Previous Page Next Page 
సంకల్పం పేజి 9

 

        బెడ్ రూం ఐస్ : శారద.
   
    బ్లడ్ స్పోర్ట్ : సుకన్య.
   
    ది డెవిల్స్ పారడైజ్ : జగదంబా
   
    ఒక్క నిమిషం ఆలోచనలో పడింది లిఖిత. మళ్ళీ మరోసారి పేర్లన్నీ చదివింది.
   
    'జగదాంబ'కు వెళ్లుండొచ్చు.
   
    మరో అయిదు నిమిషాల్లో జగదాంబా థియేటర్ మెయిన్ గీటు దగ్గరుంది లిఖిత.
   
    మాట్నీ షో, 4 గంటలకు- అప్పుడు నాలుగున్నరైంది. థియేటర్ గేట్లు మూసేశారు. గేట్ కీపర్ కర్ర పట్టుకుని నిల్చున్నాడు.
   
    కారాపి, గేటు వేసొస్తున్న అమ్మాయిని చూసి-
   
    "ఆటెప్పుడో స్టార్టయిపోనాది.....కౌంటర్ కూడా క్లోజ్ చేసినారు" అన్నాడు.
   
    "అయినా ఫర్వాలేదు.... వెళ్ళొచ్చుకదా..."
   
    "వెళ్ళొచ్చమ్మా.... వెళ్ళొచ్చు..... ఇంగ్లీషు సినిమాకి అరగంటైతె నేటి....గంటైతే నేటి?" వ్యాఖ్యానించాడు నలభై ఏళ్ల గేట్ కీపర్.
   
    టిక్కెట్ తీసుకొని 'డ్రెస్ సర్కిల్' లోకి వెళ్ళింది.
   
    చీకట్లో ఏం కన్పించలేదు.
   
    ఒక్క నిమిషం పట్టింది మనుషుల్ని గుర్తించడానికి.
   
    లిఖిత అంచనా లెప్పుడూ తప్పవు.
   
    నడిరోడ్డుమీద ఒక అపరిచిత వ్యక్తిని చూపించి, అతను వెళ్తున్న గమ్యాన్ని చెప్పమంటే ఆ అమ్మాయి ఈజీగా చెప్పగలదు.
   
    ఆ వ్యక్తి అలాగే.... నిజంగా అలాగే.... వెళతాడు.
   
    భవిష్యత్తులో వికాస్ ఎలా వెళ్తాడో ఆ అమ్మాయికి తెలుసు. వికాస్ ఏం చేయబోతాడో ఆ అమ్మాయికి తెల్సు.
   
    వికాస్ ని ఎలా తీర్చిదిద్దాలో ఆ అమ్మాయికి తెల్సు. మీరు మిక్కిలి వికాస్ కి తనేమౌతుందో ఆ అమ్మాయికి తెల్సు!
   
    షికెన్ ఈజీలీ ఐడింటి ఫై ది పీపుల్.... అండ్ ఆల్సోదైర్ రేర్ క్వాలిటీస్.....
   
    వికాస్ లో వున్న 'రేర్ క్వాలిటీ'ని లిఖిత గమనించింది!
   
    ఒకటవ వరుస..... రెండో వరుస.... మూడో వరుస...
   
    మూడో సీటు.
   
    "వికాస్!" అని పిల్చింది.
   
    తల తిప్పాడు వికాస్. ఆ సమయంలో లిఖిత అక్కడ!
   
                                   *    *    *    *    *
   
    "చెప్పండి.... ఏం జరిగిందో....?" కారు నడుపుతోంది లిఖిత.
   
    ప్రక్కన కూర్చున్నాడు వికాస్.
   
    జరిగిందంతా చెప్పాడు వికాస్.
   
    సడెన్ గా అడిగింది లిఖిత.
   
    "ఎక్కడ కెళ్దాం?"
   
    "యాజ్ యూ లైక్..." చెప్పాడు వికాస్.
   
    "అయితే... ఈనాడు ఆఫీసు దగ్గర కెళ్దాం..." చెప్పింది లిఖిత, వికాస్ ముఖం వేపు చూస్తూ.
   
    ఎందుకు? ఏమిటి? అని అడగలేదు వికాస్.
   
    కారు నక్కవాని పాలెం మీదుగా వెళ్తోంది.
   
