Previous Page Next Page 
సంకల్పం పేజి 8

 

   "అగ్గిపిడుగులో రామారావు వాడిన ఫేంట్లు, అనార్కలిలో నాగేశ్వరరావు వాడిన ఫేంట్లు, జిగిజిగేలు ఫేంట్లు, గుండె ఝల్లుమనే ఫేంట్లు....." పాత కట్టి పాడుతున్నట్టుగా మేనమామ అరుస్తున్నాడు.
   
    అతని ముందు ఆ ఫేంట్లను బేరమాడుతున్న పల్లెటూరి జనం ఎడారిలో ఒయాసిస్ లా వుంది మావయ్య కనబడ్డం.
   
    "మావయ్యా" పరుగు, పరుగున వెళ్ళి చొక్కా పట్టుకున్నాడు. మేనమామ చయనులు ఆశ్చర్యంగా చూశాడు. ఆపైన ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.
   
    "ఏమిటిరా.... ఇక్కడ?" ఏవడికో బేరం చెప్తూనే అభిమానంగా అడిగాడు.
   
    "పెద్దక్క చచ్చిపోయింది.... అన్నం లేదు. నీ దగ్గర అన్నం వుంటుందట కదా? పెద్దక్కే చెప్పింది. నాన్నకి చెప్పకుండా వచ్చేశాను. అమ్మ క్కూడా చెప్పలేదు" ఏడుపు ముఖం పెట్టేశాడు వికాస్.
   
    "ఏం ఫర్వాలేదు నేను చెప్తాలే.... ఆకలేస్తోందా? బొంబాయి చెట్నీతో మినపట్టు తిను. ఆర్రోజుల్దాకా అన్నం అడగవ్" అంటూ పదినిమిషాల్లో ఫలహారం తెప్పించాడు.
   
    చయనులు పాత ఫేంట్లను అమ్మకం చేస్తూనే వున్నాడు.
   
    మేనమామ వేపు చూస్తూ ఆనందంగా, దిగులు లేని హృదయంతో టిఫిన్ తింటున్నాడు వికాస్.
   
    ఓ గంట తర్వాత-
   
    రోడ్డు మీద బస్సు కోసం నిలబడ్డారు చయనులు, ప్రక్కన వికాస్-
   
    "పూర్ణా మార్కెట్లో..... మూడు ఏభైలిచ్చి కొన్న పాత బట్టలు.....అయిదు యాభైలకి అమ్ముడై పోయాయి. ఇదేరా.... మీ మేనమామ చేసే వ్యాపారం.....ఇకనుంచీ నీ పూచీ నాది...... నేను చెప్పే పని చెయ్యి.... దొంగతనం తప్ప ఏ పని చెయ్యడానికైనా సిగ్గుపడకు.....కష్టపడే వయసులో కష్టబడకపోతే.... ఆ తర్వాత సుఖపడలేవ్.... గుర్తుంచుకో."
   
    మేనమామ చయనులు, వీలు దొరికినప్పుడల్లా లోకం గురించి, లోకంలో మనుష్యుల గురించి, ప్రవర్తన గురించి, మంచి చెడ్డల గురించి, కల్సిరాని పరిస్థితుల్లో మంచే చెడుగా మారడం గురించి, కల్సొచ్చే పరిస్థితుల్లో చెడే మంచిగా మారే వ్యవహారం గురించి, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా చెప్పేవాడు.
   
    మేనమామ ప్రతీ అనుభవం వికాస్ కో పాఠం అయ్యేది.
       
    అది వర్షాకాలం-
   
    ఏం వ్యాపారం చెయ్యాలో తోచలేదు చయనులకి. ఆ రెండు నెలలూ కుదురుగా ఒకచోట వుండే పని చూసుకోవాలనుకున్నాడు. తాలూకా కేంద్రం టూరింగ్ టాకీస్ లో బుకింగ్ క్లర్క్ ఉద్యోగం సంపాదించాడు.
   
    సైకిళ్ళ స్టాండ్ దగ్గర నిలబడేవాడు వికాస్.
   
