Previous Page Next Page 
రీవెంజ్ పేజి 9

    "ఒకవేళ మీలో ఎవరినైనా చేసుకోవలసివస్తే మాత్రం ఇందాక విజిల్ వేసి పిలిచిన అమ్మాయిని మాత్రం చేసుకోనంతే!" ఠక్కున చెప్పాడు.

    "భలేవారే....? ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారు..."

    ఆ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కనీసం ఓ యాభైవేలన్నా తక్కువ ఇచ్చుకోవలసి ఉంటుంది. మిగతా ఎవరినైనా అయితే లక్షరూపాయిల కట్నం చాలు" చెప్పింది సుజిత. ఎవర్ని చేసుకోవాలన్నది మీ ఆర్ధిక స్థోమత మీద ఆధారపడి వుంది. సో ఎవర్ని చేసుకోవాలన్నది మీరే సైడ్ చేసుకోండి.

    నవ్వుతూనే కాస్త సీరియస్ ని మిళితం చేసి చెప్పింది అన్విత.

    "వ్వాట్! అంటే మీరందరూ కట్నం ఇవ్వకుండా! ఎదురు కట్నం ఇస్తే చేసుకుంటారా" తెల్లబోయాడా వ్యక్తి.

    "లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికొచ్చి, పెద్ద పెద్ద చదువులు చదువుకొని మీలాంటివాళ్ళను కొనుక్కుంటామనుకున్నారా..." సుజిత రోషంగా అడిగింది.

    "మా బావను ఇలా ఏడిపిస్తే నేను ఊరుకోను, అసలే మా బావకు చచ్చేంత సిగ్గు, కదు బావా.... కాస్తంత సిగ్గుని అభినయిస్తూ అడిగింది రిమి.

    స్వంత మరదలితోనే స్వతంత్రించి మాట్లాడలేదు అటువంటిది అమ్మాయిలందరూ కలసి ఏడిపిస్తుంటే తట్టుకోలేకపోయాడు.

    "హలో మిస్టర్! ఇంతకీ మన పేరు చెప్పలేదు. మీరు మాలో ఎవర్ని చేసుకోయేది అసలే చెప్పలేదు." మళ్ళీ ప్రయత్నించింది రిమి.

    అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. తనకేదో స్పృహ తప్పుతున్నట్లు తిరుగుతున్నట్లనిపించసాగింది. మరికొంత సేపక్కడుంటే తనకి నిజంగానే పిచ్చెక్కుతుందేమో అన్న అనుమానం తొలిసారిగా ప్రవేశించిందతనిలో.

    అక్కడి నుంచి బయట పడటం కోసం నిజమే "నాకు మెంటల్ మా నాన్నకు మెంటల్ ఆ చెట్టుకి మెంటల్. అసలీ ఊరికే మెంటల్" అనుకుంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోయాడతను.

    ఒక వ్యక్తిని సంతృప్తిగా బాచ్ అందరు హాయిగా నవ్వి ఐస్ క్రీమ్ పార్లల్ వైపు నడిచారు.


                             *    *    *


    ఖాళీగా నిశ్శబ్దంగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ లోకి హటాత్తుగా దూసుకు వచ్చిన అన్వితా మిత్ర బృందాన్ని చూసి కాళ్ళు బల్లపై పెట్టి తీరిగ్గా కూర్చున్న షాప్ మేనేజర్ కమ్ ఓనర్ కంగారుపడి హడావుడిగా సర్దుకుని కూర్చున్నాడు. ఒక వైపు భయంకరంగా కురుస్తున్న వర్షం. ఈ వర్షంలో వీళ్ళందరూ తలదాచుకోటానికి వచ్చారా లేక ఐస్ క్రీమ్ తినటానికి వచ్చారా అన్న సందిగ్ధంలో పడ్డాడు. ఏం కావాలో చూడమన్నట్లు బేరర్ కి కళ్ళతోనే సైగచేశాడు. వాళ్ళదేమీ పట్టించుకోకుండా సరాసరి టేబుల్ దగ్గరకు వెళ్ళి బేరర్ ని పిలిచారు.

