Previous Page Next Page 
సృష్టి పేజి 9


    "మీరు వెళ్ళండి."

 

    "సాయంత్రం అయిదు గంటలవరకూ ఏం చేస్తారు మీరు? అవార్డ్స్ ఎనౌన్స్ చేసే టైమ్ కి  వచ్చేద్దాం" అందామె.

 

    "వీలయితే హుస్సేన్ గారిని కలుసుకుంటాను" అన్నాడతను.

 

    "ఓ.కె! సరిగ్గా  అయిదు గంటలకు వచ్చేస్తాను. వచ్చేటప్పుడు మీకో మంచి ప్రెజెంటేషన్ తెస్తాను" చెప్పి ముందుకు కదిలిందామె.

 

    మళ్ళీ బుక్  చదవటంలో మునిగిపోయాడతను.

 

    అంతలో హాల్లోకి ఒక్కసారిగా ఉప్పెనలాగా ఓ  ఇటాలియన్ సుంగంధం వ్యాపించినట్టయ్యింది.

 

    చాలామంది పెయింటింగ్స్ నుంచి కళ్ళు తిప్పి మెయిన్ డోర్ వేపు చూశారు.

 

    లోనికొస్తూ కనిపించింది చీనాంబర.

 

    బెనారస్ పట్టుచీరలో వచ్చిన చీనాంబరను చాలామంది ఆసక్తిగా చూడటం గమనించి తనలో తానే నవ్వుకుంది.

 

    జనం ఎట్రాక్షన్ ని తనవేపు తిప్పుకోవాలంటే ఏం చేయాలో, ఆ  ట్రిక్కులన్నీ చీనాంబరకు బాగా తెలుసు.


    
    అందాన్ని గ్లామర్ గా మార్చుకోవడం, ఆ గ్లామర్ని  అద్భుతంగా ప్రెజెంట్ చేసుకోవటం ఒక ఆర్ట్!

 

    ఆ ఆర్ట్  తెల్సిన  అసలయిన ఆర్టిస్ట్  చీనాంబర.

 

    వరసగా పెయింటింగ్సును చూస్తూ ఒకచోట చాలాసేపు ఆగిపోయింది చీనాంబర.

 

    పెయింటింగ్, ఆ పక్కన వేరే  కార్డ్ బోర్డ్  మీద ఆ పెయింటింగు వేసిన ఆర్టిస్టు పేరు, ఆ పెయింటింగులో వున్న అర్థం ఇంగ్లీషులో రాసివుంది. చీనాంబర ఆగిపోయి చూస్తున్న....... పెయింటింగ్ దగ్గర మాత్రం  అర్థం తెలుగులో రాసుంది. పక్కనున్న నిర్వాహకుడ్ని పిలిచి అడిగింది.

 

    నిర్వాహకుడు చదివి చెప్పాడు.

 

    "వెన్నుని ముఖచంద్ర బింబంబు కళదేర
    దరుణి లోచన కుముదంబు లలరె,
    శౌరికి జికు రాంధకారములే పెరుగగ
    ముకురాస్య నఖర తారకలు వెలసె
    వనజాక్షు వక్షః కవాటంబు జిగిమీద
    బిబ్బోకవతి చను గుబ్బలుబ్బె
    స్వామికి, భుజకల్పశాఖలు బలియంగ
    నాథనాభికిని, బాహులతికలెనసె
    హరికి యౌవన వాసంత మతిశయిల్ల,
    నాతికిని బిక కళ కంఠ నాద  మెదవె
    భళర! ఇటువంటి ఈ సతీపతుల జాతి
    రీతు లమ్మక్క! యని రతిప్రియుడు వొగడ


    

    మేడమ్! రాధికా స్వాంతనం అని తెలుగులో ఒక ప్రబంధముంది. అందులో ఇళా సుందరి అనే ఆమె ఒక కథానాయిక, ఆ నాయికలను వర్ణించటం ఇతివృత్తం. పెయింటింగ్ చూస్తే మీకా విషయం స్పష్టంగా తెలిసిపోతుంది."

