Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 16

    లతిక అతని ప్రవర్తన చూసి భయంతో ముడుచుకుపోయింది. అసలు ఫణూ, ఆనందమూర్తీ ఎలా స్నేహితులయ్యారో ఆమెకు నిజంగా అంతుబట్టని ప్రశ్నలాగా మిగిలిపోయింది. ఏవిధంగా చూసినా వాళ్లిద్దరి మధ్యా స్నేహలత అల్లుకుపోయే కామన్ విషయాలు కానీ ఆలోచనలు కానీ లేవు. ఫణికి ముక్కుమీద కోపం, తనకన్నాఎవరు ఎక్కువగా వున్నాసరే అసూయ. కట్టుకున్న భార్య సరేసరి చచ్చేంత లోకువ. స్నేహితులని కూడా మొహమాటపడడు. తనలోని లోభత్వాన్నీ, అత్యాశనీ ప్రదర్శించేసీ లోకువయిపోతాడు. అతడికి బంధుత్వం, స్నేహం, దయా, జాలీ, నీతీ, నిజాయితీ అనే పదాలకి అర్ధాలు తెలీవు.

    కానీ ఆనందమూర్తి అచ్చు శ్రీరామచంద్రమూర్తే. ఏనాడూ అతనిలో కోపం చూడలేదు. హర్షితని పల్లెత్తుమాట అనగా వినలేదు. పేదలంటే జాలి. వృత్తిపట్ల గౌరవం, నీతీ నిజాయితీకి ప్రాణమిచ్చే ఆత్మాభిమానం గల గుణవంతుడు. ఫణి హర్షితని ప్రేమించాట్ట. హర్షిత ఆనందమూర్తిని ప్రేమించింది. ఆనందమూర్తీ హర్షితని ప్రేమించాడు. ఫమికి అది కూడా పరాజయమే. ఆనందమూర్తి ఆటల్లో చదువులో ప్రవర్తనలో 'మంచివాడు' అని పేరు రావడం, ఫణికుమార్ ప్రతిసారీ ఆనందమూర్తి తరువాతే నిలవడం కూడా అతనిలో ఆనందమూర్తి మీద అసూయ కలగడానికి కారణమయింది. అయితే చిన్నతనంలో ఇలాంటి భావాలు కలిగినా, పెద్దయ్యాక వాటిని తుడిచిపెట్టుకోవడం బాధ్యత గల వ్య్కతులు, సంస్కారవంతుల లక్షణం. కానీ ఫణిలో ఆ దుర్గుణాలు కూడా పెరుగుతూనే వచ్చాయి. ఈ ఆలోచనలన్నీ ఆమె మనసులో ఒక్కసారిగా ముసురుకుని ఫణికేసి చూడాలంటే వొంట్లో వొణుకుపుట్టింది. పిచ్చిదానిలా అతని మొహంలోకి చూస్తూండిపోయింది.  "వచ్చే వారం వామనరావుని ఆనందమూర్తి డిస్పెన్సరీ లో చేరుస్తాడు పూర్ ఫెలో" అంటూ నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వాడు ఫణికుమార్. లతిక ప్రతిమలా అతనికేసి చూస్తుండిపోయింది.

    వెంటనే ఫోన్ ఎత్తి  తన క్లినిక్ నెంబర్ డయల్ చేశాడు "డాక్టర్ ఫణికుమార్ స్పీకింగ్" అన్నాడు డ్యూటీ నర్స్ ఫోన్ తీసింది. ఆమెకేవో ఇనస్ట్రక్షన్స్ ఇచ్చాడు. లతిక మంచం మీద వాలిపోయింది.

    "ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశారు క్లినిక్ కి?" అడిగింది లతిక.

    "అన్నీ నీకు చెప్పాలా? సరే చెప్తావిను. స్పెషల్ వర్డ్ పేషంట్ శ్రీశ్రీశ్రీ వామనరావు గారికి ఏమేం టాబ్లెట్స్ ఇవ్వాలి, ఎన్నిగంటలకి ఇవ్వాలి చెప్పాను" అన్నాడు.

    "ఆ విషయాలు ఇదివరకే చెప్పి వుంటారుగా. మళ్ళీ ఇప్పుడెందుకు ఫోన్ చేశారు?"

    "ఒక డాక్టరుగా నా పేషంటు గురించి నేను శ్రద్ద వహిస్తే, నీకు ఏవేవో సందేహాలొస్తున్నాయే! అదే ఆనందమూర్తి చేస్తే మహా పొగిడేస్తావ్ అతనికి బాధ్యతలెక్కువ వంకాయ అంటూ! మరి నన్నుపొగడడానికి నీకు నోరు రావడం లేదా? చూడగా నువ్వు ఆనందమూర్తిని ప్రేమిస్తున్నట్టుగా కనబడుతోంది" కటువుగా అన్నాడు.

