నువ్వే చెప్పు" అన్నాడు విశ్వం.
"అతణ్ణి కలుసుకున్న తర్వాత గాని మనం ఏం చెయ్యాలో నిర్ణయించలేం."
"మీ అన్నయ్య మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు అభ్యంతరం లేదుగా?"
"నాకా? అభ్యంతరమా? నన్ను నలువైపుల నుంచీ బంధించారు. నా తల్లి దండ్రుల ముందు అపరాధిగా నిలబెట్టారు. నాకు ఇష్టం లేని పెళ్ళి చేశారు. వాళ్ళిద్దరి అంతు చూస్తాను." రవి గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. మెడ మీద నరాలు తేలాయి.
విశ్వం తనలో తనే నవ్వుకున్నాడు. అతడికి కావాల్సింది అదే.
"ఆలస్యం ఎందుకూ? రేపే వెళ్దాం" అన్నాడు విశ్వం.
"రేపు రాత్రి బస్సుకు టికెట్స్ బుక్ చేస్తాను"
"అలాగే"
3
ఇందుమతి చెప్పినదంతా మౌనంగా విన్నాడు గౌతమ్.
దీర్ఘాలోచనలో పడిపోయాడు.
"నేను భ్రమ పడ్డానంటావా?"
ఓ క్షణం అలోచించి "కావచ్చు" అన్నాడు.
"ఏమిటి నీ ఉద్దేశ్యం? గేటు తీసుకుని మనిషి బయటకు రావడం గేటు శబ్దం వినడం, నేను వెనక్కు తిరిగి చూస్తే గబగబా వెళుతున్న మనిషి కనిపించడం నీ పేరు పెట్టి నేను పిలవడం, అతడు ఓ క్షణం ఆగి వెనక్కు చూసి గబగబా వెళ్ళిపోవడం -----అవన్నీ భ్రమలే అంటావా?" ఆవేశంగా అడిగింది.
"అవన్నీ భ్రమలనడం లేదు."
"మరి?"
"ఎవర్నో చూసి నేను అనుకోవడం...."
"ఎవర్నో కాదు....."
"నన్నే చూశావా?" పకపక నవ్వాడు గౌతమ్.
"అచ్చం నీలా ఉన్నావాణ్ణి చూశాను. ఇదెలా సాధ్యమో నాకు అర్ధం కావడం లేదు."
గౌతమ్ ముఖం గంభీరంగా మారింది. ఆలోచనలో పడ్డాడు.
అవును! తను ఈ విషయం గురించి ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించ లేదు. తనను అనేకసార్లు ఎవరోగా భ్రమపడి ఎవరెవరో పలకరించడం జరిగింది. తను అప్పుడు ఆ విషయాన్ని అంత సీరియస్ గా ఆలోచించలేదు.
అతని పేరు కూడా గౌతమ్, అంతా తన పోలిక, ఇద్దరూ ఒక చోట ఉంటే బాగా తెలిసన వాళ్ళకు భేదం కనిపించవచ్చును. ఆ మాటకొస్తే తనను రవి స్నేహితులు కూడా అదాటున చూసి రవి అని భ్రమ పడటం ఎన్నోసార్లు జరిగింది. అయితే రవి తన సోదరుడు. పోలికలుండటం సహజం. మరి అతడో!
ఆతడు కూడా తన సోదరుడా? తామిద్దరూ కవల పిల్లలు కాదు కదా? అమ్మ అవివాహితగా ఉన్నప్పుడు ఇద్దరూ పుట్టి ఉండాలి. ఒకణ్ణి ఎవరికైనా పెంపుకు ఇచ్చి ఉండాలి.
"ఏమిటి గౌతమ్ అంతగా ఆలోచిస్తున్నావ్?"
"అదే! నా పోలికలతో మరొకడు ఉండటం గురించే."
"ఇప్పుడు నాకు అనిపిస్తోంది అంటీ అతణ్ణి చూసే షాక్ అయి ఉంటుందని . ఆరోజు కలవరించింది కూడా."
"ఏమని?"
"వెళ్ళిపో! ప్లీజ్ , వెళ్ళిపో , నిన్ను నేను చూడలేను. ప్లీజ్ వెళ్ళిపో అంటూ పలవరించింది.
"అంటే అతడెవరో అమ్మకు అప్పుడే తెలిసి వుండాలి" సాలోచనగా అన్నాడు.
"నాకూ అలాగే అనిపిస్తున్నది. అంటీ ఇప్పుడెలా ఉంది?"
