Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 9

    "నాకు మతి స్థిమితం లేదూ" అంటూ రాయుడు రచయిత మీద విరుచుకుపడ్డాడు. రచయిత ఆయన్ను వారించి "మీరు అసలు విషయం మరిచిపోతున్నారు. మనమిలా కుర్రాళ్ళని పలకరించి ఏ కబురూ చెప్పకుండా సుహాసిని ఫోటో చూపించి ఈ అమ్మాయెలాగుందని అడిగితేవాళ్ళు మనల్ని ఏ లాడ్జికో బ్రోకర్ల మనుకుంటున్నారు. అందుకే ఒకడు మొహమాటస్థుడు కాబట్టి తనలాంటి వాణ్ని కాదన్నాడు. ఇంకొకడు చలాకీ మనిషి కాబట్టి రేటు కూడా అడిగాడు దానికి ఆ కుర్రాడి మీద విరుచుకు పడితే నలుగురూ మన చుట్టూ చేరతారు. అసలా అమ్మాయి ఎవరో ఆఫోటో మన దగ్గరెందుకుందో అన్న ఆరా కూడా వస్తుంది. వీటన్నింటికీ జవాబు చెప్పే బదులు మీకు మతిస్థిమితం లేదనుకుంటే ఏ గొడవా ఉండదు" అన్నాడు.   
    రాయుడికి పరిస్థితి ఆకళింపు అయింది. "అవును. ఈ విషయం నాకు స్పురించనే లేదు" అనుకుంటుండగా ఓ కుర్రాడు వాళ్ళిద్దరి దగ్గరకూ వచ్చి జేబులో చెయ్యిపెట్టిచిన్న ఫోటో తీసి చూపించి "ఊళ్ళోకి కొత్తగా వచ్చింది సార్. మిమ్మల్ని చూస్తే చాలా గొప్పవాళ్ళలాగున్నారు. అందుకే మీకు మాత్రం ఈ ఫోటో చూపిస్తున్నాను. బుక్ చేయమంటారా?" అని రాయున్ని అడిగాడు.   
    రాయుడు కుర్రాడి వంక చిరాగ్గా చూసి "మేమలాంటి వాళ్ళం కాదు" అన్నాడు. ఆ కుర్రాడు వెళ్ళిపోగానే "ఛా, ఛా- ఆ ఇద్దరు కుర్రాళ్ళూ మన గురించి ఎంత నీచంగా అనుకున్నారో ఏమో" అని బాధ పడ్డాడు రాయుడు. ఆయన మనసు వికలమైపోయింది. రచయిత ఆయన వంక జాలిగా చూసి "మీకెందుకండీ ఈ బాధ! ఆ ఫోటో పట్టుకుని నేను తిరగి మంచి హీరోని నేను ఎన్నిక చేస్తాను" అన్నాడు.   
    "సరే నీ టేస్టు సంగతే చెప్పాలి. నా హీరోని నేనే ఎన్నుకుంటాను" అన్నాడు రాయుడు పట్టుదలగా అయితే, ఆరోజుకు వాళ్ళింకే కుర్రాళ్ళనూ పలకరించలేదు. బోణి బాగోలేదని రాయుడు చాలామార్లు అనుకున్నాడు.   
    రాయుడు ఇంటికి వెళ్ళగానే చెల్లెలు అడిగింది "ఏమిటన్నయ్యా బొత్తిగా ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతున్నావూ" అని.   
    "నా సినిమా ఓ కొత్త హీరోకోసం వెతుకుతున్నా నమ్మా! ఎర్రగా బుర్రగా ఉండి, ఇంకా పెళ్ళి కాని కుర్రాడు కావాలి" అన్నాడు రాయుడు.   
    "ఊరి వీధుల్లో తిరిగితే దొరుకుతాడా హీరో!" అంది లలిత. "ఏ నాటకాల ట్రూపు వాళ్ళనో పట్టుకుంటే అనుభవమున్న వాడు దొరుకుతాడు. ఎర్రగా, బుర్రగా ఉన్నంత మాత్రాన యాక్షన్ రావద్దూ - నీ వాటం చూస్తే సుబ్బారావు కూడా హీరోకి పనికి వస్తాడనేలాగున్నావు."   
    రాయుడు ఉత్సాహంగా "సుబ్బారావెవరమ్మా? అతనెక్కడుంటాడు? త్వరగా చెప్పు" అనడిగాడు.   
    లలిత ఆశ్చర్యంగా "చెబితే అతన్ని హీరోని చేస్తావా?" అంది.   
    "ముందు చెప్పమ్మా-నేనతన్ని చూడాలిగా" అన్నాడు రాయుడు.   
    "సుబ్బారావు ఈ వీధిలోనే ఉంటాడు" అంది లలిత బియ్యే చదవగానే అదృష్టం కొద్దీ ఉద్యోగం దొరికింది. అతనంత బుద్దిమంతుడులేడని వీధి వీధంతా చెప్పుకుంటారు. ఆడవాళ్ళు కనబడితే తల దించుకుని నడుస్తాడు..."   
    "ఏం ఉద్యోగం చేస్తున్నాడు?" అనడిగాడు రాయుడు.   
    "ఏదో గుమాస్తాగిరీ వెలగబెడుతున్నాడు అతని రూపానికి దగ్గ ఉద్యోగం కాదని అంతా అంటారు. మంచి బట్టలు వేసుకుంటే కలెక్టర్లా ఉంటాడు. కాని ఎప్పుడో కాని వేసుకోడు" అంది లలిత.