    "ఛ.....ఏమిటండీ ఆపాడు మాటలు? అతడు నాకు అన్నయ్య లాంటివాడు ఇంతనీచంగా  మీరు ఎలా మాట్లాడగలిగారు" కంట తడిపెట్టుకుంది లతిక. వెనక్కి వాలి ఆలోచనల్లో లీనమైపోయాడు ఫణి.

                                                *    *    *

    రెండు రోజులు గడిచిపోయాయి.

    ఎవరి పన్లు వాళ్లు చేసుకుపోతున్నారు. రాత్రి ఎనిమిది గంటలవుతోంది ఫోన్ మోగితే లతిక వెళ్ళి తీసింది. ఆనందమూర్తి మాట్లాడుతున్నాడు ఫణికోసం అడిగాడు. ఇంకా డిస్పెన్సరీ నుంచి రాలేదని చెప్పింది. "అయితే అక్కడికే ఫోన్ చేసి మాట్లాడతాను. రేపు రాత్రి మా ఇంటికి మీరిద్దరూ డిన్నర్ కి రావాలి" అన్నాడు ఆనందమూర్తి.

    "ఏమిటి విశేషం?" అడిగింది లతిక

    "మా మారేజ్ డే! ఫణితో నువ్వు కూడా చెప్పు. నేనూ క్లినిక్ కి ఫోన్ చేస్తాను" ఫోన్ పెట్టేశాడు ఆనందమూర్తి.

    ఫణి ఇంటికొచ్చాక ఆనందమూర్తి ఫోన్ చేసిన విషయం చెప్పింది లతిక  "నాకూ చేశాడు వెళ్దాం" అన్నాడు.

    ఆ మర్నాడు డిస్పెన్సరీ నుంచి త్వరగా వచ్చాడు ఫణి. లతిక ముస్తాబై సిద్దంగా వుంది.  "ఏమండీ! మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? వాళ్ళు మనకిచ్చేరుగా " అంది లతిక నెమ్మదిగా, భయపడుతూనే.

    "ఐ...హేట్...దిస్......హివ్. .... అండ్ టేక్ బిజినెస్! వాళ్ళిచ్చారని మనమూ, మనమిచ్చామని వాళ్లూ ఇలా సాగుతూనే వుంటుంది" విసుక్కున్నాడు.  "జీవితంలో ప్రతిదీ గివ్ అంటే టేక్ సిద్దాంతమే! వాళ్ళిచ్చినప్పుడు మనం పుచ్చుకున్నాంగా. మనం ఇవ్వాల్సొచ్చినప్పుడు ఇలా మాట్లాడితే, ఏమనుకుంటారు."

    ఫణి ఏమీ మాట్లాడలేదు.

    కాస్త ధైర్యం పుంజుకుని, "ప్రేమా, అనురాగం, ఆప్యాయతా, వస్తువులు ఆదరణ, అంతా తల్లీ బిడ్డల మధ్య, ఆలుమగల మధ్య అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, అంతా ఇచ్చి పుచ్చుకోవడమే. అదే జీవితం! అందులోనే ఆనందం. ఎవరికి ఎవరిచ్చిందీ సరిపోదు. అదే జీవితం కాదు. కానీ అవి జీవితాన్ని రసవత్తరంగా మార్చే తీపి గుర్తులు."

     "అయిందా ఉపన్యాసం? సరే పద. అక్కడికి గిఫ్ట్ ఇచ్చిన ఆనందమూర్తి మహా ఉదారస్వభావుడు. ఈ ఫణి ఉట్టి లోభి వెధవ అని నీచేత ఎందుకనిపించుకోవాలి?" అంటూ కారాపి, "ఏం కొందామో చెప్పు అడిగాడు.

    లతిక క్షణంసేపు ఆలోచించి, "వెండి దుకాణానికి వెళ్ళి ఒక మంచి కుంకుమ భరిణె హర్షితకి కొందాం. ఆనందమూర్తికి మీ ఇష్టం" అంది.

    "సరే! వాడికొక నెక్ టై కొనిచ్చేద్దాం" అన్నాడు.

    "హమ్మయ్య" అనుకుంది.

    కారు జేమ్స్ స్టీట్ వైపు మళ్లించాడు. అక్కడ నెక్ టై కొని, పక్కసందులో వున్న వెండి దుకాణాలకెళ్ళి కుంకుమ భరిణె తీసుకున్నారు.

 Previous Page Next Page