Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 16

  

  "నా తమ్ముడిలాగే ఎందుకుండవు?" వసంత ప్రశ్న .

    "నేను తగను __" అన్నాడు గరవయ్య అప్రయత్నంగా.

    సుదర్శనం వింతగా అతడివంక చూసి __ "పొనీలే _ అలాగే మానేద్దువుగాని. ఈ ఒక్కొక్కరోజుకీ నాకు కంపెనీ యియ్యి. ఇది కొత్తసరుకు. మానేసేముందిలాంటి సరుకు రుచి చూడాలి కూడా __"అన్నాడు.

    "మానేసేముందు ....అని సుదర్శనం అనగానే, అప్పుడే తాను తాగుడు మానేసినట్లూ, వసంత తన్ను మెచ్చుకుంటున్నట్ట్లూ ఊహించకుని, ఆనందపడిపోయాడు గరవయ్య.

    "కానీ, ఈ ఒక్కసారికీ మాత్రమెందుకు తాగాలి?" అంటోంది వసంత ఊహల్లో కూడా.

    "పాపం సుదర్శనానికి కంపెనీ కావాలి ......" అని తనకుతానే నచ్చజెప్పుకున్నాడు గరవయ్య.

    బాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లో పోసి _ "సోడా కలపనా?" అన్నాడు. సుదర్శనం.

    అందుకాగానే గ్లాసుల్లో వసంత కనబడింది. గరవయ్యకు.

    "ఈ ఒక్కసారికే అక్కా __ ఇంకెప్పుడూ తాగనుగా ....."

    అక్కా అనుకున్నప్పుడతడు కొద్దిగా తడబడ్డాడు. ఆ తర్వాత తాగుడు మైకంవల్ల అతడి మాటలూ, అడగులూ పూర్తిగా తడబడసాగాయి.

                                                                        11

    అది రమాకాంతం యిల్లు. రాజారావు, రమాకాంతంఎదురుగా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.

    "మీతో పనుండే వచ్చాను....." అన్నాడు రాజారావు.

    "చెప్పండి __" అన్నాడు రమాకాంతం.

    "మీరీ ఊరికి పెద్దలు. నేనేంచేయాలనుకున్నాముందు మీకే చెబుతాను. ఆ ఊళ్ళో రోడ్లన్నీ గతుకులు గతుకులుగా, చాలా అసహ్యంగా ఉన్నాయి ....."

    అతడింకా మాట పూర్తీచేయకుండానే __ " ఎడ్లరోడ్లల్లా గుంటాయ్?" అన్నాడు రమాకాంతం.

     "భాధ్యతగల పెద్దలు నడుంకడితే  __ మంచిరోడ్లెంత సేపు ?" అన్నాడు రాజారావు వెంటనే.

    "అంటే మీ ఉద్దేశ్యం?"

    "మీరీ ఊరి పంచాయితీ అధ్యక్షులు కనుక _ ఊళ్ళో మంచి రోడ్లు వేయించాల్సిన బాధ్యత మీమీద ఉంది."

    "రాజరావుగారూ! ఒకళ్ళచేత నా బాధ్యతలు గుర్తుచేయించుకునే పరిస్థితికి నేనింకా దిగజారిపోలేదు. మా ఊరికి రోడ్లవసరమా, కాదా అన్నది నేనూ, నా ప్రజలూ చూసుకుంటాం , మీరేదో చుట్టపుచూపుగా వచ్చారు కాబట్టి ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకండి _ " అన్నాడు రమాకాంతం తీవ్రంగా.

    "మీరు కాస్త శాంతించాలి. నేను మీరేదో అన్యాయం చేస్తూంటే ఎదుర్కోందుకు వచ్చిన ప్రజానాయకుడ్ని కాదు. మీమీద అభాండాలు వేయాలనుకునే అపోజిషన్ లీదర్నీ కాను. నేనీ ఊరికి చుట్టపుచూపుగా వచ్చాననుకుంటే అది మీ పొరపాటు. ఈ గ్రామం ఉన్నంత కాలమూ _ నేనూ ఇక్కడుంటాను. నేనీ గ్రామం వదిలానంటే అందుక్కారణమీ ఊరు ఏ దుర్మార్గుల కారణంగానో నాశనం కావడమే! మీ బాధ్యతలను మీకు గుర్తుచేస్తే _ కోపమోస్తుందని నేననుకోలేదు."

    రమాకాంతం ఉలిక్కిపడ్డాడు __ "నేనీ గ్రామం వదిలానంటే అందుక్కారణమీఊరు ఏ దుర్మార్గుల కారణంగానో నాశనం కావడమే!" అన్న రాజారావు మాటలాయనంలో వణుకు పుట్టించాయి. ఈ గ్రామం నాశనం చూసికానీ కదలనని రాజారావు తన్ను హెచ్చరించినట్లయింది. ఇతడు నిజంగా నక్సలైటా?

