Previous Page Next Page 
భామ కలాపం పేజి 9

 

    సుదీరకి ఆ తరువాత ఇంకేం చెయ్యాలో అర్ధం కాలేదు. రాజు కంటే మొండివాడు బలవంతుదంటారు.

 

    మాట్లాడకుండా లేచి నిల్చుని ప్రత్యర్ధిని అంచనా వేసి చూస్తున్నట్లు దాన్ని చూసింది. చిలక కూడా అంత సేపూ సుదీర వైపు బోర్ గా చూసింది. చూసి చూసి తేలిగ్గా ఒక మాట అనేసింది. తన చెవులకి తనే నమ్మలేక పోయింది సుదీర. షాక్ తగిలినట్లు ఒక్క అడుగు వెనక్కి వేసి "వాట్!" అంది సంభ్రమంగా.

 

    మళ్ళీ ఒకసారి సుదీర కి తనేం చేస్తుందో చెప్పింది చిలక.


    సుదీర అప్రయత్నంగా అటూ ఇటూ చూసింది. ఎవరన్నా విన్నారేమో అని. అక్కడ ఎవరూ లేరు గనక తన పరువు దక్కింది.

 

    అప్పుడు గుర్తొచ్చింది సుదీరకి. అచిలకని అమ్మిన భాన్ సాబ్ చెప్పిన ఒక విషయం "దీన్ని ఇదివరకు ఒక నావికుడు పెంచాడమా!" అతనితో బాటు షిప్పులో ప్రపంచమంతా తిరిగి వచ్చింది ఇది!"


    నావికులు ఉపయోగించే భాషా , ఉతపదాలు దీనికి బాగా అలవాటయినట్లున్నాయి.

 

    "నోర్ముసుకుని పడి ఉండు!" అంది సుదీర చూపుడు వేలితో చిలకని బెదిరిస్తూ.

 

    చటుక్కున ఆ వేలిని కొరికి, "నోర్ముసుకుని పడి ఉండు!" అంది చిలక.

 

    ఉక్రోషంగా నిస్సహాయంగా చూస్తూ మంచం మీద కూర్చుంది సుదీర.

 

    ఆ రాత్రంతా దాని వాగుడుతోనే నిద్ర లేకుండా గడిచిపోయింది.


    "సుదీరా! లేచావా?" అంటూ లోపలికి వచ్చింది సీత. అప్పటికే ఆమె తలంటి పోసుకుని పట్టుచీరే కట్టుకుని ఉంది.

 

    "జస్ట్ గిమ్మీ టెన్ మినిట్స్ మమ్మీ!" అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది సుదీర.

 

    అరగంట తరువాత........

 

    ఆ చీకటిలో మూడు కార్లు రత్నాకరరావు ఇంటినుంచి బయలుదేరి వాళ్ళ గార్డెన్ వైపు సాగిపోయాయి.


    కార్లు గార్డెన్ గేట్లోకి ప్రవేశిస్తుంటే మేకల అరుపులు వినపడ్డాయి. గొంతు కోస్తుంటే ఏడ్చే మేకల అరుపులు.

 

    కారు దిగగానే అక్కడ పేము కుర్చీలో కూర్చున్న ఒకాయనకి పాదాభివందనం చేశారు సీత రత్నాకర రావు.


    అయన పేరు చింతకాయల బాబా.

 

    బాబా వాళ్ళిద్దరి నెత్తి మీదా తన పాదాలు ఉంచి ఆశీర్వదించాడు. దూరం నుండే నమస్కారం చేసింది సుదీర.

 

    "అంతా రేడియేనా, స్వామి?" అంది సీత.

 

    "ఆహా! అంతా రెడినే! ముందు నువ్వు కొలను లోకి దిగి స్నానం చెయ్యి తల్లి!"

 

    సీత కొలనులోకి దిగుతుంటే చూసింది సుదీర. ఆమెకి ఉపిరాగిపోయినట్లనిపించింది.