    ఆ రోజు అక్కడ సమీపంలో ఏదో సంత జరుగుతోంది.
   
    టాకీస్ లో ఏదో క్రైం సినిమా...
   
    జనం... జనం.... సన్నగా తుంపర్లు పడుతున్నా.... జనం విపరీతంగా వస్తున్నారు.
   
    సైకిళ్ళ స్టాండ్ దగ్గర నిలబడి స్టాండ్ లో పెట్టిన సైకిళ్ళకు పదిపైసలు కిరాయి వసూలు చేస్తున్నారు వికాస్.
   
    అప్పటికి, సినిమా ప్రారంభం కావడానికి ఇంకా పదినిమిషాలు మాత్రమే టైముంది-
   
    ఆ సమయంలో, గేటులోంచి వచ్చిన వాహనాన్ని విచిత్రంగా చూస్తూ నిలబడిపోయాడు.
   
    అది పాతకాలపు ఫోర్డ్ కారు.
       
    కారు... కారు....
   
    వికాస్ జీవితంలో మొట్టమొదటిసారి కారును చూడటం అదే. అది నాలుగు చక్రాలతో నడిచి లోనికొచ్చి ఆగడం చాలా విచిత్రంగా వుంది వికాస్ కి.
   
    దగ్గరకెళ్ళి ముట్టుకొని చూశాడు భయం, భయంగా-
   
    అది కర్వలేదు.... అరవలేదు....
   
    గబగబా మేనమామ దగ్గరకెళ్ళాడు-
   
    "ఏం..... రా.... ఏం జరిగింది?"
   
    "అదేంటి మావయ్య..." అ అవాహనానని చూపిస్తూ అడిగాడు వికాస్.   

    "దాన్ని కారు అంటారు. కారునెప్పుడూ చూడలేదురా?"
   
    లేదన్నట్టు తలూపాడు వికాస్.
   
    "కారులు ఎక్కడ నుంచొస్తాయ్ మావయ్యా...?"
   
    ఆ ప్రశ్నకు మేనమామ నవ్వాడు.
   
    "కారులు ఎక్కడ నుంచో రావు.... తయారు చేస్తారు.... అవ్వి అందరూ కొనుక్కోలేరు.... లక్షాధికారులు మాత్రమే కొనుక్కుంటారు."
   
    "మనం తయారు చెయ్యొచ్చా...?" వికాస్ వేపు చూసి, అతని తలని ప్రేమగా నిమిరి-
   
    "చెయ్యొచ్చురా.... బాబూ.... చెయ్యొచ్చు... మనిషి తలచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు...."
   
    "అయితే.... నేను పెద్దయ్యాక కారు తయారుచేస్తాను...." ఆ మాటంటూ, పరుగెత్తుకుంటూ కారు దగ్గర కెళ్ళాడు.
   
    అక్కడ ఎంతసేపు నిలబడ్డాడో తెలీదు.
   
    ఆ రాత్రి....
   
    చాలాసేపు వికాస్ కి నిద్రపట్టలేదు. ఎప్పుడో పడుకున్నాడు.
   
    పడుకున్నా అతని కళ్ళ నిండా కలలు...
   
    ఆ కలలో ఎన్నెన్నో కార్లు... ఆ కార్లు గాల్లో తిరుగుతున్నాయి.... గాల్లో తిరుగుతున్న ఆ కార్లలో కూర్చుని చిన్నారి వికాస్....
   
                                *    *    *    *    *
   
    జింఖానా కంపెనీ షోరూంలో కెళ్ళిన లిఖిత లోనికెళ్ళినంత వేగంగా బయటికొచ్చేసింది.
       
    టైపిస్ట్ చెప్పిన మాటను నమలేకపోయింది ఆమె.
   
    "మేనేజ్ మెంట్ వికాస్ ని తీసేసిందండి....హైదరాబాద్ నుంచి రాగానే...రిజైన్ చేసి వెళ్ళిపోయాడు."
   