    "మేడం! ఏం తీసుకుంటారు..." వినమ్రతతో అడిగాడు బేరర్.

    అన్విత ఐస్ క్రీమ్స్ కి ఆర్దరివ్వబోయి కాసేపాగింది మిగతా వాళ్ళ అభిప్రాయం కోసం. నాకు హనీమూన్ స్పెషల్ అంది సుజిత నాకు చాకొలెట్ రిపిల్ అంది రిమి. ఇలా లాభంలేదని అందరి తరపున స్ట్రింగర్ స్పెషల్ ఆర్ధరిచ్చింది.

    పదినిముషాల తరువాత బేరర్ నిశ్శబ్దంగా ఐస్ క్రీమ్స్ సర్వ్ చేసి దూరంగా నిలబడ్డాడు, వాళ్లు మాటలాడుకుంటున్న మాటలు వింటూ.

    అమెరికా అంతరిక్ష యుద్ధం దగ్గర నుంచి రాజీవ్ గాంధి ఎగైనెస్ట్ ప్రెస్ బిల్లు వరకూ మాట్లాడుకున్నారు - ఐస్ క్రీమ్స్ తింటూనే పదినిముషాల తరువాత వాళ్ళ టాపిక్ ప్రేమల మీదికి మళ్లడంతో వాతావరణంలో కాస్త సీరియస్ నెస్ చోటు చేసుకుంది.
    "ప్రేమ పై నీ అభిప్రాయమేమిటి 'అనీ' ...? అన్వితను ప్రశ్నించింది సుజిత
   
    "ఇంటర్వ్యూ చేస్తున్నావా....? ప్రేమ గురించి అయితే నాకు తెలిసినంతవరకు మంచి అమ్మాయేకాని చదువులోనే కాస్త పూర్!"

    "ప్రతిసారి నువ్విలా జోక్ గా తీసి పారేయటం బాగోలేదు... అయినా నీకంటూ ప్రతి విషయంలోనూ అభిప్రాయాలు వున్నాయి. కాని ఈ విషయంలోనే నీకు సరైన అవగాహన లేదని మేమనుకుంటున్నాము. ఐ మీన్. నీకు ప్రేమించడం చేతకాదనికాదు."

    "ప్రేమ గురించి అభిప్రాయం అడిగావు కాబట్టి నేను ప్రేమించిన తరువాత నా అభిప్రాయం చెబుతాను" నవ్వుతూనే చెప్పింది అన్విత.

    "నువ్ సీరియస్ గా తీసుకోనంటే ఒక విషయం అడుగుతాం?" ప్రశ్నించింది రిమి.

    ఏమిటన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది అన్విత.

    "నువ్ అందంగా వుంటావన్న ధీమా వల్లా.....? అందర్నీ నీ చుట్టు తిప్పుకుంటావ్. అసలు నీకు ఎవరినైనా ప్రేమించే వుద్దేశ్యం ఉందా..." ప్రశ్నించింది మమ్మి.

    "నువ్వలా అడగడంలో తప్పులేదు. కాని, నేను కోరుకునేది స్వచ్చమైన ప్రేమ అందులో స్వార్ధం, అపోహలు వుండవు. నా చుట్టు తిరిగే వాళ్ళందరిలోను ఏదో స్వార్ధం కనబడుతోంది అయినా వాళ్లంతట వాళ్ళే అదే పనిలా నా చుట్టు తిరుగుతుంటే నేను చేసేది మాత్రం ఏముంది"

    "మరి మిత్రా కూడా అలాగే ప్రేమిస్తున్నాడంటావా...? ప్రశ్నించింది రిమి.
 

 Previous Page Next Page