 

    ఆ చిన్నకొలనులో నీళ్ళు లేవు. నీళ్ళకు బదులు రక్తం ఉంది.

 

    కొన్ని వందల మేకలని చంపితే గాని అంత రక్తం రాదు.

 

    తన ఒంట్లో రక్తం గడ్డ కట్టినట్లయి పోయింది సుదీరకు. స్తంభించిపోయింది.


    కొలనులో మునిగి లేచిన సీత శరీరానికి చిక్కగా అంటుకుంటుంది రక్తం. చాలా పెద్దగా మంత్రాలు చదువుతున్నాడు.


    మూడుసార్లు రక్తంలో మునిగి బయటికి వచ్చింది సీత.


    "ఇష్టపదవి ప్రాప్తిరస్తు!" అని ఆశీర్వదించాడు బాబా.


    వినయంగా నమస్కరించింది సీత. ఆమె శరీరం మీద రక్తం జేగురు రంగులో గడ్డ కడుతోంది.


    తరువాత రత్నాకరరావు కొలనులోకి దిగాడు. అతని వ్యాపారం శతాధికం కావాలని ఆశీర్వదిస్తూ మంత్రాలూ చదివాడు చింతకాయల బాబా.


    "మా అమ్మాయి చదువు పూర్తీ చేసుకుని అమెరికా నుంచి వచ్చింది స్వామి! తనని కూడా బిజినెస్ లో పెట్టాలని ఉంది. అమోఘంగా ఆశిర్వదించండి" అంది సీత.


    "అలాగే! అమ్మాయిని గూడా మడుగులో దిగి స్నానం చేయమనండి" అన్నాడు బాబా.


    సీత సుదీరని పిలవడానికి తిరిగి చూసేసరికి అప్పటికే కారు స్టార్టు చేసి సిటి వైపు వెళ్ళిపోతోంది తను.


    సీత మొహంలో చిరాకు కనబడింది. "ఉడుకు రక్తం! పెద్దవాళ్ళు చెప్పినట్లు చెయ్యాలన్న జ్ఞానం ఏ కోశానా లేదు!" అని విసుక్కుంది పళ్ళ బిగువున.


    బాబా చిన్మయనందంగా నవ్వాడు.


    "పూజ పూర్తయింది! నాకింక మంత్రి పదవి ఖాయమేనంటారా స్వామి?" అంది సీత ఆరాటంగా.


    ముమ్మటికిను! అయితే మూడు రకాల పూజలు పూర్తీ చేస్తేనే అది సిద్దించేది. మిగతా రెండు ముగిస్తే నువ్వు పదవి వెంట పడనక్కర్లేదు. పదవే నీ వెంట పడి వస్తుంది తల్లీ!"


    "ఆ మిగతా రెండు పూజలూ ఏమిటో చెప్పనే లేదు స్వామీ!"


    "రెండోది చాలా సులభమే!" అంటూ అదేమిటో చెప్పాడు బాబా, సీత నవ్వింది.


    "ఇకపోతే మూడోదే కాస్త కష్టసాధ్యమైనది."

 

    "మనకు అసాధ్యమైనది ఏది లేదు స్వామి? ఏం చెయ్యాలో చెప్పండి."

 

    ఒక్కొక్క అక్షరం విడివిడిగా పలికాడు బాబా "న ర బ లి!"


    ఆ అక్షరాలూ ఉచ్చరిస్తున్నప్పుడు అతని పెదవుఅల ప్రకంపనానికి ఆ తోటలోని చిగురుటాకులన్ని సన్నగా వణికాయి.


    సుదీర ఇంటికి తిరిగి వచ్చేసరికి తన పెంపుడు కుక్కలన్నీ గోలగోలగా అరుస్తున్నాయి. బెడ్ రూం ముందు చేరి. సిల్వర్ మరి బేజారెత్తిపోయి కళ్ళప్పగించి పంజరం వైపు చూస్తోంది.


