా, వెళ్దాంరా!" అన్నాడు ఫణి.

    "నువ్వు డిస్పెన్సరీకి వెళ్తున్నావు. లతిక ఇక్కడ ఉంటుందిలే" అంది హర్షిత.


    "అవును ఫణీ! నువ్వు ఇంటికి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము లతికను ఇంటికి తీసుకొచ్చి దిగబెడుతాం" అన్నాడు ఆనందమూర్తి.

    "లేదు నేను వచ్చి తనని తీసుకెళతాను" అంటూ గబగబా బైటికి నడిచాడు ఫణికుమార్.

    ఫణి వెళ్ళిన అయిదు నిమిషాల వరకు వాళ్ళ ముగ్గురి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది.

    "నేను లాస్ట్ వీక్ చూసినప్పుడు వామనరావు కండిషన్ బాగానే వుంది. ఎలా పోయాడో పాపం!" స్వగతంగా అన్నాడు ఆనందమూర్తి.

    "మళ్ళీ రాంగ్ ట్రీట్ మెంట్ ఏమైనా జరిగిందేమో!"

    "ఊ......హూ., ఒకసారి చేసిన తప్పుని తెలుసుకున్న తర్వాత ఫణి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడని నేననుకోను."

    "ఎందుకనీ."

    "ఇది పేషెంట్ల జీవితాలకు సంబంధించిన వ్యవహారం. ఆటకాదు. ఇంతకు ముందు తెలియక ఫణి పొరపాటు చేసాడు. ఆ విషయం తెలిసేలా వివరించాక మళ్ళీ అలా జరిగే అవకాశం లేదు" అన్నాడు ఆనందమూర్తి. దాంతో లతికకు ఏదో గుర్తొచ్చినట్టు ఆనందమూర్తి వైపు చూసింది. ఆనందమూర్తి ఏమిటన్నట్టు ఆమె వైపు చూశాడు.

    లతిక జంకింది.

    'ఏమీ లేదన్నట్లు' అడ్డంగా తిప్పింది.

    "లతికా! ఏదో చెప్పాలనుకున్నావు చెప్పు." ఆనందమూర్తి

    "ఏం లేదు. మళ్లీ రాంగ్ మెడిసిన్స్ వామనమూర్తికి ఇచ్చారేమోనని నాకు సందేహంగా వుంది" అంది లతిక.

    "ఆ సందేహం ఎందుకు కలిగింది?"

    "ఇది నా అనుమానం మాత్రమే . నిజం అయి ఉండకపోవచ్చు" సణిగింది లతిక.

    "అదే ఆ అనుమానం రావడానికి కారణం?"

    "నాలుగు రోజుల క్రితం మీరు మా ఇంటికి వచ్చి వెళ్లారు. ఆరోజు ఫణి చాలా ఇర్రిటేటింగ్ గా మాట్లాడాడు కూడా!"

    "అవును........"

    "మీరిలా వెళ్ళగానే ఫణి వామనరావు కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడాడు" అంది లతిక.

    "వామనరావు హెల్త్ విషయంలో కంగారుపడవద్దని ధైర్యం చెప్పడానికి అయి వుంటుంది" అన్నాడు ఆనందమూర్తి.

    "అందుకు కాదు"

    "మరెందుకు?"

 Previous Page Next Page