అందరూ పనులు కూడా మానేశారు. ఎవరూ పనులకు వెళ్ళడం లేదు ఆఫీసులు, పాఠశాలలు, ఫ్యాక్టరీలు అన్నీ మూతపడిపోయాయి. బతికేది వారంరోజులే అని తెలిసిపోయినప్పుడు ఎవరు పనులు చేస్తారు? బస్సులు, రైళ్ళు, విమానాలు, తిరగడం లేదు మరీ ఎమర్జెన్సీగా వెళ్ళేవాళ్ళ కోసం ఒకటో రెండో బస్సులు తిరుగుతున్నాయి. అవీ ఈరోజే. రేపుంటాయన్న నమ్మకం లేదు"
ఆ మాటలు వింటున్న సూర్యాదేవికి గుండె నొక్కుతున్నట్లని పించింది. ఇలా జరిగితే మరి జగదీష్ ఎలా వస్తాడు? విమానాలు నడవక పోతే మధ్యప్రదేశ్ నుంచి ఎలా రాగలడు? ఈ వారం రోజులు తను ఒంటరిగా నలిగిపోవలసిందేనా? దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకి.
వడివడిగా అడుగులు వేసింది. కొట్టు ముందు చాలా క్యూ వుంది. చాలా కొట్లు మూసివేయబడ్డంతో అక్కడ రద్దీగా వుంది. క్యూలో నిలిచింది.
"పదండయ్యా బాబూ పదండి క్యూలోనే వారమంతా అయిపోయే టట్లుంది బతికినంత కాలమూ టెన్షన్ తో భార్యాబిడ్డలతో కూడా మనసారా మాట్లాడింది లేదు. ఇప్పుడైనా తలుపులు బిగించుకుని హ్యాపీగా కుటుంబంతో గడపనివ్వండి కదలండి" ఎవరో వెనుకనున్న వ్యక్తి అరుస్తున్నాడు.
సూర్యాదేవి వంతు వచ్చేటప్పటికి పావుగంటైంది. రైస్ కొనుక్కుని ఇంటి ముఖం పట్టింది.
ఓ గుంపు ఎదురైంది భజనబృందం తన్మయత్వంతో దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు ఇక్కడినుంచి సరాసరి స్వర్గానికి చేర్చనున్న అభ్యర్దన వాళ్ళ ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
మరో కుర్రకారు బ్యాచ్ ఎదురైంది. వాళ్ళంతా తాగున్నారు చేతుల్లో బీరు బాటిళ్ళున్నాయి.
"అయిపోయింది అంతా అయిపోయింది అనుభవించండి గురూ, చచ్చిపోయాక తాగాలన్నా తాగలేము అనుభవించు రాజా!" ఓ యువకుడు జనాంతికంగా అరుస్తున్నాడు.
ఆమె చిన్నగా నవ్వుకుంది. రకరకాల మనుషులు చచ్చిపోతున్నామని తెలియగానే ఎవరికివారు తమ పద్ధతుల్ని ఎంచుకున్నారు. ముసలీ ముతక దేవుడ్ని కొలుస్తుంటే, భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు తలుపులు మూసుకుంటున్నారు.
మరికొందరు ఏదో జరుగుతుందన్న భరోసాతో వున్నారు. మరి కొందరు దీనిని కొట్టి పారేస్తున్నారు. మరికొందరైతే పిచ్చిపట్టి ఏడుస్తున్నారు.
రకరకాల మనస్తత్వాలు, మనిషి మనిషికీ ఎంత భేదం ఇంత భేదం వుంటుంది కాబట్టే మనిషి ప్రవర్తన ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేం. లైబ్రరీల నిండా పుస్తకాలు నిందుకు పోతుంటాయి గానీ మనిషి ఫలానా సమయంలో ఫలానా విధంగా ప్రవర్తిస్తాడన్న జనరలైజేషన్ లేదు. జంతువు నుంచి వచ్చిన మానవుడు తన పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పించుకోలేడేమో, తప్పులు చేస్తూ, సరిదిద్దుకుంటూ సాగవలసిందే.
సూర్యాదేవి ఇంటికి చేరుకుంది.
కొద్దిగా అన్నం వండుకుంది. ఆ అన్నం, మరికొన్ని పళ్ళు తిని భోజనం ముగించింది.
టీ.వీ. ఆన్ చేసింది. చాలా ఛానల్స్ లో ఏమీ రావడం లేదు. బిబిసీ వరల్డ్ న్యూస్ మాత్రం వస్తోంది.
ఈ వార్త తాలూకు ప్రభావం ఏ దేశం మీద ఎలా వుందో వివరిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో తిండిగింజలు కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఒకరి నుంచి ఒకరు తిండి గింజలు లాక్కుంటున్నారు. కొట్టుకుంటున్నారు. చంపుకుంటున్నారు. మరీ తెలివైనవాళ్ళు, గూండాలు, సైనికులు ఎక్కువెక్కువగా ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నారు.
అమెరికా లాంటి సంపన్న దేశాల్లో విందులు, వినోదాలతో జనం ఊగిపోతున్నారు.