"చాలా దిగులుగా కనిపిస్తోంది. అమ్మ ఏడవడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. నాన్న చచ్చిపోయినప్పుడు. అదీ కొన్ని రోజుల తర్వాత ఏడ్చింది. ఉదయం నన్ను చూడగానే పిచ్చిగా ఏడ్చింది. అలా ఏడవడం ఎన్నడూ చూడలేదు. కారణం అడిగితే చెప్పదు. బహుశా అతను కూడా...." ఆపై మాటలు మింగేశాడు.
ఇందుమతి గౌతమ్ ముఖంలోకి చూసి ఏదో అనబోయి ఆగిపోయింది.
ఎదురుగా తల్లి అటో దిగడం కనిపించి చివ్వున లేచి ఆమెకు ఎదురు వెళ్ళింది ఇందుమతి.
"గౌతమ్ బాగున్నావా?" అని కుర్చీలో అలసటగా కూలబడింది.
"కాఫీ తెస్తాను"
"నువ్వెందుకమ్మా, వంటమనిషి రాలేదా?"
"వచ్చింది, కాఫీ పెట్టమని చెప్పి వస్తాను." అని లోపలకు వెళ్ళింది ఇందుమతి.
"అంటీ మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆ అమ్మాయి ఆత్మహత్య చెసుకుందా?"
"మాములు కధే. రుక్మిణికి కోపం ఎక్కువట పెళ్ళికి ముందే ఆమె ఎవర్నో ప్రేమించిందంట, ఆ సంగతి తెలిసి తన కొడుకు పెళ్ళాన్ని ఏలుకుంటున్నాడట. అయినా, ఆ అమ్మాయి మనసంతా అతడి మీదే ఉండేదట. వెధవ పుస్తకాలు చదువుతూ కూర్చునేదట. అత్తగానీ, భర్త గానీ చిన్నమాట అంటే బెదిరించేదట. "నేను చచ్చి మిమ్మల్ని ఉరికంబం ఎక్కిస్తాను' అని మాటకు ముందు బెదిరించేదట , ఆ బెదిరింపులకు కారణం మాలాంటి వాళ్ళేనట. పేపర్లు కూడానట....."
"ఎవరన్నారు?" ఇందుమతి అందుకుంది.
"ఇంకెవరు అత్తా, భర్తా!"
"మరి తల్లీ తండ్రి ?" గౌతమ్ అడిగాడు.
"వాళ్ళు లబోదిబో మంటున్నారు. తమ కూతుర్ని నిలువునా కాల్చి చంపారంటున్నారు. భర్త పెట్టె బాధలు, అంత దౌర్జన్యం గురించి చెప్పుకొని ఎన్నోసార్లు ఏడ్చిందట. అత్తవారింటికి వెళ్ళననీ , వెళ్ళితే తనను చంపేస్తారనీ ఎడ్చేదట...."
"అయినా వాళ్ళు నయానా భయానా కూతుర్ని ఆ నరకంలోనే పంపించేరన్నమాట!"
"అంతకంటే ఏం చేస్తారు?"
"అదేమిటి, అంటీ మీరూ అలాగే అంటారు? తెలిసి తెలిసి అక్కడికే పంపించే తల్లి దండ్రులు అపరాదులు కారా? కూతురికి తమ ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందా? అత్తవారి వైపు వారికీ చంపే అవకాశం ఉంటుందా? ఇలాంటి కేసుల్లో అత్తమామలతో పాటు తల్లి దండ్రుల్ని శిక్షించాలి." ఆవేశంగా అన్నాడు గౌతమ్.
"అలా శిక్షించడానికి లా అంగీకరించదుగా? అయినా, తల్లి దండ్రులు పాపం కూతురి సంసారం బాగుపడాలని తాపత్రయపడ్తారు గాని, చెడి పోవాలని అనుకోరుగా?"
"అది నిజమే . కాని సంసారం బాగుపడే మార్గం లేదని తెలిసినా ఆడపిల్ల చావైనా బతుకైనా ఆత్త వారింట్లోనే అనే చాదస్తంతోనే తల్లి దండ్రులు అలా ప్రవర్తిస్తారు. మీ ఉద్యమంలో తల్లిదండ్రులు చందాసం పోగొట్టే కార్యక్రమం కూడా చేర్చండి అంటీ.
"కరెక్టు! " గలగల నవ్వింది ఇందుమతి.
"ఇన్నిటికీ పోలీసు కేసు ఏమని నమోదు చేశారు?"
"ఆత్మహత్య అనె౧ ఆత్య అని రుజువు చెయ్యడానికి సాక్ష్యాధారాలు లేవంటారు."