"తప్పకుండా అందజేస్తాన్లెండి!" అన్నాడు రాజారావు. జగ్గారా వతడికి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.
దంపతులిద్దరూ నిద్రకుపక్రమించారు. పడుకునేముందు రాజారావు భార్యతో __" ఈ జగ్గారావేవడో తమాషా మనిషి లాగున్నాడు . నా కతడి వ్యవహారం అనుమానంగా ఉంది. రామాకాంతంగారి ద్వారా ఉద్యోగం సంపాదింఛాలనుకునే వాడు __ ఆయన్ను కలుసుకోకుండా కవరు నాకెందుకిచ్చాడు? తనే స్వయంగా వెళ్ళివుంటే కదా!" అన్నాడు.
ఇంతకీ ఆ కవర్లో ఏముందో?" అంది వసంత.
"అది మనకెలా తెలుస్తుంది?"
"అవును _ దొంగతనంగా చదివితే తప్ప మనకేలా తెలుస్తుంది? దొంగతనంగా చదవాల్సిన అవసరం మనకేముంది?" అంది వసంత.
రాజారావు మనసు కాసేపు వూగిసలాడింది. తానా కవరు విప్పి చదవాలా? అలాంటి అవసరం తనకుందా?
ఆలోచిస్తూనే అతడు నిద్రకు పడ్డాడు.
9
"రండి రండి రాజారావుగారూ _ బహుశాల దర్శనం !" అంటూ ఆహ్వానించాడు రమాకాంతం.
రాజారావు నవ్వుతూ కుర్చీలో కూర్చుని _ "బహుకాలదర్శన మంటారేమిటీ _ పదిరోజుల క్రితం మనం కలుసుకున్నాం _" అన్నాడు.
"భలేవారే _ పది రోజులకోసారిటండీ చూసుకోవడం __ మనవంటి వాళ్ళం _ రోజురోజూ కలుస్తూండాలి మరి!"
"ఏమతితేనేం _ అటువంటి అవకాశ మిప్పుడొచ్చిందిగా __" అని _ "అవును కానీ __ మీకూ ఇంట్రస్టు౦దని తెలిస్తే మనం గ్రామస్థుల చదువు కలిసే ప్రారంభిచేవాళ్ళం కదా! ఇప్పుడు మీరు నాతో మాట మాత్రం అనకుండా వేరే కార్యక్రమ మెందుకు మొదలెట్టారూ?" అన్నాడు రాజారావు.
ఈ సూటి ప్రశ్నకు రమాకాంతానికి వెంటనే జవాబు తట్టలేదు _ "అబ్బే _ ఎక్కువమందికి చేప్పడానికి వీలుగా ఉంటుందని, మీకు తోడుగా మరో అయిదుగురిని నియమించా సంతే!" అన్నాడాయన నీళ్ళునములుతూ.
"థాంక్స్! కానీ ఈ విషయం ముందుగా నా చెవిన వేయాల్సింది _"
"ఏమిటో _ బద్డంకిచేశారండీ!"
"పోన్లేద్దురూ _ దానికేం గానీ, ఈ ఊళ్ళో చదువుకోవాలని ఎందరో కుతూహలపడుతున్నప్పుడు _ చదువు చెప్పడాని కుత్సాహమున్న యువకులున్నప్పుడు _ ప్రజా చైతన్యం కలిగించే ఈ కార్యాక్రమాన్ని మరింత క్రమబద్దంగా నడపాలి. ఇది ఈనాడు పుట్టి,. రేపు చనిపోయేలా ఉండకూడదు. కాబట్టి ఒక వయోజన విద్యాకేంద్రాన్ని స్థాపిస్తాం . ఊళ్ళోచందాలు వసూలు చేద్దాం. మీరు తలచుకుంటే గవర్నమెంటు గ్రాంట్స్ కూడా వస్తాయి మీరు ఊం అన్నారంటే, నేను కార్యరంగంలోకి దూకుతాను __" అన్నాడు రాజారావు ఆవేశంగా _ అన్ని విషయాల్లోనూ మీకు చేదోడు వాదోడుగా ఉంటాను _"
రమాకాంతం నిశ్చేష్టుడయ్యాడు. రాజారావు మీద దేబ్బతీసి, అతడి పలుకుబడి పెరక్కుండా చేయాలనీ తను కొత్త కార్యక్రమం ప్రారంభించాడు. కానీ, అదే అవకాశంగా తీసుకుని, తన పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నాడు రాజారావు నిజంగానే ఇతగాడు ఆసాధ్యుడు. అయితే _ అన్ని విషయాలల్లోనూ మీకు చేదోడు వాదోడుగా ఉంటాను _ అన్న రాజారావు మాట ఆయనకు కొత్త ధైర్యాన్నిచ్చింది రాజారావు వంటివాడు తనకు పోటీగా కాక అండగా వుంటే, యీ వూళ్ళో తనకిక తిరుగుండదు . రాజారావు వాటం చూస్తుంటే పదవీ వ్యామోహం, కీర్తీ దాహం ఉన్నవాడిలా కనబడడం లేదు ఏమయినా తను రాజరావుతో శత్రుత్వం వహించడం మంచిది కాదనుకున్నా డాయన.
