కృషి పాలభాగం పై స్వేదం పేరుకుంది.
ఆడిటోరియంలో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం పేరుకుంది.
ముఫ్ఫై సెకండ్లు పూర్తయిన సూచనగా బజర్ మోగింది.
ఉన్నట్టుండి ఆడిటోరియం కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది.
"ఐ పిటీ యు మిస్టర్ విశ్వనాథ్" ఓడిన విశ్సుని చూస్తూ సానుభూతిగా అన్నాడు క్విజ్ మాస్టర్ వాసు. "డిఫెండింగ్ చాంపియన్ తో చివరిదాకా అద్భుతంగా పోరాడిన మీరు ఆఖరి ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయారు...ఆ జానపద గీతం రాసింది నండూరి."
"కొందరు విద్యార్ధులు డయాస్ పైకి దూసుకుపోయి విజేత రాజేంద్రని పైకెత్తేసారు.
అవాక్కయి చూస్తూంది కృషి.
ఓడిన విశ్సులో ఓటమి తాలూకు బాధలేదు. ముందుకొచ్చి తనూ రాజేంద్రని అభినందించాడు. "కంగ్రాట్స్"
ఆ తర్వాత వచ్చిన పనైనట్టు చకచకా డయాస్ పై నుంచి క్రిందకి నడిచి అందరూ చూస్తుండగానే ఆడిటోరియం దాటి చీకటిలోకి వచ్చాడు...
అక్కడ కారు దగ్గర నిలబడ్డ కృషిని చూడడం కాకతాళీయమో లేక ముందునుంచీ ఆమెను గమనిస్తున్నాడో ఆమెకు తెలీదు. ఆమె అతడి కోసమే వెయిట్ చేస్తున్నట్టు "హల్లో" నాయి పలకరించి కారులో కూర్చున్నాడు.
ఆ క్షణందాకా అతడిపై ఏర్పడిన అణువంత సదభిప్రాయం ఏమన్నా వుంటే అదికాస్తా చెదిరిపోయింది.
అందరూ తననే గమనించడాన్ని చూసిన కృషి వెంటనే కారుని ముందుకు పోనిచ్చింది రాద్దాంతం చేయకుండా.
రోడ్డు కిరుపక్కలా బారుల్లా వున్న విధ్యుద్దీపాల కాంతి ఆమె చెంపలపై వెలుగు నీడల్ని అద్దుతుంటే అన్నాడు విస్సు.
"థేంక్స్ మిస్ కృషి"
"పిలవకుండా వచ్చినందుకు" ఆమె జవాబు చెప్పలేదు.
ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ ని మభ్యపెట్టి అతడు తప్పించుకున్న పద్దతి గురించి ఆలోచిస్తూంది ఆ క్షణంలో.
"యూ సీ మిస్టర్."
"విస్సు..." టక్కున చెప్పాడు.
"నీ పేరేమిటో ముందే తెలుసుకున్నాను."
"తెలుసుకున్నాకనే యిలా వచ్చారని నాకు తెలుసు"
"ఎలా"
"ఎనాలిసిస్..." నిశ్చలంగా చూశాడు విస్సు "అవును కృషి....ఉదయం మీరు నా విషయంలో హర్ట్ కావటాన్ని గమనించాను నేను కారు దిగేక మీరు సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్తారని ఊహించాను....కాబట్టే మీరు పోలీస్ స్టేషన్ కి చేరకముందే మీరు వస్తున్నట్టు యస్సై వెంకట్రావ్ కి ఫోన్ చేసి చెప్పాను కూడా."
దిగ్భ్రాంతిగా చూసింది కృషి...
"మొత్తానికి నా అంచనా మేరకి మీరక్కడికి వెళ్ళారు. యస్సై ద్వారా అంతా విన్నారు. నా ఎనాలిసిస్ ప్రకారం పోటీకి వచ్చారు."
"ఎన్ని గట్స్ నీకు-" సీరియస్ గా అంది. "నన్ను నీ లవర్ గా చెప్పటానికి నీకెన్ని గుండెలు?"