     "సుబ్బారావుని ఇప్పటికిప్పుడు చూడ్డానికి వీలుంటుందా? అన్నాడు. అతడి ముఖంలోని ఆతృత చూసి లలిత ఆశ్చర్యంగా "ఓ ఫిలిం ప్రొడ్యూసరు తన కోసం ఇంతలా కలవరించి పోతున్నాడని తెలిస్తే ఆ సుబ్బారావు గుండె ఆగిపోతుందేమోనని భయంగా ఉంది నాకు" అంది.   
    "తల్లీ-నేను ఫిలిం ప్రొడ్యూసరునన్న విషయం మాత్రం అతడికి చెప్పకు. పుణ్యముంటుంది" అన్నాడు రాయుడు.   
    "ప్రొడ్యూసరునని చెప్పకుండా సినిమాలో ఎలా బుక్ చేస్తావు?"   
    "నే నతన్ని సినిమాలో బుక్ చేస్తానని నీకు చెప్పలేదు కదా!" అన్నాడు రాయుడు అన్నగారి వ్యవహారం లలితకు అర్ధం కాలేదు ఆమె గీతను సాయం ఇచ్చి రాయున్ని సుబ్బారావు ఇంటికి పంపించింది. రాయుడు రచయితను కూడా తీసుకుని వెళ్ళాడు.   
    అది మామూలు పెంకుటిల్లు తలుపు తట్టగానే నలభైకి పైనా యాబైకి లోపూ ఉండే ఓ విధవావిడ వచ్చి తలుపు తీసింది.   
    "ఆవిడే సుబ్బారావు తల్లి సుభద్రమ్మ" అని చెప్పింది గీత.   
    "సుబ్బారావుగారున్నారండీ" అన్నాడు రాయుడు.   
    "లోపలకు రండి" అంటూ ఆహ్వానించింది సుభద్రమ్మ. గీత రాయుడి తన మామయ్యగా పరిచయం చేసింది. రాయుడు, రచయిత అక్కడున్న రెండు పాత కుర్చీలలో భయం భయంగా కూర్చున్నారు.   
    "మా వాడితో మీకేం పని!" అంది సుభద్రమ్మ,   
    "ఒక్కసారాయన్ను పిలుస్తారా?" అన్నాడు రాయుడు   
    "పిలుస్తాను. కానీ పనేమిటో నాకు చెబుతారా?" అంది సుభద్రమ్మ. ఆవిణ్ణి చూస్తే పెద్ద వ్యవహారవేత్తలా కనబడింది రాయుడికి.   
    "పనేమీలేదండి. ఓసారి ఆయన్ను చూడాలి" అన్నాడు రాయుడు.   
    సుభద్రమ్మ ఆశ్చర్యపడింది "చూడ్డం ఎందుకూ?"   
    రాయుడు చిరాగ్గా "ఓసారి ఆయన్ను పిలుస్తారా?" అన్నాడు. తనతో ఇంటర్వ్యూకోసం ఎందరో గొప్పవాళ్ళు చేతులు కట్టుకు నిలబడుతారు. అలాంటిది సుబ్బారావు తల్లి లక్ష ప్రశ్నలు వేస్తోంది.   
    వాడిప్పుడు ఆవకాయను పెద్ద జాడీలోంచి చిన్న జాడీ లోకి మారుస్తున్నాడు చిన్న బట్టకట్టుకుని ఉన్నాడు. కాసేపు పడుతుంది. మీరు కూర్చోగలరా?" అంది సుభద్రమ్మ.   
    రాయుడు ఆశ్చర్యపడ్డాడు బియ్యే ప్యాసై ఉద్యోగం చేస్తున్న కుర్రాడు చిన్న బట్ట కట్టుకుని ఆవకాయ ఓ జాడీ లోంచి ఇంకో జాడీలోకి మారుస్తున్నాడా?   
    గీత కిసుక్కున నవ్వింది.   
    "ఎందుకే నవ్వుతావు? వాడేమైనా కానీపని చేస్తున్నాడా? తల్లికి సాయపడుతున్నాడు. చిన్నప్పటినుంచీ నాకు సాయం చేయడంవల్లనే ఈవాడు వాడింత వాడయ్యాడు" అంది సుభద్రమ్మ.   
    "ఏం చేస్తున్నాడండీ మీవాడు?" అన్నాడు రాయుడు.   
    "ఎల్వీ రాజుగారి ఆఫీస్ లో గుమాస్తా!" అంది సుభద్రమ్మ గర్వంగా. తన కొడుకు ఇండియాకు ప్రధాన మంత్రి అన్నంత గొప్పగా చెప్పిందావిడ. ఆ విషయాన్ని- "దరఖాస్తు పెట్టగానే పిలుపు వచ్చింది. వాడికి ఎవ్వరి సిఫారసులూ లేవు. వెళ్ళేముందు నా కాళ్ళకు మ్రొక్కాడు. నేను ఆశీర్వదించాను. నా ఆశీర్వాదబలంతోనే వాడికా ఉద్యోగమొచ్చింది."   
    రచయిత ఆమెను గమనించి "ఈమెది చాలా బలమైన వ్యక్తిత్వం. సుబ్బారావు తల్లిచాటు బిడ్డగా పెరిగి ఉంటాడు" అనుకున్నాడు.
   "నాకు చాలా సంతోషంగా ఉందమ్మా! నీ వంటి తల్లికన్నా ఆ బిడ్డ చాలా అదృష్టవంతుడు అందుకే అతడినో సారి చూడాలని ఉందమ్మా" అన్నాడు రాయుడు.

 Previous Page Next Page