"చూడండి రాజారావుగారూ! మీరు వయసులో చిన్నవారు. ప్రతివిషయంలోనూ ఆవేశం పనికిరాదు. ఒక రోజు నలుగురికి చదువుచెప్పి, రేండో రోజున చందాలకంటూ బయల్దేరితే ప్రజలు మన్ని అపార్ధం చేసుకునే అవకాశముంది ముందీ కార్యక్రమాన్ని నలుగురూ మెచ్చేవిధంగా జయప్రదం చెయ్యాలి. ఆ తర్వాత కార్యక్రమం దానంతటదే పడుగేడుతుంది . కాబట్టి మీ రేప్పుడెం చేయాలనుకున్నా నాతో సంప్రదించకుండా చేయకండి. నాబోటి అనుభవజ్ఞల సలహా మీకు చాలా అవసరం _" అన్నాడాయన నెమ్మదిగా, సానునయంగా,
రాజారావు తలూపి _ "అందుకే కదండీ _ అన్నింటికీ మిమ్మల్నే సంప్రదిస్తున్నాను. అన్నట్లు నిన్న జగ్గరావని ఒకతను మా యింటికొచ్చాడు. అతడు మా స్నేహితుడుకి శిష్యుడులెండి. మీ రతడికి ఉద్యోగమిప్పిస్తామని వాగ్ధానం చేశారుటగా _ మిమ్మల్ని కలవడం కుదరలేదనీ, మీ కీకరందజేయమనీ నన్ను కోరాడు _" అంటూ కవరుఆయన కిచ్చాడు.
రామాకాంతం కుతూహలంగా కవరు అందుకుని __"జగ్గారావనే పెరేదీ నాకు గుర్తులేదు. అయినా ఉత్తరం __ చూస్తె ఎవరో తెలుస్తుంది __" అంటూ కవరు చించి ఉత్తరం తీసి చదువుకున్నా డాయన. అది చదువుతూండగా అయన ముఖంలో చాలా మార్పులోచ్చాయి. చదవడం పూర్తీచేసి రాజారావువంక తీక్షణంగా చూశాడాయన .
రాజారావు కుతూహలంగా ఆయనవంక చూస్తున్న వాడల్లా _ అయన చూపుల కులిక్కిపడ్డాడు _" అదేంటండీ? ఏమయిందీ _ అలా చూస్తున్నారు!"
ఏదో అనబోయి తమాయించుకుని _" ఆ జగ్గారావిదేనా ఇక్కడికి రావడం?" అన్నాడాయన .
పూర్వం జగ్గారావు తనింటికి వచ్చిన వైనం చెప్పాడు రాజారావు అంతా విని రమాకాంతం రాజారావు వంక అనుమానంగా చూసి _ " ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మడానికి లేదండీ _ అసలేవర్ననేం లాభం _ప్రభుత్వమే అలాగేడుస్తోంది! సరే _ పాపం _ మీరొచ్చి చాలాసేపయినట్లుంది ...." అన్నాడు.
రాజారావు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతడిలా వెళ్ళగానే రమాకాంత౦ పాలేరుచేత కరణంగారింటికి కబురంపించాడు. కనకరాజు ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వచ్చాడు.
"అతగాడీ వూళ్ళో ఊరికే మకాం పెట్టలేదు __" అన్నాడు రమాకాంతం, కనకరాజును చూస్తూనే
"అతగాడంటే ఎవరూ?" అన్నాడు కనకరాజు.
"అదే _ రాజారావు. ఈ ఉత్తరం చదవండి. అతడూరికి వచ్చిన కొత్తలో ఎవర్నయితే విందుకాహ్వానించాడో __ ఆ పేరే ఈ ఉత్తరంలోనూ ఉన్నాయి. ఎవడో జగ్గారావనేవాడు తనకీ కవరిచ్చి నా కిమ్మని చెప్పాడని అంటున్నాడు కానీ, నాకావిషయం నమ్మతగ్గదిగా లేదు ....." అన్నాడు రమాకాంతం.
కనకరాజూ ఉత్తరం అందుకుని చదివాడు. అయన ముఖంలోనూ రంగులు మారాయి. అయితే అయన కాసేపాలోచించి _ మీ రావేశంలో కంగారుపడుతున్నారు గానీ _ రాజరావీ ఉత్తరం రాసుండడు. ఈ ఉత్తరంలో ఏం రాసుందో అతగాడికి తెలిసుండదు. నిజంగా ఎవడో జగ్గరావే ఈ ఉత్తరాన్నతడికిచ్చి ఉంటాడు . ఎందుకంటే తను రాసిన ఉత్తరాన్ని మీ కందజేయడానికి రాజరావింత తెలివితక్కువ పద్దతి అవలంభించడు. రహస్యంగా మీ కందేలా చేసివుండే వాడు. ఎవడూ కోరి తనమీదకు అనుమానం తెప్పించు కోడు. అతడు మన అయిడుగుర్నీ విందుకు పిలిచాడంటే _ మనం గ్రామపెద్దలమనే గదా __" అన్నాడు.