"అమ్మాయి స్థాయిని బట్టి గుండెల సంఖ్య పెంచుకోవాలంటారా"
అతడి పరిహాసం ఆమెను మరింత ఉద్రేకపరిచింది. "ఎస్ మిస్టర్ విస్సు....లవ్ మాట అటుంచితే అసలు నా స్థాయి అమ్మాయిని లవర్ గా చెప్పుకోటానికైనా చాలా గుండెలు కావాలి."
విస్సు మౌనం మాత్రమే కాదు..... అతడి మృదు మందహాసాన్నీ ఆమె భరించలేకపోయింది. "ఒక మోసగాడిగా, డబ్బుకోసం ఎంత నీచానికైనా దిగజారే ఓ లోఫర్ గా పరిచయమైన నువ్వు ఆలోచనల్లో సైతం నాకు దగ్గర కావాలనుకోవడం దారుణం, క్షమించరాని నేరం కూడా."
"మీరు అవసరానికి మించి ఎక్కువగా రియాక్టవుతున్నారు కాని అసలు ఏ మనిషి ఆలోచల్నయినా మరో వ్యక్తి ఎలా ఆపగలడు....ఉదాహరణకి మన విషయం తీసుకుందాం.....పక్కన కూర్చున్నాను. మిమ్మల్ని ఫిజికల్ గా ముట్టుకోవడం నేరం కావచ్చేమో కాని ఆలోచనల పరంగా ఏవన్నా చేయగలను. చీకటి నవ్విన చిరు వెలుగులా మీ కనుపాపల్లో మెరిసే కాంతి నాలో ఇప్పుడు కలవరం రేపుతోందన్న విషయం మీకు చెప్పకుండా అలాగే మీ కళ్ళను చూస్తూ వుండిపోగలను...దాన్ని మీరు అడ్డుకోలేరుగా. మీ మౌనం నా ఆలోచనల అడుగున వున్న కోరికల తీగల్ని కదిలిస్తూ సంజె యెరుపు సెలయేటిపై పరుచుకున్న తొలి సిగ్గులాంటి మీ చెంపల్ని స్పృశించమని ప్రేరేపిస్తుంది. మానసికంగా ముట్టుకొన్నాను కాని అది మీకు తెలీదుగా.....మీ కనుకొలకుల కాంతి సంగీతాన్ని వింటూ నిమ్మోన్నతాల జాగ్రఫీని నిశిరాత్రి వేళ చదవాలని నా మనసు వువ్విళ్ళూరుతూంది. ఆలోచనల వర్షా గగనాన్ని పరుపుగా మార్చి అల్లసాని రాయని పిచ్చెక్కిన ప్రవరాఖ్యుడిలా రెచ్చిపోతూ మీ క్రీగంట సరఫరా అయ్యే విధ్యుచ్చక్తిని ఒంటిలోకి రప్పించుకోవాలని వుంది. ఇప్పటికే ఆలోచనల్లో రప్పించుకున్నాను కూడా అది మీకు తెలీదుగా"
"స్టాపిట్" అరిచింది కృషి. ఆమె ఫాలభాగంపై పేరుకున్న స్వేదం ఉక్రోషంగా కానీ మనసులోని ఎ ద్వారాల్నో తెరిచి చాలా ఇబ్బంది పెట్టినా వాస్తవాన్ని ఋజువు చేస్తుంటే కారుని ఓ మూల ఆపింది "దిగిపో"
"హృదయం సింహాసనంపై నుంచా"
వ్యంగ్యంగా నవ్వింది "ఇంత భాషా పరిజ్ఞానం వున్న వాడివి క్విజ్ లో ఆ చివరి జానపద గీతం రాసిన వారి గురించి చెప్పలేకపోయావేం..."
అదోలా చూశాడు ముందు....వెంటనే అన్నాడు "ఓడిపోవాలని"
మళ్ళీ నవ్వింది ఎగతాళిగా "మరో కథ చెబుతావనుకుంటాను"
భావుకుడిలా అప్పటి జానపద గీతపు వాక్యాల్ని ఉచ్చరించాడు.
