తప్పించుకోవటానికి కూడా వ్యవధి లేకపోయింది. నిరుత్తరురాలయి ఆమె గిరుక్కున మంచందగ్గరకు వెళ్ళిపోయింది.
ఆమె రూపంచూసి అతను విస్మితుడయాడు. కొద్దిరోజుల్లో ఇలాంటి మార్పు ఎలా సాధ్యం? ఆ సుధ వేరు. ఈ సుధ వేరు. ఆ సుధ సిగ్గు, సౌజన్యం, సుకుమారత్వం, చిలిపితనం. అల్లరీ అన్నీ మూర్తీభవించిన ఓ కోమలాంగి. ఈ సుధ నిర్వికార, నిస్సంగమూర్తిలా కనుబడుతోంది యోగినిలా ఉంది. హతభాగినిలా ఉంది.
"సుధా!" అన్నాడు కొంచం ముందుకువచ్చి ఆవేదన వ్యక్తమవుతున్న కంఠంతో.
ఆమె ఏమనుకున్నదో మెల్లిగా అతనివేపు తిరిగి కళ్ళెత్తి అతనిముఖం లోకి చూసింది. ఆమెని చూసి అతను విస్మతుడైనట్లే అతని రూపంచూసి ఆమె విస్మితురాలయింది. జుట్టంతా రేగిపోయి ప్రక్కలకూ, కళ్ళమీదకూ పడుతోంది. ముఖమంతా పీక్కుపోయి ఎంతోజబ్బుపడి లేచిన మాదిరిఉంది. వేసుకున్న పైజమా, లాల్చి ముడతలుపడి, నలిగిపోయి ఉన్నాయి.
"ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు?" అని గొణిగింది కళ్ళు క్రిందకి వాల్చి.
"సుధా!" అన్నాడు సత్యమూర్తి ఆవేశంగా. "నువ్వు వున్నట్లుండి ఎందుకింత కఠినురాలవి అయిపోయావు? నేనేం అపరాధం చేశాను? నిన్ను చూడాలని ఇన్నాళ్ళూ ఎట్లాకలవరించానో, ఎట్లా కొట్టుకుపోయానో ఊహించగలవా నువ్వు? సుధా! నేనుదెబ్బతిని ప్రాణాపాయస్థితిలో వున్నాను. నువ్వు రెండు మూడుసార్లువచ్చావు. అంతే. మళ్ళీ కంటికి కనిపించలేదు. ఏమయ్యావో ఏమయ్యావోనని ప్రాణం తల్లడిల్లిపోయింది. ఇంతలో మీ నాన్నగారి మరణవార్త విని స్తంభించిపోయాను. వెంటనేవచ్చి నీ ముందు వాలుదామని ఎంత తహతహలాడినా నా శరీరస్థితి నన్ను కదలనియ్యలేదు. ఆ అవకాశం కలగాగానే ఎంతో ఆవేదనతో వచ్చాను నీ దగ్గరకు. నన్ను చూడటానికి కూడా నువ్వు నిరాకరించావు. సుధా! నా తండ్రి పోయినప్పుడు మా ఇంటికి వచ్చిన నిన్ను నేను నిరాకరణ చెయ్యలేదు. అలాంటి సందర్భానికే మీ ఇంటికివచ్చిన నన్ను మౌనంతో వెళ్ళగొట్టావు. చెప్పు సుధా చెప్పు. నా నేరం ఏమిటి? నామీద నీకు ఎందుకు కోపంవచ్చిందో విడమర్చిచెప్పనిదే నాకు మనశ్శాంతి లేదు"
ఆమె మాట్లాడలేకపోయింది. తలెత్తి పిచ్చిదానిలా చాలాసేపు అతని ముఖంకేసి చూస్తూ వుండిపోయింది. తరువాత హఠాత్తుగా ఏదో తెలివి వచ్చినట్లు రెండుచేతుల్తో ముఖం కప్పుకొని ఆపుకోలేని దుఃఖంతో వల వల ఏడ్చివేస్తోంది.
సత్యమూర్తి అప్రతిభుడయ్యాడు. ఆమె దగ్గరగావచ్చి "నేనేమన్నా బాధించానా?" అన్నాడు పశ్చాత్తాపంగా.
ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. ఎంత ప్రయత్నించినా దుఃఖం ఆపుకోలేకపోతోంది. ఆమెను దగ్గరకుతీసుకుని పొదివి పట్టుకుని కన్నీరు తుడిచి మంచిమాటలు చెబుతూ ఓదార్చాలన్న ఉద్రిక్తత కలిగించిందతనికి. కాని సంకోచంతో అంతపని చేయలేకపోయాడు. "నేనేమన్నా కానిమాటఅంటే క్షమించు సుధా" అన్నాడు జాలిగా.
చాలాసేపటికి ఆమె తేరుకుని పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుంది. అప్పటికప్పుడే ఆమె ఎర్రగా కందిపోయింది. "లేదు. మీరేతప్పూ చేయలేదు. మిమ్మల్ని క్షమించే అర్హత నాకులేదు. నాన్నగారు పోయినప్పటినుంచీ నాకు మతిస్థిరంగా వుండటంలేదు. ఇప్పుడు బాగానే వుంది. వచ్చినప్పట్నుంచీ పాపం నిలబడే వున్నారు, మరీ మూర్కురాల్ని అయిపోయాను, కూర్చోండి" అంది.
అతని గుండె కళుక్కుమంది. హఠాత్తుగా ఆమె ఎంతో దూరం వెళ్ళిపోయినట్లనిపించింది. "ముందు మీరు కూర్చోండి. చాలా నీరసంగా కనబడ్తున్నారు" అన్నాడు. ఆమెను యింతవరకూ "నువ్వు నువ్వు" అని సంబోధిస్తున్న విషయం గుర్తుకువచ్చి సిగ్గుపడ్డాడు.
ఇద్దరూ ఒకరి కెదురుగా ఒకరు కుర్చీలలో కూర్చున్నారు. ఆ కుటుంబానికి తటస్థించిన ఆపద ఆమెకు సంభవించిన దురన్యాయం వీటిని గురించి ప్రస్తావించక వ్యక్తిగతపు గొడవలు మాట్లాడాననుకుని అతనికి చాలా సిగ్గనిపించింది.
"ఇలాంటి కష్టం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. చాలా అన్యాయం జరిగిపోయింది" అన్నాడు ఎలాగో కూడదీసుకుని అంతకంటే ఎలా చెప్పాలో తెలీక.
"మేము యిప్పుడు చాలా బీదవాళ్ళం" అంది కొంచం ఆగి సుధ.
ఆమె తనని ఎత్తిపొడుస్తున్నదేమోనని, అతను కలవరపడ్డాడు. "వ్యక్తియొక్క హృదయాన్నిబట్టీ గుణగణాల్ని బట్టి విలువలు స్థిరపడుతాయిగాని గొప్పా, బీదా అనే తారతమ్యాన్ని బట్టి కాదుగా" అన్నాడు సాలోచనగా.
"అవన్నీ పుస్తకాల్లో మాటలు. స్వార్ధంతోకూడిన మామూలు మనుషులకు సంబంధించినవి కాదు మూర్తిగారూ! హృదయ సౌశీలయతగాని. గుణగణాల్లోగాని ఏమిలోపం వుందని మీరు ఉషని అలాంటి అన్యాయానికి గురిచేశారు? చెప్పండి" అని అడిగేసింది సూటిగా.
అతను త్రుళ్ళిపడ్డాడు. ఉష సంగతి ఈమెవరకూ ఎలావచ్చింది? అతని గుండె గబగబ కొట్టుకుంది. "ఆ విషయం మీకెలా తెలిసింది?" అన్న ప్రశ్న నోటివరకూ వచ్చింది. కాని అది చాలా అపహాస్యంగా వుంటుందనీ, తనని తాను కించపరుచుకున్నట్టుగా వుంటుందనీ నిగ్రహించుకుని "చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న విన్నాను మీ నోట. జీవితంలో అనేకమంది వ్యక్తులు పరిచితులు కావటం జరిగి నిష్క్రమిస్తుంటారు. వాళ్ళనందర్నీ అన్యాయం చేసినట్లా? నమ్మించి మోసగించటం జరిగినప్పుడుకదా అన్యాయమనేమాట" అన్నాడు.


