తల్లి మాటలు వింటుంటే రూప గిల్టిగా ఫీలయింది. తల్లి ఇచ్చిన చనువు, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగ పరిచానేమోనన్న భావంతో బాధపడుతూ తల దించుకుంది. పద్మావతి నిట్టూర్చి లేచి నుంచుని "సరే...ముందు రేపు అతనితో మాట్లాడక మిగతాది ఆలోచిద్దాం.....అన్ని అడుగు పద కిందికి" అంటూ కిందకి దారితీసింది.
"సురేష్......మా అమ్మ, నాన్నకి మన సంగతి తెలిసిపోయింది. నిన్న ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు నన్ను నిలదీసి అడిగేశారు. మనని చూసిన అయన ఫ్రెండు ఎవరో నాన్నతో చెప్పారట" మర్నాడు టైపుకు వెళ్ళగానే సురేష్ ని చూడగానే రూప దగ్గరకెళ్ళి ఆందోళనగా చెప్పేసింది.
సురేష్ మొహం కళ తప్పింది.
"ఈజిట్ ఎలా.....ఏం అన్నారు?" ఆదుర్దాగా అడిగాడు.
"ఇంటి కెళ్ళేటప్పుడు చెప్తా అంతా టాంక్ బండ్ కి వెడదాం.....చాలా మాట్లాడాలి" అంది రూప. తర్వాత గంటా సురేష్ రోజులా లేకుండా సీరియస్ గా, అన్యమనస్కంగా, మొహం గంటు పెట్టుకుని టైపు కొట్టాడు. టైపవగానే ఇద్దరూ టాంక్ బండ్ కి నడిచి వెళ్ళారు.
ఖాళి బెంచి ఒకటి చూసుకుని కూర్చున్నారు. రోజు ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునే ఇద్దరూ అంతసేపూ మౌనంగా నడిచి వచ్చారు.
"ఏం జరిగింది? అంతా సరిగా చెప్పు " అన్నాడు సురేష్. రూప జరిగిందంతా ఏకరువు పెట్టి ఆందోళనగా చూసింది. "మా అమ్మ నాన్న ఇంత జరిగాక వూరుకోరు. మనం పెళ్ళి చేసుకోవాలి సురేష్ మీ నాన్నగారి పేరు, వివరాలు అన్ని అడిగిరమ్మాన్నారు. పెళ్ళి విషయం మీ నాన్న గారితో మాట్లాడుతారటా నాన్నగారు.
"ఆర్ యూ క్రేజీ రూపా, పెళ్ళేమిటి నాకు ఇప్పట్నించి చదువైనా అవలేదు. ఓ ఉద్యోగం లేదు సంపాదన లేదు. ఐ యామ్ ఓన్లీ టంటి టూ. ఇప్పటినుంచి పెళ్ళేమిటి నాకు.......చదువు కావాలి, ఉద్యోగం దొరకాలి, లైఫ్ లో సెటిల్ అవాలి, నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి.....అప్పుడు పెళ్ళి ప్రసక్తి. ఇప్పుడు పెళ్ళి చేసుకుని ఏం పెట్టి పోషించాలి పెళ్ళాన్ని. ఆర్ యూ మేడ్. పెళ్ళి ఇంకో ఐదేళ్ళ తరువాత మాట. ఇంకా మా అన్నయ్య వున్నాడు. వాడికే పెళ్లవలేదు, నాకు పెళ్ళేమిటి?"
రూప ఆందోళనగా, భయంగా సురేష్ వంక చూసింది.
"మరి ఎలా సురేష్.....అయిదేళ్ళంటే నాన్న వూరుకుంటారా? వాళ్ళకేం చెప్పడం? మరో అయిదేళ్ళంటే నాకు పాతికేళ్ళు వచ్చేవరకు పెళ్ళి చేసుకుండా వుంటారా? నాకు అప్పుడే సంబంధాలు చూస్తున్నారు మా వాళ్ళు. ఐదేళ్ళు వెయిట్ చెయ్యరు మా వాళ్ళు?"
"అయితే చేసేసుకో ఎవరినన్నా, మంచి సంబంధం వస్తే వదలకుండా చేసుకోవడం మంచిది. నాకోసం అన్నాళ్ళు వెయిట్ చేయడం మంచిది కాదు" కూల్ గా అన్నాడు.
