Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 10


    "ఏముంటుంది? నేను కష్టపడ్డాను. మనకు కలిసి వచ్చింది. లేని వారికి ఉన్నవారి కలిమి చాలదా ద్వేషం పుట్టించడానికి?" సుదర్శన్ రావు గొంతులో కూతుర్ని లాలించే సున్నితత్వం అప్పటికప్పుడు వచ్చేసింది.

    అది ప్రియాంక తల్లి పసిగట్టింది.

    తప్పదు- ప్రమాదకరమైన అడుగే అయినా వెయ్యక తప్పదు. మరిక తన కూతురు బాగుపడదని నిరాశా, నిస్పృహతో క్రుంగిపోయిన తనకు తన కళ్లెదుటే ఏదో అద్భుతం జరిగినట్టు తన కూతురు కొత్త విషయాల వైపు దృష్టి మరలించింది. ఆ ఆసక్తిని, జిజ్ఞాసను తన భర్త నరికివేయక ముందే తను రెచ్చగొట్టి లేపాలి.

    "ఇప్పటికైనా నిజం చెప్పండి-" అంది అతి బలవంతం మీద ప్రాణాల్ని ఉగ్గబట్టుకుంటూ. బహుశా అదేనేమో ఆమె తొలిసారి ఒకింత ధైర్యంగా భర్తతో మాట్లాడడం-

    సుదర్శన్ రావు షాక్ అయ్యాడో క్షణం... కళ్ళు పెద్దవి చేసుకుని భార్య వైపు చూశాడు.

    తన కూతురు తనను హఠాత్తుగా నిలదీస్తుందేమిటా అన్న దిగ్భ్రాంతి ఇప్పుడు చిన్నదైపోయింది.

    ఇప్పుడు భార్యను మందలించాలా?

    కూతుర్ని సముదాయిందాలా?

    రెండూ ప్రమాదకరమైనవే-

    క్షణాల్లో అతనో నిర్ణయానికొచ్చేశాడు-

    "సరే బేబీ... నీకన్ని విషయాలు వివరంగా చెబుతాను. కానిప్పుడు కాదు. రాత్రికి... నాకిప్పుడు చాలా అర్జంట్ మీటింగ్ వుంది. ఇలా అంటున్నానని తప్పించుకునే ప్రయత్నమనుకోకు... నన్ను నమ్ము చాలు" అంటూ భార్యకేసి చూసి సైగచేసి మేడమీదికి వెళ్ళిపోయాడు.


                  *    *    *    *


    "గుప్తాజీ... నన్నిక ఆపే ప్రయత్నం చేయకండి. అతన్ని తొలి చావుదెబ్బ తీసే ఛాన్స్ ఎలా వస్తుందో చెప్పండి" త్రినాధ్ కళ్ళలో ఎరుపు జీర.

    గుప్తా ఓ క్షణం భయపడ్డాడు.

    "తప్పదు గుప్తాజీ... దారుణమైన అవమానం జరిగింది నాకొక్కడికే కాదు. నా ప్రాణసమానులైన మరొకరికి- ఇక నేను ఉపేక్షించలేను. నన్ను శాంతింపజేయాలనే మీ ప్రయత్నం వృధా. అది మీ పెద్దరికాన్ని మీరు దెబ్బ తీసుకోవడమే. ఇది తప్ప మరేదన్నా చెప్పండి. నేను మీ మాటను జవదాటను. చెప్పండి ఎలా? అతన్ని నేను కొట్టదలచిన తొలిదెబ్బ అతనికి లక్షల్లో నష్టం కలిగించడం- మలిదెబ్బ అతన్ని మానసికంగా కృంగదీయడం... ఇప్పుడు చెప్పండి ఎలా ప్రొసీడ్ అవుదాం?"

    గుప్తా త్రినాధ్ కళ్ళలో కనిపిస్తున్న తీక్షణతను, స్థిర నిశ్చయాన్ని పసిగట్టాడు.

    ఇక తప్పదనిపించిందతనికి-


                  *    *    *    *


    తన కూతురు ప్రియాంక రాత్రికి తప్పక నిలదీస్తుంది తనను. తన చెల్లెలు వసుంధరాదేవి ఒకప్పటి దుస్థితికి తను కారణం కాదని చెబితే- దాన్ని ప్రియాంక నమ్మితే తనపై కొంతవరకు మాత్రమే సదభిప్రాయం ఏర్పడుతుంది. ఆ తరువాత నీ చెల్లెలు ఆ దుస్థితిలో వుంటే చూస్తూ ఎలా వూరుకోగలిగారు? మీకు మానవత్వం లేదూ అని నిలదీసి నిందిస్తే?