    ఈనాడు ఆఫీసు ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ వుంది. అక్కడ పొడవాటి మెట్లున్నాయి. ఆ మెట్ల ప్రక్క కారాపింది.
   
    "ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం."
   
    ఆమె వెనకే, కారు దిగాడు వికాస్.
   
    ఇద్దరూ మెట్లమీద కూర్చున్నారు- ఇద్దరి మధ్య రెండడుగుల దూరం.
   
    "భానోజీరావుతో ఛాలెంజ్ చేసిన వ్యక్తి.... దిగాలుగా ఉన్నారేమిటి?" జోగ్గా అంది లిఖిత.
   
    "నో..... నో.... అలాంటిదేం లేదు. నా మూడ్ బాగులేనపుడు సినిమాల కెళ్ళడం నా అలవాటు.... చికాగ్గా వున్నప్పుడు, మాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో... మూడింట్ని చూసి రూమ్ కెళ్తాను" అన్నాడు వికాస్ ఒకింత నిర్లిప్తంగా.
   
    "ఓ.కే. సినిమాకే వెళ్తారా?" నవ్వుతూ  అంది లిఖిత.
   
    నిశ్శబ్దంగా నవ్వాడు వికాస్.
   
    "దేర్ ఆర్ టైమ్స్ ఇన్ ఎవ్విర్ వన్స్ లైఫ్ వెన్ సమ్ థింగ్ కన్ స్ట్రక్టివ్ ఈజ్ బోర్న్ అవుటాఫ్ ఏడ్ వర్సిటీ... యూ నో దట్" సీరియస్ గా అంది లిఖిత.
   
    "ఎస్... ఎస్... ఐ... నో...." అని మాత్రం అనగలిగాడు వికాస్.
   
    "మరలాంటప్పుడు మీ ప్లాన్ ఏమిటో చెప్పండి. ఏమైనా హెల్ప్ చెయ్యగలిగితే చేస్తాను.... అదీ మీ కిష్టమైతేనే" ఎదురుగా సిటీబస్ స్టాఫ్ వుంది. ఆ పక్కన ఈనాడు ఆఫీసు. ఆఫీసులోంచి వచ్చే జనం..... సిటీబస్ కోసం నిలబడిన జనం..... దారంట పోయే జనం.... వాళ్ళిద్దరివేపే చూస్తున్నారు. ఆ విషయం గమనించాడు వికాస్.
   
    "ఐ కెన్ డూ వండర్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకుంది. నా ఇన్ స్పిరేషన్ నాకుంది. సినీ నటి రేఖని అమితంగా ప్రేమించి పెళ్ళి చేసుకొని, ఏవో గొడవల వల్ల ఆత్మహత్య చేసుకున్న ముఖేష్ అగర్వాల్ నా ఇన్ స్పిరేషన్. ఎస్....నిజంగానే నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకూ వచ్చానో మీకు తెలీదు. నన్ను ఇరిటేట్ చేసిన ఆ భానోజీరావుక్కూడా తెలీదు..... బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు..... బస్టాప్ దగ్గర పకోడీలు పెట్టుకున్నా చాలు. రోజుకో యాభై రూపాయలొస్తాయి. బతుకు గురించి నాకెప్పుడూ బెంగలేదు....
   
    మన ఎదురుగా వున్న ఈనాడు పేపర్నే తీసుకోండి..... దిగ్రేట్ రామోజీరావ్..... ద లెజెండ్ ఆఫ్ ది సెంచరీ.... ఎస్..... నిజంగానే ఆయన ఢిల్లీలోనే ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఇవాళ మనం అనుకునేవాళ్ళమా? ఒక తపన..... ఒక దీక్ష..... ఒక నిర్ణయం.... ఒక ప్లానింగ్.... ఇవాళ చూడండి. పేపర్ ఇండస్ట్రీ దగ్గర్నించి పికెల్ ఇండస్ట్రీ వరకూ..... అతి తక్కువ సమయంలో, ఆయన సాధించిన ఘనత..... పొలిటికల్ గా కూడా ఆలోచించండి. వందేళ్ళ కాంగ్రెస్ ని పడగొట్టిన ఎన్టీఆర్ వెనుకున్న శక్తి రామోజీరావు....అవునంటారా.... కాదంటారా?" ఆవేశంగా చెప్పాడు వికాస్.
   