రూప తెల్లబోతూ చూసింది "సురేష్!" అంది ఆశ్చర్యంగా.
"అవును రూపా! ఐదారేళ్ళు వెయిట్ చెయ్యమని నేను మాత్రం ఎలా అంటాను.
"మీ వాళ్ళ ఆదుర్దా మీ వాళ్ళకుంటుంది. ఇంతకీ నేనీ ఐ.ఏ.ఎస్ పరిక్ష పాసవుతానో లేదో ఆ బ్యాంక్ పరిక్షన్నా పాసవుతానో లేదో, ఏం ఉద్యోగం వస్తుందో, ఎన్నాళ్ళకొస్తుందో, ఐదేళ్ళ తర్వతన్నా పెళ్ళి చేసుకునే పొజిషన్ లో వుంటానో లేదో! నా ఫ్యూచర్ ఏమిటో నాకే తెలియదు నేనేం చెప్పగలనిప్పుడు."
"సురేష్ నీ కోసం ఐదేళ్ళు కాదు, పదేళ్లన్నా వెయిట్ చేస్తాను. అంతేగాని, మరొకర్ని ఎలా ఎలా పెళ్ళి చేసుకోగలను. ఆ మాట అసలు ఎలా అనగలిగావు. ఇదేనా నా ప్రేమని అర్ధం చేసుకున్నది." ఆవేశంగా ఏదో అనబోయింది రూప. సురేష్ విసుగ్గా వారిస్తూ.
"రూపా! థింక్ ప్రాక్టికల్లి. డోంటాక్ లైక్ ఎ ఫూల్. ప్రేమ పెళ్ళి రెండూ వేరు వేరు. ప్రేమ అన్నది ఒక థ్రిల్లింగ్. ఎమోషనల్ ఎక్స్ పిరియన్స్. పెళ్ళి సోషల్ సేక్యురిటికి, పిల్లలికి, ఫేమిలీ లైఫ్ - రెండింటికి ముడిపెట్టకు, ఆఫ్ కోర్స్! ప్రేమించి పెళ్ళి చేసుకోగలిగితే మంచిమాటే, మనకా అవసరం లేనప్పుడు ఏం చేస్తాం. నేను ఉద్యోగస్తుడినైతే మనం పెళ్ళి చేసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడు మనకా వీలు లేదు కనుక- ఈ అనుభవం ఒక తియ్యని జ్ఞాపకంగా మిగుల్చుకుని లైఫ్ తో ఎడ్జెస్ట్ అవాలి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ అడ్జెస్టుమేంట్.
మన కాలేజిలో సరదాగా చదువుకుంటూ, ఫ్రెండ్స్ తో సినిమాలకి, షికార్లకి, పిక్నిక్ లకి, హోటళ్ళకి....ఇష్టం వచ్చినట్టూ తింటూ ఎంజాయ్ చెయ్యలెదూ! ఇదీ జస్టు ఫర్ ఫన్ అనుకుని ఓ మూడు నాలుగు నెలలు సరదాగా ఎంజాయ్ చెయ్యగలిగినందుకు ఆనందించి ఈ అనుభవానికి గుడ్ బై చెప్పేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. అది ప్రాక్టికల్ థింకింగ్ అంటే" సురేష్ చాలా అనుభవశాలిలా, ఆరిందాలా విడమర్చి భోధపరుస్తుంటే రూప వింటూండి పోయింది.
అ మాటలకి అర్ధం కాసేపటికి బోధపడి వెర్రిదానిలా సురేష్ ని చూస్తూ వుండిపోయింది. "సురేష్! ఏమిటలా మాట్లాడుతున్నావు. నాకు భయం వేస్తోంది. నిజంగా పెళ్ళి చేసుకోవా నన్ను? ఇన్నాళ్లూ నీతో తిరిగాను. అందరికీ తెల్సింది. ఇప్పుడు నీవు చేసుకోకపోతే మా నాన్న అమ్మ నన్ను చంపేస్తారు" రూప భయంతో చెమటలు పట్టాయి. ఏడుపు ముందుకు రాసాగింది గొంతు రుద్దమవుతుండగా వణుకుతున్న గొంతుతో అంది బేలగా చూస్తూ.