     వాటి అరుపులను అనుకరిస్తూ గబగబ ఏవో మాటలు పలుకుతూ కుక్కలన్నీటిని హడల గొట్టేస్తోంది చిలక.

    సుదీర చూడగానే శరణు కోరుతున్నట్లు శోకాలు పెడుతూ వచ్చి వెనక చేరింది సిల్వర్. తక్కన కుక్కలు అన్ని కూడా ఆమె దగ్గరికి ఆ ధైర్యంతో పెద్దగా మొరగడం మొదలెట్టాయి.


    "డవున్ బాయ్! డవున్ బాయ్! కీప్ క్వయిట్! ఓహ్ డియర్! ఓహ్ డియర్!" అంటూ  వాటిని సముదాయించి బయటికి పంపేసి, కోపంగా చిలక వైపు తిరిగింది సుదీర.


    "యూ స్కౌండ్రల్ !"

 

    "యూ స్కౌండ్రల్ !" అంది చిలక తక్షణం.

 

    "మెడ విరిచేస్తాను."

 

    "మెడ విరిచేస్తాను."

 

    "షట్ - అప్!"

 

    "షట్ - అప్!"

 

    "ఓ గాడ్! ఇదెక్కడి శని చుట్టుకుంది నాకు!"

 

    "ఓ గాడ్! ఇదెక్కడి శని చుట్టుకుంది నాకు!"

 

    ఉక్రోషంతో పెదిమ కొరుక్కుంటూ కాసేపు దాని వైపు చూసింది సుదీర. ఒక నిశ్చయానికి వచ్చి ఛోటూని పిలిచింది.


    ఛోటూ! దీన్ని తీసుకెళ్ళి ఊరవతల ఎక్కడన్నా వదిలేసిరా! మళ్ళీ వెనక్కి రాలేనంత దూరం తీసుకెళ్ళు సరేనా?" అంది.


    "ఏమయింది అమ్మాయిగారూ?"


    "దీనికి పిచ్చిపట్టినట్లు వాగుతోంది."

 

    ఛోటూ అపనమ్మకంగా చిలకని చూసాడు. "ఏమే, బద్మాష్ దమగ్ ఖరాబ్ అయిందా నీకు?"

 

    నోట్లో వేలు పెడితే కొరకడం చేతకాని దానిలా అమాయకంగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది చిలక.

 

    "పదవే సైతాన్ ఔలాద్. నిన్ను బిస్మిల్లా చేస్తా."

 

    చిలక ఉలుకూ పలుకూ లేకుండా, సంతాప సభలో శ్రోతలా విచారంగా వింటోంది.

 

    పంజరం పట్టుకుని వెళ్ళిపోయాడు ఛోటూ. తుఫాను వెలిసినట్లయింది.

 

    తీరా చిలకని పంపేశాక , అప్పుడు కొంచెం బాధ అనిపించింది సుదీరకి. అతను దాన్ని చంపెస్తాడా ఏమిటి ఖర్మ. బిస్మిల్లా చేస్తానంటే ఏమిటి అర్ధం? చంపకుండా ఉరికే వదిలేసి రమ్మని తను గట్టిగా చెప్పి ఉండాల్సింది.


    తన చిలక చచ్చిపోతే వారం రోజుల పాటు భోజనం మానేసిన భరత్ గుర్తు వచ్చాడు. ఎంత సెన్సిటివ్ మనిషి అతను.

 

    పదవి కోసం వందల కొద్ది మేకలని చంపించి వాటి రక్తంలో స్నానం చేసింది తన తల్లి.


    మనిషికి మనిషికి ఎంత తేడా?

 

    ఎలా ఉన్నాడో ఆ భరత్.

 

    ఏదో శబ్దం వినబడితే ఉలిక్కిపడి తలతిప్పి చూసింది సుదీర.

 

    కిటికీ చువ్వ మీద కూర్చుని ఉంది చిలక.

 

    "యూ డెవిల్! ఎలా వచ్చావ్?" అంది సుదీర ఆశ్చర్యంగా.

 Previous Page Next Page