    "నాక్కావలసింది మీ ప్లాన్ ఏమిటని?" లిఖిత నోటి వెంట ఆ మాట వినగానే-
   
    "ఏదో ఇరిటేటయ్యో, ప్రవోక్ అయ్యో భానోజీరావుతో నేను ఛాలెంజ్ చెయ్యలేదు. వీడో బచ్చా అనుకుని నన్ను ఇరిటేట్ చేశాడాయన. కానీ.... నా లైఫ్ ఏంబిషన్ ఏమిటో ఆయనకు తెలీదు. అదీ నా మంచికే జరిగిందనుకుంటాను. నిరాశలోంచి పుట్టినవాడికి నిరాశ వుండదు. ఆకలితో ఆరుమైళ్ళు అన్నంకోసం పరిగెట్టిన రోజులున్నాయి నా జీవితంలో. పదిపైసల కోసం ఆరుగంటలు ఎండలో నిలబడిన రోజులున్నాయి. బురదలో పడ్డ అన్నాన్ని తీసుకుని, ఆబగా తిన్న రోజులున్నాయి. నాకు డబ్బు విలువ తెలుసు..... నాకు శక్తి విలువ తెలుసు" అంటూ లిఖిత వేపు చూశాడు.
   
    "నాక్కావలసింది మీ ప్లాన్ ఏమిటని?" లిఖిత నోటివెంట మళ్ళీ ఆ మాట వినగానే-
   
    "నేను కొంచెం ఆలోచించుకోవాలి" నెమ్మదిగా అన్నాడు వికాస్.
   
    "నాదో డౌట్.... మనసు మార్చుకుని మీ చైర్మెన్ మిమ్మల్ని పిలిచారనుకొండి.... వెళ్తారా?" టాపిక్ మారుస్తూ అంది లిఖిత.
   
    "నో.... వెళ్ళను" వెంటనే అన్నాడు వికాస్.
   
    "మంచి పోస్టు.... మంచి సాలరీ"
   
    "ఆ కంపెనీకి నన్ను చైర్మెన్ని చేసినా నే వెళ్ళను" దృఢంగా చెప్పాడు వికాస్.
   
    "ఎక్కడైనా హోటల్ కెళ్ళి కాఫీ తాగుదామా" లిఖిత అంది.
   
    అలాగేనన్నట్టుగా తలూపాడు వికాస్. ఇద్దరూ లేచారు.
   
    కారు ఆసీలుమెట్ట జంక్షన్ దగ్గరకొచ్చినప్పుడు అడిగాడు వికాస్.
   
    "ఈనాడు ఆఫీసు దగ్గరకే ఎందుకెళ్దామన్నారు?"
   
    నవ్వింది లిఖిత.
   
    "చెప్పనా...." ఓరకంట చూస్తూ అంది.
   
    "జనరల్ గా ఎవరైనా మాట్లాడుకోడానికి ఎవరూ లేని ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. అవునా? లేకపోతే ఏ బీచో, పార్కో, హోటలో, ఊరి చివార్లకో వెళ్తారు కదా.... అందర్లా మనమెందుకుండాలి? బిజీ సెంటర్లో మాట్లాడుకుంటాం మార్పులోని మాధుర్యాన్ని అనుభవించవద్దా?"
   
    లిఖిత మాటలకు ఆలోచనలో పడ్డాడు వికాస్.
   
    'గమ్మత్తైన క్యారెక్టర్!" మనసులోనే అనుకున్నాడు.
   
    జగదాంబా జంక్షన్లో-
   
    హోటల్ మాలాలో కూర్చున్నారిద్దరూ.
   
    కాఫీ తాగుతూ అంది లిఖిత-
   
    "రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. మూడురోజుల్లో వస్తాను.... మీ నెక్స్ట్ ప్లాన్ చెప్పాలి."
   
    ఎందుకెళ్తోందో అడగాలనుకున్నాడు. ఎందుకు లెమ్మని వూరుకున్నాడు.
   
    "అలాగే"
   
    మరి కాసేపటికి ఇద్దరూ బైటకొచ్చారు.
   
    "మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళనా?"

 Previous Page Next Page