పాటలతో, నృత్యాలతో స్టేడియంలు, ఇళ్ళు, అపార్ట్ మెంట్లూ హోరెత్తి పోతున్నాయి.
ఇంటియాలాంటి వర్ధమాన దేశాల్లో అటూ ఇటూ కాకుండా వుంది పరిస్థితి.
కొందరు తిండిగింజల కోసం నానాతిప్పలు పడుతుంటే, మధ్య తరగతివాళ్ళు, సంపన్నులు తమ తమ పరిధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రపంచం మొత్తం మీద బస్సుగానీ, రైళ్ళుగానీ, విమానాలుగానీ తిరగడం లేదు. అంగళ్ళు అనేవి లేవు. చాలా దుకాణాల్లో వస్తువులన్నిటినీ జనానికి పంచేశారు. పంచేస్తామన్నా తీసుకునే వాళ్లేరి?
ఢిల్లీలో, బాంబేలో అయితే కరెన్సీ నోట్లు వీధుల్లోకి విసిరేయడం వలన ఎక్కడ చూసినా వందలు, పదులనోట్లు కనబడుతున్నాయి. జనం వాటిని తాకడం కూడా లేదు డబ్బుతో ఏం చేస్తారు?
డబ్బుకు విలువ పోయిన ఆ క్షణాన్ని ప్రపంచం ఇరవై నాలుగు గంటలకు ముందు ఊహించి అయినా ఊహించి వుండదు. కొన్ని నగరాల్లో నివసించే మిలియనీర్లకు పిచ్చిపట్టి పోయింది.
తాము సంపాదించైనా ఎస్టేట్లు విస్తరించిణ వాణిజ్య సామ్రాజ్యాలు ఎందుకూ కొరగాకుండా పోవడంతో మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఇలా ఎన్నెన్నో సంఘటనలు, సెకనుకో దృశ్యాన్ని చూపిస్తున్నా తరగడం లేదు.
దాన్ని ఆపుచేసి దూరదర్సన్ పెట్టింది.
అది పనిచేస్తోంది. వార్తలు వస్తున్నాయి. కరెంటు, హాస్పిటల్స్ లాంటివి పనిచేయటానికి వాలంటరీ దళాల్ని ఏర్పాటు చేసుకోమంటున్నారు. ఇప్పటికే చాలా నగరాల్లో ఇవి ఏర్పాటయ్యాయి.
ఈ వార్తల మీద రాజకీయ నాయకుల ప్రతిస్పందన, కొంతమంది శాస్త్రవేత్తల ఇంటర్వ్యూల తరువాత సినిమాపాటలు వేస్తున్నారు. సూర్యాదేవి అలా చూస్తూ ఉండిపోయింది.
19
రెండోరోజు పేపరు కూడా రాలేదు. వార్తాపత్రిక రావాలంటే పనివాళ్ళు వెళ్ళాలి కదా వాళ్ళూ వెళ్లుండరు. అందుకే వార్తాపత్రిక వచ్చుండదు. పగలూ, రాత్రీ వీధుల్లో జనంతో సందడిగా వుంది. పిల్లలూ, పెద్దలూ తమ అభిరుచుల మేరకు ఆటలాడుతున్నారు.
సాయంకాలమైతే పాటలూ, డ్యాన్సులూ, మధ్య మధ్య మూడ్ రాగానే ఇళ్ళల్లోకి దూరి తలుపులు వేసుకుంటున్న జంటలు...
పెళ్ళికాని యువతలు-యువకులు ఎవరో ఒకర్తో సెటిలై ఎంజాయ్ చేస్తున్నారు. వృద్దులైతే భజనలు వదలడం లేదు. తాగుడు మరీ మితిమీరి పోయింది. కొత్త కొత్త వంటకళతో ఇల్లు ఘుమ ఘుమలాడి పోతున్నాయి.
శుక్రవారం తెల్లవారేటప్పటికి సీన్ లు మరింత మారిపోయాయి. చాలామంది ఏడుస్తున్నారు. మరికొంతమంది తల్లులైతే పిల్లల్ని కౌగిలించుకుని వదలడం లేదు. ఒకరికొకరు ఓదార్చుకుంటున్నారు.
ఆరోజు సాయంకాలం అయిదు పదిహేను నిముషాలకు డిసాస్టర్ ప్రారంభమవుతుంది. తోకచుక్కలోని భాగం భూమిని ఢీకొంటుంది. భూమికి మరింత దగ్గరగా వస్తున్న ఆ తోకచుక్క నమూనాని టీవీల్లో కూడా చూపిస్తున్నారు. మరింత దగ్గరగా వస్తున్న ఆ తోకచుక్క నమూనాని టీవీల్లో కూడా చూపిస్తున్నారు.
మధ్యాహ్నమైంది.
జనమంతా ఇళ్ళనుంచి బయటకొచ్చేశారు. ఏడుపులు, పెడబొబ్బలు, హాహాకారాలు- భీభత్సంగా వుంది పరిస్థితి.