    ఈ ఆలోచనతో సుదర్శన్ రావు ఆ రాత్రికి ఇంటికి వెళ్ళకుండా ఆఫీసులోనే వుండిపోవాలని నిర్ణయించుకున్నాడు.


                                       *    *    *    *


    ప్రియాంక తన గదిలో అసహనంగా పచార్లు చేస్తూ తండ్రి కోసం ఎదురుచూస్తోంది.

    త్రినాధ్ మాటలు విన్న దగ్గర్నుంచి, తమ మధ్యవున్న బంధుత్వం తెలుసుకొన్న క్షణం నుంచి ఆమెలో చిత్రమైన ఉద్విగ్నత చోటుచేసుకుంది. తను ఒప్పుకున్నా, లేకున్నా త్రినాధ్ తనకు మేనత్తకొడుకు. అంటే తనకు బావ. ఎంత విచిత్రమైన కాకతాళీయం... ఇది కాకతాళీయమే అయినా మాలినీదేవి పథకం మాత్రం త్రినాధ్ వెనుక పొంచి వుంది.

    మాలినీదేవి కెందుకో తన తండ్రిమీద పగ...?

    అందుకోసమే ఆవిడ సమర్ధుడైన వ్యక్తికోసం ఎదురుచూస్తూ వుండి వుండాలి. అప్పటికే తనెవరో కూడా తెలిసి వుండాలి. అంటే తమకు మాలినీదేవికి మధ్య శతృత్వం వుంది. అది ఎప్పటిదో కూడా అయి వుండవచ్చు. ఇకపోతే తను హిందూ ద్వారా లిఫ్ట్ క్లూ కోసం ప్రయత్నించటంలో అనుకోకుండా త్రినాధ్ ఎంటర్ అయిపోయాడు. తన అహం అంగీకరించకపోయినా త్రినాధ్ కి దారుణమైన అవమానం జరిగింది. దాన్ని రెచ్చగొట్టి త్రినాధ్ అహాన్ని మేల్కొలిపింది.

    ఈలోపే అనుకోకుండా తన మేనత్త వసుంధరాదేవికి తన కొడుకును అవమానించిన వ్యక్తి గురించి తెలిసుండాలి. ఆ తెలవటం అన్నది ఆమె గత జ్ఞాపకాల్ని కదిలించి వుండాలి.

    ఏది పథకమో... ఏది కాకతాళీయమో?

    పట్టుదలకు, పౌరుషానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు త్రినాధ్.

    కేవలం అవే వున్నాయనుకోవడం భ్రమ అని చెయిన్ ఉదంతం తెలియజేసింది.

    ఇప్పుడు గదా డ్రామా రక్తి కట్టింది! వేచి చూడాలి. ఏమవుతుందో? ఎవరు ఎవర్ని ఓడిస్తారో? ఎవర్ని దెబ్బతీస్తారో? ఎవరు గెలుస్తారో? ఎవరు ఏ తీరానికి చేరనున్నారో? శెభాష్ త్రినాధ్...

    ఇప్పటివరకు ఓ సాధారణ వ్యక్తితో ఛాలెంజ్ చేసానేమోనని అప్పుడప్పుడు చింతించాను. కానిప్పుడు సమ ఉజ్జీతోనే అని విశ్వసిస్తున్నాను.

    నీవే నాకు సరైన జోడి-

    నన్ను నువ్వు ఓ పొగరుబోతు పిల్లగా చూశావు. పగబట్టి పంతం నెగ్గించుకునే పౌరుషవంతురాలిగా చూశావ్.

    ఇకిప్పుడు పరిణతి చెందిన భద్రకాళీ రూపం చూడబోతున్నావ్.

    ఆలోచనల్నుంచి తేరుకొని ఒకింత ఆశ్చర్యపోయింది. తన ఆలోచనలు ఏవైపుకు సాగిపోతున్నాయ్? ఒకప్పుడు తను అవమానించిన వ్యక్తినే ఈరోజు మెచ్చుకుంటోంది.

    తను ద్వేషించిన వ్యక్తి గురించే అనుక్షణం ఆలోచిస్తోంది.