    "నా బాధ్యతలు మీరెందుకు గుర్తుచేయాలి?"

    "మీకు చెడ్డపేరు రాకూడదని __" తాఫీగా అన్నాడు రాజారావు.

    "అంటే!"

    "మా వీధిలో రోడ్డు మరీ అద్వాన్నంగా ఉంది. ఈ విషయమై మా వీధి పెద్దల్ని సంప్రదించాను. రోడ్డువేయడానికి శ్రమదానం చేస్తామంటూ అంతా ముందుకొచ్చారు. ఈ విషయంలో ఏదయినా ఖర్చయితే అది నాదే! మా వీధిలో రోడ్డు మేమే వేసుకుంటాం . అప్పుడు ఊళ్ళో సంచలనం కలుగుతోంది . ప్రతి వీధిలోనూ ఎవరిమటుక్కు వాళ్ళే రోడ్లేసుకుంటే _ పంచాయితీ బిర్డెందుకు, ప్రెసిడెంటుదుకు _ అన్న భావం అందరికీ పలుకుబడితో పదిమంది కుధ్యోగాలు వేయించడానిక్కాదండీ ఊళ్ళోని ప్రజలకుపకారం చేయాలి. ఊరు బాగుచేయాలి. అలా జరగనివాడు మీకు చెడ్డపేరు తప్పదు ....."

    రాజారావు మాటలు రమాకాంతానికి నచ్చలేదు. అయినా  తమాయించుకుని __ "మీరు చెప్పేది బాగానే వుంది కానీ, ఊరి బాగుకోసం నేను శతవిధాల ప్రయత్నిస్తూనే వున్నాను. అది నా ప్రజలకు తెలుసు . రోడ్ల విషయమంటారా! అదంత అర్జెంటు కాదు. మా ఊరి రోడ్లిలా యాభై ఏళ్ళనుంచి ఏ మార్పూ లేకుండా ఉన్నాయి. కానీ ప్రజా జీవితం స్థంభించిపోలేదు. ఊరిమీద వచ్చే ఆదాయం తక్కువ . అది అర్జంటు పనులకే ఉపయోగించాలి. మీరు కుర్రతనపు టావేశంతో కంగారుపడి, నాతో చెప్పకుండా ఏమీ చేయకండి _" అన్నాడు.

    "కంగారుపడి చేసేవాణ్నయితే మీదాదాకా రాకపోదును. నేను మీ అభిప్రాయంతో ఏకీభవించను. ఊరిని చూడగానే, ఇక్కడ ఏళ్ళతరబడి ఏ అభివృద్ధి కార్యక్రమాలూ జరుగలేదనిపిస్తుంది. అందువల్ల పంచాయితీ డబ్బు చాలా వుంటుంది. ఈ ఊరికి మంచి రోడ్లు అర్జంటుగా కావాలి. ఈ ముక్క నేనంటే చాలదనుకుంటే ఊరి ప్రజలచేతే అనిపిస్తాను. కానీ ఈలోగా నాలుగయిదు రోజుల్లో మా వీధిలో మేము రోడ్డేసుకుంటాం ....." అన్నాడు రాజారావు.

    రమాకాంతం ఏదో అనబోయాడు . అప్పుడే లోపల్నుంచి ఓ యువకుడు వచ్చేడు. అతణ్ని చూస్తూనే_ "రావయ్యా రవీ __ రా __ సమయానికి వచ్చావు. నీ కీయన్ను పరిచయం చేస్తాను. ఈయన పేరు రాజారావు. మా ఊరొచ్చి మూణ్నెల్లయింది  __ " అంటూ రాజారావును పరిచయం చేశాడాయన.

    రాజరావా యువకుడి వంక ఆశ్చర్యంగా చూసి ఏదో అనబావుగా _ ఏమీ మాట్లాడవద్దని ఆ యువకుడు కనుసైగ చేశాడు. అది రమాకాంతం గమనించలేదు.

    "ఇతడు మా దూరపు బంధువు. మా పెత్తండ్రిగారిపెత్తండ్రిగారిమనవడు. పేరు రవి. బియ్యే ప్యాసయ్యాడు. పట్నంలో ఉంటున్నాడు పల్లెసీమలంటే మీకులాగే మహాసరదా! మీ గురించి విని, మీతో పరిచయం చేసుకోవాలని మహా ఉబలాటపడ్డాడు. నేనే తీసుకుని మీ యింటికొద్దామనుకుంటున్నాను. ఈలోగా మీరే వచ్చారు...." అంటూ రమాకాంతం పరిచయ వాక్యాలు పూర్తీచేశాడు. 

 Previous Page Next Page