    "రిజైన్ చేసాడా.....! ఏం జరిగింది....?" షాక్ తింటూ అడిగింది లిఖిత.

    "తెలీదండి."
   
    విసురుగా కార్లో కొచ్చి కూర్చుంది. వికాస్ రూమ్ కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
   
    డాబా గార్డెన్స్ నుంచి ప్రహ్లాదపురం రావడానికి సరిగ్గా అరగంట పట్టింది. డోర్ నెంబర్ పట్టుకోడానికి మరో పదినిమిషాలు- రూం దగ్గరకెళ్ళి లిఖితకు-
   
    రూం తాళం వేసి వుండడంతో చికాకనిపించింది.
   
    నీరసంగా మెట్లు దిగుతూ, క్రింద పోర్షన్ అడిగింది.
   
    "తెలీదండీ.... ఉదయం వెళ్ళిపోతాడు.... రాత్రెప్పుడో వస్తాడు.... గంట క్రితం చూశాను...."
   
    "ఇక్కడ ఆయన ఫ్రెండ్సెవరయినా వున్నారా?"
   
    "తెలీదండీ.... కొత్తగా వచ్చాడు కదా....ఫ్రెండ్సుంటారంటారా?"
   
    ఆ మనిషి తిరిగి ఎదురు ప్రశ్న వేయడంతో చిర్రెత్తుకొచ్చింది ఆమెకు.
   
    మరో మాట మాట్లాడకుండా రోడ్డుమీద కొచ్చింది.
   
    ఎక్కడ దొరుకుతాడు.
   
    అసలు హైద్రాబాద్ లో ఏం జరిగి వుంటుంది? వాంటెడ్ గా రిజైన్ చేశాడా? లేక ఏదైనా జరిగిందా?
   
    ఏదో జరిగుంటుంది.
   
    అంటే.... షాక్.... డిప్రెషన్లో వున్న వ్యక్తి ఎక్కడకెళతాడు.
   
    డిప్రెషన్లో వున్న వ్యక్తి వంటరితనాన్ని కోరుకుంటాడు. మానసికమైన వంటరితనం కావాలి.
   
    అంటే-
   
    సముద్రం.... లేదా.... పార్క్.... లేదా సినిమా....లేదా... బారు...       
   
    తనకు తెల్సినంత మట్టుకు వికాస్ లిక్కర్ ముట్టడు.....
   
    ముందు బీచ్ కెళ్ళి చూస్తే....?
       
    అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలైంది.
   
    బీచ్ నిశ్శబ్దంగా ఉంది.... ఎక్కువమంది జనం లేరు.
   
    రెండు కిలోమీటర్ల పొడవున్న సముద్ర తీరాన్నంతా గాలించింది. ఎక్కడా వికాస్ కన్పించలేదు.
   
    ఎక్కడకు వెళ్లుంటాడు? పార్కుకా? సినిమాకా?
   
    సినిమాకే వెళ్లుంటాడు. నిశ్చయంగా అనుకుంది. అయితే ఏ సినిమాకి వెళ్ళుంటాడు?
   
    వికాస్ మనస్తత్వం రీత్యా క్రైం అండ్ లవ్ సినిమాల్ని ఇష్టపడతాడు.
   
    అయితే-
   
    సిటీలో ఆడుతున్న సినిమాల లిస్ట్ చూడాలి.
   
    రామకృష్ణా బీచ్ నుంచి, కే.జీ హాస్పిటల్ సెంటర్ కొచ్చి అక్కడున్న పాన్ షాపు దగ్గర ఈనాడు పేపరు కొని, సిటీ సప్లమెంట్ తిరగేసింది.
   
    "తెరపై ఈనాడు"
   
    లిఖిత చూపులు ఇంగ్లీషు సినిమాల మీద పడింది.
   
    డైహార్ట్ : శ్రీకన్య   
   
    బర్డ్ ఆన్ ఎ ఫైర్ : అలంకార్.
   
    నథింగ్ అండర్ నీత్ : జ్యోతి

 Previous Page Next Page