    తను అసహ్యించుకున్న వ్యక్తినే అభిమానిస్తుంది. ద్వేషంతో మొదలయి...

    ఇకపైన ఆలోచించలేకపోయింది...

    ఆ ఆలోచనల్ని అంతలోనే అహం అడ్డుకుంది.


                                        *    *    *    *


    "టుటికోరిన్..."

    సముద్రపొడ్డు పట్టణం...

    తమిళనాడు రాష్ట్రం....

    మద్రాసు హార్బర్ మీద పెరిగిన సరుకుల దిగుమతి ఎగుమతి రవాణా వత్తిడిని తగ్గించేందుకు కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ టుటికోరిన్లో కొత్త హార్బర్ నిర్మించబోతోంది. అందుకోసం జాతీయ పత్రిక లన్నింటిలో టెండర్స్ ని ఆహ్వానించింది."

    గుప్తా చెప్పుకుపోతున్నాడు సీరియస్ గా.

    "మీరెలా చేస్తారన్నది నా ఊహకు అందని విషయం. కాని మీరు ఏదో ఒకటి చేయగలరన్న నమ్మకంతో మీకో ఇన్ ఫర్ మేషన్ అందించాలనుకుంటున్నాను."

    ఏదో ఫైల్ తిరగేస్తున్న త్రినాధ్ కేవలం కళ్ళను మాత్రం పైకెత్తి ఏమిటన్నట్టు కనుబొమలు ఎగురవేశాడు. గుప్తా ఏదో చెప్పేందుకు ప్రయత్నించబోయే లోపు త్రినాధ్ ఓ క్షణం ఆగమన్నట్టు సైగ చేశాడు.

    ఆఫీస్ లీగల్ సెల్ మేనేజర్ వచ్చి ఓ కవర్ అందించాడు వినయంగా.

    త్రినాధ్ అతన్ని వెళ్ళమన్నట్టు సైగ చేసి కవర్ ఓపెన్ చేసి చూశాడు.

    కొద్ది క్షణాల తర్వాత గుప్తావైపు మామూలుగా చూస్తూ కవర్ అందించాడు త్రినాధ్.

    గుప్తా దాన్నందుకొని మొదటి లైన్ చదివి ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు.

    తెరిచేసరికి అతని కళ్ళు తడిదేరి వున్నాయి. త్రినాధ్ వైపు కృతజ్ఞతగా చూస్తూ రెండు చేతులెత్తి నమస్కరించాడు మౌనంగా.

    త్రినాధ్ కుర్చీలోంచి లేచి జోడించిన గుప్తా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని "మీరు నాకన్నా పెద్దవారు... అనుభవజ్ఞులు... నేను చేసింది సహాయం కాదు. రుణం తీర్చుకోవడం... మీ అపార అనుభవాన్ని ఆధారంగా మీరు నాకందిస్తున్న సలహా, సహకారాలకి నేను డబ్బుతో విలువ కట్టి నన్ను నేను కించపరుచుకోదల్చలేదు... దయచేసి ఇంకెప్పుడూ నమస్కరించి నన్ను బాధ పెట్టకండి. త్వరలోనే ఒక తండ్రిగా మీకున్న బాధ్యతను కూడా నెరవేర్చుకుంటే మీకు రిలీఫ్ గా వుంటుంది. నాకు తృప్తిగా వుంటుంది... మంచి సంబంధం చూసుకోండి. ఖర్చు విషయం మర్చిపోండి."

    అప్పుడు గుప్తా కళ్ళలో కనిపించిన వెలుగు అంతకు ముందెప్పుడూ తనెవరి కళ్ళలోనూ చూడలేదు త్రినాధ్.

    కొద్దిక్షణాలపాటు గుప్తా ఏమీ మాట్లాడలేకపోయాడు.

    మూగగా, కృతజ్ఞతగా త్రినాధ్ వైపే చూస్తుండిపోయాడు.

    "ఇప్పుడు నేను స్వతంత్రుడిని- సుదర్శన్ రావుకు కట్టవలసిన డబ్బు మీరు కట్టేసి నన్ను ఒడ్డుకు లాగారు... ఇప్పుడు నా కూతురు పెళ్ళి చేస్తానంటున్నారు. ఈ సందర్భంలో కూడా నాలుగు మాటలు మీతో చెప్పుకోకపోతే నాకా అసంతృప్తి జీవితాంతం మిగిలిపోతుంది..."