"కళ్ళకేటో మబ్బు కమ్మినట్టుంటాది. నిదరల్లె నా వొల్లు నీరసిస్తున్నాది....దూరాన నారాజుకే రాయిడౌనో ఈ రోజు నా రాతలే రాలపాలౌనో"
ఆగేడు క్షణం పాటు...
ఆమె విస్మయంగా చూస్తుంటే కవితలా చెప్పుకుపోయాడు విస్సు...
"ఆపు లంబాయంట అడవి పోతుంటాయి... గుండెల్లో వుండుండి గుబులు దిగులౌతాది-"
కృషి యిక నిభాయించుకోలేకపోయింది.
"ఇక్కడ మిగతా చరణాల్ని చెప్పగలుగుతున్న నువ్వు అక్కడ మరి పెదవి విప్పకుండా పందెంగా ఒడ్డిన ఇరవైవేలునీ ఎందుకు పోగొట్టుకున్నట్టు."
నండూరి నాయుడు బావ ఎంకిని చూసినట్టు చూశాడు. వెనువెంటనే అన్నాడు "మరో ముఫ్ఫైవేలు అప్పళంగా కొట్టేయాలని."
"వ్వాట్" విస్మయంగా అంది.
"అవును కృషీ....నేను ఓడిపోతే మరో ముఫ్ఫైవేలు ఇస్తానన్నాడు రాజేంద్ర. ఎందుకో తెలుసా? ఇంకా ఛాంపియన్ గా తనే కొనసాగాలని..." యధాలాపంగా నవ్వేశాడు విస్సు. "నీలాగే ఓ డబ్బున్న అబ్బాయి తన గెలుపుకి మరో ముప్పయివేలు ఉదారంగా ఖర్చు చేస్తానంటే ఆ డబ్బు కోసం నేను ఓడిపోతేనేం."
నిజమనిపిస్తున్నా ఈ నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతూంది. "నమ్మమంటావ్"
"ఇది నిజమే అని నిరూపించబడాలీ అంటే రేపు సాయంకాలం ఆరు గంటలకి బ్లూ లాగూన్ రెస్టారెంట్ కి రా."
"ఎందుకు"
"రాజెంద్రనీ, నన్నూ అక్కడ చూడటానికి"
ఆమె నిశ్శబ్దంగా వుండిపోయింది చాలా సేపటిదాకా...
విస్సు ఇప్పుడు మోసగాడిగానే కాదు మరింత దిగజారిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు.
డబ్బు కోసం వ్యక్తిత్వాన్ని సమూలంగా నాశనం చేసుకోగలనని ధీమాగా చెప్పగలుగుతూ నిర్వీర్యమైపోతూన్న ఈ దేశపు యువతకి అసలు సిసలయిన ఉదాహరణలా కనిపిస్తున్నాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నారు" అడిగాడు విస్సు.
"డబ్బు తీసుకుని హత్యలు సైతం చేయగల హంతకుడికీ డబ్బు కోసం ఎలాంటి గడ్డినయినా కరిచే ఓ యువకుడికి తేడా ఏమిటి అని."
"అద్భుతమైన ఆలోచన కృషీ. సస్యశ్యామలమైన దేశంగా ప్రస్తుతించబడే యీ నేలపై పచ్చగా పెరుగుతున్నది గడ్డి మాత్రమే... గడ్డి ఒక్కటీ కాదు ఆ గడ్డి కోసం ప్రాకులాడే పశువుల సంతతీ ఇక్కడ ఎక్కువే. ఆ పశువుల్లో రాజకీయ నాయకులున్నారు. పోలీసులున్నారు. మేధావులూ వున్నారు. అయితే అందరిలో ఒకడిగా నేనూ బ్రతకటానికి కారణం ఏదన్నా కాని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. నేను మీరనుకున్న కాలుష్యంలో బ్రతుకుతున్నా యింకా కాలుష్యం పూర్తిగా అంటని వాడ్ని. కాబట్టే నా అవసరాలకి డబ్బు సంపాదించే ప్రోసెస్ లో అప్పుడప్పుడూ యిలాంటి ప్రయత్నాలు చేస్తుంటాను."