"రూపా! ఎందుకలా భయపడుతున్నావు. ఏం జరిగిందిప్పుడు. లోకంలో నేనొక్కడ్నే మగాడినా నాకంటే మంచి అర్హతలున్న వాళ్లునీకు దొరుకుతారు. మీ అమ్మ నాన్నగార్లతో చెప్పు నాకింకా చదువు అవలేదు, ఉద్యోగం లేదు ఇప్పటినుంచి చేసుకోనంటున్నాడు అని. దానికింత భయం ఎందుకు" తేలిగ్గా అన్నాడు.
"సురేష్ నీకు తెలిదు మా నాన్న సంగతి. అయన ఓల్డ్ ఫాషన్. ఇలా పెళ్ళికాకుండా అమ్మాయిలు తిరగడం అది నచ్చదు ఆయనకి. నిన్ననే అసలు అడిగేశారు, పెళ్ళి చేసుకుంటానన్నాడా అతను అని."
"రూపా! ఒక సంగతి చెప్పు. నిన్ను పెళ్ళి చేసుకుంటానని నేనెప్పుడన్నా ప్రామిస్ చేశానా?"
రూప తలదించుకుంది. తన తప్పు తెలిసి వచ్చింది. "లేదు, అదే నా పొరపాటు, నీ ప్రేమని నమ్మాను, మన ప్రేమ పెళ్ళి వరకు వెడుతుందనుకున్నాడు" రూప ఆవేశంగా ఏదో అనబోయింది.
"కూల్ డౌన్ మైడియర్! పెళ్ళి చేసుకోవాలన్నా షరతు నీవు పెట్టలేదు ఆ మాటలన్నా అడగలేదు. నీవూ నాతో తిరగడానికిస్టం చూపావు. నీవు ఎంకరేజ్ చెయ్యకపోతే నేనెలా నీతో యింత చనువు తీసుకోగలిగేవాడిని. ఆడదానికి ఇష్టం లేకుండా యిండిఫరంట్ గా వుంటే మగాడు ముందుకు వెళ్ళగలడా? నీవు సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి రాను అంటే బలవంతంగా తీసికెళ్ళగలిగేవాడినా నీకిష్టపడే వచ్చావు.
నీకు యీ ప్రేమ, ఎక్స్ పిరియన్స్ రుచి చూడాలనిపించింది. ఇప్పుడు నన్నొకడినే ఎందుకు బ్లేమ్ చేస్తావు. నీవు ముందురోజే పెళ్ళి చేసుకుంటే తిరుగుతాను అన్న షరతు పెడితే నేను ఆరోజే చెప్పేవాడినేమో. పెళ్ళి చేసుకోడానికి నీ కర్హతలు చాలవని కాదు, నీవు చచ్చాకా కాదు, కానీ ఇప్పట్లో నేను చేసుకోవడం కుదరదు. నా కాళ్ళమిద నేను నిలబడగలగాలి. ఆ తర్వాతే పెళ్ళి ఇప్పుడు చేసుకుని నిన్నేం చెయ్యమంటావు? మా నాన్న నన్నే కాక నిన్ను పోషిస్తారా. రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని పోషిస్తారా? అసలెలా అడగడం, నీకిప్పుడు పెళ్ళికి తొందరోచ్చిం దా అని మోహన్నే అడుగుతారు యింట్లో..."
"సురేష్! నీకోసం నేను ఐదేళ్ళు ఆగుతాను. ఇంట్లో సర్ది చెపుతాను. ఈలోగా నేనూ ఏం.ఎ చదువుతాను. ఆ తర్వాత ఏదన్నా ఉద్యోగానికి ప్రయత్నించి ఉద్యోగం చేస్తుంటాను. నికుద్యోగం రాగానే పెళ్ళి చేసుకుందాం. ఏమో ఐ.ఎ.ఎస్. అయితే ఉద్యోగం మళ్ళి ఏడాదే వచ్చేస్తుంది. అది కాకపోయినా ఏదో ఉద్యోగం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. మావాళ్ళని వప్పిస్తాను." రూప ఆశగా అతన్ని చూస్తూ అంది.