    త్రినాధ్ మౌనంగా వింటున్నాడు. "సుదర్శన్ రావు నా వలన లక్షలు, కోట్లు లాభం పొందినా- కృతజ్ఞతగా ఒక్క లక్ష కూడా ఇవ్వకపోగా- బాధ్యతల పరిధిలో సమాధి అయి నైతిక విలువల్ని కాలరాసి నేను చేసిన దొంగతనాన్ని పెద్దదిగా చేసి నన్ను, నా కుటుంబాన్ని నడిరోడ్డులో నిలబెట్టడమేగాక, ఆ లక్షను తనే దొంగతనం చేయించి నన్ను సర్వనాశనం చేయాలని చూశాడు.

    నేనతని దగ్గర దొంగిలించిన లక్షే చట్టానికి కనిపిస్తుంది. నా దగ్గర నుంచి అతను దొంగిలించిన లక్షల్ని తెచ్చిపెట్టే పథకాలు మాత్రం కనిపించవు.

    కానిప్పుడు మీ యెడల నేను చేస్తున్నది చాలా చిన్న పని. కేవలం సమాచారం అందించడం. అందించిన సమాచారం నుంచి సమస్యా పరిష్కారం వెతుక్కోవడమన్నది మీరు చేస్తున్నదే. ఆ మాత్రం చిన్నపనికి మీరు కడుతున్న వెల చాలా గొప్పది. పెళ్ళీడుకొచ్చిన కూతురున్న తండ్రికి దేవుడు ప్రత్యక్షమై ఓ వరం కోరుకో అంటే 'నా కూతురుకి పెళ్ళి చేయ్' అనేస్తాడు ఆర్తిగా. అనాలోచితంగా లక్షలు కావాలనడు- తనకు ఆరోగ్యం ప్రసాదించమనడు, అందలం ఎక్కించమనడు. తన గుండెల మీద పెట్టుకొని పెంచిన తన చిన్నారి కూతురు సుఖపట్టం గురించే ఆ క్షణం ఆలోచిస్తాడు. పదికోట్లు ఇవ్వలేని సుఖం, తన కూతురు పెళ్ళయింది, సుఖపడుతుంది అన్న ఓ తండ్రి భావనముందు మరేదీ నిలవలేదు. అలాంటి అతి గొప్ప ఆనందాన్ని మీరు నాకు కలిగించారు. నా గుండె లోతుల్లోంచి పెల్లుబికే భావాలు భాషరాని నా మూగ గొంతుకలో కొట్టాడుతున్నాయి. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాదనకు బాబు- ఈ ప్రపంచంలో నాకత్యంత ప్రాణసమానమైంది నా కూతురు. చిన్నప్పుడు నా చిన్నారి తల్లి వేసిన గంతులే ఇప్పటికీ నా కళ్ళలో తిరుగాడు తుంటాయి. ఆ ఆనందపు గంతులే ఆమెకు శాశ్వతం కావాలని ఎన్ని కలలు కన్నాను! ఆ కలల్ని నిజం చేసుకొనేందుకే రాత్రింబవళ్ళు సుదర్శన్ రావు అభివృద్ధికి శ్రమించాను. రక్తం ధారపోశాను... అయినా ఏనాడు నేను సేద తీరాలనుకున్నది లేదు. నేను సేద తీర్చుకుంటే నా కూతురు నుదుట స్వేదం అలుముకొంటుందనే బెంగబాబు. అలాంటి నేను... సుదర్శన్ రావు దుర్మార్గపు చర్యకు కుప్పలా కూలిపోయాను. అప్పుడు ప్రత్యక్షమయ్యారు మీరు దేముడిలా. కాని నేనేమి అడగలేని మూగనయ్యాను కాని బాబు... దేవుడికి భక్తుడి మాటలే బాధను తెలియపర్చక్కర్లేదని రుజువు చేశావు.

    ఇప్పుడు చెబుతున్నాను; కాదు ప్రమాణం చేస్తున్నాను. మీ లక్ష్యానికి న ప్రాణాన్ని ఆనందంగా అర్పించుకుంటాను" గుప్తా కళ్ళ వెంట కన్నతండ్రి ఆనందం కన్నీటి రూపంలో జాలువారింది.

    త్రినాధ్ లో అప్పటివరకూ అతనికి ఆనందం కలిగించిన విషయాలు వేరు-

 Previous Page Next Page