Previous Page Next Page 
రీవెంజ్ పేజి 8

    "మీకు తెలుసుగా నేనే పని ఒంటరిగా చేయనని, మరి ఈ కార్యక్రమములో మీరు సాయపడితేనే" కాస్త అమాయకంగా మొహం పెడుతు ప్రశ్నించింది రిమి.

    "అలాగే సాయపడతాం గాని, రేపు పెళ్ళి గట్రా అయిన తరువాత కూడా సాయం వుండమంటే కష్టం అమ్మాయ్! అయినా ఫ్రండ్స్ మి కనుక తప్పదనుకో" సమాధానం ఇచ్చింది సుజిత.

    "సరేగాని ఆ అబ్బాయిని పిలవనా" అని చెప్పి వెంటనే క్లాప్ కొట్టి పిలిచింది వెళుతున్న ఆ వ్యక్తిని.

    ఆ వ్యక్తికి సరిగా వినబడకపోవడంతో అందరూ కలసి గట్టిగా క్లాప్స్ కొట్టారు దగ్గరకి రమ్మన్నట్లుగా రిమి మాత్రం ఉత్సాహంగా 'కయ్' మని విజిల్ వేసింది.

    అప్పుడు వెనక్కు తిరిగాడా వ్యక్తి, పిలుస్తున్నది ఎవరా అని. దగ్గరకు రమ్మని చేయి వూపటంతో సందేహిస్తూ తల వంచుకుని దగ్గరకు వచ్చాడు.

    అంతమంది అమ్మాయిలు కేకలు వేసి విజిల్స్ వేసి పిలవడం వింతగాను, విచిత్రంగాను తోచి విషయం ఏమై వుంటుందా అన్న సందిగ్ధం వచ్చిందా వ్యక్తికి.

    చల్లగాలి రివ్వున వీస్తుంది. వర్షం ఉదృతంగానే కురువసాగింది.

    అతనూ వర్షంలో తడవటం వలన సన్నగా వణుకుతున్నాడు.

    వయసు ఇరవై దాటినట్లు వుంది. ముహంలో మాత్రం అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

    ఎందుకు పిలిచారన్నట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు వారివైపు.

    రిమి గొంతు సవరించుకొని ప్రశ్నల వర్షం మొదలుపెట్టింది.

    "హలో బావా ఇలా వచ్చావు. ఒక్కడివే వచ్చావా! మామయ్య రాలేదా?"

    సమాధానం ఏమి చెబుతాడో అని ఆత్రంగా ఎదురు చూశారు.

    అర్ధంకానట్లు మొహం పెట్టి ఏమిటన్నట్లు చూశాడు. అతనికి ఆశ్చర్యంగా వుంది.

    ఈ అమ్మాయి 'బావా' అంటుందేమిటా అని.

    మళ్ళి అదే ప్రశ్నను రెట్టించింది రిమి.

    అతని నుంచి సమాధానం రాకపోవటంతో మాటలు రావేమోనన్న అనుమానం వచ్చిందందరికి.

    సుజిత కల్పించుకొని "హలో! పాపం బావ వచ్చాడని తెలిసి పరుగు పరుగున వచ్చి కష్టపడి విజిల్ కూడా వేసి పిలిస్తే సమాధానం చెప్పరేమిటి....!"

    అతను సమాధానంగా తలని అడ్డంగా వూపాడు.

    రిమి కాస్త కోపంతో ప్రశ్నించింది.

    "మీకు..... మీకు మెంటలా...? మా బావనుకొని పిలిచాను.

    సారి... మా బావయితే ఇలా ముంగిలా వుండడు."

    ఎందుకో తొందరపడి ఎక్కువగా మాట్లాడుతున్నానేమో అనిపించింది రిమికి.

    అతనికి కాసేపటి వరకు రిమి ఏమిటన్నదన్నది అర్ధంకాలేదు.

    అర్ధం అయిన తరువాత ఉక్రోషంతో రెండు నిమిషాల తరువాత అడిగాడు గొంతు పెగల్చుకొని.
    "ఎందుకు....?

    ఎందుకడుగుతున్నారు...." కంఠంలో స్థాయిని పెంచి తిరిగి ప్రశ్నించాడు.

    "ఎందుకేమిటి. మమ్మల్నే తిరిగి ప్రశ్నిస్తారు. మేమడిగే వాటికి మీరు సమాధానం చెప్పటమే మీ భాద్యత. మీకు మెంటలా అని అడుగుతున్నాం. మెంటల్ వుంటే వుందనండి లేకపోతే లేదని చెప్పండి అంతవరకే..." మొహాన్ని సీరియస్ గా మార్చి ప్రశ్నించింది సుజిత.

    "నాకు మెంటలా...?" అతను విపరీతంగా ఆశ్చర్యపోయి "నాకు మెంటల్ లేదండి. రెండు తరాల క్రితం మాత్రం మా వంశంలో మా ముత్తాత తమ్ముడు - గారికి కాస్త మతి స్థిమితం ఉండేది. ఆ తరువాత ఎవరికి రాలేదండి" వాళ్ళ వంక సూటిగా చూడకుండా ఎటో చూస్తూ సమాధానం ఇచ్చాడు.

    "అయితే మీకు మెంటల్ లేదుగా" లేదన్నట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు.
    అమ్మాయిలందరూ అతని చుట్టూ చేరారు. అందరూ కలసి నవ్వసాగారు. నవ్వుతూనే "మెంటల్ లేదు... లేదు" అని అరవసాగారు.

    అతను ఖిన్నుడై చూస్తుండిపోయాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేయబోతున్నారు అన్నది అతనికి అర్ధం కాలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయట పడటం మంచిదనుకున్నాడు.

    మీకు మెంటలుందని తెలిసి మాకు బాగా నచ్చారు. "మీకిష్టమైతే మాలో ఒకరిని మీరు ఇద్దర్ని చేసుకుంటానన్నా మా కభ్యంతరం లేదు" చెప్పారు అందరూ.

    ఆ మాటకి మరింత తెల్లబోయాడా వ్యక్తి అంతవరకు అతను తలవంచుకును వెళ్ళిపోయే అమ్మాయిల్నే చూశాడు కాని ఇలా పబ్లిక్ గా నన్ను పెళ్ళాడతావా అన్న అమ్మాయిల్నింతవరకూ చూడలేదు.

    "కాని మా నాన్నగారు వూరుకోరండి, కోప్పడతారు. మా మరదల్నే చేసుకోమంటారు" ఒక నిముషమాగి మరల అతనే అన్నాడు.

 

 Previous Page Next Page