 

    "ఆ బుక్ ను ఎవరు రాశారు?" ఆసక్తిగా అడిగింది చీనాంబర పెయింటింగులో ఆర్టిస్టు వేసిన ఇళ సొగసును చూస్తూ.

 

    "ముద్దుపళని అని ఒక లేడీ " చెప్పాడు.

 

    "లేడీస్ ఇళా లేడీస్ ని వర్ణిస్తూ బుక్స్  రాస్తారా? ఆ లేడీ రైటర్ ఎగ్జిబిషన్ కి వచ్చిందా?"

 

    చీనాంబర మాటలకు నిర్వాహకుడు నవ్వాడు.

 

    "కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన ఓల్డ్ బుక్ అది. ఆవిడ అప్పుడే చనిపోయారు" నవ్వుతూ చెప్పాడు  నిర్వాహకుడు.

 

    "ఓ సారీ! నాకు యిలాంటి విషయాలు పెద్దగా తెలీదు" థాంక్స్ చెప్పి ముందుకు కదిలిందామె.

 

    తెలుగుదేశంలో పుట్టినా, పుట్టిన దగ్గర్నించీ ఢిల్లీలోనే  పెరిగిందామె. తెలుగు కల్చర్ ని యిష్టపడే ఆమె ఆ కల్చర్  గురించి బుక్స్ చదివి మాత్రమే  తెలుసుకుంది.

 

    తెలుగు కల్చర్ ని ప్రతిబింబించే ప్రతి పెయింటింగు దగ్గర  పావుగంట సేపు ఆగి పరీక్షగా చూస్తూ హేండ్ బుక్ లో డిటైల్స్ రాసుకుంటోందామె.

 

    అమెరికాలోని ఫ్రెండుకి ఆ డిటైల్స్ ని పంపాలని ఆమె కోరిక. మరో పది పెయింటింగ్స్ తర్వాత తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించే పెయింటింగు.....

 

    పక్కనున్న డిటైల్స్ ని పట్టిపట్టి చదివింది.

 

    "అపలేనే యెంకి ఈ పడవ యిసురు!

    పాడలేనే యెంకి పదములీ రోదలో!

    పడవ సల్లగ నడిపి

    పదము సదువంటావు!

    కస్సు మంటాయేరు

    గాలి నెగబోసింది.

    ఆపలేనే యెంకి ఈ పడవ యిసురు.

    వోరుగాలే పాట

    దారి కడతా వుంది!

    బేటి కురికే పాట

   నోట గోడతా వుంది!

   ఆపలేనే యెంకి ఈ పడవ యిసురు.

    తల మలపుకొని పాట

    తలలింది కామోసు

`    జీముడల్లే లోనె

    తిరుగుతున్నాదేటో!

    ఆపలేనే యెంకి! ఈ పడవ యిసురు.

    యెన్నెలణంటే పాట

    కెంత మనసవుతాదో
    పాట సాగే తలికి

    పయనమే మవుతాదో!

    ఆపలేనే యెంకి ఈ పడవ యిసురు!

 

    ఆ విచిత్రమయిన తెలుగు విషయం తెలీని చీనాంబర ఆశ్చర్యంగా ఈ పాటని మళ్ళీ మళ్ళీ  చదువుకుని అర్థంకాని విచిత్రమైన అనుభూతికి లోనయింది.

 

    రెండు గంటలు గడిచాయి.

 

    వెళ్ళిపోదామని నిర్ణయించుకుని వెనుదిరిగి గబగబా వచ్చేస్తూ కుడి స్తంభం పక్కన గోడకు వేలాడుతున్న పెయింటింగు చూసి అప్రయత్నముగా ముందుకడుగేసింది.

 Previous Page Next Page