"ఏం చేస్తావా డబ్బుని"
"ఈ ప్రశ్న ఇంత సంపాదించినా ఇంకా సంపాదించాలనుకునే మీ తాతయ్యని అడగాల్సింది."
ఉలిక్కిపడింది కృషి.
"పరపతి అంటే కేవలం గెలుపు మాత్రమే అనుకునే రాజేంద్ర తండ్రి రామనాథ చౌదరి లాంటివాళ్ళని అడగాల్సిందే."
ఆమె చూస్తుండగానే కారు దిగుతూ అన్నాడు. "సరే...రెండో సారి కారు లిఫ్టు ఇచ్చారుగా. ఇంతడబ్బు నేనేం చేసేదీ చెప్పడం నా కనీస ధర్మం కాబట్టి చెబుతున్నాను. మరేంలేదు. నాకు చాలా ఖరీదయిన కాల్ గర్ల్స్ తో సంబంధం వుంది. సంపాదించిన డబ్బుని ఆ సుఖాలకి ఖర్చు చేస్తుంటాను."
కృషి మోహంలో కదలాడిన జుగుప్సలాంటి భావాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు విశ్సు.
చివరిగా అతడు చెప్పిన విషయంలోని నిజానిజాలు కాదు ఆమె ఆ క్షణంలో ఆలోచిస్తున్నది.
డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన కృషి డబ్బుకి సంబంధించిన కొత్త నిర్వచనాలు వింటూంది.
అసలు గెలుపంటే...
డబ్బు సంపాదించడమా....లేక...
డబ్బు కోసం ఓటమికి సిద్దపడ్డమా...
కొడుకు గెలుపుకోసం కొంత డబ్బుని ఓడిన తండ్రికీ డబ్బుకోసం తనకు తానే ఓటమికి సిద్దపడిన విస్సుకి తేడా ఏమిటి.
ఇద్దరిలో గెలిచిందెవరు?
కొడుకుని ఓ మేధావిగా సంఘానికి పరిచయం చేయాలని డబ్బుని వెచ్చించే యీ రామనాథ చౌదరి.
ఎవరు...
* * * *
"సంఘంలో శాఖోప శాఖలుగా విస్తరించిన ఓ క్రిమినల్ రామనాథచౌదరి" చెప్పాడు డాక్టర్ మహంతి.
అపరాత్రివేళ స్తంభించిన గాలికి సాక్ష్యంలా కిటికీ ఆవలి ఫేరన్ మొక్క స్థబ్దతగా కనిపిస్తుంటే ఆసక్తిని వింటూంది కృషి.
"ఒకప్పుడు ఒక మామూలు లేబర్ లీడర్ రామనాథ చౌదరి, ఆ తరువాత కేపిటలిస్టుగా ఎదిగిపోయాడు. కోట్ల ఆస్థి సంపాదించాడు. రాజకీయపరమైన పలుకుబడిని సంపాదించుకుని చాలా వ్యాపారాలు ప్రారంభించి ఓ పెద్ద మాఫియా లీడర్ గా చలామణీ అవుతున్నాడు. ఇల్లిసిట్ లిక్కర్ ని తయారు చేయడం మొదలుకుని రాజకీయ నాయకులకి గూండాలకు సరఫరా చేస్తుంటాడు. అధికారంలో వున్న పార్టీ అండ, సంఘంలో వున్న పరపతి అక్రమంగా సంపాదించిన డబ్బు ఇవన్నీ అతడి స్టేటస్ ని కాపాడుతుంటాయి. కాబట్టే యిప్పుడు తన కొడుకు ఓడిపోకుండా వుండటానికి డబ్బు ఖర్చు చేయటానికి సిద్దపడ్డ చౌదరి తన గెలుపుకి స్థాయి భేదం లేదన్నట్టు చాలా కాలం నుంచి మీ తాతయ్యనీ ఢీకొంటూ మెంటల్ గా టార్చర్ చేయగలుగుతున్నాడు కూడా."
దిగ్భ్రాంతిగా చూసింది..." అంటే"